అక్షర

వీనులవిందుగా హనుమద్వైభవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీమద్ రామాయణ
మకరందమ్
సుందరకాండ
-ఆకెళ్ల అచ్యుతరామమ్
వెల: రూ.450
పుటలు: 874
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో
**

‘చూచితి సీతను - వ్రత నియమమ్మే
గాచి రక్షించుచున్న దా సతిని
తన సువ్రతములచే నక్షతమై
మనుచున్నది దీనత సీతాపతి’
హనుమంతుడు శ్రీరాముని ముందు సాష్టాంగ నమస్కారం చేసి చెప్పిన మాట ఇది. సుందరకాండ చివరలో ఉన్నమాట. హనుమంతుడు సాధించిన కార్యమిది. శతయోజన విస్తీర్ణమైన సముద్రాన్ని దాటి లంకను చేరి, సీతను చూచి రావటానికి హనుమంతుడు మహేంద్ర పర్వతమెక్కి నింగి కెగిరినాడని చెప్పటంతో మొదలైన సుందరకాండ, తిరిగి వచ్చి, ‘చూచితి సీత’నని శ్రీరామునికి చెప్పటంతో ముగుస్తుంది.
ఈ సుందరకాండను ఆకెళ్ల అచ్యుతరామమ్‌గారు ‘శ్రీమద్ రామాయణ మకరందమ్ సుందరకాండ’ పేరుతో 874 పుటల ఉద్గ్రంథాన్ని రచించారు. ఇది వాల్మీకి రామాయణానికి తెలుగు అనువాదం. కావ్యమంతా మాత్రాచ్ఛందస్సుకు చెందిన రగడల్లో వ్రాయబడింది. పాడుకోవటానికి తగినట్లు ఉండటం కోసం కవి ఈ మాత్రాచ్ఛందస్సును ఎన్నుకొన్నట్లు తెలుస్తోంది.
ఈ గ్రంథంలో 65 విభాగాలున్నాయి. రామాయణాన్ని ‘మకరంద’మని పేర్కొన్నాడు కాబట్టి, ఈ విభాగాలను కవి, ‘కలశము’లని పేర్కొన్నాడు. ఈ కలశాల్లోని కథామకరందం స్థూలంగా ఈ క్రింది విధంగా ఉంది.
1.హనుమంతుడు సముద్రం దాటి లంకను చేరి రాత్రివేళ రావణుని అంతఃపురంలో వెదకి చివరకు అశోకవనంలో ఉన్న సీతను చూడటం.
2.రావణుడు సీత కడకు వచ్చి, తనను పెండ్లాడుమని చెప్పి రెండు నెలల గడువు పెట్టటం.
3.హనుమంతుడు సీతను సమీపించి తనను పరిచయం చేసుకొని రాముడిచ్చిన ఉంగరాన్ని సీతకివ్వటం, సీత తన చూడామణినిచ్చి రామునికివ్వుమని చెప్పటం.
4.హనుమంతుడు అశోకవనాన్ని ధ్వంసం చేసి అక్ష కుమారుడు మొదలైన రాక్షస వీరులను చంపి, ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రానికి కట్టుబడి రావణుని సభను చేరి తాను రామదూతనని, సీతను వెదుకటానికి వచ్చినానని చెప్పటం.
5.అశోకవన ధ్వంసం, రాక్షసులను వధించినందుకు కోపించిన రావణుడు హనుమంతున్ని వధించబూనగా, దూత వధార్హుడు కాడని విభీషణుడు చేసిన సూచన మేరకు శిక్షగా హనుమ తోకకు నిప్పు పెట్టటం, ఆ నిప్పుతోడనే లంకా దహనం చేయటం.
6.లంక నుండి తిరిగి వచ్చిన హనుమంతుడు తన రాకకోసం ఎదురుచూస్తున్న అంగదాదులను కూడి సుగ్రీవ, లక్ష్మణ సమేతుడైయున్న శ్రీరామునికి తాను లంకలో ఉన్న సీతను చూచినానని చెప్పి ఆనవాలుగా చూడామణిని అందజేయటం.
