అక్షర

అణగారిన ఆర్తుల మూగవేదనను వినిపించే కథలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సదానంద్ శారద కథలు
పేజీలు: 275
వెల: రూ.180/-
ప్రతులకు: నవచేతన పబ్లిషింగ్ హౌస్
గిరిప్రసాద్ భవన్
జిఎస్‌ఐ పోస్ట్
బండ్లగూడ (నాగోల్)
హైదరాబాద్- 500 068
040-24224453
**
అణగారిన ఆర్తుల మూగ వేదనను వినిపించేందుకు కథకులు సదానంద్ శారద ముప్పయి కథలతో ఓ గ్రంథాన్ని వెలువరించారు. పాకాల సదానంద్ తన సతీమణి శారదకు తన జీవితంలోనే కాక పేరులోనూ సగ భాగాన్ని పంచిన సహృదయులు! ఆయన కథల్లో జీవం ఉంది. జీవితముంది.. ఏకబిగిన చదివించే లక్షణముంది. అన్నింటికి మించి.. కథా వస్తువు ఎంపికలో వైవిధ్యముంది.. కథాగమనంలో బరువు ఉంది.. సందర్భోచిత సన్నివేశాలు.. పాత్రలు.. పాత్రల మధ్య సంభాషణలు.. ఇందలి కథలకు బలాన్ని కూర్చాయి.. చక్కని శిల్పంతో సాగే ఈ కథలు మంచి సందేశాలను మోసుకొచ్చాయి. మనం అనునిత్యం మన చుట్టూ చూస్తున్న ఘటనలే కానవస్తాయి!
సంభాషణా శైలికి పెద్ద పీట వేసి రచయిత సదానంద్ నడిపించిన ఇందలి కథలు.. పేదల వ్యథలకు అద్దం పట్టేలా ఉన్నాయి. మూడు వంతులకు మించి ఇంకా అట్టడుగు వర్గాల బతుకులు భారమేనన్న సంగతిని గుర్తు చేస్తాయి. అందుకు కర్తలం.. పరిష్కర్తలం మనమేనని తేల్చి చెబుతాయి! ప్రభుత్వం దేశాన్ని పాలించగలదేమో కాని.. సమాజాన్ని పాలించలేదన్న సత్యం తెలిసిన రచయిత సదానంద్ సమాజాన్ని ప్రభావితం చేసేదీ.. సంస్కరించేదీ సాహిత్యం అన్న సంకల్ప బలంతో రాసిన ఈ కథలు సామాజిక చైతన్యానికి దోహదపడతాయి. మన కర్తవ్యాలను గుర్తు చేస్తాయి. సదానంద్ కథల్లో వ్యంగ్యం సున్నితంగా ఉన్నప్పటికీ.. చెప్పదలచుకున్న విషయాన్ని విలసితంగా ప్రకటించడంలో సఫలీకృతులయ్యారు. కొన్ని కథల్లో ఆయన ఉపయోగించిన తెలంగాణ భాష.. చక్కగా ఒదిగిపోయేలా శ్రద్ధ తీసుకున్నారు. వాక్యాలు మరీ పొడుగు కాకుండా.. సంభాషణలు మరీ పెద్దగా లేకుండా.. సరళమైన రీతిలో చక్కగా రూపుదిద్దడంలో రచయిత ప్రతిభ కానవస్తోంది.
ఇందలి చాలా కథల్లో దొరల పెత్తనాన్ని చూస్తాం.. జీతగాళ్ల పట్ల యజమానుల దురుసుతనాన్ని గమనిసాతం. ఇళ్లలో పనిచేసే వారి దీన గాథలను వీక్షిస్తాం!
మొట్టమొదటి ‘జాడీ’ కథలో గురవయ్య పాత్రను చూస్తే జాలేస్తుంది. దొరల పెత్తనానికి బలయ్యే గురవయ్య.. బుక్కెడు బువ్వకు.. గుక్కెడు నీళ్లకు దూరమయ్యేలా చేసే దొరసాని పాత్రను చక్కగా రూపుదిద్దారు.
‘తొక్కుడుబండ’ కథలోనూ పాపారావు, రంగమ్మలు జీతగాడు గంగన్నను బానిసగా మార్చి.. ఆడిపోసుకోవడం పాఠకులను కదిలిస్తుంది.
‘్ఫటో’ కథ ఆర్ద్రంగా మలచబడింది. లచ్చుమయ్య కథ చివరన చెత్తకుండీ దగ్గర తన ఆకలిని తీర్చుకునేందుకు గబగబా రెండు చేతులతో అందింది అందినట్లు నోట్లోకి కుక్కుకునే సన్నివేశం అందరినీ కంటతడి పెట్టిస్తుంది.
బహుమానం తేగల ఫొటోగా ఆ దృశ్యాన్ని చిత్రించడం మరీ బాధనిపించే ఘటనను కథకులు చక్కగా ఆవిష్కరించారు.
‘తులసి మొక్క’ కథలో గుర్నాథం పాత్ర ఉన్నతంగా ఉంది. అవినీతిపరుల మధ్య నీతివంతుడైన గుర్నాథం పాత్రను చూస్తే.. గంజాయి తోటలో తులసిమొక్కను తలపించేలా ఉంది.
