అక్షర

కథన కౌశలమే అసలు బలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశ్వకథా శతకం
(కథాసంపుటి)
-ముక్తవరం పార్థసారథి
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో
*
పుస్తకం పేరు తెలుపుతున్నట్లే వంద కథల విందు ఈ ‘విశ్వకథా శతకం’. దేశ సరిహద్దులు దాటి, ఖండాంతరాలను అధిగమించి, శతాబ్దాలకు వారధి కట్టి, లోకం చుట్టి వచ్చిన కథలివి. ముందుగా ఈ కథల్లో అత్యంత విలువైన రెండు గుణ విశేషాల్ని గురించి చెప్పుకోవాలి. మొదటిది కథ చెప్పిన విధానం. రెండవది సంక్షిప్తీకరణలో సాధించిన సమగ్రత. ప్రతి కథా ఒక తెలుగు కథే అనిపించేటంత ఆత్మీయమైన శైలితో, తెలుగు పలుకుబడితో ఆవిష్కరించిన పార్థసారధి గారి రచనా నైపుణ్యం - సంపుటిలో ప్రత్యక్షర ప్రమాణంగా కనిపిస్తోంది.
‘కెనడా చెహోవ్’గా కీర్తి గడించిన ఏలిస్ మన్రో కథ ‘మగ పిల్లలూ - ఆడపిల్లలూ’తో మొదలై జేమ్స్ రెటీ ‘క్షణంలో సగం’తో ముగిసింది ఈ సంపుటి. ఈ మధ్యలో ఎందరెందరో సాహితీ దిగ్ధంతులు! మార్క్‌ట్వేన్, బెర్ట్రండ్ రసెల్, గొగోల్, బాల్జక్, సాదత్ హసన్ మంటోలవి రెండేసి రచనలు చోటు చేసుకున్నాయి. ‘అమ్మ’ అనే ఆఫ్రికన్ జానపద కథ ఒకటి ఉంది. ప్రపంచ సాహిత్యంలో ప్రసిద్ధి పొందిన ‘అంకుల్ టాంస్ కేబిన్’, హెర్మన్ మెల్విల్ ‘మోధీడాక్’, జార్జ్ ఎలియట్ ‘ది మిల్ ఆన్ ది ఫ్లాస్’ హెచ్‌జి వెల్స్ ‘ది ఐలండ్ ఆఫ్ డాక్టర్ మోరో’ వోల్టేర్ ‘కాండీడ్’ జార్జ్ మెరిడిత్ ‘డయానా ఆఫ్ ది క్రాస్‌వేస్’ వంటి నవలల పరిచయాలు ఉన్నాయి. ప్రతి కథా పరిచయానికీ ముందు - ఆ రచయిత జీవన రేఖల్నీ, రచనా నేపథ్యాన్నీ - అద్దంలో కొండలా చూపారు పార్థసారథి.
ఈ వంద కథల్లోని వస్తు స్పృహ, వైవిధ్యం ఎంతగా ఆశ్చర్యపరుస్తాయో, వాటిలో పరిచయమైన మనుషుల చిత్తవృత్తిలోని, ప్రవర్తనలోని వైరుధ్యాలూ, వైచిత్రీ - అంతకంత విశేషంగా చదువరుల్ని అబ్బురపరుస్తాయి. మొదటి కథ ‘మగపిల్లలూ - ఆడపిల్లలూ’ పేరు సూచిస్తున్నట్లే స్ర్తిని పురుషులు చూసే దృష్టి కోణాన్ని బహు సున్నితంగా ఆవిష్కరించింది. స్ర్తి తన అస్తిత్వాన్ని నిలుపుకోవటానికి చేసే ప్రయత్నాలూ ఎంతో కళాత్మకంగా, ధ్వనిసహితంగా చిత్రించబడినై. ఆమెలోని స్వేచ్ఛా కాంక్షని ఉన్నతీకరిస్తూ కథలో ఆడ గుర్రాన్ని వదిలేస్తుంది కథ చెప్పే ‘నేను’. కథానికలో చెప్పిన దాని కంటే, దాని వెనుక చెప్పకుండా ఉంచిన అద్భుత భావాలు చదువరికి ఎంతటి ఆలోచనా ప్రేరకాలు కాగలవో తెలుపుతుంది ఈ కథ. జాక్‌లండన్ ‘ఎదురు దాడి’లో ఒక జాతి ఎలా పరాయి వారి చొరబాటుతో, దోపిడీతో క్రమేపీ అంతరించి పోతుందో వివరించారు. అమెరికాను ఆక్రమించుకున్న వలస పాలకులు ఆదివాసీ రెడ్ ఇండియన్లను లొంగదీసుకుని, ఎలా కొత్త శిక్షాస్మృతుల్నీ, న్యాయ వ్యవస్థల్నీ సృష్టించారో చెబుతుందీ కథ. సార్వకాలీనమూ, సార్వజనీనమూ అయిన రెండు సామాజిక సత్యాల్ని సిద్ధాంతీకరించి స్థిరపరచినట్లు, ఈనాటికీ వాటి సంభావ్యత నిర్ధారింపబడి నిలిచి ఉన్నట్లు ఒక తెలివిడిని అందిస్తాయి - ఈ రెండు కథలూ!
