అక్షర

దేశభక్తికి స్ఫూర్తి దీపాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘రూపక త్రయం’
-ద్వానా శాస్ర్తీ:
56 పుటలు;
వెల: రూ.50/-
ప్రతులకు: తెలుగు కుటీరం, 1-1-428,
ఆర్కీస్‌వెస్ట్, గాంధీనగర్,
హైదరాబాదు- 500 080
**
అతిశయోక్తి అనుకుంటే అనుకోవచ్చుగానీ- ఈనాడు తెలుగు రాష్ట్రాలలో నన్నయ్య అంటే తెలియని విద్యార్థి వున్నాడేమో, కానీ ద్వానా శాస్ర్తీగారంటే తెలియని విద్యార్థి లేడు. విద్యార్థులకే కాదు, 78 గ్రంథాలు రాసిన రచయితగా పెద్దలకూ ఆయన సుపరిచితులే. మూడు దశాబ్దాల అధ్యాపక అనుభవం ఆయనది.
తెలుగు భాషా సంబంధంగా ఎనిమిది పొత్తాలు రాసిన ఉత్తమ మాతృభాషాభిమాన రచయిత. పాత పత్రికా సంపుటాల్ని తరచి ఎన్నో అంశాలు సమాజానికి తెలియజెప్పిన శక్తిమంతులు.
ఆ శాస్ర్తీగారు ఇప్పుడు గురజాడ దర్బార్, పత్రికోద్యమ వికాసం, బులుసు సాంబమూర్తి అనే రూపకాలు రాసి ‘రూపకత్రయం’ పేర స్ఫూర్తిదాయక పుస్తకాన్ని అందించారు.
గురజాడ దర్బారులో గురజాడ, కందుకూరి, గిడుగు, జయంతి రామయ్య, వేదం, ఆదిభట్ల, తాపీ, సి.పి.బ్రౌను పాత్రలు. ఈ అవి స్మరణీయ పాత్రల ప్రత్యేక, ప్రత్యేక శిఖరాయమాన సేవాభాగస్వామ్యాలను ఆత్మప్రదర్శకంగా, వారి వారి రచనోక్తుల ఉటంకింపులతో, కాలీన ఉజ్జ్వల ఘట్టాలను కొన్నిటిని దృశ్యమానమయ్యే విధంగా రాశారు. ఉటంకింపులివ్వడంలో ఎంతో మెలకువ కనబరచారు.
జయంతి రామయ్య ‘ఎండంబుల్గులు’ పద్యం చదివినప్పుడు ఇంతటి సహజ పద్యాలను వారు రాశారా అని ఆశ్చర్యానందం కలుగుతుంది. వేదంవారు సి.పి.బ్రౌనుతో ‘దిక్కుమాలిన వేమన పద్యం’ అనడంలో కొందరు పండితులకు వేమన పట్ల గల తక్కువ చూపును చూపినట్లయింది. కందుకూరికి భాషావిషయంలో ఉన్న భావాల పరిణామాన్ని బాగా చూపారు. సి.పి.బ్రౌను పాత్రను బాగా అభివ్యక్తంచేశారు. అయితే సి.పి.బ్రౌను విశ్వనాథవారు అన్నట్లుగా తెలుగు వింటూ వుంటే ఏదో ఒక సంగీతం వింటున్నట్టుగా వుంటుంది అని అనిపించడం బాగులేదు. కారణం కాలరీత్యా విశ్వనాథవారి పద్యం బ్రౌను వినే, చూసే అవకాశం లేదు. అయితే తెలుగు భాషపై విశ్వనాథ వ్రాసిన పద్యభావం ప్రజలకు చేర్చాలనే శాస్ర్తీగారి తపనను మనం గ్రహించగలం. గురజాడ దర్బారులో రూపకం చదువుతూంటే దృశ్యమానమవుతోంది. ఇక ప్రదర్శిస్తే మనల్ని ఆ కాలంలోకి తీసుకువెళ్ళి కూర్చోపెట్టినట్లే వుంటుంది. నాటి మహనీయ వ్యక్తుల శక్తుల్ని సంఘటనాత్మకంగా చూడడానికి వీలవుతుంది.
రూపక త్రయంలోని రెండవ రూపకం, పత్రికోద్యమ వికాసం, చంద్రం, తేజ పాత్రల ద్వారా ఒకనాటి ప్రముఖ పత్రికలు, ఇతర పత్రికలు స్వాతంత్య్ర ఉద్యమానికి చక్రాల్లా ఎలా పనిచేశాయో ఎటువంటి పాత్ర వహించాయో, ప్రజలపై ఎంత ప్రభావాన్ని చూపాయో తెలిపారు.
చివరలో పత్రికలపై గానయోగ్య కవిత రాశారు. అందులో ‘చైతన్య శిఖరాలపై రెపరెపలాడిన పతాకాలు ఈ పత్రికలు’ అనడం చాలా బాగుంది. పత్రికా చారిత్రక సమాచారాన్ని పొదిగించుకున్న రూపకమిది.
రూపకత్రయంలో మూడవ రూపకం ‘ఆంధ్ర మహర్షి’ బులుసు సాంబమూర్తి. ఇరవై ఏళ్ళ కొడుకు ముక్కుపచ్చలారని వయస్సులో ప్లేగువ్యాధికి చనిపోయిన దుర్భర శోక సందర్భంలో మూడురోజుల తర్వాత జరిగిన కాకినాడ కాంగ్రెస్సు సభలకు సాంబమూర్తి యధావిథిగా హాజరయ్యారు. దేశభక్తితో పుత్రశోకాన్ని దిగమింగుకున్నారు. సరోజనీదేవినాయుడు వంటి నాయకులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ సంఘటన, మరికొన్ని ముఖ్య సంఘటనల్ని ద్వానాశాస్ర్తీ స్ఫూర్తిమంతంగా రూపకార్యంగా చిత్రించారు.
చరిత్రాంశాలు, సాహిత్యాంశాలు, నాయకుల త్యాగాంశాలు ప్రేక్షకుల ప్రశంసలుపొందే విధంగా రాసిన ఈ మూడు రూపకాలూ తెలుగునాట నాలుగుచెరగులా ప్రదర్శించతగ్గవి. పక్ష భక్తికి అధిక ప్రాధాన్యమిచ్చే వర్తమాన దారుణ కాలంలో ఈ మూడు రూపకాలూ దేశభక్తి స్ఫూర్తి దీపాలై వెలుగులు వెదజల్లుతాయి.

-సన్నిధానం నరసింహశర్మ