అక్షర

ఊరి పేర్లు ప్రాంతీయ చరిత్రకు ప్రతిబింబాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఊరు-పేరు (ఆంధ్రప్రదేశ్)
సేకరణ: వాండ్రంగి కొండలరావు
వెల: రూ.100 పేజీలు: 296
ప్రతులకు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ

** *** ***** **************

‘పేరులోన నేమి పెన్నిధి యున్నది’ అన్నది నిన్నటి మాట. పేర్లలోని అర్థాన్ని, వాటి వెనుక వున్న చరిత్రను వివరించే శాస్త్రంగా నామ విజ్ఞానము ఒక సరికొత్త శాఖగా ఎదగడం ఇవ్వాళ్టి నిజం. కొద్దో గొప్పో వ్యక్తుల పేర్లను, వాటి ఉత్పత్తి అర్థాల గురించి మాట్లాడుకోవడం విన్నాం. కాని స్థల నామాలు, గృహ నామాలు, జంతు నామాలు - మరింత విస్తృతంగా వ్యక్తి నామాలపై కూడా విశే్లషణ జరగవలసిన అవసరాన్ని తెలుగునాట మొదటగా గుర్తించి, ఆ దిశగా పరిశోధనలు ప్రారంభించి, దానికి విశ్వవిద్యాలయ స్థాయిలో శాస్త్ర ప్రతిపత్తిని కలిగించిన ఘనత నిస్సందేహంగా ఆచార్య యార్లగడ్డ బాలగంగాధరరావు గారిదే.
ప్రతి ఊరికి ఒక పేరు ఉంటుంది. ఆ పేరుతోనే దానికి గుర్తింపు లభిస్తుంది. ఎక్కువగా జనావాసాలు నెలకొన్న నైసర్గిక స్థితిగతులను ఆయా ఊరి పేర్లు తెలియజేస్తాయి. కొన్ని కాలానుగుణంగా సమాజంలో నెలకొన్న సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. ఇవికాక కులాల పేర్లు, వ్యక్తుల పేర్లు, సంఘటనల సూచకాలు కూడా ఆయా ఊర్ల నేపథ్యాన్ని సూచిస్తాయి. గ్రామ నామం ఏక పదమైనా ఉండవచ్చు. లేదా రెండు నుండి నాలుగు పదాల వరకు ఉండవచ్చు. ఒకే ఊరి పదం రెండు మూడు ఊర్లకు ఉండవచ్చు. అది యధాతథంగా కానీ, కొన్ని మార్పులతో కాని ఉండవచ్చు. మునుపు ‘అగ్రహారం’ల మాదిరిగా, ఇప్పుడు ఎక్కడబడితే అక్కడ ‘అంబేద్కర్ నగర్’లు వెలుస్తున్నాయి. వాటి వెనుక వున్న పూర్వ నామాలను వెతికి పట్టుకోవాల్సిన అవసరముంది. అసలు సిసలు తెలుగు పదాలతో వున్న ఊరి పేర్లు ప్రాచీనమైనవనీ, సంస్కృతం - ఉర్దూ - ఆంగ్ల పదాల పేర్లతో ఏర్పడినవి ఆధునికమైనవని స్థూల దృష్టికి గోచరించినా, వాటిని నిశితంగా పరిశీలిస్తే కాని నిగ్గుదేల్చలేము. పాత తెలుగు పేర్లను సంస్కృతీకరించడం, పాత ఊరి పేర్లను కాదని ఉర్దూలో నామకరణం చేయడం, ఆయా కాలాల నాటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పరిశీలించాల్సి ఉంటుంది.
నామ విజ్ఞానం గురించి తెలిసినప్పటికీ, శాస్ర్తియ పరిశోధనా దృక్పథంతో కాకుండా - సాహిత్య విద్యార్థి, భాషోపాధ్యాయుడు, ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా వాండ్రంగి కొండలరావు సహజ కుతూహలంతో సేకరించిన ఊరి పేర్ల సంకలనమిది. చాలా ఏళ్ల నుండి వీరు ఊరి పేర్లకు సంబంధించి పత్రికల ద్వారా, పుస్తకాల ద్వారా సమాచారాన్ని సేకరిస్తూండేవారు. అంతేకాదు. అన్ని జిల్లాల్లోని రచయితలు, జర్నలిస్టులు, జానపదుల సహకారం తీసుకుని ఈ సంకలనాన్ని రూపొందించానని రచయిత తెలియజేస్తున్నారు. జానపదుల నోట వినిపించే గాథలు, స్థానిక చరిత్రల ఆధారంగా తెలియజేసిన ఊరి పేర్లలో, జన వ్యవహారాలలో నలిగిన పుక్కిటి పురాణాల కల్పన వుండే అవకాశముందని గమనించాలి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 13 జిల్లాల ఊరి పేర్లను తనకు తెలిసిన, తమకు తోచిన విధంగా ఇవ్వడం కంటే - నిర్దిష్టంగా ఒక ప్రాంతాన్నో, ఒక జిల్లానో ఎంపిక చేసుకుని సమగ్రంగా రూపొందిస్తే పాఠకులకు ఉపయోగపడేది. పరిశోధకులకు ఒక రిఫరెన్స్‌గా పనికి వచ్చేది. ముఖ్యంగా నామ విజ్ఞాన పరిశోధకులకు చరిత్ర, సంస్కృతులతో పాటుగా భాషా శాస్త్రంలో మంచి నైపుణ్యం వున్నప్పుడే సరియైన ఫలితాలను రాబట్టుకో గలుగుతామని రచయిత గుర్తించాలి.
ఊళ్ల పేర్లనేవి, ఒక భాషా సమాజపు సంపూర్ణ చైతన్యానికి ప్రతీకలు. ఆ భాషా సమాజాన్ని అధ్యయనం చేయడానికి, చారిత్రక భూగోళాన్ని పునర్నిర్మించడానికి ఇవి ఉపయోగపడతాయి. ఇవి స్థానిక చరిత్ర సంస్కృతులను తెలియజేయటమే కాకుండా, నిఘంటువుల కెక్కని అనేక పదాల జాడను తెలియజేస్తాయి. ఈ దిశగా వాండ్రంగి కొండలరావు సంకలించిన ‘ఊరు-పేరు’ గ్రంథం, సామాన్య పాఠకులకు కనీస పరిజ్ఞానాన్ని కలిగించే అవకాశముందని భావించవచ్చు.

-కె.పి.అశోక్‌కుమార్