అక్షర

భవ్య భావనల ఊట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘పద్య పారిజాతము’
-కుప్పా వేంకట కృష్ణమూర్తి
పుటలు: 138.. వెల: రూ.50
ప్రాప్తిస్థానం: శ్రీ గణపతి
సచ్చిదానందాశ్రమము
దత్తనగర్, ఊటీ రోడ్,
మైసూర్ -570025
భారతదేశానికి ఆర్ష సంస్కృతి వెనె్నముక. ధర్మనిరతి, అచంచల భగవద్భావన, మహోదాత్త తాత్త్విక దృష్టి, మహాపురుష పరంపర, ఆదర్శ గురుశ్రేణి, ప్రస్థానత్రయం, సంగీత సాహిత్యాది లలితకళా సంపన్నత మొదలైనవి భారతీయ సంస్కృతి అనే వెనె్నముకకున్న అనేకమైన వెన్నుపూసలు. ఈ వెన్నుపూసల లాంటివైన కొన్ని అంశాల మీద కుప్పా వేంకట కృష్ణమూర్తిగారు మిక్కిలి ప్రత్యయ భావంతో కొన్ని సంస్కృతంలోను, కొన్ని తెలుగులోను రచించిన శ్లోక - పద్య కవితా సంకలనం ‘పద్య పారిజాతము’.
ఇందులో గణపతి, శివుడు, శంకరాచార్యులు, రామాయణము, జగన్నాథ కవి, శ్రీగణపతి సచ్చిదానంద స్వామి, వ్యాసుడు, కృష్ణానది మొదలైన 52 శీర్షికల కింద ఛందోబద్ధ కవితలు, ‘చిలిపి ఊహలు’ ‘అనాది కాలమా’ ‘మరల’ అనే ఒక మూడు వచన కవితలు ఉన్నాయి.
కవి తన భావనా వీధిలో శివుని విరాట్రూపాన్ని దర్శిస్తూ రాసిన ‘ఎవ్వాని విస్తృతికీ పెద్ద ఆకాశ...’ అనే పద్యం ఎంతో వ్యాఖ్యాన అపేక్షితంగా ఉంది. బాగుంది. ‘పరమేశ్వరుని బ్రహ్మాండ రూపంలో ఆకాశం ఒక వెంట్రుకలాగ ఉంది. చంద్రగోళమే ఒక చిన్న పువ్వులాగా ఉంది. గంగానది మొత్తం ఒక మంచుబిందువులాగ ఉంది’ అంటాడు కవి. ఇలా ఎప్పుడుంటుంది? విశ్వం మొత్తం ఏకైక మహారూపంగా కనిపిస్తేనే.
ఇక్కడ శివునికి ఉన్న ‘స్థాణు’ అనే నామాంతరం గుర్తుతెచ్చుకొని, అన్వయించుకోవాలి. స్థాణువు అంటే కదలని వాడు. అసలు విశ్వమంతా తానే అయ్యున్నప్పుడు ఇంకా తాను కదలటానికి చోటెక్కడుంది? అందుకనే ఆ ఆదిదేవుని పేరు స్థాణువు. అలా కదలటానికి కూడా వెంట్రుకవాసి చోటు గాని, ఖాళీగాని లేని ఆ అనంత (ఇన్ఫినిటీ) రూపంలో ఆకాశ, శశి, గంగలు అలా సూక్ష్మాతి సూక్ష్మంగానే కనిపిస్తాయి. ఇలా ఒక అంశం చెప్తుంటే, మరొక విశేషాంశం స్ఫురించటం ఇక్కడి ధ్వని గాంభీర్యం.
‘మహేశా! నీవెలాంటివాడవో నాకు తెలియదు. నీవు ఎలాంటివాడవో అలాంటి వాడికి నా నమస్కారం’ అన్న భావనా పద్యం ఒక చమత్కార వచనం.
‘శ్రీరాముడు’ పద్యంలో ‘పాయసం అనే తీయని గింజలోంచి పుట్టిన కల్పవృక్షం నీవు. సీతాదేవి ఓరచూపుల వాన చినుకులలో తడిసిన చిగురాకువు నీవు’ మొదలైన వాక్యాల పద్యంలోని భావ సౌందర్య, రూపక, క్రమాలంకారాలు చాలా బాగున్నాయి.
‘గణపతి’ శరణాగతిలోని ‘యదీయ దివ్య దీధితచ్ఛటాయే హఠాద్విపాటిత ప్రసాంద్ర సంతమః..’ మొదలైన శ్లోకాల్లో అక్షర రమ్యత హృదయంగమంగా ఉంది.
త్రిమూర్త్యాత్మక ఏక స్వరూపాన్ని వర్ణిస్తూ ‘కైలాస నిలయ కాంతులే నీకన్నులేమో! వైకుంఠంలోని విద్యుల్లక్ష్మీ శోభంతా నీ జుట్టులోని పాయల్లోకి వచ్చి దూరిందేమో! బ్రహ్మలోక కాంతిచ్ఛటాశ్రీలు నీకు వస్త్రంగా చుట్టుకున్నాయేమో! ఆ సమైక్య రూపమే నేను నమ్మిన సచ్చిదానంద స్వరూపమేమో’ అనటంలోని ‘వస్తూత్ప్రేక్ష’ హృద్యంగా ఉంది.
‘స్వామీజీకి స్వాగతాంజలి’గా కూర్చిన ఐదు పద్యాలలోను సమాస ధారాళత, ధారాశుద్ధి సమంగా సమకూరాయి. ‘స్మాగతమస్మదీయ జననాంతర కోటి చితాఘవాసనా/ భోగ విపాక జన్మ విషపూరిత దుర్భర దుష్ట భావనా/ వేగ...’ అంటూ సాగిపోయే పద్యం ఒక తార్కాణం.
