అక్షర

గుండెని తడిమే ‘తడియారని స్వప్నం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘తడియారని స్వప్నం’’
-లోసారి సుధాకర్
వెల: రూ.100/-
ప్రతులకు: రచయత,
39/449-17, రోడ్ నెం.13
వివేకానందనగర్,
కడప- 516001
9949946991

‘‘తడియారని స్వప్నం’’ కవితా సంపుటిలో వ్యవస్థలోని సంఘటనలు తనలో కలిగించే స్పందనలకీ, వ్యక్తిగతంగా తనలో కలిగే భావాలకీ స్పందించి అక్షర రూపం ఇవ్వడం జరిగిందని మొత్తం కవితల్ని చదివితే పాఠకులకి అర్థమవుతుంది. వ్యవస్థపరంగానేగాక వ్యక్తిగా బహిర్గతం కావడమన్నది కవికి అదనంగా కలిసివచ్చే లక్షణమవుతుంది. లోసారి సుధాకర్ ఒక బిక్షకుడి గురించి వ్రాసినా ‘నాయన’గురించి వివరించినా ఓ ఆర్తి అగుపిస్తుంది. ఓ తడి కళ్ళలో చిప్పిల్లుతుంది.
‘‘అతడో పద్యం’’అన్న కవితలో ‘‘సులువుగా వెళ్ళాడు/మళ్ళీ వస్తాననీ చెప్పలేదు/ తిరిగిరానూ లేదు.... కానీ.../ తన గుర్తుగా ఓ పద్యాన్ని నాటి వెళ్ళాడు’’అనడంతో అతని స్మృతి ఆర్దత కలిగించి గుండెను తడిగా చేస్తుంది. ‘‘దాపుడు చీర’’ కవితలో అమ్మదాచుకున్న దాపుడు చీర జీవితాంతం దాపుడుగానే మిగిలి ఏనాడూ ఏ పూటా ఆ చీరని కట్టుకోని స్థితిని చెబుతున్నప్పుడు తను పడిన బాధ పాఠకునిలోనూ ప్రతిఫలిస్తుంది.
‘‘అన్నమూ-ఆకలి పాట’’ కవితలో యాచకున్ని చూసి కదిలిపోయిన గుణం అక్షరాల్లో నిక్షిప్తం చేస్తూ’’ ఇక వాడి పాత్రలో రూపాయినై వాలుతూ! వాడి ఆకలిని తీర్చే మెతుకుగా మారుతా’’నని తనకుతాను నీరైపోవడం చివరి చరణాల్లో కనిపిస్తుంది. ‘‘బతికిన క్షణం’’ కవితలో ‘‘ఎడబాటును గురించి వివరిస్తూ’’ మరణించడంకన్నా మహాశిక్షేముంది అనడం గుండెను ఛిద్రంచేస్తుంది. ‘ఒక జ్ఞాపకం వంద గాయాలు’ కవితలో ‘‘పోవయ్యా బాటసారి.... ఇది చిగురించని తోట’’అన్న వాక్యంలోనూ ‘‘అతీతం’’లో మనంమనల్ని మనం సంస్కరించుకున్నప్పుడు ఇరు దేహాలం కాదు ఒకే ప్రాణం’’అన్న వాక్యంలోనూ ‘‘ఒక వీరుని అమరత్వం’’లో ‘అతడక్కడుంటే బావుణ్ణు తన సాహసాన్ని స్తుతిస్తూ పూల గుత్తెనై పాదాలపై వాలి వుందును యుద్ధం ముగిసిన సాయంత్రం... అంటూ చివర్లో ‘‘అసలు ఆ మనిషి ఎక్కడ లేడని? అతనిది ఒక వీరుని అమరత్వం’’ అని ముగిస్తాడు. ఒక ప్రారంభానికి అంతంలేదని వివరిస్తాడు.
