అక్షర

కథాసాహితిలో ఓ మైలురాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మా కథలు -2016
సంకలనకర్త: సిహెచ్.శివ రామప్రసాద్
ప్రకాశకులు
తెలుగు కథారచయితల వేదిక
స్వగృహ అపార్ట్‌మెంట్, సి-ఎఫ్2
భాగ్యనగర్ కాలనీ కూకట్‌పల్లి హైదరాబాద్ - 500 072.
వెల: రూ.99

*** *** ********

దిన, వార, మాసపత్రికలు, అంతర్జాల పత్రికలు, దీపావళి, ఉగాది లాంటి ప్రత్యేక సందర్భాల్లో వెలువరించబడుతున్న సంచికలు - వీటన్నింటి ద్వారా ఏటా సుమారు ముప్పై వేల కథానికలు తెలుగు భాషలో వెలుగు చూస్తున్నాయని ఒక అంచనా! సగటు పాఠకుడు ఇన్ని కథలు చదవటం తలకు మించిన పని! అసాధ్యం కూడాను.
ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేయటానికి కొందరు సాహితీ ప్రియులు కంకణం కట్టుకున్నారు. ఏడాది పొడవునా, వెలువడిన కథల్ని వీరు సేకరించి, తాలు నుండి ధాన్యాన్ని వేరు చేసి, 20 లేదా 30 కథల్ని చివరకు ఎంపిక చేసి తెలుగు పాఠకులకు అందిస్తున్నారు. కొద్దీ గొప్ప తేడా తప్ప వీటిని ‘ప్రాతినిధ్య’ కథలుగా పేర్కొనవచ్చు. ఇలా ప్రచురిస్తున్న సంస్థల్లో ‘తెలుగు కథ రచయితల వేదిక’ వారు ఒకరుగా చెప్పుకోవచ్చు. గత 5 సంవత్సరాల నుండి అంటే 2013 నుండి వీరు ‘మా కథలు’ అన్న శీర్షికతో ఏటా ఓ సంకలనాన్ని వెలు వరిస్తున్నారు. సిహెచ్.శివరామ ప్రసాద్ (వాణిశ్రీ) గారు ఈ ‘వేదిక’కు కన్వీనర్‌గా వ్యవహరిస్తూ, అయిదు కథా సంపుటాల్ని ‘తెలుగు కథ రచయితల వేదిక’ ప్రచురించింది. ఇది వారి ఆరవ సంపుటం. ఇందులో 41 కథానికలున్నాయి. మాధవపెద్ది గోపాలకృష్ణ గోఖలే శత జయంతి (1917 - 2017) సందర్భంగా ఈ సంచికను గోఖలే గారికి అంకితమిచ్చారు. గోఖలే గారి గౌరవార్థం ఆయన రాసిన ‘బల్లకట్టు పాపయ్య’ కథను మొదటి కథగా ఈ సంకలనంలో చేర్చారు. డా.వేదగిరి రాంబాబు, విహారి, రామాచంద్రవౌళి, పి.చంద్రశేఖర ఆజాద్, సింహప్రసాద్, సలీం లాంటి ప్రముఖులు, మరెందరో వర్థమాన లబ్ధ ప్రతిష్టుల కథానికలు ఇందులో చేర్చబడటం ఈ ‘మా కథలు 2016’ విశేషం. ఈ కథల్లో కొన్ని నవ్య, స్వాతి, సాక్షి, నవ తెలంగాణ, ఆంధ్రభూమి లాంటి ప్రముఖ పత్రికలు నిర్వహించిన పోటీల్లో బహుమతి పురస్కారాలు గెలుచుకున్నవి అవటం విశేషం. ఈ సంచికలో ప్రచురించబడ్డ కథలు - 2016లో ప్రచురించబడ్డ కథలకు ప్రాతినిధ్యం వహించేవిగా ఉన్నాయి. భాష, శైలి, శిల్పం పాఠకుడిని ఆకట్టుకుంటాయి. ఒక స్పష్టమైన ప్రాపంచిక దృక్పథం, మనిషికి మనిషి పట్ల ప్రేమను ఉద్బోధిస్తాయి.
తూర్పు గోదావరి జానపదుల మాండలికాన్ని ‘బల్లకట్టు పాపయ్య’ (మా గోఖలే) మన ముందుంచుతుంది. ఎతె్తైన కొండపై నుండి తనో రాయిలా దొర్లుతూ, దొర్లుతూ, కిందికి జారిపడ్తూ, పడ్తూ.. పాతాళంలోకి.. లోయల్లోకి.. రాలిపోతూ.. (అతడు - రామాచంద్రవౌళి) ఆపరేషన్ అనే యమదూతతో సమరం (డాక్టర్ మీరు దేముణ్ణి చూసారా? -కె.బి.కృష్ణ), పదునైన కత్తిలా మారి కసుక్కున గొంతులో దిగబడినట్లు (నరకకూపం- సలీం) లాంటి గొప్ప వర్ణనలు; ఎన్నో సామెతలు (అబద్ధం - నల్ల భూమయ్య), ఆకట్టుకునే ఎత్తుగడ, ప్రబోధాత్మకమైన సందేశాలు, (ఒక కోయిల గుండె చప్పుడు - అత్తలూరి విజయలక్ష్మి) వుప్పల లక్ష్మణరావుగారి అతడు - ఆమె లాంటి కథా ప్రయోగాలు (చిలాకులు - చిగురాకులు - అభిమన్యు), అందరూ దర్శించుకున్నదే వారణాశి - అయినా, క్రొత్త సందేశంతో కొత్త శిల్పమూ శైలితో వారణాశి వైభవాన్నీ, అక్కడ ‘శవ దర్శనం శివాదర్శనం’తో సమానమని చెప్పే, కాడ్రేగుల శ్రీనివాసరావు ‘నిశ్శబ్ద నీరాజనం’. ప్రతి కథ ఒక కొత్తదనాన్ని, సాహిత్యంలో కొత్త ప్రయోగాన్ని ఎత్తిచూపుతాయి. కథ చివర ‘్ఫల్లర్’గా ఇచ్చిన ఒక మంచిమాట, లలేదా ఓ క్రొత్త విషయం విజ్ఞానదాయకంగా ఉంది. ఆయా కథా రచయితల వివరాలు, అడ్రస్‌లు ఇవ్వటం వల్ల పాఠకుడు తన స్పందనని డైరెక్టుగా, రచయితతో పంచుకోగలిగే సౌకర్యం ఉంది. వీటన్నిటి వల్ల ‘మా కథలు 2016’ సంకలనాన్ని ఆ సంవత్సరపు కథలకు ప్రాతినిధ్యం వహించే సంకలనంగా ‘సూచిక’గా పరిగణించవచ్చు. కథా కాలగమన పరిశోధనకు గొప్పగా పనికివచ్చే సంకలనం ఇది.

-కూర చిదంబరం.. 8885552423