అక్షర

మేలిముత్యాల కథల మాలిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చొరబాటు
(కథల సంపుటి)
రచయిత: శిరంశెట్టి
కాంతారావు
వెల: 150 రూపాయలు
ప్రతులకు- అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాల్లో.

వ్యవసాయం ఒక్కటే జీవన విధానంగా ఆ జీవితం చుట్టూనే దానిపైనే ఆధారపడి కుల వృత్తులూ, పండగలూ, ఆచారాలు ఉన్న రోజులు ఎలా వుండేవో ఇప్పుడు కథల్లోనే చదవాలి. అలాటి కథలు రాయగలిగేవాళ్ళకి ప్రజాజీవితం పట్ల ఒక అవగాహన, ఇష్టం, ప్రేమ వుండి తీరాలి. నడుస్తున్న చరిత్ర, మారిపోతున్న విలువలు ఇందుకు కారణవౌతున్న నేపథ్యం గురించి కూడా తెలిసి వుండాలి. అంటే ఒక రచయిత సాటి మనుష్యుల పట్ల, వాళ్ళ వేదనలు, బాధల పట్ల సానుభూతితో తన మనసు మెలిపెట్టిన సంఘటనలను ఇతరులతో పంచుకోవాలనే తపనతో రాస్తే ఆ రచనలు ఎలా వుంటాయో శిరంశెట్టి కాంతారావుగారి కథలు చదివితే తెలుస్తుంది. ఈ కథలు ఉత్త ఊహల్లోంచి పుట్టుకొచ్చినవి కాదు. మనుష్యుల జీవితాల్లోంచి ఊడిపడి, ఆ కష్టమేదో అర్ధం అయ్యాక మరచిపోయే ప్రయత్నం చేసినా అవకాశం లేక, మనసుని ఉక్కిరిబిక్కి చేస్తే రాలిన కన్నీటి చుక్కలు. ఈ కథల సంపుటి ‘చొరబాటు’లో 18 కథలున్నాయి. ఈ కథల్ని సరదాగా రాయటమూ, చదవటమూ కూడా కుదిరేపని కాదు. కడుపులో ఉండచుట్టుకుపోయే ఆకలినీ, రెప్పలకింద దాక్కున్న దుఃఖాన్ని, బతుకు భారాన్ని, మనిషి భయాన్ని, బలహీనతలనీ కోరికనీ, ఇష్టాన్నీ బాధ్యతగానే రాయాలి. పాఠకులు కూడా బాధ్యతగానే చదవాలి కూడా. చరిత్ర పుటల్లోకి జారిపోతున్న కొనే్నళ్ళ కిందటి జీవితాన్ని గుప్పెట్లో బిగించి పాఠకులకు చూపే ప్రయత్నం చేశారు రచయిత.
‘‘శవదహనం చేశాక ఆ శవం బూడిదపై, కూర్చుని పైసలు అడిగే కుల వృత్తినీ, ఆ వృత్తి కాలవాహినిలో కనుమరుగైపోతూ విద్యుత్ దహన వాటికలు రావటం గురించి, ఆ వృత్తిపై బతికే కాటిపాపడు మొదటి శవంగా ఆ దహన వాటికలో గుప్పెడు బూడిదగా మిగలటం గురించి ‘సాక్షి’ కథలో చెప్పారు రచయిత. మనిషి కష్టాన్ని తగ్గించే యంత్రాలు రావటం నాగరికత అయితే, వాటివల్లనే ఆ మనిషి బతుకుతెరువే మాయం కావటం గురించి పాఠకుల కళ్ళముందు ఒక ప్రశ్నార్థకం నిలబడుతుంది. అయితే రచయిత చాలా ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే బాధ్యత తనే తీసుకొన్నారు. చిక్కులెక్కలాంటి సమస్య కథగా మొదలై పరిష్కారం దిశగా నడుస్తూపోతుంది. కాంతారావుగారు ముందుమాటలో చెప్పినట్లు, కథే నా శాశ్వత చిరునామా. ఈ చిరునామాను నిలబెట్టుకోవాలంటే లక్ష్యంతో కథలు రాస్తున్నవాడ్ని కాబట్టి ఈ లక్ష్యాన్ని అనుగుణంగానే నా కథలుంటాయని సరిగానే చెప్పారు. నిజమే. కథే రచయిత గురించి చెప్పాలి. అంతేగానీ కథలో శిల్పం, కలిగించే ఉత్సుకత అందమైన పదాల కూర్పులతో కథారచయిత సృష్టిగానే వుంటూ చదువుతుండగానే ఎక్కడో జారిపోయి కనబడకుండా పోతుంది. పాఠకుల మనసులో