అక్షర

దళిత సాహిత్య చరిత్రను తిరగరాయాల్సిందే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొలి తెలుగు
దళిత కథాయిత్రి
తాడి నాగమ్మ కథలు-రచనలు
సంపా: సింగిశెట్టి శ్రీనివాస్
వెల్దండ శ్రీ్ధర్
సబాల్టర్న్ రీసెర్చ్ సెంటర్
హైదరాబాద్
వెల: రూ.200
పేజీలు: 104
ప్రతులకు: 98492 20321
*
తొలి కవయిత్రి కుప్పాంబికను, తొలి తెలుగు కథా రచయిత్రిగా బండారు అచ్చమాంబను వెలుగులోకి తెచ్చిన నిరంతర పరిశోధకుడు సంగిశెట్టి శ్రీనివాస్, ఈసారి తొలి దళిత కథా రచయిత్రిగా తాడి నాగమ్మను గుర్తించి, ఎంతగానో శ్రమించి ఆమె రచనలను, ఆమె జీవిత విశేషాలను సేకరించి పుస్తక రూపంలో తీసుకువచ్చారు.
తాడి నాగమ్మ తూర్పు గోదావరి జిల్లాలో రాజోలు తాలూకా ఆదుర్తి గ్రామంలో జన్మించింది. మాలపల్లిలో పుట్టి విద్యావంతురాలైంది. దళితులలో విద్యా చైతన్యాన్ని తీసుకురావడానికి పని చేసింది. సమకాలీన సామాజిక, రాజకీయ ఉద్యమాల నేపథ్యంలో రచనా రంగంలోకి అడుగుపెట్టింది. ఆమె రచనల పూర్తి వివరాలు తెలియక పోయినప్పటికీ పరిశోధకుడు శ్రమించి, ఎంతో కష్టం మీద తాడి నాగమ్మ రాసిన నాలుగు కథలు, ఒక నాటిక, మూడు వ్యాసాలను సేకరించగలిగారు. అందులో మొదటి కథ ‘ఇంకెక్కడి జయము’. ఇందులో తండ్రి చనిపోవడంతో, యూనివర్సిటీ విద్య చాలించి మహేశ్వర చంద్రుడు తమ సంస్థానానికి అధిపతిగా పట్ట్భాషిక్తుడవుతాడు. ఇరవై యేళ్ళ చిన్న వయసులోనే ఆ ప్రాభవమును చూసిన మహేశ్వరుడు అనుభవము లేక పాశ్చాత్య అనుకరణతో, కీర్తి కాంక్షతో విపరీత ఖర్చులు, దాన ధర్మాలు చేసి దివాలా తీస్తాడు. చివరికి బతకడం కోసం జట్కా బండి తోలుకుని కడుపు నింపుకునే పరిస్థితి వస్తుంది. తమను తాము ఉన్నతులుగా భావించుకుని, తమ స్థాయిని మరిచి ప్రవర్తిస్తే, అసలుకే మోసం వస్తుందని ఈ కథ హెచ్చరిస్తుంది. అప్పటి కింకను గాంధీ ఇర్విన్ సంధి జరుగలేదనే వాక్యముతో ‘ఒక ముద్దు’ కథ ప్రారంభమవుతుంది. అంటే 1930ల ముందటి సంగతి అన్న మాట. శాసనోల్లంఘనలో భాగంగా విదేశీ వస్తు బహిష్కరణ కొనసాగుతుంది. ఒక పద్దెనిమిది ఏళ్ల యువతి అంకిత భావంతో ఆ ఉద్యమంలో పాల్గొని ప్రచారం చేస్తుంటుంది. ఒక పట్టణంలో బహిష్కరణాస్తమ్రు పని చేయడం లేదని విని ఆ యువతి అక్కడికి బయలుదేరుతుంది. అక్కడ కనిపించిన విలాస యువకుడికి విదేశీ వస్తమ్రులు కొనవద్దని, వాటి లాన నష్టాల గురించి వివరిస్తుంది. దానికి ఆ యువకుడు విలాసంగా, ఎగతాళిగా నీవు ఒక ముద్దిచ్చినచో, నేను స్వదేశీ దీక్షను అవలంబించనంటాడు. దానికి ఆ యువతి ‘నా కిద్దరు అన్నలు ఉన్నారు. అనుదినము నన్ను ముద్దిడుకుని ఆశీర్వదించి శాంతి సమరమునకు పంపుతున్నారు. విదేశీ వస్తు వ్యామోహంలో పడి కొట్టుకుపోతున్న సోదరుడ్ని రక్షించాల్సిన అవసరముంది. నీవు నా మూడవ తోబుట్టువువు. అన్నా! రమ్ము. ఒకటి కాదు వలసినన్ని గొనుము’ అనడంతో ఆ యువకుడు నిశే్చష్టుడై పోతాడు. ఉద్యమకారులకు వుండాల్సిన సమయస్ఫూర్తిని, త్యాగనిరతిని ఈ కథ తెలియజేస్తుంది. కెయిన్ లాంగ్ జపాన్ దేశీయుడు. రాజరికమును పెంపొందింపజేయుటకై స్థాపింపబడిన సంఘమునకు ఉపాధ్యక్షుడు. సిసీలియా ఇంపీరియలిజమును నాశనం చేసి, కమ్యూనిజంను వ్యాపింపజేయ సమకట్టిన రహస్య విప్లవ సంఘము యొక్క కొరియా దేశాల శాఖకు అధ్యక్షురాలు. రెండు శత్రు శిబిరాలకు చెందిన ఈ యువతీ యువకుల మధ్య ఏర్పడిన ప్రేమ బంధం ఎలా విషాదాంతం అయిందో తెలుసుకోవాలంటే ‘సందిగ్ధము’ కథ చదవాల్సిందే. ‘ప్రేమ సమస్య’ కథలో మేరీ కోటీశ్వరుడైన ఒక యూదుని కుమార్తె. సహాధ్యాయి, జర్మన్ సేనాని కుమారుడైన ఆల్బర్ట్‌ను ప్రేమిస్తుంది .అతని ఆర్థిక ఇబ్బందుల్లో ఆదుకుంటుంది. జర్మన్ నాయకుడిగా వచ్చిన హిట్లర్ యూదులను చిత్రహింసలు పెట్టడంతో అనేకులు విదేశాలకు పారిపోతారు. యూదులతో సంబంధాలను పెట్టుకున్న వాళ్లను కూడా శిక్షించేవారు. ఆ భయంతో ఆల్బర్ట్ ఆమెకు దూరం కాగా, నాజీలకు చిక్కిన మేరీ భూగృహంలో బందీగా నానా హింసలు పడి మరణిస్తుంది. ప్రతి కథలనూ ప్రపంచ చరిత్ర - ప్రపంచ రాజకీయాల పరిశీలన గావించడం విశేషం. చివరి రెండు కథలు విదేశీ నేపథ్యంలో రూపొందడం వల్ల అది సహజమే అనిపిస్తుంది. కాని మొదటి కథలో మహేశ చంద్రుని విదేశీ యాత్రను పురస్కరించుకుని, రెండవ కథలో స్వాతంత్య్రానికి సంబంధించి ప్రపంచ చరిత్రను తెలియజేయడం కనిపిస్తుంది. వర్ణ వ్యవస్థ గురించి ‘సందిగ్ధం’ కథలో ‘తెల్ల జాతులు తేజరిల్లుటకును, వర్ణ జాతులు వంగి తిరుగుటకును సృష్టింపబడినవని నమ్మువారెందరు లేరు?’ అని ప్రశ్నిస్తారు. అలాగే ‘ప్రేమ సమస్య’లో ‘నరకమనునది ఎచ్చటనో లేదు. యూదులకు జర్మనీ దేశము నరకము. నీగ్రోలకు అమెరికా దేశము నరకము. భారతీయులకు దక్షిణాఫ్రికా నరకము. మాలలకు హిందూ దేశమే నరకము’ అని తమ నిశ్చితాభిప్రాయాన్ని తెలియజేస్తారు. ఈ కథలన్నీ 1934-37 మధ్యకాలంలో వచ్చినవే.
ఇక నాటిక గురించి. తను తప్ప ఇతరులెవరూ బాగుపడవద్దనుకునే స్వార్థపరుడు, సంకుచిత హృదయుడు రమణారావు. ఇతరుల అవకాశాలను, జీవితాలను నాశనం చేసి తన భవిష్యత్తును నిర్మించుకుంటాడు. చివరకు ‘సమాధులపై సౌధమును నిర్మించవద్దు’ అనే గుణపాఠాన్ని నేర్చుకుంటాడు. ఈ నాటికతో పాటు మూడు వ్యాసాలు కూడా ఇందులో వున్నాయి. ‘స్ర్తి నగౌరవపరచి హింసించిన వ్యక్తి గాని, సంఘము గాని, జాతిగాని, మతము గాని, రాజ్యము గాని, మహా సామ్రాజ్యము గాని ఈ పృథ్విపై వర్థిల్లుట వట్టిది ‘స్ర్తి కన్నీటి’చే విశ్వమే కరిగిపోవును’ అని ఒక వ్యాసంలో తెలియజేస్తారు. కాలము మారిన కొలది, విజ్ఞానము పెరిగిన కొలది ‘మానవుల సంబంధములు’లో వచ్చిన, వస్తున్న మార్పులను వివరించడం మరో వ్యాసంలో కనిపిస్తుంది. విజ్ఞానం వలన సమకూరిన సాధనా సంపత్తి, ఆయుధాల తయారీ మానవ వినాశనమునకు దారి తీయడం విచారకరమని మరో వ్యాసంలో తెలియజేశారు. తులనాత్మక విశే్లషణతో కూడిన ఈ వ్యాసాలు విజ్ఞాన దాయకంగా ఉన్నాయి. మొత్తానికి స్ర్తివాద చరిత్రను, దళిత సాహిత్య చరిత్రను తిరగరాయాల్సిన అవసరాన్ని ఈ పుస్తకం సూచిస్తుంది. భవిష్యత్తులో తాడి నాగమ్మ రచనలను వెలికి తీయడంలోనూ, ఆమెపై పరిశోధనలు గావించడానికి గాను, ఈ పుస్తకం ప్రధాన ఆధారంగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

-కె.పి.అశోక్‌కుమార్