అక్షర

దిక్పతుల కథల కరదీపిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అష్ట దిక్పాలక వైభవం
-వక్కంతం సూర్యనారాయణరావు
పుటలు: 456
వెల: రూ.395
ప్రతులకు: ప్రిజం బుక్స్ ప్రైవేట్ లిమిటెడ్
1-1-728/ఎ, స్ట్రీట్ నెం.10
గాంధీనగర్
హైదరాబాద్-500 080

** ** ** **

వ్యాస భగవానుడు మనకు అందించిన వాఙ్మయ ప్రపంచంలో పురాణ సముదాయం కూడా ప్రముఖమైనదే. 18 పురాణాలు, 18 ఉప పురాణాలు - మొత్తం కలిపి 36. ఆ 36 పురాణాలలోని అసంఖ్యాక పాత్రలు, వాటి వృత్తాంతాలలోని విలక్షణతలు, విభిన్నతలు పరిశీలిస్తుంటే అంత అద్భుత పురాణ కథా సాహిత్యం ప్రపంచంలో మరెక్కడా లేదనిపిస్తుంది - పాశ్చాత్యములైన గ్రీకు మొదలైన పురాణ వాఙ్మయ వైశాల్యంతో పోల్చినా కూడా.
మన ప్రాచీన పౌరాణిక వాఙ్మయంలో కనిపించే ఇంద్ర, అగ్ని, యమ, వాయు, ఈశానాది అష్ట దిక్పాలకుల చరిత్రలను దాదాపు సంపూర్ణంగా సరళమైన శిష్ట వ్యావహారిక వచనంలో వక్కంతం సూర్యనారాయణరావు ‘అష్టదిక్పాలక వైభవం’ అనే పేరుతో పురాణ వాఙ్మయాభిలాషులైన వారికి సంతృప్తి, సమ్మోదాలను కలిగించే రీతిలో అందించారు.
సగటు విద్యావంతులకు తెలియని అనేక పౌరాణికమైన, అభిరుచి ప్రవర్థకాలైన అంశాలు చాలానే ఉన్నాయి ఇందులో.
పెద్ద బాలశిక్ష, పాతకాలపు ఎక్కాల పుస్తకాల ద్వారా మాత్రమే తెలుసుకోగలిగే అష్టదిక్పాలకుల భార్యల పేర్లు, రాజధానులు, వాహనాలు వంటివే కాకుండా అవన్నీ ఆ దిక్పాలకులకు ఎలా ఏర్పడ్డాయి అనే విషయ వివరణలు చాలా విస్తారంగాను, ఒక నవల చదువుతున్నంత పఠనానుభూతి కలిగే విధంగాను రాశారు రచయిత.
ఎన్నో ఆసక్తికరమైన, వౌలికమైన వృత్తాంత విశేష కథామాలికలాగే పుస్తకం మొత్తం ఒక పఠనీయ ఆకర్షణతో పాఠకుడిని ముందుకు లాగుతూ సాగిపోతుంది.
‘రావణుడి కరవాలం మెరుపులా కదిలింది. యక్షుడి తల మొండెం నుండి వేఱై పోయింది. రావణుడి ఆగ్రహాన్ని, అహంకారాన్ని అవ్యక్తమైన అక్షరాలతో లిఖిస్తున్నట్టు యక్షుడి రక్తం నేల మీద చిమ్మింది’ అనటంలోని ఉపమాలంకారం ఈ రచనలోని అలంకార పోషణా ధోరణికి ఒక ఉదాహరణ.
‘బాల వైశ్రవణుడు పాకుతూ కాలాన్ని కొలత వేశాడు. దోగాడుతూనే కాలాన్ని కొలత వేశాడు. పడుతూ లేస్తూ, ఆడుతూ పాడుతూ కాలగణన చేశాడు. ఉగ్గుబాలతో, గోరుముద్దలతో అమ్మ అందించే మంచిమంచి విషయాలను ఆకళింపు చేసుకున్నాడు.’ లాంటి భావ సౌందర్య, లాలిత్య పూర్వక వాక్యాలు అక్కడక్కడ తళుక్కుమన్నాయి.
అక్షర దోషాలు, అచ్చుతప్పులు చాలా చోట్ల ఉన్నాయి. - ఇలాంటి వాటి వల్ల వాక్యార్థం ఇబ్బందిలో పడిపోయింది చాలా చోట్ల. ఉదాహరణకు 301వ పుటలో ‘సాగర గర్భంలో మందిరంలో నిర్మించమని విశ్వకర్మను ఆదేశిస్తాను’ అని ఉంది. ఇక్కడ మందిరం అని మాత్రమే ఉండాలి. ఆ తర్వాతి ‘లో’ అనవసర ప్రత్యయాగమనం.
ప్రచురణపు తొందరలోనైనా ఇలాంటి పొరపాట్లు సమర్థనీయాలు కావు.
మొత్తం మీద ఈ పుస్తకం పురాణ వాఙ్మయాభిలాషులకు ఒక కమనీయ కరదీపిక.

-శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం