అక్షర

పాదుకా సహస్ర వైభవం రాఘవీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాఘవీయం
-శ్రీమాన్ కె.వి.రాఘవాచార్యులు
సాహితీ సమాలోచన
తిరుమల ఛారిటబుల్ ట్రస్ట్,
హైదరాబాద్-500 028.

వేదాంత దేశికుల పాదుకా సహస్రంలో కేవలం స్తోత్ర
భాగమే కాక చిత్ర
కవిత్వమును కూడా
రచించారు. అనువాదకునికి స్తోత్రం భావానుగుణంగా తీర్చిదిద్దవచ్చు. కానీ చిత్ర కవిత్వంలోని బంధాలను, చమత్కారాలను
తెలుగులోనికి తేవడం కష్టమే అవుతుంది.

ఇటీవలి కాలంలో విలసిల్లిన ఉభయ వేదాంత ప్రవర్తకులైన విద్వాంసులలో శ్రీమాన్ కారంచేటి వేంకట రాఘవాచార్యుల వారు అగ్రగణ్యులు. సంస్కృతాంధ్ర ద్రావిడ భాషలలో పేరెన్నికగన్న విద్వద్వతంసులు. రాఘవాచార్యుల వారు పాదుకా సహస్రానికి సమగ్రమైన వ్యాఖ్యను వెలువరించినప్పుడు శ్రీవైష్ణవ విద్వల్లోకము ఆహా అని తన అచ్చెరువును ప్రకటించింది. తరువాత వారు శ్రీ వేదాంత దేశికుల స్తోత్రాలకు విపులమైన వ్యాఖ్యానాలు సమకూర్చినారు. ఈ వ్యాఖ్యా సందర్భంలో సంస్కృత వేదాంత గ్రంథాలలోని అంశాలే కాకుండా నాలాయిర దివ్య ప్రబంధంలోని శ్రీ శఠగోప పరకాలాది దివ్యసూరాల వాగ్విశేషాలను సందర్భోచితంగా ఉదహరించి - ఉభయ వేదాంతాలకు నడుమనున్న అనుబంధాన్ని వెల్లడించారు. అట్లాగే విశ్వనాథ సత్యనారాయణ శ్రీమద్రామాయణ కల్పవృక్షములోని పద్యాలను కూడా వెల్లడించారు. తాము దేశికుల సంప్రదాయానికి చెందినవారైనా పిళ్లలోకాచార్యుల వంటి తెన్గలై ఆచార్యుల వాక్యాలు కూడా ప్రామాణికాలుగా ఉదహరించారు.
అసలు సహస్ర స్తోత్ర సంప్రదాయము ద్రావిడ వాఙ్మయంలో ఆవిర్భవించింది. అక్కడ నుంచి సంస్కృత వాఙ్మయంలోనికి ఈ ప్రక్రియ ప్రసరించింది. వేదాంత దేశికులు ఈ సహస్ర స్తోత్ర సంప్రదాయాన్ని సంస్కృతంలోనికి తీసుకువచ్చినారు. తరువాతి కాలంలో వేంకటాధ్వరి మొదలైన వారు దీన్ని వృద్ధి పొందించినారు. ఆధునిక కాలంలో కావ్యకంఠ గణపతి ముని ఉమా సహస్రం వచ్చింది.
వేదాంత దేశికుల పాదుకా సహస్రంలో కేవలం స్తోత్రభాగమే కాక చిత్ర కవిత్వమును కూడా రచించారు. అనువాదకునికి స్తోత్రం భావానుగుణంగా తీర్చిదిద్దవచ్చు. కానీ చిత్ర కవిత్వంలోని బంధాలను, చమత్కారాలను తెలుగులోనికి తేవడం కష్టమే అవుతుంది.
రాఘవాచార్యుల వారి వ్యాఖ్యానంలో వ్యాకరణాంశాలు, అలంకారాలు, ప్రసక్త శాస్త్రాంశాలు మొదలైనవన్నీ సరళంగా వెలువరింపబడ్డాయి.
రాఘవాచార్యుల వారు శ్రీ వేదాంత దేశిక సరస్వతికి చేసిన వరివరస్యలో ముఖ్యమైన అంశం వారి యాదవాభ్యుదయ కావ్యానికి చేసిన వ్యాఖ్య. చివర దాకా దీన్ని పూర్తి చేయటంలో దీక్ష వహించినా కొంచెం మిగిలిపోయింది. మల్లినాథుని మార్గంలో ఈ మహా కార్యానికి వ్యాఖ్య వ్రాసి తెలుగు వారికి అభినవ మల్లినాథులుగా దర్శనమిచ్చారు. సంస్కృతంలోని అప్పయదీక్షితుల వారు దీనికి వ్యాఖ్య వ్రాయగా, ఆ మహా పండితుని వ్యాఖ్యను తెలుగు వారికి సరళ సుబోధకంగా అందించినారు.
