అక్షర

సాహితీ రసరాజు ‘రాసాని’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డా.వి.ఆర్.రాసాని
సాహిత్య సమాలోచన
వెల: రూ.300/-
ప్రతులకు: రచయిత
16-2ఇ/17, బాలాజీ రెసిడెన్సీ
మునిరెడ్డినగర్
తిరుపతి-517 502
*
రాసాని వెంకట్రామయ్యనే సాహితీ లోకం ముద్దు ముద్దుగా డా.వి.ఆర్.రాసానిగా పిలుచుకొంటారు. కవిగా, విమర్శకుడిగా, నాటక ప్రయోక్తగా, అధ్యాపకుడిగా తన సాహితీ లోకాన్ని విస్తరించుకొన్న ఆదర్శ రచయిత డా.వి.ఆర్.రాసాని. నిత్య సాహిత్య కృషీవలుడైన రాసాని షష్టిపూర్తి సందర్భంగా ప్రచురించిన ‘రాసాని సాహిత్య సమాలోచన’ ఆచార్య నాగోలు కృష్ణారెడ్డి, డా.పి.సి.వెంకటేశ్వర్లు సంపాదకులుగా వెలువడింది. 56 అంశాలతో 359 పుటలతో అచ్చువేయబడ్డ ఈ పుస్తకం సాహిత్య లోకంలో రాసానికున్న ప్రత్యేకతను చాటింది. పినిశెట్టి వేసిన ముఖచిత్రం ఈ పుస్తకానికో అందం.
150 కథలు, వందల కొద్దీ వ్యాసాలు, కవితలు, 8 నవలలు, 9 నాటకాలు, 5 విమర్శనా గ్రంథాలు, కాలమిస్టుగా బహుముఖీనమైన ప్రజ్ఞగల రాసానిపై ఇలాంటి అద్భుతమైన పుస్తకం రావడం సాహిత్య లోకపు అదృష్టం. ఏదో ఊహాపోహలకు తావులేకుండా తన జీవితాన్ని సాహిత్య ప్రక్రియలుగా మలచడం ఒక అరుదైన సాహిత్య విన్యాసం. ఇంత విస్తృతమైన సంచిక వెలువడిందంటే రాసానికి లోక పరిచయం జరిగే వరకున్న అనుభవం, ఆ తర్వాతి పుస్తక పరిచయం, రచనలు అన్నీ ‘సముద్రం లాంటి జ్ఞానం కుండ’లోకి వొంపడమే.
సమాజంలోని ‘బహుజనుల’ జీవన చిత్రాన్ని లోకానికి అందించే మహత్తర కృషి రాసాని చేయాలని సంకల్పించడం వల్లనే ఈ ‘సంచిక’ రూపుదాల్చింది. రాసానికి కలిగిన సాహిత్య పునాది ఎలాంటిదో ఆయన మాటల్లోనే ‘పండగ పబ్బాలలో, మొలకల పున్నమి రాత్రుల్లో పల్లెల్లో వేసే గొబ్బి, జక్కీకి, కోలాటం, చెక్క్భజన, పాండురంగ భజన లాంటి జానపద కళలు మనసును హత్తుకునేవి. చెనక్కాయలు వలిచేటపుడు, సజ్జగూళ్లు కోసేటప్పుడు యింకా వెనె్నల రాత్రుల్లో విశ్రాంతిగా కబుర్లు చెప్పుకునేటప్పుడు పెద్దవాళ్లు చెప్పుకొనే జానపద కథలంటే చెవికోసుకొనేవాణ్ణి... భట్టివిక్రమార్క కథలు, సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి, కాశీమజిలీ కథలు, పరమానందయ్య శిష్యుల కథలు, భోజరాజు కథలు వంటి వాటిని రోజూ కొంచెం కొంచెం చొప్పున చదివించుకొని ఆనందించుకొనేవారు (పు.14).’ ఇదీ ఆయన లోతైన కథలు రాయడానికి నేపథ్యం. భారతీయ కథకులెవరైనా ఈ నేపథ్యం ఉన్నవారే. మన కథల్లో స్థానికత, దేశీయత ఉండడానికి, కవిత్వం, కథలు దేశీయతను సంతరించుకోవడానికి ఇదే కారణం.
రాసాని సరిగ్గా ఇలాంటి నేపథ్యంతో తన రచనలు చేశాడు. అందుకే ఈ సంచికలో ఇన్ని భిన్న కోణాలను స్పృశించడానికి కారణం ఇదే.
‘ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడి కన్పించని పల్లెటూళ్ల పామర ప్రజల్ని గురించి రచనలు చేసిన వారి సంఖ్య తక్కువ. ఈ కొద్దిమంది జాబితాలో తప్పక చేర్చవలసిన.. పేరు వి.ఆర్.రాసాని.’ అని మధురాంతకం రాజారాం లాంటి ప్రసిద్ధ రచయిత పేర్కొనడం రాసాని ప్రతిభకు నిదర్శనం.
సామ్రాజ్యవాద, ప్రపంచీకరణ నేపథ్యంలో శిథిలమవుతున్న మానవ హృదయాలను దగ్గరగా గమనించిన రాసాని తన కథల్లో ఈ ఆవేదనను అక్షరబద్ధం చేసిన నిబద్ధ రచయిత. అందుకే శాంతినారాయణ ఈ పుస్తకంలోని ఓ వ్యాసంలో ‘సామ్రాజ్యవాద ప్రపంచీకరణ మహమ్మారి శక్తియుక్తుల ముందు జవసత్వాలు కోల్పోయి ఛిద్రమవుతున్న వృత్తి కులాల కన్నీటి జీవిత గాథలను తెలుగు సాహిత్య చరిత్రలో కళాత్మకంగా కథా నవలా రూపంలో రికార్డు చేసిన గొప్ప రచయిత రాసాని వెంకట్రామయ్య’ అంటారు. అతని కథా రచనా సామర్థ్యానికి పై వాక్యాలు నిదర్శనాలు. ఆయనలోని తాత్విక మానవీయ కోణాలు కథల్లో కన్పిస్తాయని నారాయణ చెప్తాడు.
‘రాసాని గిరిజన సంచార కథలకు సమాంతరంగా బహుజన కథలను రాసినాడు. ఇంతటి విస్తృతానుభవజ్ఞతకు కారణం రాసాని పల్లె పుట్టుక’ (పు.59) అంటాడు బండి నారాయణ స్వామి. ‘ఆదివాసీల సాంస్కృతిక రాయబారి రాసాని’ అని మరో బిరుదును శీర్షికగా చెప్పిన స్వామి వ్యాసంలో రాసాని మానవీయ, గిరిజన, ఆదివాసీ సంస్కృతిని సవివరంగా చెప్తాడు.
మానవీయ దృక్పథం అన్ని వర్గాలపై ఉండే వాడే సరైన కథకుడు. ఆ దృష్టితోనే మహిళను తన కథల్లో మహోన్నతంగా చూపిస్తాడు. పురుషాహంకారం కూడా కుల, ధన, పదవీ అహంకారంతో ఏమీ తీసిపోదు. ‘వొక ఆడదాన్ని కొట్టేదానికి నీకు సిగ్గు లేదా! పెండ్లాన్ని కొట్టేది వీరత్వం అనుకొంటివా’ అంటూ ఓ కథలో చెప్పించిన డైలాగు రాసానికి స్ర్తి పట్ల ఉండే దృక్పథం వెల్లడవుతుంది. ‘రాసాని కథలు - మహిళ’ అనే శీర్షికలో రాసిన వ్యాసంలో ఆచార్య మాలె విజయలక్ష్మి రాసాని స్ర్తి జీవన కథనాన్ని నాలుగు మాటల్లో చాలా గొప్పగా చెప్పారు’ రాసాని కథలు వాస్తవ జీవన దృశ్యాలు. ప్రజల జీవితాల సునిశిత పరిశీలన వీరి సొంతం. ఈ దిశలోనే నిత్య జీవితంలో మహిళల వెతలు, మహిళల మనసులు పురుషాహంకార ప్రవృత్తి, మోసం ఓ పిడికెడు కథల్లో చిత్రించారు’ అంటారు.
వెనుకబడిన వర్గాల వారిలో సమాజం చూడని ఎన్నో వెతలున్నాయి. ఆ కోణాలను, దృక్పథాలను ‘బహుజన జీవితం’ పేరుతో డా.కొలకలూరి మధుజ్యోతి రాసాని దృక్పథాన్ని వెల్లడించింది.
