అక్షర

కొన్ని విజయాలు... మరి కొన్ని అనుభవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏడు దశాబ్దాలు సిద్ధాంతంతో నా ప్రయాణం
-యస్.వి.శేషగిరిరావు
వెల: రూ.300 పుటలు: 272
ప్రతులకు: రచయిత
2-2-1137/3/ఇ/1
న్యూనల్లకుంట హైదరాబాద్-44.

*** **** *******

శేషగిరిరావు జడ్చర్ల ప్రాంతంలో ఇసుక తవ్వకాల వల్ల కలిగే నష్టాలను గణాంకాలతో వివరిస్తూ చేసిన రిపోర్టు ఆలోచించదగింది. (178). ఉస్మానియా విశ్వవిద్యాలయం భూముల పరిరక్షణ విషయంలో,
గిరిజన భూములను గిరిజనేతరులు ఆక్రమించుకోకుండా తగిన చట్టాలు తయారుచేయడంలో (184) శేషగిరిరావు పాత్ర
ప్రశంసనీయం. అల్ కబీర్ పశువధ కర్మాగారం ఎత్తివేయడం కోసం (185)లో 20వేల మందితో చేసిన పోరాటం వల్ల అంది వచ్చిన మహదవకాశాన్ని భారతీయ జనతా పార్టీ చేజేతులా కోల్పోయిన తీరును వివరించారు.

ఆచార్య ఎస్.వి.శేషగిరిరావు ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి (1956-58). భూభౌతిక శాస్త్ర శాఖలో అగ్రశ్రేణికి చెందిన విశిష్టాచార్యులు. మాస్కోలో, ఇటలీలో పరిశోధనలు చేశారు. ఉస్మానియాలో సమర్పించిన వారి సిద్ధాంత గ్రంథానికి లండన్ విశ్వవిద్యాలయ ఆచార్యులు మూల్యాంకనం చేశారు. (ఇప్పటి పిహెచ్‌డి పరిశోధకులు దీన్ని ప్రత్యేకంగా గమనించాలి.) అఖిల భారత విద్యార్థి పరిషత్ వ్యవస్థాపకులలో ఒకరు. జనసంఘ్, బిజెపి రాజకీయాలను విశ్వసించినవారు. 1956 నవంబర్ 1న హైదరాబాద్‌లోని ఫతేమైదాన్‌లో ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావాన్ని చూసిన కళ్లతోనే 2014 ఫిబ్రవరి 20 రాత్రి తెలంగాణ రాష్ట్రోదయ ప్రకటనను చూసిన వ్యక్తి. అంతేకాదు, 1936లో జన్మించిన శేషగిరిరావు 1947లో దేశానికి స్వాతంత్య్రం రావడాన్ని చూశారు. దేశ విభజనకు ముందున్న ఇండియా చిత్రపటాన్ని నేటికీ భద్రంగా దాచుకున్నవారు, బుద్ధి తెలిసిన 1947 నుండి నేటిదాక డెబ్బయ్యేళ్ల రాష్ట్ర పరిణామాలను, తన సిద్ధాంత నిబద్ధతను ఈ గ్రంథంలో చిత్రించారు. అధికారులు, ఆచార్యులు, సిద్ధాంతాలకు, సత్యనిష్ఠకు, విలువలకు తిలోదకాలిచ్చి తాత్కాలిక లాభాపేక్షలకు, ఉద్వేగాలకు లొంగిపోయిన సంగతులను మొహమాటం లేకుండా ఈ గ్రంథంలో శేషగిరిరావు పేర్కొన్నారు. ఒక రాజకీయ సిద్ధాంతానికి నిబద్ధులైన వారు తమ వారిని చాలా గొప్పగాను, అవతలి వారిని చాలా తక్కువగాను చిత్రించడం గమనిస్తాం. కాని శేషగిరిరావు బిజెపి అవలక్షణాలన్నింటిని బాహాటంగానే రాశారు. మాతృభూమికి సేవ చేయడానికి చిత్తశుద్ధితో ప్రయత్నించిన వారందరిలో చివరి దశలో కనిపించే నిర్వేదం వీరిలో కూడ కనిపించడం సహజమే (పుట.258), బిజెపికి ఒక సైద్ధాంతిక యోగదానాన్ని శేషగిరిరావు చేశారు. కాని ఎన్నికలకు, పదవులకు దూరంగా (పుట.226) ఉండి సలహాలిస్తే గెలిచిన వాళ్లు ఒక సిండికేటుగా మారి కొత్తవాళ్లను ఎదగనివ్వరని అర్థమయ్యేసరికి పుష్కర కాలమైందని శేషగిరిరావు చెప్పుకున్నది వాస్తవమే (230) తెలంగాణే కాదు, అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో కూడ బిజెపి ఒక దిక్సూచి లేని నావనే (243). బద్దం బాల్‌రెడ్డి, ఏలె నరేంద్ర, ఎన్.ఇంద్రసేనారెడ్డి లాంటి వాళ్లను ఏనాడు బిజెపి ఎదగనీయలేదు.
