అక్షర

తేట తెనుగులో అద్వైత గీతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అపరోక్షానుభూతి
గేయామృత స్రవంతి
-ఆచార్య అనుమాండ్ల భూమయ్య
పుటలు: 140.. వెల: రూ.100
ప్రతులకు: నవోదయ బుక్‌హౌస్
ఆర్యసమాజ్ మందిర్‌కు ఎదురుగా
కాచిగూడ క్రాస్‌రోడ్స్
హైదరాబాద్-500 027.
**
అనుభూతి అనేది ముఖ్యంగా రెండు రకాలు. ఒక కమ్మని కవితనో, శ్రావ్యమైన పాటనో విన్నప్పుడు కలిగేది ఒక రకం. దీనినే ఫీలింగ్ అని, Evocation అని, ఒక అనిర్వచనీయ మానసికానందం (Bliss) అని - ఇలా వివిధ విధాలుగా చెప్పుకుంటాం. ఇది సర్వసాధారణం. ఒక వైయక్తిక మానసిక స్పందన.
ఇక రెండో రకం అనుభూతి అనేది ఒక అధిభౌతిక (Meta physical) అనుభవం. ఒక చింతన. ఒక ఆలోచన. ఒక బ్రహ్మానందానుభూతి. ఇది మొదట్లో చెప్పుకున్న అనుభూతి కంటే పైమెట్టుది (Feeling in higher plane of mind). ఈ రకమైన అనుభవ విశేషాన్ని, ఆలోచనా స్రవంతిని వ్యక్తపరుస్తూ ఆదిశంకరులు రాసిన ఒక ‘ప్రకరణ గ్రంథం’ (సిద్ధాంత ప్రతిపాదక గ్రంథం) ‘అపరోక్షానుభూతి’.
అపరోక్షానుభూతి అంటే పరోక్షం కాని అనుభవం. అంటే అది ఇతరుల ద్వారా కలిగే అనుభవం కాదు. ఆ అనుభవం స్వయంగా చింతనా మార్గంలో, సాధన చతుష్టయ (వివేక - వైరాగ్య - సాధన సంపత్తి - ముముక్షత్వ) పథాన వ్యక్తి తనకు తాను అలవాటు చేసుకొని పొందాల్సిన అనుభవం.
జీవాత్మ, పరమాత్మలు విభిన్నములు కావు. పరమాత్మ యొక్క సూక్ష్మాతి సూక్ష్మ రూపమే జీవాత్మ అనే అద్వైత సిద్ధాంతాన్ని అసంఖ్యాకమైన ఉపపత్తులతో, ఉదాహరణలతో అవగతం చేసే ‘అపరోక్షానుభూతి’ అనే 144 అనుష్టుప్ శ్లోకాల గ్రంథాన్ని ఆచార్య అనుమాండ్ల భూమయ్య 105 మాత్రాచ్ఛంద కవితా ఖండికలుగా తెలుగు చేశారు. సంస్కృత అనుష్టుప్పులకు దగ్గరగా తెలుగులో కవిత్వ చరణాలు కూర్చారు.
ఇదివరలో శిష్ట్లా లక్ష్మీపతి శాస్ర్తీగారు ముత్యాలసరాల ఛందస్సులోను, స్వామి చిన్మయానంద రచించిన వ్యాఖ్యాన సహిత ఆంగ్లానువాద గ్రంథం ఆధారంగా శ్రీమతి టి.అన్నపూర్ణ వచనంలో వ్యాఖ్యాన సహితంగాను ‘అపరోక్షానుభూతి’ని సులభశైలిలో ఆంధ్ర భాషలో అందించారు.
భూమయ్యగారి అనువాదం కూడా చాలా సరళంగా, హృదయంగమంగా ఉన్నది.
‘సాధన చతుష్టయం’లోని ‘షట్సంపత్తులు’ అనే సాంకేతిక పదానికి ‘సదైవవాసనాత్యాగః...’ అంటూ ప్రారంభమయ్యే 6వ శ్లోకం నుంచి ‘చితె్తైకాగ్య్రంతు సల్లక్ష్యే సమాధాన మితి స్మృతమ్’ అంటూ ముగిసే 8వ శ్లోకం వరకు ఉన్న నాలుగు శ్లోకాల భావాన్ని తన 6,7,8,9వ కవితా ఖండికల్లో చాలా సరళ సుందరంగా, సూటిగా, సులభ గ్రాహ్యంగా చెప్పారు ఆచార్యగారు. ‘శమ’ ‘దమ’ ‘తితిక్ష’, ‘పరమోపరతి’ ‘శ్రద్ధ’ ‘సమాధానం’ అనే పదాలకున్న తాత్త్విక భావాన్ని ‘సర్వదుఃఖముల యందు/ సహనమె తితిక్షయగు’ ‘బ్రహ్మమున చిత్తమును/ పదిలమ్ముగా నిలుప/ ఇది ‘సమాధానమ’ని - ఇలా అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టు ఆ ఆరు తాత్త్విక సాంకేతిక పదాల అర్థాన్ని చక్కగా వివరించారు.