‘వ్యాసుడు’ ‘తపసులే పొంగులై తత్త్వముల్ హంగులై తన వాక్కు రంగులై తనరువాడు..’ అనే పద్యం అంత్యప్రాస అందంతో ప్రబంధ పద్యాల శైలిలో ప్రకాశించింది.
వ్యాసుని గురించే వ్రాసిన ‘మెరపులు గుత్తులై...’ అనే మరో పద్యంలో ‘గుంపులు గుంపులుగా మెరుపులు. శ్రావ్యమైన వేద పఠనానాదం ఆధార పీఠం. కల్పవృక్షపు చల్లని గాలులు స్థిరావాసం చేసుకున్నాయి. ఈ మూడూ ఒకచోట కూడి ఉన్న ఒక మహోదాత్త స్థలంలో ‘్ధర్మం’ అనే దాన్ని ఒక శిల్పంగా చెక్కితే ఆ శిల్ప రూపమే వ్యాసుడు అంటారు కుప్పా వారు. ఇందులోని భావ సౌందర్యం మనోహరం. ‘ఉదాత్తాలంకారం’ రసనిష్ఠం.
‘సహ్యే సంగమిత త్రిమూర్తి సుకలా..’ అనే శ్లోకంలో కృష్ణానదిని స్మరిస్తూ ‘త్రిమాత్రైక రూపంగా సహ్యాద్రి సాను శ్రేణులలో ఉద్భవించిన ఆ నదీమతల్లి శ్రీశైలంలో శివ రూపిణిగా, కృష్ణాజిల్లా శ్రీకాకుళం దగ్గర వైష్ణవిగా, హంసల దీవి దగ్గర బ్రాహ్మీ వేదిగా దర్శనమిచ్చే అంబ (వి)జయవాడ దగ్గర పుష్కర శ్రీయోగా దుర్గ’ అనటంలోని భావం తెలుగు రాష్ట్రాల సమైక్య భక్తి మార్గ సంస్కృతి ప్రతీకగా భాసిస్తోంది.
ఈ శ్లోక పద్య ఖండ కావ్యంలో ‘ఉద్గార పంచకం’లోని శ్లోకాలు అద్భుతమైన ఆత్మాశ్రయ కవిత్వానికి, ఆత్మ నివేదనానుభూతికి, జీవుని వేదనకు మంచి ఉదాహరణలు - పాఠకుని కదిలించే రీతిలో.
ఉద్గారం అంటే వెలువడటం. కడుపులో ఒక మథనానికి గురవుతున్న యావద్బాధా వ్యక్తీకరణావేశం కట్టలు తెంచుకొని బయటకు రావటం. ‘ఉద్గార పంచక’ శ్లోకాలలో ‘జీవుని వేదన’ను గజాననునకు నివేదన చేసే రచనావేశ తీవ్రత పరాకాష్ఠకు చేరుకుంది.
‘గణేశా! నా పూర్వజన్మ పాపాల అగ్ని నా లోలోపల జ్వలిస్తోంది. అది గొంతు దాకా కూడా విస్తరించి నన్ను కాల్చివేస్తోంది. దాని పొగ, సెగలు నా నోట్లో ఉద్గారంగా (తేన్పులాగా) బయటకు వస్తున్నాయి. శే్లష్మం (కల్మషం), పిత్తం (వికారం (మనిషి జన్మ వికృత తత్త్వం) - ఇవే నాలోని ‘గాలి - కట్టె’లు. ఆ కట్టెల మీద నా జీర్ణ మండలంలోని ఒక భాగమయిన ఆమాశయం అనే ఒక పాత్ర ఉంది. ఆ పాత్రలో నా పాపకర్మ మొత్తం దుఃఖం అనే అగ్నిలో ఉడుకుతూ, ఆవిరై ఉద్గారంగా వెలువడుతోంది. శబ్దం కూడా చేస్తోంది (ఆవేదనా పూర్వకపు నిట్టూర్పులే ఆ శబ్దాలు)...’ ఇలా జీవుని వేదనను ఉద్గారిస్తూ సాగిపోతాయి అన్ని శ్లోకాలున్నూ. కవియొక్క మనశ్శరీరంలో పాఠకుడు పరకాయ ప్రవేశం చేస్తే తప్ప ఇందులోని భావావేశ వ్యక్తీకరణా విలక్షణత మనస్సుకు పట్టదు.
ఇక వచన కవితల విషయానికొస్తే ‘అనాది కాలమా’ కవితలో ‘వికసించిన పూరేకులు/ ప్రకృతి మాత చిరునవ్వుల పెదవులు/ వింతవింత రంగులు కనిపిస్తున్నాయి/ ఆహా! ఆ వింత కుంచె మాత్రం/ కనిపించటం లేదు’ అన్న పంక్తులు వర్డ్స్‌వర్త్, ఠాగూర్‌ల భావజాల ధోరణిని గుర్తుకు తెస్తాయి.
‘కాలపు మలుపులు/ మానవ పురోగతికి కొత్త పుంతలు’ అనే ఒక కోణపు భావ పంక్తులు ఆధునిక కాలంలో ఎక్కువగా కనిపిస్తున్న వెర్రితలల నాగరికతా సంస్కృతులకు వర్తిస్తాయా అనేది కూడా ఆలోచించాలి.
మొత్తం మీద ఈ ‘పద్య పారిజాతం’ భవ్య భావనా సౌరభ సహజాతం.

-శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం