అక్షర

మాయమవుతున్న మనిషిని వెతికే ప్రయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఊరు కనబడుట లేదు
(కథాసంపుటి)
-నీలకంఠ
వెల: రూ.120/-
ప్రతులకు: విశాలాంధ్ర
పబ్లిషింగ్ హౌస్
**
‘మాయమై పోతున్నడమ్మ మనిషి’ అన్న ఆవేదనే విస్తరిస్తున్న కాలాన -‘ఊరు కనబడుట లేదు’ అన్న ఫిర్యాదు, అత్యంత సహజమైనదిగానే గోచరిస్తుంది! ఈ ఫిర్యాదునే పోలీసుస్టేషన్‌లో ఒక వ్యక్తి నమోదు చేసినట్లు కథ చెప్పే టెక్నిక్‌తో రూపుదిద్దుకున్న కథా సంపుటి - నీలకంఠ రాసిన పాతిక కథల సంపుటి ‘ఊరు కనబడుట లేదు’. సైన్సు టీచరై వుండీ పాతికేళ్లుగా కథలు రాస్తూ, పాతిక కథలతో తన మొదటి కథల సంపుటి వెలువరిస్తున్నాడంటే - రచయిత ఎంత సంయమనశీలో, ఈ సైన్సు మాస్టారు ఎంత సెన్సిబుల్ ‘కథ’న కుతూహలుడో అర్థమవుతూనే ఉంది.
‘అనుభూతులు అనుభవాలుగా మారి మనల్ని మంచి మార్గం వైపు నడిపిస్తాయి. అలా ఎవరినో ఎప్పుడైనా ఈ కథల సంపుటి ప్రేరణ కలిగిస్తుందని ఆశించినందుకే ఈ కథలు రాశాను’ అంటున్న నీలకంఠ - కథలు కమనీయంగా చెప్పే టెక్నిక్‌ను పట్టుకున్నాడు. లోకం అన్యాయమై పోతోందనీ, చుట్టూవున్న వ్యక్తుల ప్రవర్తనలే వింత పోకడలు పోతున్నాయనీ... చాలా కథలు వీటిల్లో మనకు అనిపింపజేస్తాయి. ఆశావహ దృక్పథానికి ఆస్కారం కావడానికి ముందుగా, నేటి అవ్యవస్థలోని అమానవీయ పోకడలకు అద్దం పట్టినట్లనిపించే కథలివి.
‘అమ్మ మనల్ని కంటే అలాంటి ఎందరో అమ్మలను కని పెంచింది పల్లె. పట్టణం వాళ్లు తాము పోగొట్టుకున్న దానిని వెతుక్కోడానికి పల్లెకు వచ్చేవారు. కాని నేడు పల్లెలు డబ్బు వ్యామోహంతో, కక్షలతో, స్వార్థంతో, అంతకు మించి మత్తుతో తమ ఉనికిని కోల్పోతున్నాయి...
...ఒకప్పటి పల్లెలో తల్లిదండ్రులు పిల్లల్ని కని వారిని ఎంత ప్రేమగా పెంచుతారో అంత ప్రేమగా పిల్లలు కూడా తల్లిదండ్రులను చూసేవారు. ఇది ఒక సామాజిక ప్రక్రియగా బాధ్యతగా జరిగేది. కానీ నేడు మేము పైనుంచి ఊడిపడ్డాము. మాకు డబ్బుంటే చాలన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. పల్లె యొక్క రూపాన్ని మార్చేశారు. పల్లెలో జరిగే అనేక కార్యక్రమాలు రంగుమార్చుకున్నాయి. మనుషుల ప్రవర్తనలో నైతికత లోపించింది. బంధువుల మధ్య వైషమ్యాలు పెరిగాయి. భూముల కొరకు ఆస్తుల కొరకు అన్న తమ్ముడిని చంపే స్థితికి వచ్చారు.’
నేడు కన్నతల్లిని బ్రతికున్నప్పుడే కాటికి పంపించాలనుకుంటున్న కొడుకులను చూస్తే మనిషే తప్పిపోయాడనిపిస్తుంది - అంటూ దేశానికి పట్టుగొమ్మలనే పల్లెలు మాయమై పోవడాన్ని గూర్చిన ‘ఆర్తికి’ అక్షరాకృతి నిచ్చిన కథ - సంపుటి పేరిటి ‘ఊరు కనబడుట లేదు.’
తన అందం తరిగిపోతుందని బిడ్డకు తన స్తన్యం ఇవ్వని తల్లి కథ ‘ముర్రుపాలు’. రొమ్ము కేన్సర్ వచ్చి చివరకు దుఃఖించే ఆ ఆధునిక తల్లిని కథాంతంలో కళ్లకు కట్టించారు. భార్య వుండగానే రెండో పెండ్లి చేసుకుని మోసగిస్తున్న వారున్నారు. అలా మోసపోయిన స్ర్తి కథను ‘మరణించిన మనుషులు’ కథలో చిత్రిస్తే, నాణేనికి రెండో వైపు అన్నట్లుగా ఆస్తి కోసం భర్తను హత్య చేసే స్ర్తి మనస్తత్వాన్ని ‘గాజులేసుకున్నాడు’ కథలో చూపారు.