వాల్మీకి రామాయణాన్ని యథాతథంగా తెలుగులోనికి అనువదించటం, గానయోగ్యతను కలిగించటం కోసం మాత్రాచ్ఛందస్సంబంధమైన రగడల్లో వ్రాయటం ఈ రచనలోని ప్రత్యేకత. పాఠకునికి ఏ విధమైన సందేహానికి తావు లేకుండా కొన్ని పదాలను వివరించిన తీరు కూడా కన్పిస్తుంది. రచన సరళ సుందరంగా ఉండటం వల్ల సులభంగా అర్థమవుతుంది. చదివింపజేసే లక్షణం ఈ రచనలో ఉంది.
‘శత్రువులను దునుమాడగ జాలెడు
శౌర్యం బెంతయు రాజిలుచుండగ
అరివీర భయంకరుడై వెలసెడు
హనుమంతుడు, రావణుచే నపహృత
సీతాసాధ్విని వెదకుటకై
ఆకసవందున, చారణు లెల్లరు
తిరుగాడెడు విన్వీధుల యందున
నరుగుచు ననే్వషింపగ గోరెను’
ఇది ఈ సుందరకాండలోని ప్రారంభ పాఠాలు.
‘తతో రావణ నీతాయాః/ సీతాయాః శత్రుకర్మనః
ఇయేష పదమనే్వష్టుం/ చారణా చరితే పఠి’
ఇది వాల్మీకి సుందరకాండలోని ప్రారంభ శ్లోకం. ఈ శ్లోకానికి ఆపైది అనువాదం. మూలంలోని ‘శత్రుకర్మనః’ అనే మాట తెలుగులో, ‘శత్రువులను దునుమాడగ జాలెడు.. అరివీర భయంకరుడై వెలసెడు’ అని మూడు పాదాలుగా విస్తరించింది. ‘చారణా చరితే పథి’ అనే శ్లోక పాదం, తెలుగులో ‘ఆకసమందున చారణులెల్లరు తిరుగాడెడు విన్వీధుల యందున’ అని సాగింది. ‘ఆకసమందున’ అనే మాట మరోసారి చెప్పబడింది. స్పష్టత కోసం కవి ఇట్లా వ్రాసి ఉంటాడనుకోవచ్చు. ఈ కాండకు నాయకుడనదగిన హనుమంతున్ని ప్రవేశపెడుతూ అతని పరాక్రమాన్ని తెలుపవలెనని భావించి ఉండవచ్చు. రాముని శత్రువులైన రావణాదులు హనుమంతునికి శత్రువులే. లంకకు చేరి శత్రువులను చంపి అరివీర భయంకరుడుగా తన పరాక్రమాన్ని చూపిన హనుమంతుని శౌర్యాన్ని పాఠకునికి సూచించవలెనని కవి భావించటం వల్ల ఇట్లా వివరించి ఉంటాడని. ‘చూచి రమ్మంటే కాల్చి వచ్చినాడ’ని పేరు మోసిన హనుమంతుని గొప్పతనాన్ని తెలుపటం కవి ఉద్దేశమై ఉంటుంది. ఈ విధంగా ఇది మంచి ప్రారంభమని చెప్పుకోవచ్చు.
హనుమంతుడు సీతను చూడటమన్నది సుందరకాండలో ప్రముఖమైన ఘట్టం. ఇది వాల్మీకి రామాయణంలో 15, 16, 17 - మూడు సర్గల్లో 119 శ్లోకాల్లో వర్ణింపబడింది. ఈ ఘట్టానే్న అదే సంఖ్యను పాటిస్తూ అచ్యుతరామం గారు 15, 16, 17 కలశాలలో అనువదించినారు. ఇది 42 పుటలకు విస్తరించింది. అనువాద గ్రంథం పెరగటాన్ని ఇది సూచిస్తుంది. సంస్కృత పదాలను తెలుగు చేయటంలో సమాస రచనకు పూనుకొనకుండా, విషయ స్పష్టతను దృష్టిలో ఉంచుకొని వీలయినంత వరకు తెలుగు పదాలనే ఎక్కువగా వాడినందువల్ల తెలుగు గ్రంథం ఈ విధంగా పెరిగినట్లు తెలుస్తోంది.
తాను వ్రాసిన రామాయణాన్ని వాల్మీకి లవకుశుల చేత పాడింపజేసినాడు. గానమునకు అనుగుణంగా మధురంగా, తంత్రీ లయ సమన్వితంగా రామాయణం రచింపబడిన విధానాన్ని వాల్మీకి బాలకాండ (4 సర్గ - 8,9,10,11) శ్లోకాల్లో స్పష్టం చేసినాడు. దీనిని దృష్టిలో ఉంచుకొనియే అచ్యుత రామంగారు సుందరకాండను గేయాత్మకమైన రగడల్లో వ్రాసి ఉంటారు. మంచి గాయకుల చేత పాడించి సుందరకాండను మరింత వ్యాప్తిలోనికి తేవాలని భావించి ఉంటారు.

-అనుమాండ్ల భూమయ్య