అక్షర

వౌన మేఘం కురిసిన కవితా వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇన్నాళ్ల వౌనం తరువాత
(కవిత్వం)
-అరుణ నారదభట్ల
వెల: రూ.100/-
పేజీలు: 119
ప్రతులకు: 2-2-1105/5/10
ఫ్లాట్ నెం.16
నీలాద్రి అపార్ట్‌మెంట్స్
తిలక్‌నగర్, న్యూనల్లకుంట
హైదరాబాద్ - 500 044.
9848340502
9705015207
**
కవిత్వమంటే అపారమైన ప్రేమ, కనుమరుగవుతున్న మానవ సంబంధాల పట్ల ఆవేదన, సమాజంలోని అన్యాయాలపై ఆగ్రహం, ఆడవాళ్లను అందాల బొమ్మలుగా భావించే వ్యాపార సంస్కృతి పట్ల అసహనం వౌనం వీడి ఆమెను కలం పట్టేలా చేశాయి. ఆమే నారదభట్ల అరుణ. కవితా సంపుటి ‘ఇన్నాళ్ల వౌనం తర్వాత.’
ప్రాచీన కాలం నుంచి ఆధునిక కాలం వరకు ‘వాక్యం రసాత్మకం కావ్యమ’ని, ‘విశ్వశ్రేయః కావ్యమ’ని కవిత్వానికి ఎన్నో నిర్వచనాలున్నాయి. కానీ ‘కళ్ళు మాట్లాడినప్పుడల్లా/ కవిత్వమవుతుందని, మేఘమాలికలు ఘర్షించి వర్షించి మెరుపొకటి విరిసినట్లుగా కవిత్వం’ అని సరికొత్త నిర్వచనం కవిత్వానికి ఇచ్చినపుడు మనస్సులో కొత్త మెరుపు మెరుస్తుంది. 55 కవితలున్న ఈ సంపుటి విభిన్న అనుభూతుల ఇంద్రధనస్సును ఆవిష్కరిస్తుంది.
ఈనాడు పరిమళించే మానవత్వం కరువై పోయింది. దేన్ని ముట్టుకొన్నా కరెన్సీ వాసన కొడుతున్నది. మనిషి మార్కెట్ వస్తువైపోయాడు. దీనినే ‘వాణిజ్యం’ కవితలో ‘మనిషితనమంతా మార్కెట్టైన నాగరికత/ అమ్మ ఆలి అక్క చెల్లి అనే తేడాలేవి లేవు/ కేవలం అమ్మకం ఒక్కటే లక్ష్యం’ అని అనుభూతుల ప్రవాహం లాంటి జీవితం అమ్మకం కొనుగోళ్ల వ్యాపారమై పోయిందని బాధపడతారు. ఒకప్పుడు భారతీయ సంస్కృతి గొప్పదని చెప్పుకొనే వాళ్లు. కానీ ఇప్పుడదంతా తారుమారైందని ‘గర్వించే’ సంస్కృతి నుంచి ఎన్నడో బైటపడిపోయాం’ అంటారు.
మాతృదేవోభవ పితృదేవోభవ అని తల్లిదండ్రుల్ని పూజించిన కాలం గతించింది. ముసలి తల్లిదండ్రులను కావడిలో మోసుకొని పుణ్యక్షేత్రాలు చూపించిన శ్రమణ కుమారుడు పుట్టిన దేశంలోనే వృద్ధాశ్రమాలు వెలిసాయి. ఈ ఆశ్రమాల్లో డబ్బుతో దొరికే అనేక సౌకర్యాలుంటాయి గానీ, దిగులు ఊబి నుంచి బయటకు లాగే ఆత్మీయ హస్తం దొరకదు, ‘గుప్పెడు నూకలు కాదు కరువైంది/ చిటికెడు ప్రేమ’ అని ప్రేమ రాహిత్యంలో బ్రతికే వృద్ధుల గురించి ‘వార్ధక్య దీపం’లో ఆవేదన వెలిబుచ్చుతారు. ‘కొడిగట్టే దీపానికి రెండు చేతులయ్యేదెవరు/ వెంట వున్న కన్నీళ్లు జ్ఞాపకాలు తప్ప’ అని ఆ పండుటాకులకు తోడుగా నీడగా ఐన వాళ్లు, ఆప్తులు ఎవరూ ఉండరని వారి విషాద జీవితాన్ని బొమ్మ కటిస్తారు.