1956 జూన్ 25న ఉస్మానియా యూనివర్సిటీ ఎం.ఏ. (గణితం)లో చేరిన, శేషగిరిరావు పుస్తకాలు లభించక గురువులను అడుక్కొని పుస్తకాలకు పుస్తకాలను ఎత్తి రాసుకున్నారు. అలాంటి వ్యక్తి జీవిత చరమాంకంలో ఎంతో ప్రాణప్రదంగా దాచుకున్న ఎన్నో అపురూపమైన సాహిత్య, సామాజిక వైజ్ఞానిక గ్రంథాలను సోమేపల్లి సోమయ్య గ్రంథాలయానికి ఇచ్చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ విస్తరణకు తోడ్పడ్డారు. తెలంగాణ గ్రామాలను తిరిగారు. భువనగిరి దగ్గర మేడిచర్ల గ్రామంలో ఒక ఇంట్లో భోజనం చేసి అనాలోచితంగా మజ్జిగ ఉందా అని అడిగి ఆ కుటుంబాన్ని నొప్పించానని (పు.49) నిజాయితీగా రాసుకున్నారు. ఇది చాలా చిన్న సంఘటనే కావచ్చు. ఇలాంటి చిన్నచిన్న విషయాలే మనిషిలోని ఆర్ద్రతకు, సెంటిమెంటుకు, ఆలోచనా సరళికి, ఉదాత్తతకు నిదర్శనాలుగా నిలుస్తాయి.
సప్రమాణమైన రీతిలో, దేశ కాలమాన స్థితులకు అనుగుణంగా చేసిన తమ ప్రతిపాదనలు, తీర్మానాలు ఆయా సంస్థలకు ఎంతగానో ఉపయోగపడాయన్న సంతృప్తిని శేషగిరిరావు పొందారు. అలాంటి వాటిలో కొన్ని. 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం చెలరేగిపుడు హైదరాబాద్‌లో కేంద్రీయ విశ్వవిద్యాలయం నెలకొల్పాలనీ, అందులో తెలంగాణతోసహా అన్ని జిల్లాల వారికి ప్రవేశావకాశాలు ఉండాలనీ, ఉస్మానియాలో తెలంగాణ వారికే అవకాశముండాలని శేషగిరిరావు చేసిన తీర్మానం అందరి ప్రశంసలు పొందడమే కాక హైదరాబాద్‌లో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటుకు కారణమైంది. (పు.87) ఉస్మానియా విశ్వవిద్యాలయంలో శాశ్వత అధ్యక్షులు కాకుండా రొటేషన్ హెడ్స్‌తో ప్రజాస్వామిక వాతావరణం ఏర్పడాలని చేసిన తీర్మానం ప్రకారమే 1984 నుండి రొటేషన్ హెడ్స్ పద్ధతి వచ్చింది. (142). ఎమర్జెన్సీలో జైలుపాలయిన 250 మంది ఎబివిపి విద్యార్థుల భవిష్యత్తు పాడుకాకుండా ఉస్మానియా విశ్వవిద్యాలయ అధికారులను ఒప్పించి జైల్లోనే పరీక్షలు నిర్వహింపజేసిన ఘనత శేషగిరిరావుకు దక్కింది. (పు.123). 1997 జులైలో కాకినాడ కార్యవర్గ సమావేశంలో కొందరు ప్రముఖ తెలంగాణ నాయకులు వ్యతిరేకించినా ఆంధ్రప్రదేశ్‌ను రెండు రాష్ట్రాలుగా విభజించాలన్న స్పష్టమైన తీర్మానాన్ని బంగారు లక్ష్మణ్‌తో కలిసి తయారుచేసే బాధ్యత వీరు నిర్వర్తించారు. (పు.215)
రాష్ట్రంలో ఎబివిపి ఎదిగిన తీరు, ఘర్షణలు, నక్సలైట్ స్థావరంగా మారిన వరంగల్ ఇంజనీరింగ్ కాలేజీ (130) మొ. ఉదంతాలను నమోదు చేశారు. ఆఖరుకు ఎబివిపి కార్యకర్తలు ఎం.ఎల్.ఏ లుగా ఎదగలేక పోవడానికి ఆర్‌ఎస్‌ఎస్ బిజెపిలో రగిలిన అసూయలు, స్వార్థ ప్రయోజనాలు, ముఠా తత్త్వాలు శేషగిరిరావు గారికి ఆశ్చర్యంతోపాటు బాధను కలిగించాయి.
శేషగిరిరావు జడ్చర్ల ప్రాంతంలో ఇసుక తవ్వకాల వల్ల కలిగే నష్టాలను గణాంకాలతో వివరిస్తూ చేసిన రిపోర్టు ఆలోచించదగింది. (178). ఉస్మానియా విశ్వ విద్యాలయం భూముల పరిరక్షణ విషయంలో, గిరిజన భూములను గిరిజనేతరులు ఆక్రమించుకోకుండా తగిన చట్టాలు తయారుచేయడంలో (184) శేషగిరిరావు పాత్ర ప్రశంసనీయం. అల్ కబీర్ పశువధ కర్మాగారం ఎత్తివేయడం కోసం (185)లో 20వేల మందితో చేసిన పోరాటం వల్ల అంది వచ్చిన మహదవకాశాన్ని భారతీయ జనతా పార్టీ చేజేతులా కోల్పోయిన తీరును వివరించారు. (187) గోదావరి జలాల సద్వినియోగం గురించి శేషగిరిరావు ఎంతో చిత్తశుద్ధితో విలువైన సూచనలు చేశారు. వాటికి వామపక్ష నేతలు కూడా ప్రశంసించడం గమనార్హం. హిందూ దేవాలయాల భూములను కబ్జాలు చేయడాన్ని హిందూ దేవాలయాల దగ్గర అన్య మత ప్రచారాలు సాగించడాన్ని ఖండిస్తూ ఉద్యమాలు చేశారు.
ఒక నాయకుని పేరు లేదని ఒక జిల్లా 50 వేల కరపత్రాలను, రెండు వేల పోస్టర్లను వెనక్కి పంపిస్తే మళ్లీ రాత్రికి రాత్రే ముద్రించి పంపించాల్సి వచ్చిందట. సదరు నాయకుడు ఒక శుభ ముహూర్తంలో పార్టీకి గుడ్‌బై చెప్పాడని (203) మొహమాటం లేకుండా శేషగిరిరావు ప్రస్తావించారు. ‘ఇగో’కు ఎంతటి వారలైన దాసులే కదా.
1996 తర్వాత బిజెపిలోకి పెద్ద ఎత్తున వలస వచ్చిన వారందరూ పదవులనుభవించి పార్టీకి గుడ్‌బై కొట్టినవారేనని శేషగిరిరావు ఇచ్చిన పట్టిక చూస్తే (228) పదవీ లాలస, సిద్ధాంత నిబద్ధతను ఎలా మింగేస్తుందో తెలుస్తుంది. ఆఖరుకు ఎన్నికల వేళ (1996, 1998, 1999 సం.లో) నక్సలైట్లకు ముడుపులు చెల్లించిన వారిలో వామపక్ష భావజాలాన్ని బలంగా వ్యతిరేకించే బిజెపి వ్యక్తులు కూడా ఉన్నారట. తెలంగాణ ఉద్యమం తీవ్రంగా సాగుతున్న వేళ వామపక్ష భావజాలాన్ని సమర్థించే తెహల్కా తరుణ్ తేజ్‌పాల్ పన్నిన కుట్రలో చిక్కి బంగారు లక్ష్మణ్ మానసిక క్షోభతో జైలుపాలయి ఎలా చనిపోయాడో హృదయ విదారకంగా వివరించారు.