ముద్రవేసుకొనే సమయం చిక్కనే చిక్కదు. ఒక సంఘటనను, సందర్భాన్ని దృష్టిలో వుంచుకొని, కాస్త కల్పనని ఊహని జోడించి దాన్ని కథగా మలచడం శిల్పి ఒక శిల్పాన్ని చక్కగా చెక్కటం లాటిదే... కళాకారుడి సృష్టి సజీవంగా వుంటేనే పది కాలాలపాటు చరిత్రలో నిలబడి వుండగలుగుతుంది. చీకటిపడ్డాక వికసించి ఉదయంవేళకు వడలిపోయే చంద్రకాంత పూవులాగా ఒక చిన్న జ్ఞాపకంగా కూడా మిగలకుండా రాలిపోతుంది. అలా ఎన్నో కథలు పుట్టి కంచికెళ్ళిపోతుంటాయి. కాంతారావుగారు తన కథల్ని అలా గమనం నిర్ణయించారు. కథ మొదలై ఎలా నడవాలో నడిచి ముగింపు చెప్పుకొంటుంది.
ఇందులో మొదటి కథ చొరబాటులు, పాపికొండల్లో అందమైన గోదారి వడ్డున కట్టిన హోటల్లో దిళ్ళుపరుపులు కుట్టేందుకు తన మనుమడితోపాటు బయలుదేరిన రాజేశం ఒక దుర్మార్గమైన జీవితాన్ని చూస్తాడు. ఖమ్మం జిల్లా గిరిజన ప్రాంతాల్లోని కొండరెడ్ల పిల్లలకోసం ప్రభుత్వం స్కూలుకట్టాలని తీసుకొన్న నిర్ణయంలో అక్కడికి కాంట్రాక్టర్‌గా అడుగుపెట్టిన సత్తిరెడ్డి మొత్తం గూడేనే్న పతనం చేస్తాడు. ప్రభుత్వం కట్టే స్కూళ్ళకోసం తమ సొంత భూమిని ఇచ్చిన గూడెం పెద్ద పొద్దన్నరెడ్డి కూతురు బంతెమ్మను వల్లోవేసుకొని ఆ గూడేనే్న గుప్పిట్లోకి తీసుకొంటాడు. పర్మిట్లు సంపాదించి హోటళ్ళు, కాటేజెస్ కడతాడు. గూడెం యువతులను వృత్తిలోకి దింపుతాడు, బంతెమ్మ ఆమె తండ్రి ఆత్మహత్యలతో కథ ముగుస్తుంది. పరుపులు కుట్టే రాజేశం కళ్ళతో పెద్ద నవలకు సరిపోయే ఇతివృత్తాన్ని ఇన్ని జీవితాల్ని చిన్న కథగా మలిచాడు రచయిత.
ఈ సంపుటిలో ఇంకో ‘ఇంటింటి కథ’వుంది. ఉద్యోగాల కోసమో, వ్యాపారాలకోసమో బతుకుతెరువుకోసం, ఉన్న ఊరినీ తల్లిదండ్రులను వదిలేసిపోయే పిల్లల కథలు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి. పట్టణవాసం ఇరుకు జీవితంతో కన్నవాళ్ళకు, కడుపున పుట్టివాళ్ళు చోటు ఇవ్వలేని స్థితిలోనే ఉన్నారు. ఇప్పటి సమాజంలో కళ్ళకు కట్టినట్లు కనిపిస్తున్న అభివృద్ధికి ఇదొక చీకటి కోణం. అలాటి ఒక కుటుంబంలో ఓ రాత్రి ఓ తల్లి కళ్ళుమూస్తుంది. ముగ్గురు కొడుకుల్లో నడిమివాడు పట్టణంనుంచి భార్యాబిడ్డలతో తల్లిదగ్గరకు వస్తాడు. శలవులేదని చిన్నవాడు, ఓపిక లేదని పెద్దవాడు చేతులెత్తేస్తే, శవదహనం దగ్గరనుంచి కర్మకాండలు భోజనాలదాకా ఖర్చులన్నీ మధ్యవాడిపైనే పడతాయి. తను పోయినప్పుడు కూడా ఇలాగే వచ్చి తనను గుప్పెడు బూడిద చేసి పొమ్మని కొడుకుని తండ్రి వేడుకోవటంతో కథ ముగుస్తుంది. మధ్య జీవితంలో మనుష్యుల చిన్న మనుష్యులనీ, మాయమైపోతున్న రక్తసంబంధాలనీ మంచి కథగా రాశారు కాంతారావుగారు. ఈ కథలో చాలామటుకు బహుమతి అందుకొన్న కథలే. వర్షపుచినుకు సముద్రంలో పడితే ప్రవాహంలో కలిసిపోతుంది. అదే ముత్యపుచిప్పలో పడితే మంచి ముత్యవౌతుంది. మేలిముత్యాల వంటి కథలు అందించారు శిరంశెట్టి కాంతారావుగారు.

-సి.సుజాత