అక్షర

స్వామివారి విశ్వరూప యాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘కల్యాణ లీల’
-ఓరుగంటి నీలకంఠ శాస్ర్తీ
వెల: రు. 70/-
పేజీలు: 60
ప్రాప్తిస్థానము:
నోరి సుబ్రహ్మణ్య శాస్ర్తీ
4-1-26, నాచారం,
స్నేహపురి
హైదరాబాదు-500076
**
జగద్గురు శ్రీ కల్యాణానంద భారతీ మాంతాచార్య మహాస్వామివారి జీవిత కావ్యానికి రేఖా రూప చిత్రణం ఈ గ్రంథం. రచయిత బ్ర.శ్రీ ఓరుగంటి నీలకంఠ శాస్ర్తీగారు భాష్యాంత వైయాకరణులు, వేదాంత పారీణులు, సుప్రసిద్ధ సాహితీవేత్త. స్వామి వారితో విశేష సాన్నిహిత్యం వున్న అంతేవాసి, వారి సంప్రదాయంలోని ఉత్తమ శ్రీవిద్యాసాధకుడు అయిన కారణంగా స్వామివారి జీవితం ఈ గ్రంథంలో ప్రణాళికాబద్ధంగా, ప్రయోజనవంతంగా, రుచికరంగా వర్ణించబడింది. స్వామివారి షష్టిపూర్త్యుత్సవ సందర్భంగా వారికి భక్తితో సమర్పించిన 65 పేజీల ఈ రచన 1942లో ప్రథమంగా వెలుగు చూసింది. ఇది ద్వితీయ ముద్రణ. సంపాదకులు నోరి సుబ్రహ్మణ్య శాస్ర్తీగారు. నోరి నరసింహ శాస్ర్తీ చారిటబుల్ ట్రస్ట్ వారు దీనిని ప్రచురించారు.
శ్రీవారి జననం, విద్యాభ్యాసం, సంన్యాసాశ్రమ స్వీకారానికి దారితీసిన పరిస్థితులు వివరించారు రచయిత. శైలి సరళ గ్రాంథికం. శ్రీ స్వామివారి విశ్వరూప యాత్రలు, వారు చేసిన ప్రతిష్ఠాదికాలు, వారు ఖండించిన అవైదిక మతవాదములు, భ్రష్ట పీఠములను నిరసించిన తీరు దీనిలో స్పష్టంగా తెలియవస్తున్నాయి. కాలక్రమాన్ని పాటిస్తూ తేదీలను ఇచ్చి సంఘటనలను వర్ణించిన తీరు గ్రంథానికి ప్రామాణికత్వాన్ని ఆపాదిస్తుంది.
స్వామివారి బాల్యం, వనం కొనసాగిన భీమనిపట్నం, విజయనగరం వంటి పట్టణాలు ఆయన జీవితంపై ఎలాంటి ప్రభావాన్ని చూపి, ఎలా ప్రతిస్పందింపచేసాయో ఈ గ్రంథం కనులకు కట్టినట్టు వర్ణిస్తుంది. ఈ నేపథ్యంలో స్వామివారి సర్వశాస్త్ర పారంగత్వానికి సంన్యాసగ్రహణానికి, పేరూరులో సుదీర్ఘకాలం వేదాది సర్వశాస్త్ర అధ్యయనానికి దారి తీసిన పరిస్థితులు ఆసక్తికరంగా కనిపిస్తాయి.
శ్రీ విద్యా శంకరులు జ్ఞానవాప్తికి, శ్రీ విద్యారణ్య యతీంద్రులు కర్మకాండార్ధ ప్రతిపాదకత్వానికి, శ్రీ స్వామివారు ఉపాసన తత్త్వ ప్రతిపాదకయుగానికి ప్రాతినిధ్యం వహించి ప్రధానాచార్యత్రయంగా భాసించిన తీరును గ్రంథం ప్రతిభావంతంగా సమర్ధించింది.దేశపర్యటనాన్ని విస్తృతంగా పలుమారులు చేసిన వైనం సరైన తేదీలతో చెప్పడం విశేషం.
సమకాలీన ప్రభావమే కాక భవిష్యత్తులో కూడా తన బోధనలు అకుంఠితంగా కొనసాగి ఆచరణ రూపం దాల్చడానికి వీలుగా స్వామివారు చేపట్టిన గ్రంథరచన, ప్రకాశనా పద్ధతులు; తమ సన్నిధిలోనే శిష్యులతో ఉపాసనాదికాలకు మార్గదర్శనం వహించడం, తమ సంప్రదాయాన్ని కొనసాగించే ఉత్తమ శిష్యగణాన్ని సిద్ధం చేసి వారికి ఆచార్యత్వాన్ని అనుగ్రహించడం ఇవన్నీ మనోహరంగా పొందుపరిచారు. స్వామివారిని ఉత్తమదార్శనికునిగా ఆవిష్కరింప చేస్తున్నదీ గ్రంథం.
స్వామివారి బహుభాషా పాండిత్యం, ప్రాచ్య పాశ్చాత్య బహుశాస్త్ర విజ్ఞానం, ఆర్షేయ వాజ్మయాన్ని సమగ్రంగా ఆకళింపుచేసుకున్న తీరు ఇందులో కొట్టవచ్చినట్టుగా కన్పిస్తాయి. సమకాలీన మేధావులను, సామాన్య జనులను, విభిన్న రంగాలలోని వ్యక్తులను, సంస్థలను శక్తివంతంగా ప్రభావితం చేసిన జగద్గురువుగా స్వామి ఇందులో ప్రత్యక్షమవుతారు. గుంటూరులో శ్రీ విరూపాక్ష పీఠాన్ని పునఃస్థాపించిన తీరు, అవిచ్ఛిన్న శంకర సంప్రదాయాన్ని సనాతన ధర్మాన్ని అప్రతిహతంగా ప్రతిష్ఠించిన వైనం చదువుతున్నప్పుడు పాఠకుడు ఆనందోత్సాహాలతో పులకించిపోక తప్పదు.

-వారణాసి వెంకటేశ్వర్లు