అక్షర

జీవన సంక్లిష్టతల్లో వెదుకులాటే ‘వొంతు’ కథలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వొంతు ( భావోద్వేగ కథలు)
-జిల్లేళ్ళ బాలాజీ
ధర: రూ.120/-
ప్రతులకు: రచయిత
ఇం.నెం.9-535, ఓంశక్తి గుడి పక్క సందులో
లింగేశ్వర నగర్
బైరాగిపట్టెడ
తిరుపతి - 517 501
98666 28639
*
జీవితంలోని పలు సంఘర్షణలు సంఘటనలుగా మారి కాలానికి ప్రతిబింబంగా నిలబడితే ఆ రచనా ప్రవాహమే వేరు. అంతర్గత లోతుల్ని ఆమూలాగ్రం తడిమి కొత్తకొత్త కథావస్తువుల్ని సృష్టిస్తుంది. ఇలాంటి తపనలోంచి రాటుదేలి పదునెక్కిన చూపుతో కలానికి పనిపెట్టిన రచయితల్లో జిల్లేళ్ల బాలాజీ ఒకరు. ఇటీవలే ‘వొంతు’ పేరుతో భావోద్వేగపూరితమైన కథల సంపుటిని అక్షరీకరించి పాఠక లోకానికి అందించారు. ఇది ఇతని రెండవ కథల పుస్తకం. ఇంకా అనువాద ప్రక్రియల్లో చెయ్యి తిరిగిన నేర్పరితనమూ ఉంది. ఈ సంపుటిని చదువుతుంటే జీవితాన్ని బూతద్దంలో పరిశీలించి అనుభవపూర్వక దృష్టితో కాచి వడబోసినట్టు అనిపిస్తుంది. చదివించే శైలితో పాటు బలమైన వ్యక్తీకరణ కథారచనపై ఉన్న పట్టును నిరూపిస్తుంది. ఈ ప్రాపంచిక దృక్పథాన్ని అవగాహన చేసుకోవాలంటే వీటన్నింటినీ ఒకచోట కుప్పపోసి లోతుగా అధ్యయనం చెయ్యాల్సిందే.
ప్రసవానంతరం భార్య లలిత, పసిగుడ్డుతోసహా పుట్టింటికి వస్తూనే ఐదేళ్ల పాప మెహర్‌ని వెంటబెట్టుకుని రావడం భర్త మాధవ్‌కు ఎంత మాత్రమూ మింగుడు పడదు. చాలా సందర్భాల్లో తన అసంతృప్తిని మాటల ద్వారా చేతల ద్వారా వ్యక్తం చేస్తాడు. వదిలించుకోవాలని ప్రయత్నిస్తాడు. కొన్ని నాటకీయ పరిణామాల మధ్య తిరిగి తన ఇంటికే వస్తుంది మెహర్. ఈమెను బూబూ అని పిలుచుకుంటూ గుండె మీద కుంపట్లా భావిస్తాడు. అనుకోకుండా చేరికైన ఒక కుక్కపిల్ల కొన్నాళ్లు దూరమై తిరిగి దగ్గరైనపుడు కలిగిన భావ సంఘర్షణలోని మార్పే మాధవ్‌కి కనువిప్పు కలిగిస్తుంది. అప్పట్నుంచి పాపను తన సొంత కూతురిగా భావించి ‘అంకుల్’కు బదులు ‘పప్పా’ అని పిలిపించుకుని ఆత్మీయతను పంచడంతో ఈ ‘బూబూ’ కథ సుఖాంతమవుతుంది. మానవీయ విలువల కోణాన్ని అద్దం పట్టిస్తుందిది. అక్కాతమ్ముళ్ల మధ్య బావ ప్రవర్తన కారణంగా తలెత్తిన సమస్య ఇద్దరి మధ్యా అనుకోని దూరాన్ని పెంచితే, తమ్ముడి భార్య మూలంగా చొరవతో ఆ అపార్థం కొనే్నళ్లకి సమసిపోయి తిరిగి ఒక్కటిగా కలిసిపోయే కథ ‘తోబుట్టువు’. ఆత్మీయతా బంధాలకు అడుగడుగునా పెద్దపీట వేస్తుందిది.