‘‘అరుగు’’అన్న కవితలో ఒక ముసలి అవ్వ గురించి చిత్రికలు కడుతూ ‘‘అక్కడే ఆ అవ్వ ఆ వీధి అరుగుమీద ఎముకల్ని పోగేసుకున్నట్టు కుప్పగా కూర్చుంది. రెండుకళ్ళూ రెండు ఆరిన మట్టి ప్రమిదల్లా లోలోపలికి చూపుల్ని ప్రసరిస్తూ లోలోన మనల్ని ప్రశ్నిస్తుంది. గోకుడు బిళ్ళతో పరిక్కాయలు తోడినట్టు జ్ఞాపకాల్ని తవ్వుతుంది... ఓ సాయంత్రం అవ్వలేదు అరుగును ఒంటర్నిచేసి చీకట్లోకి వెళ్ళిపోయింది. బహుశా సూర్యుణ్ణితోడుగా తీసుకెళ్ళింది కావచ్చు... అవ్వలేని అరుగు దిగులుగా కూర్చుంది’’అని ముగించడంతో మనలోమనం ఖాళీగా మిగలడం జరుగుతుంది.
లోసారి సుధాకర్ ‘‘తడియారని స్వప్నం’’లో కవితా వాక్యాల్ని విడగొట్టిన విధానం కొంత అసంబద్దత గా తోస్తుంది. వచన కవిత్వంలో అర్థం చెడకుండా వాక్యాల్లో పదాల్ని పొదగడమన్నది జరుగుతుంది. కానీ పదాల్ని అనవసరంగా వాక్యాల్లోంచి విడదీసి ఒకటి క్రింద ఒకటి వుంచడమన్నది ఈ పుస్తకం నిండా అగుపిస్తుంది. ‘‘అరగని పొద్దులా/ అన్నం ముద్దకోసం/ వెతుకుతాడు’’అన్న ఒకే వాక్యాన్ని మూడు వాక్యాలుగా ఒక దాని క్రింద ఒకటి పేర్చడంవలన (ఇటువంటివి పుస్తకం నిండా ప్రతి పేజీలోనూ దర్శనమిస్తాయి) అరువది పేజీల పుస్తకం నూట ఇరువది ఆరుపేజీలుగా మనకి కనిపిస్తుంది. అంతేగాక ‘‘యువప్రస్థానం’’వంటి రొటీన్ పదాలవల్ల, నినాదాలవలన కవిత్వం పలుచబడి పోవడం జరుగుతుంది. భావాలని సరికొత్త చిత్రికలతో నూతన పదాలతో అందించినప్పుడే కవిత్వం నూతనత్వం సిద్ధించుకుంటుంది. ‘‘యువప్రస్థానం’’వంటి మూడునాలుగు కవితలుగాగాక నినాదాలుగా అగుపించి కంటిలో నలుసులుగా, పంటికింద రాయి పలుకులుగా పడతాయి. అంతేగాక ‘‘తడియారని స్వప్నం’’ పుస్తకంలోని ప్రతి కవితలో మొదటి రెండు వాక్యాలు కవిత్వంతో మొదలై పలుకరిస్తాయి, ఆకర్షిస్తాయి, చివరి రెండు వాక్యాలూ మనసులోతుల్లో పలువరిస్తాయి, నిలుస్తాయి. లోసారి లోపమల్లా నడుమ నడిచే వాక్యాలు పలుచబడి స్పందన కొరవడడం ప్రతి కవితలో దాదాపు అగుపిస్తుంది.
కవిత్వతత్వమెరిగిన కవికి ఈ లోపాలని సరిదిద్దుకోవడమేమీ కష్టంకాదు. సంఘటనలలో కలిగిన స్పందనలని గాఢంగా స్పష్టంగా చెప్పగలిగినప్పుడు లోసారి ‘సరి’అయిన కవితలని ప్రపంచానికి అందివ్వగలడనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈమధ్య వచ్చిన కవితా సంపుటాల్లో ‘‘తడియారని స్వప్నం’’ గుండెని తడిచేస్తుందనడంలో సంశయమక్కర్లేదు. తనతోతను మాటాడుకుంటూ తనలోతను సంఘర్షించుకునే లోసారి ఈసారి సంపూర్ణమైన కవితలతో వస్తారని ఆశిద్దాం. ప్రతి వాక్యంలోనూ కవిత్వాన్ని నింపి గుండెను తడిచేస్తారని ఎదురుచూద్దాం.

-యక్కలూరి శ్రీరాములు