అక్షర

మనిషిని తూచే కవిత్వపు త్రాసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవ రహస్య లిపి
ఖాదర్ షరీఫ్ కవిత్వం
పేజీలు: 90
వెల: రూ.100/-
సన్నిధి ప్రచురణలు, నెల్లూరు
ప్రతులకు: పెరుగు రామకృష్ణ
9849230443
**
యువ స్వరం ఖాదర్ షరీఫ్ వినిపించే కవిత్వపు స్పర్శ, తెలిసిన జీవితంలోని తెలియని ద్వారాలను తెరిపిస్తుంది. ‘జీవ రహస్య లిపి’ని కనుగొనే తీవ్ర ప్రయత్నాలు, ఆ ప్రయత్నంలో కవి కల్లోల అంతరంగం ఈ అక్షరాల్లో ధ్వనిస్తుంది.
గతేడాది పుస్తక రూపంలో వచ్చిన ఈ కవిత్వం అంతా 2008 మరియు 2009 సంవత్సరాలలో రాసినది. ఆ తర్వాత ఈ కవి ఏం రాశాడో గాని, వస్తువులోని కాలాతీత తత్వం ఈ అక్షరాల్ని నిత్య నూతనంగా కాపాడుతోంది.
ఈ మధ్య కొంతమంది యువ కవులు కవిత్వానికి ప్రతీకగా నిలుస్తున్నారు. కవిత్వాన్ని ఎంత దీక్షగా చదువుతున్నారో, కావ్య సృష్టికి ఎంతగా అంతర్గత గాయాల పాలవుతున్నారో వారి అక్షరాలే చెబుతున్నాయి. సామాజిక స్పృహ పేరిట, ఉద్యమ సాహిత్యం పేరిట వేడి, వాడి పదాల కూర్పుయే కవిత్వంగా చలామణి అవుతున్న క్రమంలో కొన్ని యువ స్వరాలు మనిషిలోనికి వెళ్లి చికిత్స చేసే ప్రయత్నం చేస్తున్నాయి. తమ అనుభూతినే పిడికిట్లోకి తీసుకొని సొంత వ్యక్తీకరణా వైవిధ్యతతో పఠితల్ని తమలోకి రంగరించుకుంటున్నారు. ఈ కవిత్వపుతనం ఖాదర్ షరీఫ్ ‘జీవ రహస్య లిపి’లోని అక్షరాల్లో తొణికిసలాడుతుంది.
తిలక్, బైరాగి లాంటి కొందరు అరుదైన తెలుగు కవులు సమాజాన్ని తమ సొంత, పూర్తిగా తమదైన దృక్కోణంలోంచి దర్శించారు. ప్రేయసిని ప్రేమించినంతగా కవిత్వాన్ని ప్రేమించేవారు వారి బాటలో అడుగులు వేస్తున్నట్లు ఈ కొత్తదనపు కవిత్వం సవ్వడి చేస్తోంది.
కవిలో మనిషితనం, మంచితనం ఎంతుందో ఆయన కవిత్వమే లెక్క కడుతుంది. షరీఫ్ కవిత్వం నిండా ఈ రెండు తగినంతగా ఉన్నాయి.
కవి మనోఘర్షణ సొంతమే గాని వ్యక్తీకరణ మధురిమ మాత్రం సాధన ద్వారా సాధ్యమైంది. తనలోని భావాలను సెలయేరులా ప్రవహింప జేసేందుకు తపోఫలం సాయపడింది.
షరీఫ్ తన ఫరీదాతో - ‘బ్రతుకంటే ఎందుకో నాకు భయం కల్గినపుడు/ నువ్విచ్చిన ఒక్క ఓదార్పు/ రెక్కలు ముడుచుకపోయిన ఈ జీవితానికి/ జీవాన్నిచ్చి పుష్పింపజేస్తుంది’ అంటాడు. సగం తెలిసిన వాకిలి కవితలో.
‘శరీర సముద్రం’లో -‘శరీరంలోకి సముద్రాన్ని ప్రవహింప జేస్కుంటూ/ మమతల పాలిండ్ల పరుపుల మీద/ మమ్మల్ని సేదతీర్చిన అమ్మని/ నా ఎముకల పొడితో శిల్పం చేయాలనుంది’ అంటాడు.
‘జ్వలనాన్ని దేహం మీద కప్పుకున్న జ్ఞానులు/ అగ్నికణాన్ని నుదుటన ధరించిన యోగులు ఎక్కడ/ మరణపు వ్యధ, మానవత్వం నశించిన కథ/ రెండూ తప్ప ఇహపరాల నడుమ తిరగాడుతున్న/ జ్వలన దీపం కనపడదేం?’ పంక్తుల్లో అంది వచ్చే చేయి కోసం వెతుకులాట కనిపిస్తోంది.
‘మనిషిని ప్రేమగా స్పర్శించకుంటే/ మంచు కూడా రహస్యంగా/ అగ్నిలా రూపాంతరం చెందుతుంది’ అని మనిషికి ప్రేమకు ఉన్న అనుబంధాన్ని విప్పుతాడు.
నవ్వు విలువ చెబుతూ -‘నవ్వును అలంకరించుకోలేని అశక్తుడు/ జీవంతో కదుల్తున్న శిలలాంటి వాడే’ నంటాడు.
‘మానవ ప్రవాహం’ కవితలో -‘శాంతి కోసం పాడుతున్నప్పుడు/ మనిషి కరిగి ప్రవహిస్తాడనే నమ్మకం నాకుంది/ పాడుతూ ప్రవహిద్దాం/ పరిమళిస్తూ రాలిపోదాం’ అంటూ మానవ పరిమళాన్ని పంచుతాడు.
జీవితం, దుఃఖం, గుండెగాయం, ఏకాంతం, మనిషితనం చుట్టూ తిరిగే ఈ కవిత్వం ఒక్కోసారి తిరిగిన చోటే తిరుగుతున్న భావన కలుగుతుంది. అయితే ఇది కవి వ్యక్తిగత ఆలాపన.. ఆయన దయతో, కసితో గీసుకున్న వృత్తాలివి.
కవి రాసినదంతా పుస్తకంగా తెచ్చి, సొంత కుతి తీర్చుకునేకన్నా సంపాదకులకు ఎంపిక బాధ్యత అప్పగిస్తే పుస్తకంలో నాణ్యత పెరుగుతుందనడానికి ఈ సంపుటి నిదర్శనం. ఖాదర్ షరీఫ్ కవిత్వాన్ని పుస్తకంగా తెచ్చిన పెరుగు రామకృష్ణ కృషి, అభిరుచి అభినందనీయం. ముఖచిత్ర రూపకర్త ఎవరోగాని బొమ్మ బాగుంది. కవిత్వంలో కవి విహరించిన తీరు తెలుపుతోంది.

-బి.నర్సన్