అక్షర

పీడితుల గొంతుక.. కాళోజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ బిడ్డవు రోరి, తెలుగు మాట్లాడుటకు
సంకోచ పడెదవేల, సంగతేమిటరా?
అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదనుచు
సకలించు ఆంధ్రుడా, చావేటికిరా’ అని మనలను ఏనాడో హెచ్చరించిన సిసలైన తెలంగాణ కవి కాళోజీ. తెలంగాణ ప్రజల ఆర్తి, ఆవేదన, ఆగ్రహం ఆయన గేయాల్లా మనకు కనబడతాయి. తెలంగాణ భాషకు, యాసకు బాసటగా నిలిచిన నిలువెత్తు మనిషి కాళోజీ. ఆయన వర్ధంతి నేడు. తెలంగాణ ఉద్యమ ప్రస్థానానికి పెన్నిధి. నా గొడవకు సారధి, తొలి, మలి దశలకు వారధి అయిన కాళోజీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. కాళోజీ గొడవంతా తెలంగాణ ప్రజల కోసమే. అన్యాయాన్ని ఎదిరిస్తేనే నా గొడవకు సంతృప్తి. అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి. ప్రాప్తి. అన్యాయాన్ని ఎదిరించినోడే నాకు ఆరాధ్యుడు అని సగర్వంగా ప్రకటించిన ధీరోధాత్తుడు కాళోజీ. 1914 సెప్టెంబర్ 9న కర్నాటకలోని బీజాపూర్ జిల్లాలోని రట్టహళ్లి గ్రామంలో కాళోజీ జన్మించారు. వీరి తండ్రి వరంగల్ జిల్లాలో మడికొండలో స్థిరపడ్డారు. కాళోజీ నారాయణ రావు తెలుగు, ఉర్దూ, మరాఠీ, హిందీ, కన్నడ, ఇంగ్లీషు భాషల్లో నేర్పరి. రాజకీయ వ్యంగ్య కవిత్వం రాయడంలో దిట్ట. ‘నా గొడవ’ పేర సమకాలీన, సామాజిక సమస్యలపై నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా, స్పందిస్తూ పాలకులపై అక్షరాయుధాలను సంధించి ప్రజాకవిగా కీర్తి గడించారు. కాళోజీ గొడవంతా సగటు మనిషిదే. 1969లో తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఆయన కవితలు ఉత్తేజకరంగా ఉండేవి. తెలంగాణ వేరైతే, దేశానికి ఆపత్తా? తెలంగాణ వేరైతే తెలుగు బాస మరుస్తారా? అనీ రాశారు. ‘బడి పలుకుల భాష వద్దు, పలుకుబడుల భాష కావాలి’ అనేవారు కాళోజీ. రజాకార్ల వ్యతిరేక పోరాటాల్లో పాల్గొని ఎన్నోసార్లు జైలుకు వెళ్లారు. ‘పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది’ అనే కవితా పంక్తులు ఆయన జీవితానికి, వ్యక్తిత్వానికి దర్పణం పడుతున్నాయి. ‘సాగిపోవుటె బ్రతుకు, ఆగిపోవుటే చావు, సాగిపోదలచిన ఆగరాదిచటెపుడు?’ అనేవారాయన. ‘అవనిపై జరిగేటి అవకతవకలు చూచి, ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు?’ అని తనకూ కొంత బలముంటే ఏమైనా చేయాలన్న తెగువనూ పట్టిచ్చే ధ్వని ఈ కవితలో కన్పిస్తుంది. అన్నపు రాసులు ఒకచోట, ఆకలిమంటలు ఒకచోట, హంసతూలికలొకచోట, అలసిన దేహాలొకచోట’ అని ధనిక, పేద వర్గాల మధ్య తారతమ్యమే కాదు, ఇతర విధాలా ఈ భిన్న ధృవాలుగా సమాజం విడిపోవడాన్ని తన కవితలో ఎత్తిచూపారు. 1939లో పాతికేళ్ల వయసులో మొదటిసారి కారాగార శిక్ష అనుభవించారు. ‘నా గొడవ’లో లక్షల మెదళ్లని కదిలించారు. స్వాతంత్య్రోద్యమం నుంచి తెలంగాణ ఉద్యమం వరకు కాళోజీ అలుపెరగని పోరాటం చేశారు. ఆర్య సమాజ్, కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఇలా అందరితో కలిసి అన్యాయంపై పోరాటాలు మొదట్లో విశాలాంధ్రను కోరినా, తర్వాత కాలంలో విశాలాంధ్రలో వచ్చే నష్టాలను గుర్తించి 1969లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి పూర్తి మద్దతు ఇచ్చారు. జీవన గీతం రచనకు 1968లో ఉత్తమ అనువాద రచన అవార్డు వచ్చింది. 1992లో పద్మవిభూషణ్ పురస్కార్ లభించింది. అందుకే ఆయన తెలంగాణ ప్రజల ఉద్యమ ప్రతిధ్వని అని అంటారు. భాషను, సాహిత్యాన్ని, రాజకీయాలను, సంఘసంస్కరణలను ఉమ్మడిగా మేళవించి సమసమాజ నిర్మాణం కోసం జీవితాన్ని ధారపోసిన మహనీయుడు కాళోజీ. ఉదయం కాదనుకోవడం నిరాశ, ఉదయించి అట్లనే ఉండాలనుకోవడం దురాశ అని అనేవారు. 1937లో నిజామాబాద్ ఆంధ్ర మహాసభలో పాల్గొన్నది మొదలు ఆరున్నర దశాబ్దాల పాటు నిరంతరం ప్రజా క్షేత్రంలో పీడితుల వైపు నిలబడ్డ గొంతుక ధిక్కార పతాక కాళోజీ. నిజాం ప్రభుత్వ నిషేధాజ్ఞలను ఉల్లంఘించి గణపతి ఉత్సవాలను నిర్వహించారు. 1958లో ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి శాసన మండలికి ఎన్నికయ్యారు. కాకతీయ విశ్వవిద్యాలయం డాక్టరేట్ బిరుదు ప్రదానం చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చూడక ముందే 2002 నవంబర్ 13న తనువు చాలించారు.

- కె.రామ్మోహన్‌రావు