దివ్య ప్రబంధత్రయ - తిరుప్పల్లాండి - తిరుప్పళ్లిఎళుచ్చు - కణ్ణిక శిరోత్తాంబు అనే మూడు లఘు ప్రబంధాలకు రాఘవాచార్యుల వారి వివరణ సంప్రదాయ రహస్యాలను నిధి వంటిది. ఈ మూడు ప్రబంధాలు అష్టాక్షరీ మంత్ర మహిమను తెలియజేస్తున్న అంశం వారు ఈ వివరణలో తెలియజేసినారు.
ద్రవిడోపనిషత్తాత్పర్య రత్నావళి వేదాంత దేశికులకు దివ్య ప్రబంధాల యందున్న ప్రారణ్య బుద్ధిని తెలియజేస్తుంది. నమ్మాళ్వారుల గీతికా సహస్రములో ఒక్కో పాశురము సర్వశేషి యొక్క అనంత కల్యాణ గుణములలో ఒక్క దానిని ప్రతిపాదిస్తున్నదని వారు విశదీకరించారు. శ్రీ శఠగోప గీతాకా సమూహాన్ని వ్యాఖ్యానించటంలో దేశికుల వారి అగాధ శాస్త్ర పాండిత్యము -లో నారసి చూచే నేర్పు ఈ వ్యాఖ్యానంలో తేటతెల్లమవుతుంది. ఒక విధంగా ఇది మహాభారతంలోని విష్ణు సహస్ర నామ స్తోత్రమునకు శ్రీ శఠగోపుల మార్గంలో చేసిన వివరణగా చెప్పవచ్చును. విమర్శకులు రాఘవాచార్యుల వారి ఈ శాస్ర్తియ వివరణను అరుదైన ప్రయత్నముగా భావిస్తున్నారు.
వేదాంత దేశికుల స్తోత్రాలలో అత్యద్భుతమైంది స్వామివారు వేంకటేశ్వర స్వామి వారి దయను గురించి వ్రాసిన దయాశతకం. స్వామి దయ అన్న ఒక అమూర్తమైన గుణ విశేషాన్ని గురించి ఎంతో విస్తారంగా శతకం వ్రాయటం వారి ప్రతిభా విశేషానికి ఉదాహరణం. జీవులకు స్వామి యొక్క దయ మాత్రమే శరణ్యమవుతున్నది. అవ్యాజమైన స్వామి దయా ప్రవాహం ప్రసరించటం వల్లనే జీవుడు సంసార సముద్రం నుంచి ఉత్తీర్ణుడవుతున్నాడు. పురుషకార స్వరూపియైన అమ్మవారికి స్వామికి దయకు ఈ స్తోత్రం ఒక విధంగా ఏకీభావాన్ని సిద్ధింపజేస్తుంది.
వేదాంత దేశికులు జీవితమంతా ఏమీ కోరుకోలేదు. ఉంఛ వృత్తిలో జీవించారు. తమ సగపాఠులైన విద్యారణ్య స్వామి విజయనగర మహారాజు వారి చేత ఆహ్వానం పంపిస్తే దాన్ని తిరస్కరించారు. పోతన మొదలైన వారు ఇమ్మనుజేశ్వరాధములని రాజులను ధిక్కరించటానికి ప్రేరణ ఒక విధంగా వేదాంత దేశికుల వారే.
ఈ సమాలోచన గ్రంథం సమకూర్చటంలో సంపాదక వర్గం ఎంతో శ్రమ పడింది. ఈ గ్రంథం కోసం వ్రాసిన వ్యాసాలు, ఆ గ్రంథాల ప్రచురణ సందర్భంలో వ్రాసిన ముందు మాటలు, ఒకటి రెండు ప్రత్యేక వ్యాసాలు ఉన్నాయి. దీనిలో శ్రీమాన్ రాఘవాచార్యుల వారు వ్రాసిన వేదాంత దేశికుల పరిచయ వ్యాసం, మరొకటి వారి స్వ పరిచయం దీనిలో విలువైన రచనలు.
రాఘవీయం - రాఘవాచార్యుల వారి సాహిత్య సమాలోచనను గురించి సంగ్రహంగానైనా ఉత్తమ వ్యాసాల సంపుటి. ఇంత సఫల ప్రయత్నం చేసిన ప్రకాశకులు అభినందనలకు యోగ్యులు.

-కోవెల సుప్రసన్నాచార్య