మునిసిపల్ అధికారుల వేధింపులకు అద్దం పట్టే కథ.. ‘తలుపు చప్పుడు’. ఈ కథలో లంచాలకు ఎగబడే అధికారుల తీరుతెన్నులను కథకులు చక్కగా బంధించారు.
‘హద్దురాయి’ కథలో చిన్న దొరసాని మాటలు.. ఇతర ఘటనలు ఆధిపత్యాన్ని ప్రతిబింబించేలా ఉన్నాయి.
‘ప్రయాణం’ కథ ముగింపు బాగుంది.
‘బలం’ కథ చక్కని సందేశాన్ని అందించింది. కులాలు మతాలు మనం పెట్టుకున్నాయి. మనం ఒక్క తల్లి పిల్లలం! ఈ లోకంలో రెండే తెగలున్నాయనీ.. అవి ఉన్నోళ్లు.. లేనోళ్లు అని విడమరిచి చెప్పిన తీరు బాగుంది. ఉన్నోళ్ల ఆగడాలు సిదగకొట్టాలంటే లేనోళ్లందరూ కలిసి ఉండాలన్న.. ఎంకన్న కృష్ణవేణితో అన్న మాటలు బాగున్నాయి.
‘పనసపండు’ కథలో తండ్రి తన కోసం తెచ్చే పనస పండు కోసం సింహాచలం ఎదిరిచూసే సన్నివేశం రూపకల్పనలో కథకుని నైపుణ్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేము!
‘పండగ నవ్వు’ కథ ముగింపులో.. చలపతి తన భార్య వినతితో చెప్పే మాటలు పాఠకులను కదిలిస్తాయి.
పశుబలంతో, ధన, అధికార గర్వంతో విర్రవీగే వాళ్లను ఏదో ఒకరోజు ప్రజలే శిక్షిస్తారన్న సందేశంతో రాయబడిన ‘మంత్రి కొడుకు’ కథ ఆసక్తికరంగా మలచబడింది.
‘ఉప్పునీళ్లు’ కథలో బాధనంతా రెప్పల మాటున దాచుకుని ఉన్న కమలను చూస్తే అందరి హృదయాలు ద్రవిస్తాయి. దేవాలయ ప్రవేశ ఘట్టం ఆమెకు బాధను కలిగించేలా ఉంది.
‘ఇంటి వెలుగు’ కథలో పెళ్లాం మీద మొగుడికి.. మొగుడికి మీద పెళ్లానికి ప్రేమ వుంటేనే.. ఇంట్లో అసలైన వెలుగుంటుందని కథకులు తెలియజెప్పిన తీరు బాగుంది. ఈ కథలో ముత్తాలు, ముత్యాలుల మధ్య కొనసాగే ప్రేమ సన్నివేశాలు రమణీయంగా ఉన్నాయి.
‘ఆయా’ కథలో శాంతమ్మ పాత్ర చక్కగా వొదిగిపోయింది.
పేదవాళ్లను చులకన చేయడం, అసహ్యించుకోవడం.. తిట్టడం సంస్కారమనిపించుకోదన్న సందేశంతో ‘పిచ్చుక’ కథ రాయబడింది. పనిమనుషుల పట్ల ఎలా ఉండాలో చక్కని సందేశం ఈ కథ అందించింది.
ఈ గ్రంథంలో మరో మంచి కథ ‘మురికి’. ఈ కథలోని సన్నివేశాలు.. సంఘటనలు.. సంభాషణలు పాఠకులను ఆకట్టుకునేలా ఉన్నాయి.
పేదరికం రూపుమాపడం దీర్ఘకాలిక చర్య అయినప్పటికీ.. చేతనైనంత తోటి వారికి సహాయం చేయడమే తక్షణ కర్తవ్యం అని గుర్తు చేసే ‘అందమైన వెనె్నల’ కథలో కథకుడి ప్రతిభ కానవస్తోంది. భిక్షగా భావించక సహాయంగా ఇస్తే బాగుంటుందన్న మంచి విషయాన్ని ఈ కథ ద్వారా చెప్పడం బాగుంది.
పేదలను అసహ్యించుకునే కనకారావుకు ఆయన కూతురు ద్వారా జ్ఞానోదయం కలిగించడాన్ని ‘స్పందన’ కథలో చూస్తాం.
ఇలా ఎన్నో కథలు.. ఉదహరించడానికి వీలుగా ఈ గ్రంథంలో ఉన్నాయి. ఈ కథలు జీవితంలోని వెలుగులనే కాక చీకటులను ప్రతిబింబింపజేస్తాయి. కథకులు సదానంద్ - జీవితంలోని సుఖాలనే కాక.. దుఃఖాలను స్పృశించగలిగారు. మధ్యతరగతి జీవితాలను బలంగా ఆవిష్కరించారు. పల్లెల్లో వ్యవస్థీకృత రంగానికి చెందిన శ్రామికుల పట్ల కాస్తంత ప్రేమను కథకులు సదానంద్ ప్రదర్శించడం ప్రశంసనీయం. పేదల వ్యథలకు అద్దం పట్టడమేగాక.. వారు తిరుగుబాటుకు సన్నద్ధమయ్యేలా కథలను రూపుదిద్దడం విశేషం.

-దాస్యం సేనాధిపతి