అక్షర

దళిత స్ర్తీల వేదనల ముఖచిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘బ్లాక్ ఇంక్’ (కథలు)
-ఎం.ఎం.వినోదిని
వెల: రూ.130
పే.151 ప్రతులకు: 040-27610963

** *** ****

దళిత పురుషులు ఎదుర్కొనే వివక్ష, అసమానతలకు తోడుగా దళిత స్ర్తిలు ఇంటా బయటా గృహ హింసను, లైంగిక హింసను అదనంగా ఎదుర్కోవాల్సిన అఘాయిత్యాన్ని, నిస్సహాయత్వాన్ని అత్యంత సహజంగా చిత్రించిన కథలివి. ఆకలితో, దారిద్య్రంతో అణగారిపోయే దళిత క్రైస్తవ జీవితాలకు అద్దం పట్టిన కథ ‘బాలేదు.. జరమొచ్చింది’. తండ్రికి పని దొరకక, ఎక్కడా అప్పు పుట్టకపోతే చిన్నారి ఎస్తేరుకు తినడానికి ఏమి దొరకక, నీరసంగా ఉండి కూడా నిజం చెప్పలేక ‘బాలేదు.. జరమొచ్చింది’ అని చెప్పుకుంటుంది. జరమొచ్చిందంటే ఎవరైనా ఏమైనా పెడతారనుకుంటే, దొరకాల్సినవి కూడా దొరక్కుండా పోతాయి. దళిత క్రైస్తవ స్ర్తిల మీద కొనసాగే లైంగిక వేధింపులు, హింసను వివరించే కథ ‘మరియ’. ఆదర్శవాది, సంస్కర్తగా కనిపించే వెంకటేశ్వరరావు, మరియ మీద చేసిన క్రూరమైన లైంగిక దాడికి తట్టుకోలేక ఆమె ఆత్మహత్య చేసుకుంటుంది. ‘మాది నిప్పును కడిగే వంశం.. కడజాతి ఆడపిల్లని నా తమ్ముడు తాకుతాడా’ అన్న బుకాయింపుతో న్యాయం దొరకకుండా పోతుంది. అగ్రకులస్తులు తక్కువ కులం స్ర్తిని రేప్ చేస్తే కోర్టులు కూడా ఇలాంటి వాదననే వినిపించి, కేసును కొట్టివేయడం మామూలై పోయిందని రచయిత్రి తెలియజేసిన విధానం బాగుంది. దళిత స్ర్తిలకు పని ఇవ్వడమే కాదు వాళ్లపై లైంగిక దౌర్జన్యం జరపడం తమ హక్కుగా భావించే యజమానుల బారి నుండి తమకే కాదు, తమ పిల్లలకు కూడా రక్షణ లేదని వాపోయే తల్లి ‘ఒక విలన్ ఆత్మహత్య’లో కనిపిస్తుంది.
కుల వివక్ష సమాజంలో ఎన్న రూపాలలో కొనసాగుతుందో వివరించే కథలు కూడా ఇందులో వున్నాయి. అమాయకంగా, చిలిపిగా, తెలివిగా కనిపించే చిన్నపిల్లల్లో కూడా కుల స్పృహ ఎంత బలంగా ఉంటుందో చెప్పిన కథ ‘బ్లాక్ ఇంక్’. ఒక దళిత క్రిస్టియన్ యువతి, అగ్రవర్ణాల అమ్మాయిలతో కలసిమెలసి తిరిగి, వాళ్లనే అనుకరిస్తూ తన వాళ్లను, తన కుటుంబ పరిస్థితులను అసహ్యించుకుంటుంది. తను ఎంత ఎత్తుకు ఎదిగినా, తానేంటో తన కులమేంటో, తన స్థానం ఏదో ఎప్పుడూ గుర్తు చేసేవాళ్లను చూసింతర్వాత రియలైజ్ అయి, తన నిజమైన ఇంటిని వెతుక్కుంటూ వస్తుంది ఆ ‘తప్పిపోయిన కుమార్తె’. అందం, చదువు, సంస్కారాలు వున్నప్పటికీ దళిత యువతి ప్రేమించబడటానికే తప్ప పెళ్లి చేసుకోవడానికి పనికిరాదు. ఒకడు ఉంపుడుగత్తెగా, ఇంకొకడు కీర్తికి అడ్డదారిగా చూస్తాడు. చివరకు దళిత ఇంటలెక్చువల్ కూడా ఆమెను పెళ్లి పేరుతో ఇంట్లో బందీగా ఉంచాలనుకుంటాడు. ఇవన్నీ కాదు.. ఆమెను ఆమెగా ప్రేమించే ‘ప్రియుడు కావాల’ని కోరుకుంటుంది. ‘కుమారక్క’ను ప్రేమ పేరుతో నమ్మించి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న