అక్షర

ప్రపంచ సాహిత్య పరిమళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నోబెల్ కథలు
అనువాదం: జి.లక్ష్మి
పుటలు: 158.. ధర: రూ.120
విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
చంద్రం బిల్డింగ్స్,
చుట్టుగుంట, విజయవాడ
0866 2430302
**
విశాలాంధ్ర నుంచి పుస్తకం. అందునా నోబెల్ కథలు. నోబుల్ అనలేదు. కనుక చాలు. అట్ట మీద 20 మంది ప్రసిద్ధ కథకుల ఫొటోలు. అందులో టాగోర్‌ను తప్ప మిగతా వారిని ఎవరు గుర్తుపట్టగలరు? ప్రపంచ కథా సాహిత్యం పట్ల ఆసక్తి గలవారు ఎవరయినా ఈ పుస్తకాన్ని వెంటనే అందుకుంటారు. ఇందులో రవీంద్రుని కథ ఒకటి భారతీయ భాష. ఆరు ఇంగ్లీషు కథలు, 12 యూరోపియన్ భాషలలోనివి. 1.అరబిక్‌లో రాసిన ఈజిప్టు కథ అంటే 14 కథలను ఇంగ్లీషు ద్వారా అనువాదం చేసినట్టు లెక్క. తప్పదు! తెలుగులో ఈ కథలను ఈ పుస్తకంలో చదివే వారిలో, ఇవే కథలను ఇంగ్లీషులో, మూల భాషలో చదివిన, చదవగలిగిన వారు ఎక్కువగా, అసలు ఉండరేమో. ఇదేదో చాలా బాగుంది. అనువాదకులకు సగం కష్టం తీరుతుంది.
ఈ రచయితలు అందరూ గుర్తింపు పొందినవారు. బాగా, అంటే ఎక్కువగా రాసినవారు. వారి రచనలను లోతుగా చదివి, అందులో నుంచి ఒక్క కథను ఎంపిక చేయాలి. అది చాలా కష్టంతో కూడిన పని. అనువాదకులు అంత కష్టపడే పరిస్థితి లేదేమో?
నాగీబ్ మహపూజ్ కథ ‘ద ఆన్సర్ ఈజ్ నో’ అని ఇంగ్లీషులో వచ్చింది. అతని కథల గురించి ప్రసక్తి వస్తే, అందరూ ఈ కథ పేరు ముందు చెపుతారు. అతను రాసే కథలు చాలా దూరం సాగుతాయి. ఇది మాత్రం నిజంగా చిన్న కథ. అనువాదకులకు అది మరొక వెసులుబాటు. పిరాండెల్లో ‘యుద్ధం’, డోరిస్ లెస్సింగ్ ‘సొరంగం’ రవీంద్రుని ‘గౌరి’, లాగర్‌క్విస్ట్ ‘లిఫ్ట్’ ఇలా చాలా కథలు ప్రపంచం ఎంపిక చేసినవి. అనువాదకులు ఎంపిక చేసినవి కావు. తప్పేముందీ? మంచి కథ అయితే చాలదా? అన్నది ప్రశ్న.
రచయితలు వేరువేరు సంస్కృతుల నుంచి వచ్చినవారు. అందరూ అంతగా ప్రజాదరణ పొందినవారు కారు. నోబెల్ బహుమానం పొందిన వారందరూ ప్రజాదరణ పొందినట్లు కనపడదు. ఈ పుస్తకంలో కనిపించే రచయితలను, తెలుగు పాఠకులు గుర్తించలేరంటే ఆశ్చర్యంలేదు.
మొదటి కథ ‘నిరాకరణ’ గురించి గమనిస్తే, పేరును కుదించారు. కథను కాదు గానీ, వాక్యాలను కుదించారు. మొదటి పేజీలోనే కనిపించే వాక్యం ఒకటి ‘కొంత సమయం గడిచిన తరువాత టీచర్లందరూ కలిసి, ఆయన గదికి వెళ్లారు’ అని. ఇంగ్లీషులో వాక్యం ఇట్లా లేదు. అరబిక్‌లో మరి ఎట్లాగుందో తెలియదు. కవిత, కథలలో విషయంతోబాటు ప్రతి మాట, వాటి తీరు, వాక్య నిర్మాణం అంటే మొత్తం మీద శిల్పం చాలా ముఖ్యం గదా! మన వెసులుబాటు కొద్దీ మన పద్ధతిలో అనువాదం చేసుకోవడం తగునా? ప్రశ్న! మూలం, సంధిభాష ఎవరు చదివారు? అనువాదకులు ఇచ్చిందే అందరికీ తెలుస్తుంది.