కవయిత్రి సునిశిత దృష్టి నుంచి ఏదీ తప్పించుకుపోదు. ఒకప్పుడు పిల్లలు బడి నుండి ఇంటికి వచ్చిన వెంటనే బయటకు వెళ్లి ఆడుకొనేవారు కానీ ఈనాటి పిల్లలకు ఇంట్లోను, బళ్లోనూ ఆటలు లేవు. బళ్లో పాఠశాల పిరియడ్లు తప్ప ఆటల పిరియడ్లు వుండవు. కొన్ని బళ్లకు ఆటస్థలాలే కరువు. ఇప్పుడన్నీ నిట్టనిలువు బళ్లే కదా! పిల్లలు గూడ ఇంటికి వచ్చి పుస్తకాల సంచులు విసిరేసి టీవీ చూడ్డమో, ఫోనులో ఆటలాడుకోవడమో పరిపాటైపోయింది. దీనినే ‘ఇప్పుడు వింతేముంది/ ఎగరాల్సిన పక్షులు/ తారురోడ్డుపై నడుస్తున్నాయి. ఆరుబయట పరుగులు తీసే/ చిన్నపిల్లల గెంతులు/ నాలుగ్గోడల భద్రంగా/ చేతిలోని ప్రపంచాన్ని చూస్తున్నాయి’ అని ‘తిరగేసిన కాలం’లో ఆటలు లేని బాలల దినచర్యను ఆవిష్కరిస్తారు.
ఈ కాలంలో టి.వి. లేని ఇల్లు లేదు. ఫోను లేని చెయ్యి లేదు. ఇక టి.విలో అసలు కార్యక్రమం కంటే కొసరు కార్యక్రమమెక్కువ అన్నట్లు నిమిషానికోసారి వచ్చే వ్యాపార ప్రకటనల పరంపరలు. ప్రకటనల ప్రపంచం నిండా అందమైన ఆడపిల్లలే. ముఖానికి క్రీములు, జుట్టుకు నూనెలు ఎప్పుడూ ఇవే ప్రకటనలు. వీటి గురించి ‘బలం’ కవితలో ‘వేలు మీద మొలిచిన గోరుకు రంగులద్దుకొంటూ/ వేల కోట్లు తెచ్చి పెట్టే నువ్వు అప్సరసవే/ అని పెట్టుబడిదారులకు లాభాలు తెచ్చిపెట్టే అమ్మాయిల గురించి చెప్తూ ‘ఐదు సెకన్లకో అందాల ఆడబొమ్మ అరకొర వస్త్రాలతో ఆకర్షణ తప్పేముంది. కేవలం వ్యాపార ప్రకటన మాత్రమే/ ఆడతనాన్ని కొత్తగా ఆరబోస్తాం’ అంటారు. ఆడతనాన్ని ప్రదర్శింపచేసి లాభాలార్జించే వ్యాపారుల స్వార్థాన్ని ఎండగడతారు. ‘కొత్తగా అంగడి అవసరం లేదు ఆడనతపు ప్రదర్శనకు’ అని ఈ వ్యవస్థ సిగ్గులేనితనంపై నిర్భీతికి తన నిరసనాస్త్రాన్ని సంధిస్తారు.
ఇలా స్ర్తిలను వ్యాపార సాధనాలుగా, అందాల బొమ్మలుగా చూడడం కవయిత్రికి నచ్చదు. స్ర్తిలు నిద్ర లేవాలని, ముందుకు వెళ్లాలని ‘జవాబు’ కవితలో ఆడవాళ్లకు కొత్త అర్థమిస్తారు. ‘అఆ’లకు మరో మాట చెప్పు/ ‘అ’ అంటే అబల.. అణగారడం కాదని/ ‘అధిగమించడ’మని చెప్పు/ ‘ఆ’ అంటే ఆత్మాభిమానాన్ని చంపుకోవడం కాదని/ అది ‘ఆదిశక్తి రూపమ’ని’ ‘ఆలోచనా విచక్షణ’ చెప్పు’ అని స్ర్తిలకు ఆత్మగౌరవ పాఠాలు చెప్తారు.