అతను, బెంగుళూరులో ఉద్యోగం పేరిట ఆమెను దూరంగా పెట్టి తన పబ్బం గడుపుకున్న అతను, ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించిన కపట నాటకాన్ని చూస్తే, మనుషులు ఇంత దుర్మార్గంగా, నీచంగా ఉంటారా అని ఆశ్చర్యం కలుగుతుంది. ‘అత్త అంటే దొరలా ఉంది’ కథలో ఎంత వీర ఫెమినిస్టులైన బొట్టు, నగలు విసర్జించక పోవడానికి వారి కుల స్పృహనే కారణమని వివరిస్తారు. కలసి పోరాటం చేయాల్సిన స్ర్తిలు కులపరంగా చీలిపోవడమేమని ప్రశ్నిస్తూనే, ఈ ఫెమినిజం అగ్రవర్ణాల స్ర్తిల పోరాటం మాత్రమేనని తెలియజేస్తారు.
గ్రామాల్లో మరుగుదొడ్డి సౌకర్యం లేక ఇప్పటికీ స్ర్తిలు ఆరు బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఆరు బయలు స్థలాలు లేకుంటే రైలు కట్టలు, చెరువులు, ముళ్లపొదలు కూడా బహిరంగ విసర్జన స్థలాలుగా మారిపోతాయి. దళిత స్ర్తిలు ఎంత అసహ్యంగా వున్నా, ఎంత కష్టంగా వున్నా రైలు ‘కట్ట’ను ఉపయోగించుకోక తప్పదు. వచ్చిపోయే దారిలో, కామంతో కళ్లు మూసుకుపోయిన వాళ్ల వేట నుండి తప్పించుకోవాలి. ఇన్ని ఇబ్బందులు సరిపోవని చెవిటి కరుణమ్మ చెంబట్టుకు వెళ్లి రైలు కూత వినిపించక, దానికింద పడి చనిపోవడం కంటే విషాదమేమున్నది? ‘బ్లాక్’కథలో ఎంతో అసహ్యకరమైన పరిస్థితిలో మనసు చంపుకుని, లెట్రిన్‌లు శుభ్రపరిచే ఆమెకి డబ్బులివ్వడానికి గింజుకుని ఛస్తారు. ఆమెకు డబ్బులు అవసరమైతే, ఎవరూ ఇవ్వకపోతే, స్నేహితురాలి సలహా మేరకు అందరి లెట్రిన్లు బ్లాక్ చేస్తుంది. తర్వాత అవి బాగుచేసి డబ్బులు తీసుకుంటే, ఆమె ఆడిన నాటకం గ్రహించి వాళ్లంతా చితకబాదుతారు. ఆమె దగ్గరున్న డబ్బులు గుంజుకుంటారు. డబ్బు పోయింది. కష్టం మిగిలింది. అదనంగా తిట్లు, తన్నులు దొరుకుతాయి. ఇవన్నీ దళిత - దళిత క్రైస్తవ స్ర్తిల జీవితాలు. నీచ వృత్తులవలంబించే బి.సి. కులాల్లోని చాకలి, మంగళ్ల పరిస్థితి కూడా దళితుల కంటే మెరుగ్గా ఏం లేదు. గ్రామాల్లో తాము బట్టలు ఉతికిన వాళ్ల ఇండ్ల నుండి రోజు రాత్రి, వాళ్లు ఇచ్చే అన్నాన్ని తీసుకొచ్చి తినడాన్ని ‘చాకలికూడు’ అంటారు. ఇలా ఇంటింటికి తిరిగి అన్నం తెచ్చుకునే పద్ధతి పోవాలనీ, అందుకోసమే తాను చదువుతూ ఉద్యోగం చేస్తానని వర్థని చెబుతుంది. చాకలి వాళ్లు, ఒక మెట్టు పైనున్నామనే అనుకుంటారు కాని నిజానికి సమాజంలో వారి స్థితి దళితుల కంటే భిన్నంగా ఏం లేదని తెలియజేసిన కథ ఇది. మొత్తానికి ఇంటా బయటా దళిత స్ర్తిలు ఎదుర్కొనే వివక్ష - అవమానాలకు తోడుగా, వారికి మాత్రమే ఎదురయ్యే ప్రత్యేక సమస్యలు, రకరకాల హింస వారి జీవితంలో ఒక భాగంగా ఎలా తయారయిందో వినోదిని కథలు వివరిస్తాయి. ముఖ్యంగా దళిత క్రైస్తవ స్ర్తిల జీవితాలలోని విషాదాన్ని వెలుగులోకి తేవడంలో వినోదిని చూపిన సాహసాన్ని, నిజాయితీని, ప్రతిభను అభినందించకుండా ఉండలేం.

-కె.పి.అశోక్‌కుమార్