అక్షర

విభిన్న కోణాల్లో ‘జూకంటి’ కవిత్వ విశే్లషణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఊరి దుఃఖం
వెల: రూ.80/-
పేజీలు: 94
ప్రతులకు: కార్యదర్శి
మానేరు రచయితల సంఘం, 5-4-47
పత్తిపాక వీధి,
సిరిసిల్ల-505 301
91772 60385
*
1969 తెలంగాణ ఉద్యమం నుండి నిన్నటి మలిదశ ఉద్యమం దాకా.. తెలంగాణ ప్రజా సామాజిక ఉద్యమాల్లో భాగస్వాములై.. ‘పాతాళ గరిగె’ నుండి నేటి వరకు పాలకుల పోకడలను తమ కవిత్వం ద్వారా ఎండగడుతున్న జూకంటి జగన్నాథం రచనా వైచిత్రినీ, ముఖ్యంగా ఆయన కవిత్వాన్ని విభిన్న కోణాల్లో విశే్లషిస్తూ ‘ఊరి దుఃఖం’ పేరుతో ఓ విమర్శా గ్రంథాన్ని ఎం.నారాయణ శర్మ వెలువరించారు. పత్తిపాక మోహన్ సంపాదకత్వంలో రూపుదిద్దుకున్న ఈ గ్రంథంలో.. జూకంటి జగన్నాథంగారి ధిక్కార స్వరం వెనుక గల ఆయన సామాజిక బాధ్యతను.. శర్మగారు తనదైన శైలిలో పరిశీలించి.. అక్షరాకృతినిచ్చారు...
ప్రపంచీకరణ నేపథ్యంలో చిల్లం కల్లం అయిన పల్లెల బాధామయ చిత్రాలను దృశ్యమానం చేయడంలో కవిగా జూకంటి చేసిన ప్రయత్నాన్ని శర్మగారు తమ పరిశోధనాత్మక ఐదు వ్యాసాల ద్వారా చక్కగా విశే్లషించారు. కవి జూకంటి నేపథ్యంతోపాటు సైద్ధాంతిక భూమికలను, తాత్విక కోణాలను విలక్షణంగా ఆవిష్కరించిన శర్మగారు.. జూకంటి కవిత్వాన్ని లోతుగా అధ్యయనం చేసి.. పాఠకులకు కావలసినంత సమాచారాన్ని ఏర్చి, కూర్చి ఈ గ్రంథంలో నిక్షిప్తం చేశారు. ఈ పుస్తకంలో.. జూకంటిని ఓ ప్రయోగవాద కవిగా, విప్లవ కవిగా పాఠకులకు పరిచయం చేశారు.
మొదటి వ్యాసంలోని శర్మగారి విశే్లషణల్లో జూకంటి జగన్నాథం గారి కవితా ముద్రలోని సారాన్ని, అంశాలను, దీర్ఘకవిత నిర్వహణను, శైలి, కళ, భాషా సంస్కృతులను చూస్తాం. రైతాంగ పోరాటాలు, జగిత్యాల జైత్రయాత్ర నుంచి అందుకున్న వర్గ స్పృహ, ప్రపంచీకరణ పుణ్యమా అని పల్లెలు ఛిన్నాభిన్నమైన వైనాన్ని, సమకాలీనంగా వచ్చిన దళిత బహుజన వాదాలు, తెలంగాణ అస్తిత్వ పోరాటం వలస పాలకుల వివక్ష తదితర అంశాలు జూకంటి కవితా వస్తువులైన సంగతిని తెలుసుకుంటాం!
జూకంటి కవిత్వంలో ఆయనను విప్లవ కవిగా, ప్రాంతీయ ముద్ర గల కవిగా, దళిత, బహుజన తాత్వికతను మోస్తున్న కవిగా ఇలా విభిన్న కోణాల్లో శర్మ విశే్లషించ యత్నించడం విశేషం!
మూడో వ్యాసంలో శర్మ జూకంటి కలం నుండి జాలువారిన అయిదు దీర్ఘ కవితల్లోని విశేషాలను పొందుపరిచారు. సాధారణంగా కనిపించే వచన కవితకు, దీర్ఘ కవితకు రూపంలోనే కాదు.. వస్తు నిర్వహణ, సారం, విస్తృతి అనే అంశాల గతంగా వున్న వైరుధ్యాలను సాధికారికంగా చర్చించారు. వస్తు పర నిర్మాణంలోని నిర్మాణ వలయాలను, జ్ఞాన సిద్ధాంతంవల్ల కలిగే అనేకానేక పార్శ్వాల స్పృహ కవితలో అనేక పార్శ్వాలను తడమడానికి ఉపయోగపడుతుందనీ.. ఈ అంశాలు వస్తువులోని పార్శ్వాలు, కోణంలోని పార్శ్వాలు అనుభవంలోని పార్శ్వాలు అని విభజించుకోవచ్చని విశే్లషించారు.
‘శైలి, రచన నిర్మాణం’ పేరుతో శర్మ రాసిన నాలుగో వ్యాసంలో.. జూకంటి కవిత్వంలోని నిర్మాణం, శైలిని సోదాహరణంగా వివరించారు. చివరి వ్యాసం.. ‘ఉనికి’ పేరుతో రాయబడింది. ఈ వ్యాసంలో జూకంటి కవిత్వంలోని ‘ప్రపంచీకరణ పర్యవసానాలు’ను చర్చించారు. జూకంటి పద బంధాల్లో భావార్థకాలే ఎక్కువ అనీ.. అందువల్లే ధ్వని మొదలైన రూపాలన్నీ సామాజిక ప్రయోజనంతో పెనవేసుకుంటాయని తెలిపారు. ఇలా శర్మగారు జూకంటి జగన్నాథం గారి కవిత్వాన్ని వివిధ కోణాల్లో ఆవిష్కరించారు. ఈ గ్రంథంలోని వ్యాసాలు.. పరిశోధనాత్మకంగాను, ఆలోచనాత్మకంగాను ఉన్నాయి.

-దాస్యం సేనాధిపతి