అనువాదకులు, పాఠకులు, కథల కాలాన్ని మనసులో పెట్టుకుని చదవవలసిన అవసరం ఉంది. లేకుంటే కథల గురించి సరయిన భావన అందదు. ఈ పుస్తకంలో కథలు చాలా పాతవి. 1903 నుంచి 1991 దాకా కథలున్నాయి. డోరిస్ లెస్సింగ్, నయిపాల్ కథలు ప్రస్తుత శతాబ్దానివి. కొంతమంది కథలు ఎంతకాలమయినా బాగుంటాయి. పాత వాసన వేయవు. అన్ని కథలు, ఆ రకంగా ఉండాలన్న నియమం అంతకంటే లేదు.
ఈ సంకలనంలో 20 కథలున్నాయి. అన్ని బ్రహ్మాండంగా వున్నాయని, ఉండాలని అనుకోను కూడా కూడదు. గొప్ప రచయితల కథలు. కనుక చదివి చూడాలి. ఆయా రచయితలు మిగతా కథలన్నీ ఇలాగే ఉంటాయని కూడా ఆశించకూడదు. ఉదాహరణకు లుయిగీ పిరాండెల్లో చాలా కథలు రాశాడు. గొప్పగా రాశాడు కూడా. ఒక సంకలనంలో అన్ని ఆత్మహత్యల గురించిన కథలు, మరొక సంకలనం వెర్రితనం కథలు అచ్చు వేయగలిగిన రచయిత అతను. పిరాండెల్లో అంత బాగానూ హాస్య కథలు కూడా రాశాడు. అతని కథ యుద్ధం నిజంగా గొప్ప కథ! ముఖంలో గుద్దినట్టు ఉంటుంది దాన్ని చదివిన తరువాత. అయితే ఈ కథ ఇప్పటికే మూడుసార్లు తెలుగులో వచ్చింది. ఈ సమీక్షకుని అనువాదంగా ‘యుద్ధం’ 80వ దశకంలోనే ఒక పత్రికలో వచ్చింది. తరువాత పుస్తక రూపంలో కూడా వచ్చింది. (ఇది సమాచారం కొరకే)
ఈ సంకలనంలో కథలు కూడా వరుసగా ఒక పత్రికలో వచ్చినవే. అయినా ఈ కథలు కొన్ని బలహీనంగా ఉన్న భావం మిగిలింది. నాడీన్ గార్డిమర్ కథ విచిత్రంగా తోచింది. అది ఆఫ్రికన్ కథ మాత్రం కాదు (ఈట్), రుూట్స్ కథ కూడా అర్థం కాకుండా ఉంది. టాగోర్ కథ ఛాదస్తంగా ఉంది. కథలు బాగున్నా, నచ్చకున్నా బాధ్యత మూల రచయితలది మాత్రమే. అనువాదకులను అనడానికి లేదు. ‘అనువాదం చేయడంకన్నా కొత్త కథ సులభంగా రాయవచ్చు’ అన్న రచయితలు చాలామంది ఉన్నారు. అనువాదం ఎలాగుండాలి అని ఒక నిర్ణయం లేదు. చెడు అనువాదం అంటే నిర్వచనం లేదు. రెండు భాషల మీద, ‘సంస్కృతుల పట్ల, అవగాహన, కనీస అవగాహన, అధికారం కాదు, ఉండాలేమో? సంధి భాష ద్వారా వచ్చే అనువాదాలు సెకండ్‌హాండ్ కూడా కాక థర్డ్‌హ్యాండ్ అవుతాయి.
రచయితల ఫొటోలు కథలతోబాటు (కూడా) వేస్తే, మరింత బాగుండేది.
ఈ సంకలనం బాగు లేదు, అనడానికి లేదు. బాగుందని తేల్చి చెప్పడం కూడా తప్పే!
అనువాదాలు వస్తున్నాయి. మరిన్ని రావాలి. అప్పుడు ప్రపంచ సాహిత్యంతో పరిచయం కలుగుతుంది. అనువాదాలను ఆహ్వానిద్దాం.

-గోపాలం కె.బి.