ఆర్థర్ మిల్లర్ ‘జీవహింస’ కథలో వర్తమాన సామాజికతతోపాటు, జీవన తాత్త్వికత కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. చేపలు పట్టే వారి వృత్తి నేపథ్యంతో ‘ఆహారంగా ఉన్న జీవికి క్షేమం ఉండదనీ, మనకు ఆహారం కావాలంటే మరొక ప్రాణి చావాల్సిందే’ననీ సూత్రీకరిస్తూ, అంతర్లీనంగా - బతుకు, బతకనివ్వు - హితోక్తిని అందించారు రచయిత. ఆస్ట్రేలియన్ యువ రచయిత గ్రెగ్ ఎగాన్ (జననం: 1961) కథ ‘ది మోట్’ ఉన్నది ఈ సంపుటిలో! ఈ కతలో ప్రపంచమంతా పర్యాప్తవౌతోన్న ఈనాటి, మరీమరీ సమకాలీన సమస్య చిత్రించబడింది. ‘మనది ప్రత్యేకమైన దేశం. చుట్టూ భగవంతుడే ఒక కందకం (మోట్) సృష్టించాడు. ఇతరులు, దుర్మార్గులు - ఉద్యోగాల కోసం ఇక్కడికి వచ్చి మన అవకాశాల్ని కొల్లగొట్టుకు పోతున్నారు. మన పవిత్ర సంస్కృతి, మన మహోన్నత విలువలు నాశనమై పోతున్నై. ఇది కొనసాగితే ఇక మాకేం మిగులుతుంది?’ - ఇదీ భావన, ఆవేదన, ఆక్రోశం! ‘దేశం కాకపోతే, జాతి, మతం, భాష, ప్రాంతం లేదా మరొకటి. మనిషికీ మనిషికీ మధ్యన అఖాతాలు మాత్రం తప్పవు’ అంటూ ‘ఎన్ని నేరాలు చేసినా డిఎన్‌ఏ శాంపిల్స్ ద్వారా కూడా పట్టుబడని కొత్త తరం వస్తోంది. అవును. హిట్లర్లకు మరణం ఉండదు’ అని కథని ముగిస్తాడు రచయిత. అస్తిత్వ పోరాటాల్నీ, వాటి వలన రానున్న పర్యవసానాల్నీ శక్తివంతంగా చిత్రించిన మంచి కథ ఇది. దేశ విభజన నేపథ్యంలో కూతుర్ని కోల్పోయిన వృద్ధురాలి ఆశ నిరాశల్ని - మనసుని కలతపరిచే రీతిలో ఎంతో ఆర్ద్రంగా వర్ణించారు సాదత్ హసన్‌మంటో. కథ పేరు ‘అమృత్‌సర్‌లో ఓ అమ్మ’.
ఇలా.. పార్థసారథి చెప్పినట్టు - ఎంత వైవిధ్యముండనీ, ఎన్ని వైరుధ్యాలుండనీ, లోకంలోని రకరకాల మనుషుల్లాగ రకరకాల కథలివి’. ఏ కథలోని మనిషి ఆ కథ వరకూ ఒక ప్రత్యేక పాత్ర. కానీ ఆ పాత్ర సమాజంలో మనకు అహరహమూ కనిపిస్తూ సాధారణీకరణం చెందిన వైనాన్ని - కళాత్మక వాస్తవికతతో ఆవిష్కరిస్తారు రచయితలు. ఉదాహరణంగా ఈ సంపుటిలోని సాదత్ హసన్‌మంటో రెండో కథ ‘లవర్ బాయ్’ని పేర్కొనవచ్చు. ఇందులో సౌగంధ వేశ్యగా తాను సంపాదించే దాంట్లో నాలుగో వంతు రాంలాల్‌కు పోగా మిగిలిన దాన్ని మధుకే ధారపోస్తూ ఉంటుంది. ఆమె అతణ్ణి తన సొంత మనిషనే అనుకుంటుంది. అతను చెప్పే అబద్ధాలే ఆమెని ‘ప్రేమ’ మత్తులో ఊరిస్తాయి, ఉబ్బేస్తాయి. సరిగ్గా, ఈ సౌగంధినే మనం పాలగుమ్మి పద్మరాజుగారి కథ ‘పడవ ప్రయాణం’లో ‘రంగి’గా చూస్తాము! ఇదీ దేశీయమైనా, విదేశీయమైనా ‘మనిషి మనసు మారలేదు’ సూక్తిలోని సత్యం! రచయితలందరి తాపత్రయమూ, ఇలాంటి సత్యావిష్కరణే! ఈ సంపుటిలోని కథ ‘కళాకారుడు’ని ముగిస్తూ అంటారు రచయిత్రి ఏఎస్ బయాట్ - ‘కళాకారుడికి సృజనే జీవితం. అదే పని. ఒకప్పుడు భుక్తి కోసం. ఇప్పుడు తృప్తి కోసం!’ అని. ఇంతింత సాహిత్య సృజనకి ప్రేరణ - ఆ ‘తృప్తే!’ కథాభిమానులకు విశ్వదర్శనం చేసే అవకాశాన్నిస్తున్న మంచి పుస్తకం ఈ ‘విశ్వకథా శతకం!’ కథా రచనలో ‘క్లుప్తత’ ప్రాధాన్యతని అర్థం చేసుకోవటానికి కథకులకు కూడా అవశ్య పఠనీయ గ్రంథం ఇది.

-విహారి