మనది వ్యవసాయ ప్రధానమైన దేశం. దేశ జనాభాలో ఎక్కువ శాతం రైతులే. కష్టపడితే ఫలితం దక్కుతుందని అంటారు. కానీ కష్టపడినా ఫలితం దక్కనివారు కర్షకులే. అతివృష్టి, అనావృష్టి, కల్తీ విత్తనాలు, కల్తీ పురుగు మందులతో, గిట్టుబాటు ధరలు లేక అన్నదాతలే ఆత్మహత్యలు చేసికొంటున్నారు. ఊళ్లో అందరికీ తిండి పెట్టిన వాళ్లే ఇప్పుడు తినడానికి తిండి దొరక్క పూలమ్మిన ఊళ్లో కట్టెలమ్మలేక పరాయి ఊళ్లకు వలస వెళ్లిపోతున్నారు. వీరి దీనావస్థను గురించి ‘పొడ మరలిన జీవితం’లో ‘నరికే దళారీ రంపానికి లోకువై/ మారే రాజకీయ/ పరమపద సోపానానికి/ అతివృష్టి అనావృష్టిల దిష్టిబొమ్మై నాలుగు మెతుకుల కోసం అతడు ఊరొదిలి వెళిపోతున్నాడు’ అని ప్రకృతి వైపరీత్యానికీ దళారీ పెత్తనానికీ మధ్య నలిగిన రైతుల కన్నీటి జీవిత చిత్రాన్ని కనుల ముందు ఆవిష్కరిస్తారు.
ప్రజలకు విద్య, వైద్యం ఉచితంగా అందించాల్సిన ప్రభుత్వం రెండిట్లో ఘోరంగా విఫలమయింది. కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదువు ఒక కొనుగోలు సరుకైంది. ఇక వైద్యమూ అంతే. ప్రాణాలు పోయవలసిన దేవుడు లాంటి డాక్టరే డబ్బుల కోసం ప్రాణాలు తీస్తున్నాడు. ఎప్పుడైనా జబ్బుచేసి కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్తే డబ్బులు మంచినీళ్లుగా ఖర్చయిపోతాయి గానీ, రోగం తగ్గదు. ఈ ఆస్పత్రుల నిజ స్వరూపాన్ని బట్టబయలు చేస్తూ ‘్ఫలించని చికిత్స’లో తెలియక అడుగేసిన మొఘల్ చక్రవర్తిలా నాన్న ఆరుకాళ్ల మనిషయ్యాడు/ గొడవ పడితే నడవగలడంటే/ ఏకంగా కోర్టుకే ఎక్కేదాన్ని’ అని కార్పొరేట్ ఆస్పత్రుల తీరని ధనదాహాన్ని ‘కార్పొరేట్ ఆసుపత్రంటే/ పోలవరంలో మునకేయడమని తెలీదు!’ అని ఆక్రోశిస్తాడు. ఇంకా ఈ పుస్తకంలో మంచుగడ్డ, చల్లని వేసవి, జీవామృత ధార, ఉనికి, మేల్కొలుపు, సందెవేళ, వౌనం మాట్లాడిన వేళ, అలసిన వెలుగు మొదలైన కవితలు మనసుపై ప్రగాఢ ముద్ర వేస్తాయి.
చైత్రానికీ చిగురాకుకూ మధ్య తీయని సంగమం కవిత్వం, బ్రతుకుపోరులో చుక్కాని కవిత్వం, కొత్తదారుల్లో పూవై పూస్తుంది, రైలుపట్టాల్లా కలుసుకోము గానీ కలిసే నడుస్తుంటాము, ప్రతి నిత్యం కొత్త పదాలతో తెల్లకాగితంపై చీకటిని చీల్చేది రాత్రి వంటి వాక్యాలు తాజా పరిమళాలతో మనసును అలరిస్తాయి.
కవయిత్రికి ఇది తొలి పుస్తకమైనా అలా అనిపించదు. జీవితానుభవాలు చెక్కిన అక్షర శిల్పాలు పాఠకులను ఆలోచింపజేస్తాయి.
కవిత్వం రాయడానికి నిరుపసతిస్థలం, కర్పూర తాంబూలం, ఉయ్యాల మంచం మొదలైనవన్నీ కావాలని ఆనాడు పెద్దన అన్నాడు. మనసులో మెదిలే భావాలకు అక్షర రూపమివ్వడానికి స్ర్తిలకు ఇలాంటి సౌకర్యాలేమీ అక్కరలేదు. ఇంటి పనుల్లో, వంట పనుల్లో మునిగిపోతున్నపుడు కాసింత తీరిక దొరక్క భావాలన్నీ మనసులోనే అణగిపోతాయి. అప్పుడప్పుడు మనసు గూటి నుంచి బయటకు వచ్చి కవిత్వ ప్రపంచంలో అక్షరాల సీతాకోక చిలుకలు ఎగురుతాయి. ఆ ప్రయత్నంలో సఫలీకృతులైన అరుణగారు వాటిని నిరంతరం అలాగే ఎగరనివ్వాలని ఆకాంక్షిద్దాం.

-మందరపు హైమవతి