గుళ్లో నాదస్వరం కొలువు కోసం తాత తమ్ముడు కొడుకు సుబ్రహ్మణ్యం - చంద్రల మధ్య సాగిన కథన అంశమే ‘వొంతు’ ప్రత్యేకత. పాత్రల సంభాషణలో సహజత్వం, జీవన వాస్తవికత, వృత్తిపరమైన వారసత్వ తగాదా ఫలిత ప్రయోజనమూ, నిష్కల్మషమైన, స్వార్థపూరిత వ్యక్తిగత ప్రవర్తనలలోని తేడాలతో ఆద్యంతమూ రక్తి కట్టిస్తాయి. మాండలిక యాసలోని చిక్కదనపు పటుత్వాన్ని కళ్లకు కట్టిస్తాయి. చివర్లో పిన్ని ఆదెమ్మలో కలిగిన పశ్చాత్తాప భావం ఈ కథకు మూల ఆయువు పట్టు. ఇలాంటి కోవకు చెందినదే మరో కథ ‘రాచబాట’. మంగలి కుల వృత్తిలోని సాధక బాధకాలకు వేసారి ఈసడించుకుంటూ రాత్రికి రాత్రే ఊరును విడిచి వెళ్లిపోయి పట్నంలో ఎదురైన అనుభవాల నేపథ్యంలో తిరిగి క్షవర వృత్తినే గొప్ప గౌరవంగా భావించి, ఒక షాపు రూపంలో దానిని తెరిచి డబ్బు సంపాదించవచ్చనే ఆలోచనను ‘కోదండ’ పాత్ర ద్వారా అక్షరీకరించే ప్రయత్నం చేస్తాడు రచయిత. మానసిక సంఘర్షణను కొట్టొచ్చినట్టు చిత్రీకరిస్తాడు. మనిషి అస్తిత్వానికి సంబంధించిన కులవృత్తుల మూలాల వేళ్లను అందుకోవడానికి తపన పడతాడు పై రెండు కథల్లోనూ. రాని గవర్నమెంటు ఉద్యోగం కోసం కాలాన్ని వృధా చేసుకుంటూ చివరికి మంగలి వృత్తిని ‘చక్రవర్తి హేర్ స్టైల్స్’ పేరుతో జీవనోపాధిని వెతుక్కుని ఆదర్శప్రాయంగా బతకడంలో ఉన్న గౌరవాన్ని హుందాగా స్వీకరించే వ్యక్తి కథ ‘ఎర్రతివాచీ’. ఆత్మసంతృప్తిని పరాకాష్ఠ దశకు చేరుస్తుందిది. గొప్ప అనుభూతినిస్తుంది.
విధి నిర్వహణలో సైనిక దేశభక్తిని చాటిచెబుతూ శత్రువుని అంతం చెయ్యడంలో మానవత్వాన్ని ప్రదర్శించి, చివరికి ఆ శత్రువు చేతిలోనే ప్రాణాల్ని పోగొట్టుకునే స్థితిలోంచి ‘చావుతప్పి కన్ను లొట్టబోయిన’ చందంగా మిత్ర సైనికుడు ద్వారా బతికి బట్టకట్టిన వైనం ‘శత్రు సంహారం’ అనే కథలో వ్యక్తమవుతుంది. కుటుంబ ఆర్థిక పరిస్థితులకు, నిరుద్యోగ సమస్యలకు తట్టుకోలేక తీవ్రవాదుల్లో కలిసిపోయిన కృష్ణకి తిరిగి గ్రామంలో ప్రవేశించినపుడు ఊరు ఊరంతా ఖాళీచేసి, తన కుటుంబ సభ్యులు సైతం తన మూలంగా ఎలా చావుకి దగ్గరయ్యారోనన్న నిజాన్ని ఓ వృద్ధుడు ద్వారా తెలుసుకుంటాడు. ఆ ముసలి వ్యక్తిని ప్రాణాలతో రక్షించడానికి కాపుకాసిన తన సహచరుల్ని కూడా కాల్చి చంపి తనలోని పశ్చాత్తాపాన్ని అర్థంలేని ఆవేశంగా భావించి కొసముగింపునిస్తాడు ‘నలుగురిలో ఒకడు’ కథలో. చాలా ఆలోచనాత్మకంగా సాగి మంచి దిశానిర్దేశాన్ని సమాజానికందిస్తుంది. తాను చేయని తప్పుకి డా.శశిధర్‌ను పోలీసులు అరెస్టు చేసిన తర్వాత జడ్జీ తీర్పుని ఇవ్వబోయే ముందు అసలు దోషిగా ముద్రపడిన తీవ్రవాది అయిలయ్య వచ్చి, తానంతట తానుగా లొంగిపోవడం ‘చీకటి నుండి వెలుగులోకి’ కథకి కొసమెరుపు. గొప్ప మానవతా దృక్పథం ఉట్టిపడుతుంది. ఈ మూడు కథల్లోనూ వైవిధ్యం వస్తురీత్యా కనిపించినా భావోద్వేగాలు సమపాళ్లలో అభివ్యక్తమవుతాయి.
‘పంజా’ కథలోని ఎత్తుగడ, శిల్పం ఉన్నత ప్రమాణాలను అందుకుంటాయి. కూతురు లాంటి విద్యార్థినిని అధ్యాపకుడు వేధించిన తీరుకు అతని సొంత కుమార్తె పేరుతోనే భార్య చెప్పిన మొబైల్ సమాధానం అర్థవంతమైన ముగింపునిస్తుంది. ‘కుక్క కాటుకి చెప్పు దెబ్బ’ అన్న నానుడి అప్రయత్నంగా స్ఫురిస్తుంది. కథ ప్రారంభంలో వెంటాడే నిద్రలోని సింహాన్ని ప్రొఫెసర్‌గా చిత్రించడం కలల ఆధారంగా మనస్తత్వాన్ని అధ్యయనం చేసే విధానాన్ని స్పష్టం చేస్తుంది. ఇది చాలా స్ఫూర్తిదాయకమైన కథ. యవ్వనంలో ఉన్న కూతురు చదువుకునే వయసులో మగాడి వలలో చిక్కుకుందని గ్రహించిన తల్లి నేరుగా ఆ కుర్రాడి లక్షణాలను, చెడు అలవాట్లను ప్రత్యక్షంగా మారువేషంలో పరిశీలించి, సేకరించిన ఆధారాలతో సహా శృతికి చూపించి జ్ఞానబోధ చెయ్యడంతో రాబోయే ముప్పును సకాలంలో పసిగట్టి ఆమెను గండం నుండి గట్టెక్కిస్తుంది ‘పరిరక్షణ’ కథలో. ఇందులో తల్లి అరుణమణి గొప్ప సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తుంది.
ఇంకో కథలో తన పోలీసు బుద్ధితో ఓ ఎస్సై మితిమీరిన చాదస్తపు అనుమానాలతో తోటి ఖైదీలతోప్రవర్తించినట్టే కన్నకూతురు లహరిని కూడా కఠిన క్రమశిక్షణతో బలిచేస్తూ, అప్రయత్నంగా జరిగిన ఒక చిన్న పొరపాటును తిరిగి సరిచేసుకునేలోపే ఆమె ఆత్మహత్య చేసుకుంటుంది. అవివేకం, అతికోపం, అమిత తొందరపాట్లు కొని తెచ్చే అనర్థాలను ‘దృష్టి’ కథ వ్యక్తం చేస్తుంది. ప్రాణప్రదంగా ప్రేమించే భర్త సుధాకర్ మమకారాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక అపార్థంతో మథనపడిన తీరు ‘శ్రీవారి స్వార్థం’ కథలో బొమ్మ కడుతుంది. ‘ముఖాముఖం’ కథ కొత్త కోణాన్ని ప్రతిఫలింపజేస్తే, ‘మానస’ కథ బస్సు ప్రయాణంలోని తోటి ప్రయాణికుడితో గడిపిన క్షణాల్ని అపోహలతో సందేహాలతో ముడిపెట్టి చివర్లో నిజాన్ని గ్రహించాక అన్నీ పటాపంచలవుతాయి. ‘సమీరా ఓ సమీరా’ కథ వాస్తవానికి, సహజత్వానికి దూరంగా ఉన్నట్టు కనిపించినా, కథాచిత్రణలోని బలంతో పాఠకుణ్ణి చదివించుకుంటూ వెళ్లిపోతుంది.
ఇందులోని మొత్తం 15 కథలూ మానవ జీవితాల్లోని పలు పార్శ్వాల్ని ఎత్తిచూపుతూ, లోటుపాట్లను సమర్థవంతంగా సరిదిద్దుతూ హితోపదేశాన్ని అందించేవే. కథాకథనంలోని బిగువూ, చదివించే సరళమైన శైలీ, మెరుపు ముగింపులు, ఎంచుకున్న ఇతివృత్తాలు అలరింపజేస్తాయి. ఆసక్తిగా ముందుకు నడిపిస్తాయి. ఇంత మంచి కథలకు ఏర్చికూర్చి పాఠక లోకానికి అందించిన రచయిత జిల్లేళ్ల బాలాజీని అభినందించకుండా ఉండలేం.

-మానాపురం రాజా చంద్రశేఖర్