చిన్ననాడే గ్రామీణ కళలు తనను ఎలా ఆకర్షించాయో మొదట రాసాని చెప్పుకొన్నారు. అతని రచనల్లోని కళాత్మక దృక్పథాన్ని ఆచార్య కె.దామోదర నాయుడు చక్కగా విశే్లషించారు. ‘పరస’ నవలంతా గంగిరెద్దుల వారి గురించే చెప్పబడింది. ‘చీకటి రాజ్యం’ నవలలో పిల్లనగ్రోవి నృత్యం, గొబ్బి, మట్టి బతుకులు నవలలో వడ్డెల డుముకుల నృత్యం చెప్పబడింది.’ (పు.86) ఇలా అజ్ఞాతంగా ఎందరో వృత్తి కళాకారుల జీవితాలను వారిని ముడిపెట్టి ఉన్న అనేక విషయాలను రాసాని తన రచనల ద్వారా సమాజానికి అందించారు.
ప్రపంచీకరణ, ఆర్థిక సరళీకరణ ప్రక్కవాణ్ణి కూడా పగవాణ్ణి చేసింది. వేట, యిరసాలమిట్ట, తాలుగింజలు, పయనం, కొలిమి, నేరం, తీర్పు, రంగుల కల, చెప్పు తినెడు కుక్క, పాలగొడ్డు.. లాంటి శీర్షికలతో ప్రళయాగ్ని లాంటి ప్రపంచీకరణను ప్రశ్నించాడు రాసాని. ఈ విషయాలను డా.పి.సి.వెంకటేశ్వర్లు చక్కగా విశే్లషించాడు. అలాగే డా.పి.వి.సుబ్బారావు ‘రాసాని రాసిన రాయలసీమ రైతు కథలు’ అనే శీర్షికలో చక్కని వ్యాసం రాశాడు. తాను పుట్టిన నేలలో రైతులు ఎలా తమ జీవితాన్ని కోల్పోయి కన్నీరు మున్నీరవుతున్నాడో వివరించారు.
సామాజిక అస్థిత్వాలపై డా.ఎన్.ఈశ్వర్‌రెడ్డి, రాసాని - గ్రామీణ కథల రాజధాని పేరుతో డా.కలువగుంట రామమూర్తి, రాసాని కథల్లోని కులవృత్తులను జిల్లేళ్ల బాలాజీ చక్కగా విశే్లషించారు. తన జీవితంలో ఛిద్రమవుతున్న, శిథిలమవుతున్న బ్రతుకులను రాసాని కథల్లో ఎలా చిత్రీకరించారో ఆచార్య ఆర్.రాజేశ్వరమ్మ వివరించారు. ‘అప్పటికే సూర్యుడు పడమటి కొండల్లో అంతర్థానమయ్యాడు. ఎన్నటికీ అంతుపట్టని పెనుమాయలా చీకటి క్రమంగా లోకాన్ని ఆక్రమించుకోసాగింది’ అన్న ‘మినే్నరు’ అనే రాసాని కథలోని వర్ణన అత్యద్భుతం. లక్కినేని రాజీవ్‌బాబు రాసాని చేసిన వర్ణనలను, ప్రతీకలను విశే్లషించారు. రాసాని కథ రాసినా, నవల రాసినా, గేయం రాసినా అది అత్యద్భుత శిల్పంతో, రమణీయ శైలితో ఉంటుంది.
‘ఆమె ఓ పల్లె పిల్ల - ఆమె మట్టి వాసన ఇంకాపోని నల్ల గొర్రెపిల్ల - మెడ కింద లింగాలు కదిలిస్తూ చెంగున దూకే కంచి మేకపిల్ల’ అంటూ అతని కవిత్వ వర్ణన అత్యంత సుందర శైలిగా పేర్కొనవచ్చు.
రాసాని మానవీయ తాత్విక దృక్పథం గల రచయిత. సిద్ధాంతాల చట్రంలో ఇరుక్కున్నాడో లేదో చెప్పలేం గాని మనసున్న అక్షర శిల్పి. ఎక్కడ బలహీనత ఉంటుందో అక్కడ తన అక్షర ముద్ర వేసిన అసమాన ధీశాలి. ప్రతి అక్షరం దీన జన సంరక్షణకు తోడ్పడాలని తపించిన అరుదైన అక్షరార్చకుడు. ఎక్కడా వెటకారం, అహంకారం, కాఠిన్యం లేకుండా తాను చెప్పగల దిట్ట రాసాని. ఆయనలోని మంచితనానికి అదంతా ఉదాహరణ. ఆయన రచనల్లోని భిన్న దృక్పథాలను ఎందరో పేరు మోసిన రచయితలు సమగ్రంగా విశే్లషించిన ఈ పుస్తకం సాహిత్య పాఠకులందరికీ అవశ్య పఠనీయం. ఇంత అత్యద్భుతంగా తీర్చిదిద్దిన సంపాదకులు అభినందనీయులు.

పి భాస్కరయోగి