‘పట్టణంలో జంతువులు’ కథ చదివితే - ‘నిర్భయ’ సంఘటన గుర్తుకొస్తుంది. బేతాళ కథ టెక్నిక్‌లో ఈ కథను నీలకంఠ చెప్పిన తీరు ఆకట్టుకుంటుంది. జ్యోతి, గీతిక స్నేహితులు. ఒకరు జర్నలిస్టు. మరొకరు ఫొటోగ్రాఫర్. ఓ రాజకీయ నేత నరబలి నిర్వహిస్తున్నాడని తెలిసి, వెళ్లి, ప్రమాదంలో పడతారు. అడవిలో తప్పిపోయిన గీత ‘హైనా’ వల్ల కేవలం ప్రాణాలు మాత్రమే పోగొట్టుకుంటే, జనావాసం పట్టణంలోకి వచ్చి బస్సెక్కిన జ్యోతి... మానాన్నీ, ప్రాణాన్నీ కూడా పోగొట్టుకుంటుంది డ్రైవర్‌తో సహా కామాంధులైన మనుషులతో. ‘అడవిలో ఉన్నవి మృగాలు అయితే, పట్టణంలో మనుషులు...’ - దీనికి సమాధానమేమిటి’ అని చివర్లో బేతాళుడు ప్రశ్నిస్తే - ‘ప్రతి కథకు ఏదో ఒక వివరణ ఇచ్చే విక్రమార్కుడు ఇక్కడ ఏమీ సమాధానం చెప్పలేకపోయాడు. చెమర్చిన తన కళ్లను తుడుచుకుంటూ బేతాళుడిని తనే చెట్టుపైకి ఎక్కించి వెనుతిరిగాడు’ అని ముగిస్తాడు నీలకంఠ.
‘దోమ కాపురం’ కథ నీలకంఠ సైన్సు టీచర్ కనుక - దోమ వైపు నుండి చెప్పుకురావడం ఒక టెక్నిక్. వాటివల్ల రోగాలు వ్యాపిస్తున్నాయి. కానీ దోమల దృష్టికోణం నుండి మనుషుల్ని చూపిస్తూ రాసిన ఈ కథలో - రోగాల బారిన పడిన దోమల బాధను చిత్రిస్తూ, తన పిల్లలతోబాటుగా దోమ ‘కాయిల్’ చివర మంటలో దూకి, ఆత్మహత్య చేసుకున్నట్లుగా చెప్పడం - పరిసరాల పరిశుభ్రతను కొత్త టెక్నిక్‌లో చిత్రించడమే! దాసుగా, నాటకాల రాయుడిగా, ఎప్పుడూ నవ్వుతూండే పల్లెలోని చెంచయ్య పొట్టకూటి కోసం పల్లె వదిలి పట్నం చేరి, తన ఒంటెద్దు బండికి తానే ఎద్దయి, తన పొట్టమీద కాడిమాను పెట్టుకుని, బరువుల్లాగి సంపాదించే బ్రతుకు సాగించవలసి వచ్చిన దయనీయ స్థితికి - నిలువెత్తు దర్పణమైన కథ ‘ఒంటెద్దు బండి’.
‘ప్రేమ సప్తస్వరాల సితారు - ద్వేషం గుండెలపై వేలాడే కైజారు. ప్రేమ గుండె గొంతుకలోన కొట్టుకలాడే తియ్యని గీతం’ అంటూ ‘మరలా పలకనా ప్రియా!’ అనే కథ - రచయిత నీలకంఠలోని కవితాత్మకతను అద్భుతంగా, మంత్రి నందూ పాత్ర ద్వారా అభివ్యక్తం చేస్తోంది. మనిషి రూపంలో వున్న మృగమైన భర్త రాజేష్‌ను చంపి జైలుపాలయిన నీనా, నందూ ప్రియురాలే కావడం, కథాంతంలో వారిని ఒకటిగా నిల్పడం, కథాక్రమాన్ని ఆసాంతం రచయిత కవితామయంగా చెప్పడం ఈ కథలోని టెక్నిక్.
అక్రమ ఇసుక రవాణాకు సంబంధించిన కథ - ‘ఇసుకలో నిప్పుకోడి’. ‘సహజ వనరులు మన అవసరాలు తీర్చుకోవడానికి అతిగా ఉపయోగించకూడదు. నదీ, ఇసుక ప్రజలందరి సొత్తు’ అని ప్రబోధించే కథ ఇది. పేదల గురించీ, మధ్యతరగతి జీవుల గురించీ స్పందించే హృదయంతో నీలకంఠ కథలు రాసారు. ‘సారాదేవత’ ‘రెక్కల గింజలు’ ‘గంగన్న కొడుకులు’ ‘టివి ఆపరేటర్ కావలెను’ ‘వాస్తు భాస్కరా’ వంటి కథలన్నీ ఆకట్టుకుని చదివించేవే. ‘పట్టణంపై పీడ నీడ’ ‘స్వలింగ సంపర్కం’ వంటి అంశంపై సంధించిన కథ.
ఏమయినా ప్రతి కథనూ టెక్నిక్‌తోనూ, ఒక లయాత్మకమైన శైలితోనూ, పాత్రోచితంగానూ, ఒక తాత్త్విక విశే్లషణతోనూ రాయడం నీలకంఠ కథల విశేషం! ‘ఊరు కనబడుట లేదు’ కథల సంపుటి - మాయమై పోతున్న మనిషిని వెతికి, రక్షించుకునే ప్రయత్నం.

-సుధామ