1969లో ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ ఉద్యమం 1872లో జై ఆంధ్ర ఉద్యమం సమయంలో అందిన సువర్ణావకాశాన్ని ఎందుకు అనుకూలంగా వినియోగించుకోలేక పోయిందో ఇప్పటికీ అర్థం కావడం లేదన్నారు. (పు.91) ఏముంది. ఇందులో? ఇందిరా గాంధీలో ఉన్న దృఢ నిశ్చయం అంతే! ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా శేషగిరిరావు తాము తయారుచేసిన సుశిక్షితులైన ఎబివిపి కార్యకర్తలతో సాగించిన ఉద్యమం కోసం అప్పుడప్పుడూ ఇంట్లోని ఖరీదైన వస్తువులమ్మేసి అజ్ఞాత కార్యకర్తల ఖర్చు కోసం ఇచ్చిన ఆసక్తికరమైన వివరాలు (పు.124) వారి నిబద్ధతను తెలియజేస్తున్నాయి.
కమ్యూనిజం పూర్తిగా ఆచరణలోకి తేబడిన రష్యా ఎందుకు విఫలమైందో విశే్లషించుకొనే అవసరం లేదా. (పు.139) 1991లోనే లెనినిజం అస్తమించింది. (పు.138) అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం కొనసాగే ప్రక్రియ. అభివృద్ధి పనులకు హింస ప్రతిబంధకం. అభివృద్ధే నక్సల్స్ ధ్యేయమైతే కోట్లాది ప్రజాధనంతో ఏర్పడిన ప్రజా సౌకర్యాలను ఎందుకు ధ్వంసం చేస్తారు? తుపాకితో జడిపించి ఎన్నికలను బహిష్కరించాలనే హక్కు వీరికి ఎవరు ఇచ్చారు? మానవ నైజంలో ఈర్ష్యా ద్వేషం, అసూయ, కామం, క్రోధం, అహంకారాలు ఏ యుగంలోనైనా ఏ వ్యవస్థలోనైనా అంతర్భాగాలు. మార్క్సిజం, మావోయిజం వాటికి అతీతాలు కావు. (పు.130) అని శేషగిరిరావు మాటలు కరెక్ట్ అని చరిత్ర నిరూపించింది.
ఇందిరాగాంధి హత్యతో తలెత్తిన సానుభూతి పవనాలు కారణంగా అనూహ్యమైన మెజారిటీలో రాజీవ్‌గాంధీ ప్రధాన మంత్రి అయ్యారు. రాజీవ్‌గాంధీ ప్రధానమంత్రి అయిన సందర్భంలో (1985 జనవరి) రాసిన ఒక వ్యాసంలో శేషగిరిరావు రెండు మూడేళ్లలో బ్రహ్మాండమైన ప్రజా ఉద్యమాన్ని ఎదుర్కోవలసి వస్తుందని చెప్పినపుడు అందరూ ఆశ్చర్యపోయారు. కానీ బోఫోర్స్ కుంభకోణం రాజీవ్‌ను ఉక్కిరిబిక్కిరి చేయనే చేసింది. (పు.173)
మానవ మనుగడ కోసం, మానవత్వ వికాసం కోసం ఆవేదనతో తపనతో శేషగిరిరావు కర్తవ్య పథాన నడిచారు అని అన్న ఒక అభిమాని అభిప్రాయం వాస్తవం. (పు.191) శేషగిరిరావు ధన్యజీవి. ఇంత గొప్ప వ్యక్తి ఉస్మానియాలో పని చేసినా నేను పరిచయం చేసుకోలేక పోవడం నా దురదృష్టం. అబద్ధాలతో అసూయలతో స్వార్థ ప్రయోజనాలతో పోరాడటం అంత సులభం కాదు. సత్యమే జయిస్తుందన్న విశ్వాసమెంత ఉన్నా అసత్యం కూడా జయిస్తున్నదే అన్న అభిప్రాయం (అది భ్రమ కావచ్చు) కూడా అనుభవంలోకి వస్తుంది. ఈ రోజు అబద్ధం సర్వాంతర్యామియై ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నది. (పు.8, 193) అన్న శేషగిరిరావు మాటలు వారి వయస్సుకు, వర్తమాన సమాజ గమనానికి దర్పణం పడ్తున్నాయి. చదువదగిన జీవితచరిత్ర ఇది.

-వెలుదండ నిత్యానందరావు