అక్షర

మూల కథలకు అనువాదపు సోయగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘కథాదౌత్యం’
సంకలనం
అనువాదకులు:
ఎల్‌ఆర్‌స్వామి
ప్రతులకు: అన్ని ప్రముఖ
పుస్తక కేంద్రాలలో
**
మలయాళంలోని 24 కథల తెలుగు అనువాదం ఈ ‘కథా దౌత్యం’ సంకలనం. అనువాదకులు-ఎల్.ఆర్.స్వామి. సృజనాత్మక రచయితగా, అనువాదకులుగా అపారమైన కృషి చేస్తున్న స్వామిగారి కృషికి గుర్తింపుగా వారికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఆ గ్రంథం-‘సూఫీ చెప్పిన కథ’. స్వామిగారికి మాతృభాష తమిళంలోనే కాక మలయాళం, తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషలలో మంచి ప్రావీణ్యం ఉంది. అందువలన వారు ఆయా భాషా రచనల్ని అనువాదం చేస్తూ రాణిస్తున్నారు.
ఈ ‘కథా దౌత్యం’ ఏడుగురు మలయాళ రచయితల కథలు ఉన్నాయి. వారు-కమలాదాస్, సేతు, కె.పి.రామనున్ని, కె.ఆర్.మీర, హరికుమార్, సి.వి.శ్రీరామన్, పి.కె.పారక్కడన్. తాము ఎన్నుకున్న ఇతివృత్తాల్ని-ప్రక్రియాపరంగా నిఖార్సయిన కథానికలుగా మలచడంలో వీరంతా అమిత నైపుణ్యం కలిగిన వారు. అగాధమైన బతుకు సంద్రాన్ని నేపథ్యంగా ఉంచి, మనిషి జీవిత శకలాన్ని కథాత్మకంగా, క్లుప్తతతో ఆవిష్కరించడంలో ఈ మలయాళ రచయితల రచనా శక్తి మనకీ కథల ద్వారా విశదమవుతుంది.
సేతు రాసిన ‘్భమి దాహం’ కథ ఒక పల్లెటూరి సామూహిక ఛిద్రజీవన విషాదం. అనావృష్టి తీవ్రత ఆ ఊరి ప్రజల్ని ఎంతటి దుర్భరమైన కష్టాలపాలు చేసిందో అంచెలంచెలుగా చూపుతునే, హఠాత్తుగా వచ్చిన అతివృష్టి పర్యవసానాన్నీ గాఢంగా చిత్రించిందీ కథ. ఇందులో కథనమంతా ఒక వృద్ధుని గొణుగుడుగా, ఒక పిల్లవాడి స్పందనగా సాగి, అనుభూతి ప్రదంగా ముగియడం-మంచి రచనా విన్నాణంగా దర్శనమిచ్చింది.
కె.ఆర్.మీర ‘శూర్పణఖ’ కథలో ప్రధాన పాత్ర చేతన. కథంతా ఆమె గతం-స్వగతం, ప్రస్తుతం-విగతం కలయికగా ఉత్తమ కథా కథన శిల్పంతో-ఆలోచనా ప్రేరకంగా సాగింది. చేతన పూర్వ పరిచితుని వృత్తాంతమంతా ఆమె స్మృతి ధారగా ప్రవహిస్తుంది. చేతన ప్రముఖ స్ర్తివాది. ఆమె ప్రేమించి కలిసి బతుకుతున్న రాం, ఆమె కూతురు సీత పాత్రల్ని ఎంతో పుష్టిగా తీర్చిదిద్దారు రచయిత్రి. సీత తల్లిపాలకు నోచుకోక ‘లాక్టోజన్’ మీద బతకడం, దాని పర్యవసానంగా ఆ పదేళ్ల పిల్ల స్థితీ, కడకు చేతన బ్రెస్ట్ ఆపరేషన్‌కు గురి కావడం వంటి కఠిన వాస్తవాలు సంఘటనాత్మకంగా కథలో ఇమిడిపోయి రచనకు వనె్న గూర్చాయి.
కొడుక్కి నలభై అయిదేళ్లొచ్చినా, ఈనాడు ప్రముఖ సర్జనైనా, ఆనందమయంగా సాగుతున్న కుటుంబ యజమాని ఐనా-అతనిపై ముసలి తల్లి తన వాత్సల్యాన్నీ, ప్రేమనీ, అంతకు మించిన విశ్వాసాన్నీ-ఎంత అచంచలంగా నిలుపుకుంటుందో, ఎంత గాఢంగా, ఆర్ధ్రంగా వ్యక్తం చేసిందో-తెలుపుతుంది-‘శస్త్ర చికిత్స’ కథ. దీన్ని కె.పి.రామనున్ని రాశారు.
కమలాదాస్ కథ ‘వరలక్ష్మీ వ్రతం’. లక్ష్మి భర్తని అమితంగా ప్రేమిస్తున్నది. ‘నావల్ల ఆయనకి జీవితాంతం ఏ బాధలు లేకుండా శారీరకంగ, మానసికంగాను చూసుకుంటానని నామీదే ఒట్టు వేసుకున్నాను. ఆయన అసలు బాధ పడకూడదు’ అనీ, ‘నేను ప్రేమిస్తున్నంతగా అతనిని నువ్వు ప్రేమించగలవా అని నాకు తెలియదు. కానీ, నా కోసం నువ్వు ఒక పని చేయాలి. ఆయనని ఎప్పుడూ బాధపెట్టకు’ అనీ ఆరాటపడుతూ, తన మనసులోని మాటని చెబుతుంది. ఎవరికి? విమలకి. ఈ విమలకీ, లక్ష్మి భర్తకీ పూర్వ సంబంధం ఉన్నదని తెలుస్తునే ఉంటుంది! విమలని ‘వరలక్ష్మీ వ్రతం’కి పిలిచి ఒక కొబ్బరి కాయ, ఇత్తడి దీపం కుందె ఇచ్చి పంపుతుంది లక్ష్మి. ‘ఈ రెండూనేనా నేను ఆనాటి నష్టాల కింద లెక్క వేసుకోగలిగినవి? అనే (ని)స్పృహతో బయటికి నడుస్తుంది విమల! మంచి మనస్తాత్విక రచన! మిగిలిన కథలన్నిటా సమాజం పోకడ, మనుషుల మనస్తత్వ వైరుధ్యాలు సాంద్రంగా చిత్రితమైనాయి.
సంకలనంలో కథలుగా చేర్చబడిన పారక్కడన్ ఆరు కథలూ-ఆరు గల్పికలు. సామాజికత, వర్తమానత, సమగ్రత కలిగి, వెటకారాన్ని ప్రాణంగా, వ్యంగ్యాన్ని దేహంగా దాల్చిన మంచి రచనలు ఇవి.
కథలన్నీ ఏకబిగిని చదివిస్తాయి. కారణం-స్వామి గారి సరళ శైలి, అనువాద కథ అనిపించని కథనరీతీ, స్వాభావికమైన తెలుగు వచనమూ. ఇతివృత్తాన్ని అచ్చమైన కథానికగా ఎలా మలచాలో తెలుసుకోవడానికి రచయితలకు కూడా మేలైన ‘గైడ్’గా ఉపయోగపడే విలువైన సంకలనం ‘కథా దౌత్యం’.
*

-విహారి