‘అలాతం భ్రమణేనైవ/ వర్తులం భాతి సూర్యవత్/ తద్వదాత్మని దేహత్వం పశ్యత్య జ్ఞానయోతః’ అనే శ్లోకాన్ని ‘మండుకర్రను బట్టి/ మండలాకారముగ/ ఏ చిత్రిప్పుచునుండ/ తోచునది సూర్యునిగ/ ఆత్మలో దేహమును/ అజ్ఞాని అట్లెకను’ (ఒక కొఱివికట్టెను గుండ్రంగా వర్తులాకారంలో తిప్పుతుంటే అది సూర్యమండలం లాగా కనిపించవచ్చు. కానీ నిజంగా అది సూర్యుడు కాదు. అలాగే దేహమే ఆత్మ అనుకుంటాడు మూర్ఖుడు -లేక- అజ్ఞాని) అని తెనిగించారు ఉపమాలంకార భావశోభ గాని, భాషా సౌందర్యంగాని దెబ్బతినకుండా.
‘తనను నిగ్రహించుటనె దమమనిరి బుధవరులు’ అనే వాక్యానికి సంస్కృత మూలంలో కర్తృ పదం లేదు. ‘అభిధీయతే’ (అనబడుచున్నది, చెప్పబడుచున్నది) అంటూ కర్మణి ప్రయోగం(passive voice) లో ఉన్నది. తెలుగులో అది సహజ సుందరంగా కనిపించదు. కనుక ‘బుధవరులు’ అంటూ ఒక కర్తను చెప్పటం ఒక భాషాంతరీకరణపు మెళకువ(Translatory Expounding Technique) ‘బుధ్యతే సర్వమితి బుధః (అన్నీ తెలిసినవాడు బుధుడు - అంటే పండితుడు) కనుక బుధవరులు అనే కర్తృ పదం ఇక్కడ వౌలిక భావానికి పరిపుష్టత, తార్కిక బలం (Logical Uprightness) సమకూరుస్తోంధి.
ఇలా ఈ పుస్తకంలోని అనువదిత చరణాలన్నీ సమర్థవంతంగాను, సమర్థనీయంగాను ఉన్నాయి.
అయితే వీలుపడిన కొన్నిచోట్ల సంస్కృత పదాలకు దీటుగా తేట తెలుగు పదాలు వాడితే బాగుండేదేమో! ఉదాహరణకు 36వ ఖండికలో ‘మలిన సంశ్లిష్టమే’ అనే సంస్కృతపు మాట ఘాటుకు మాఱటగా ‘మకిలి మంగలమేను’ అంటూ తెనిగిస్తే తెలుగు ‘నీటు-గోటు’లు ఒక ‘రీతి’ భాతిలో మెఱిసేవేమో!
‘కాకవిష్ఠము (4వ కవితా ఖండికలో) అనే సంస్కృత కఠిన పదానికి బదులుగా ‘కాకిరెట్టను జూడ (లేక ‘చూసి’) కలుగు వైముఖ్యమటు’ అని ఉంటే ‘వైముఖ్యము’నకు ‘రెట్ట’ అనే తెలుగు పదం తోడై ఇంకా ఎక్కువ వైరాగ్య భావాన్ని భావాత్మక ‘పరికరాంకురము’ అనే అలంకర చ్ఛాయతో స్ఫురింపజేసేదేమో!
పెద్దమనిషి తరహాలో గ్రాంథిక భాషా ధారాళత యొక్క బిగువులో సాగిన ఈ రచనలో 100వ ఖండికలో ‘ఏదైతె’ అనే వ్యావహారిక పద ప్రయోగం ఒక దిష్టి చుక్కలాగా (అ) భాసించింది.
మొత్తం మీద ఈ అనువాద కృతి ఒక ఉదాత్త సుందర కృషి.

-శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం