అక్షర

మనిషి కోసం అనే్వషణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అజరామరం
ఎవీ రామిరెడ్డి కవిత్వం
పుటలు: 102.. వెల: రూ.80
ప్రతులకు: ఎం.రాజ్యలక్ష్మి
102, శ్రీకోట రెసిడెన్సీ
పాత పోలీసుస్టేషను దగ్గర
మియాపూర్,
హైదరాబాద్-49.
*
కలల పారావతాల రెక్కలు విరిగి నేల మీద కుప్పకూలినపుడు, ఊహల గాలిపటాలు తెగిపోయినపుడు, జీవితంలోని రంగులన్నీ వెలసిపోయి ఒక్క విషాద వర్ణమే మిగిలినపుడు చెప్పలేని దిగులు కలుగుతుంది. మనిషిలోని మంచితనం అంతరించినపుడు, మానవత్వం నశించి, మృగత్వం ఒళ్లు విరుచుకొన్నపుడు, వేయి తలలతో స్వార్థం విషం కక్కుతున్నపుడు గుండె గాయపడుతుంది. ఆ మానని గాయాలకు అక్షర రూపమిస్తాడు కవి. అలాంటి కవే రామిరెడ్డి.
బాల్యాన్ని బలిగొంటున్న విద్యా విధానం, మన సాంస్కృతిక సంపదను నాశనం చేస్తున్న టీవీ, క్రమక్రమంగా అంతరించిపోతున్న మనిషి ఎవీ రామిరెడ్డి ‘అజరామరం’లోని కవితా వస్తువులు.
ఈ ప్రపంచమంటేనే కొంతమంది మనుషుల సమూహం. కొంతమందితో ఎంతసేపైనా మాటలాడాలనిపిస్తుంది. కొంతమందితో అసలు మాటలాడాలనిపించదు. దీనే్న కవి ‘కొందరు వ్యక్తులు కొన్ని సంభాషణలు’లో ‘కొందరితో సంభాషించేటపుడు/ లోపల ఒక జలపాతం పుడుతుంది/ పూల మొక్కలు ప్రశాంతంగా తలలూపుతాయి/ నాభి దగ్గర పుట్టిన సంతోష తరంగాలు/ మనస్తీరం వెంట అలల్లా వ్యాపించి మన నుదుటి మీద చందమామల్ని వెలిగిస్తాయి!’ అంటూనే మరి కొంతమందితో మాటలాడేటపుడు ‘వాళ్లతో మాట్లాడేటప్పుడు/ కోపంకన్నా ముందుగా/ లోపలెక్కడో పుటుక్కున ఓ తిట్టు పుట్టి/ అది చెట్టులా పెరిగిపోతుంది/ పెనుగాలికి పెళపెళా విరిగినట్టు/ మన వాక్స్వాతంత్య్రం వేర్లతో సహా కూలిపోతుంది’ అని సంభాషణల్లోని వైరుధ్యాన్ని చెప్తారు.
ఇప్పుడు టీవీల యుగం. అందరికీ టీవీ ఒక వ్యసనమే. టీవీలో అనేక కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఆటల పోటీలు, పాటల పోటీలు నిర్వహిస్తుంటారు. ఈ పోటీల్లో ముక్కుముఖం తెలీని చిన్నారులు పాల్గొంటారు. ఆరేళ్ల పిల్లలు పెద్దవాళ్లలా అభినయిస్తారు. దీనే్న ‘ఎలిమినేషన్ జోన్’లో ‘ప్రేమ పాటల కుంభవృష్టిలో చిన్నారులు తడిసి ముద్దవుతారు/ ఆరేళ్ల పాప పదహారులా హొయలు పోతుంది/ ఆకలేస్తే అన్నం పెడతా.. మూడొస్తే ముద్దులు పెడతా’నని అంటుంది.. అంటారు కవి. ఇక్కడ చిన్న పిల్లలు వయసుకు మించి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని కవి బాధపడతారు. అంతేగాక ఫైనల్‌కి వస్తానని అనుకొంటుంది అమ్మాయి. ‘కానీ చివరికి ఆ అమ్మాయిని ఎలిమినేషన్ లిస్ట్‌లో పెట్టేస్తారు. ఆ లిస్టులోకి రాగానే ఏడుపొకటే తక్కువ ఆ అమ్మాయికి. దీనినే ‘ఎలిమినేషన్ రౌండులో/ ఎంత నిబ్బరంగా నిలబడిన/ పసి మనసుకైనా/ నిర్దాక్షిణ్యంగా ఏడిపించడమెలాగో వాడికి తెలుసు!’ అని నిర్వాహకులను నిందిస్తారు. ‘ఇప్పుడొక స్మాల్ బ్రేక్’ కూడ ఇలాంటి వికృతమైన కార్యక్రమాల గురించిన కవితే.
ముఖపత్ర కవిత ‘అజరామరం’ ఒక రసార్ద్రమైన కవిత. ఇది బాల్య జ్ఞాపకాల గురించిన కవిత. ఒకప్పటి బాల్యాన్ని, ఇప్పటి బాల్యాన్నీ పోల్చి రాసిన కవిత. ‘గోలీలాటలు గుర్తున్నాయా/ తాటిబుర్రలు గుర్తున్నాయా?’ అని ప్రారంభించిన కవిత పాఠకులను వారి జ్ఞాపకాల వనాల్లో విహరింపజేస్తుంది. ‘చెప్పుల్లేని నడకా ఆరు కిలోమీటర్ల కావల సర్కారు బడీ/ పొలం గట్లూ పోలిగా పాటలూ నారుమళ్లు వరి కళ్లాలు/ పత్తికోతలూ అంతా ఒక సహజాతి సహజ ప్రకృతి సౌందర్య జీవ లయ’ అంటూ అప్పటి బాల్యంలోని మాధుర్యాన్ని గుర్తుకి తెచ్చుకొంటూ ‘కూచున్నా నిలుచున్నా పడుకున్నా ఫస్ట్ ర్యాంకే ప్రథమ లక్ష్యం/ తాతయ్య నీతి కథల ఊసే లేని హోంవర్కుల సుడిగుండాలు’ అని ఏ మాత్రం ఆటలు, పాటలు, విరామం లేని ఇప్పటి బాల్యాన్ని చిత్రీకరిస్తారు.
ఈ సంపుటిలో మరో కవిత ‘మళ్లీ మనిషి కోసం’ ‘ఒకప్పుడు అమ్మా ఆవూ ఇల్లూ ఈశ్వరుల తాత్పర్యం/ బాల్యంలోనే మనిషికి మనోనేత్రమయ్యేది/ అప్పుడు మనిషంటే ఒక మధుర ఫలం/ అప్పుడు/ మనిషి ఆకాశమంత హరిత స్వప్నంలా మారి/ పది మందికి పట్టెడు మెతుకులు పెట్టే వాడు/ ఇప్పుడు/ మనిషంటే మరతుపాకీ/ వేటుకు సిద్ధంగా వున్న వేటకొడవలి/ నిర్భయ స్వరాన్ని నిలువుగా చీరేసిన/
సామూహిక అత్యాచారం’ అని ఒకప్పుడు అన్నదాతగా, ఆత్మీయ
మిత్రునిలా అలరించిన మనిషే ఇప్పుడు ఒక మృగమై, ఒక మృగయుడై, సాటి మనిషిపై అత్యాచారం చేసే మృగాడుగా మారిపోతున్నాడని అంటూ ‘ఇప్పుడు/ వేట కొడవలి కాదు, వేయి రెక్కల పావురం కావాలి/ నాటుబాంబులు కాదు/ నాదస్వరం కావాలి/ యాసిడ్ బాటిల్ కాదు, యాగఫలం కావాలి/ అత్యాచారం కాదు, సత్యాచారం కావాలి’ అని ఇతరులకు కీడుచేసే వాడు కాకుండా మేలు చేసేవాడు కావాలి అని అంటారు కవి.
ఒకప్పుడు పొలాలను ప్రాణంగా భావించేవారు రైతులు. భూమిని తల్లిగా భావించి కొలిచేవారు. తమ పొలంలో పంటలు పండకపోయినా అమ్మడానికి ఇష్టపడేవారు కారు. ఏదో కారణం వలన పొలం తమ చేతి నుండి జారిపోతే ఆత్మహత్యలు కూడా చేసికొనేవారు. కానీ రెండేళ్ల కిందట రాజధాని కోసం తమ పొలాల్ని తీసుకొన్నప్పటి రైతుల ఆవేదనను ‘రాజధాని’ కవితలో బొమ్మ కట్టిస్తారు. ‘అదిగో రాజధాని/ అధికారిక ప్రకటన వెలువడిందో లేదో/ మా ఊరి భూమికి రెక్కలొచ్చాయి/ ఏ ఇద్దరు కలిసినా ఆకాశ ధరల అతిశయోక్తులే’ అని అంటూ ‘ఒక నిర్మాణం కోసం/ సామూహిక జీవన సూత్రం ధ్వంసం కావడం/ వ్యవస్థీకృత విషాదం/ పంటలు నూర్చే కళ్లాల్లో/ పచ్చనోట్ల పందిళ్లు వేయాలనుకోవడం/ పచ్చదనానికి పాతర వేసినంత పాపం’ అని అంటారు. డబ్బిచ్చి పచ్చని పంటలు పండే పొలాలను స్వాధీనం చేసికోవడాన్ని జీర్ణించుకోలేక తన గ్రామం తనకి కావాలని ‘కాలుష్యం కోరలు సాచని/ కాంక్రీటు వనాలు కన్ను తెరవని/ నా గ్రామం నాక్కావాలి!’ అని తన మనసులోని కోరికను వెల్లడిస్తారు. పొలాలు, ఇళ్లు తాను పుట్టిన ఊరు, తాను ఆటలాడిన ఊరు మాయమై పోవడాన్ని తట్టుకోలేని సగటు మనిషి ఆవేదనను పట్టుకొన్న కవిత ఇది.
పగలంతా ఉద్యోగం చేసి అలసిపోతాడు పురుషుడు. చల్లని ఏ.సి గదిలో కూడా సమస్యల ఎండ కాస్తుంది. వ్యాపారంలో లాభనష్టాల ఒత్తిళ్లు, అసంతృప్తి అగ్నిజ్వాలలు రగులుతూనే ఉంటాయి. చిటికెడు మనశ్శాంతి కూడా ఉండదు. కానీ ఇంటికి రాగానే ఎదురుగా చిరునవ్వుల వెనె్నలలు చిందిస్తూ ఆమె ఎదురు రాగానే అతని అలసటంతా మంత్రం వేసినట్లు మటుమాయమై పోతుంది. దీనే్న ‘ఆమె నవ్వు’లో ‘ఏసి గదిలో ఏడెనిమిది గంటలపాటు/ ఒకటే ఎండ/ బిడ్లూ టెండర్లూ ప్రాజెక్టులూ/ లాభనష్టాల ఎక్సెల్ షీట్లూ/ తలుపులు తెరుచుకోగానే/ ఎదురుగా ఆమె నవ్వుతూ/ అరణ్యం అదృశ్యమైంది/ ఇంట్లో అడుగుపెడుతుండగా/ అంతరంగంలో ఆకాశం విస్తరిస్తూ/ పరవశంగా పక్షులు రెక్కలు విప్పుతున్న స్థితిని ఇంట్లో అడుగు పెడుతూనే దృశ్యం మారిపోతుందని, మనసులో ఆనందాకాశం ప్రత్యక్షవౌతుందని అంటారు.
మనిషి ఇప్పుడు వ్యాపార వస్తువై పోతున్నాడు. నమ్మకానే్న పెట్టుబడిగా పెట్టి లాభాల నార్జిస్తూ సామాన్యుల నెత్తిన టోపీ పెడుతున్నాడు. ఎన్నో చిట్‌ఫండ్ కంపెనీలు డిపాజిట్ చేసిన సొమ్ముకు రెండింతలు ఇస్తామని ప్రజలను నమ్మించి, మొదటి, రెండు నెలలు డబ్బులు ఇస్తారు. నమ్మకం కుదిరాక ప్రజల దగ్గర నుంచి కోట్లు కోట్లు వసూలు చేసి బోర్డులు తిప్పేసిన కంపెనీలు కోకొల్లలు. దీనినే ‘రెప్పలు కత్తిరించిన కల’లో ‘నమ్మకం పెట్టుబడి కావడమే వాణిజ్య మర్మం/ వ్యాపారమంటూ మొదలయ్యాక/ లాభనష్టాల వాకిళ్లు వాటంతటవే...’ అని కొందరు పెద్దఎత్తున చేసే మోసాలను అక్షర రూపంలో ఆవిష్కరిస్తారు.
‘అజరామరం’లో కవితలన్నిటికీ మనిషే కేంద్రం. నిఖార్సైన మనిషి కోసం కవి పడే తపన ఈ పుస్తకంలో కనిపిస్తుంది. ఒక మనసున్న మనిషి కోసం, మలయమారుతం లాంటి మనిషి కోసం, మంచితనం కిసలయించే మనిషి కోసం, స్వార్థం లేకుండా, తన తోటివారిని నలుగురినీ ప్రేమించే అచ్చమైన మనిషి కోసం కవి చేసే అనే్వషణ ఈ సంపుటిలో ప్రతి అక్షరంలో ప్రతిఫలిస్తుంది.

-మందరపు హైమవతి