అక్షర

కాలానికి వేలాడుతున్న కథలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆహార యాత్ర
-డా.ఎ.ఎం.అయోధ్యారెడ్డి కథలు
పేజీలు: 167 వెల: రూ.100
ప్రతులకు: నవోదయ, నవచేతన విక్రయ కేంద్రాల్లో లభ్యం

** *** *** ***********************

కథలకు, కాలానికి విడదీయరాని బంధముంటుంది. ఏ కథ అయినా ఆనాటి సామాజిక పరిస్థితులను, జీవన విధానాన్ని పెనవేసుకొని ఉంటుంది. చరిత్రకు కాల్పనికతను జోడించి రాయడమే కథంటే. అందుకే సాహిత్యంలో కథలకున్నంత పాఠకాదరణ మరే ప్రక్రియకుండదు.
డా.ఎ.ఎం.అయోధ్యారెడ్డి మూడు, నాలుగు దశాబ్దాల క్రిందట రాసిన కథలు ‘ఆహార యాత్ర’ పేరిట పుస్తక రూపం దాల్చాయి. ముప్పయి యేండ్లు పాత్రికేయ ప్రయాణం సాగించిన రచయిత తాను చూసిన జన జీవితాల్ని తన అంతర్గత ఘర్షణను జోడించి కథలుగా మలిచారు.
‘కథలెప్పుడూ బతుకులోంచి పుట్టుకొస్తయి. ఊహకు, ఫాంటసీకి తావులేదు. బతుకు విడిచి సాముచేసేది కథ కాదు. కథ పుట్టేందుకు జీవితం నెలవైతే.. జీవితాన్ని చేరుకునేటందుకు కథ ఒక బాట! ఇది అయోధ్యారెడ్డి కథకిచ్చిన నిర్వచనం. ఈ కథలన్నీ ఆయన నియమించుకున్న పరిధిలోనే ఉన్నాయి.
‘ఆహార యాత్ర’ కథల సంపుటిలో 17 కథలున్నాయి. అన్నీ సుమారుగా 1980-90 ప్రాంతంలో పత్రికల్లో అచ్చయినవే. కొన్నింటికి కథల పోటీలో బహుమతులు కూడా వచ్చాయి.
మానవ సంబంధాలు, జీవన వ్యధలు, లోకం తీరు ఈ కథల్లో ప్రధాన అంశాలుగా కనబడతాయి. కథల్లో సమయ సందర్భాలు నిన్నటిని గుర్తుచేసినా సమస్యలు నేటికీ సమాజాన్ని పట్టుకొని ఉన్నవే.
బజారు మనిషిగా ముద్రపడిన స్ర్తితో చినబాబు పడే భావోద్వేగ ఘర్షణను ఎంతో సున్నితంగా అల్లిన కథ ‘నిశ్శబ్దం చప్పుడు’. వారి మధ్య అనుబంధాన్ని తండ్రి ‘జానెడులేవు వెధవా.. నీకు అమ్మాయి కావల్సి వచ్చిందా’ అని చేతులు నొప్పి పెట్టేలా కొట్టినా, ‘ఈ రోజు నుండి నేనే నీ సురేష్.. ఈ రాఖీ నాకు కట్టు’ అని చినబాబు అనడంతో కథ వినూత్న మలుపు తిరుగుతుంది.
రైతుకు అప్పులిచ్చి వారి రక్తాన్ని పిండుకునే భూస్వామి రాంరెడ్డి కథ ‘పిచ్చికుక్క’. రాంరెడ్డిని పిచ్చికుక్కతో పోల్చుతూ - పిచ్చికుక్క కరిస్తే అందరికీ పిచ్చి లేసినట్లే రాంరెడ్డి సహవాసంతో మిగతా వాళ్లు కూడా రక్తపిపాసలవుతారని, పిచ్చికుక్కను చంపాల్సిందే అనేది కథా సారాంశం.
ఆకలి నకనకను అక్షరాల్లోకి దించిన కథ ‘ఆకలికి మరోవైపు’. ‘అమ్మో.. ఆకల్రా దేవుడా.. తండ్రీ.. నారాయణా.. ఇంక నేను బత్క. లచ్చిముండా.. నీమీద మన్నువడ.. నాకింత కూడుపెట్టే’ అనే ఆక్రందనలో ఆకలే సర్వస్వం. తల్లి ఆకలి తీర్చే ప్రయత్నంలో మరో మగాడి ఆకలికి లచ్చిమి బలవుతుంది.
కాలానికి నిలబడే కథ ‘ఆహార యాత్ర’. రాసింది 1990లో అయినా దాని తాజాదనం తగ్గదు. శ్రామిక చీమల నాధారం చేసుకొని రాసిన ఆహార యాత్రలో చీమల ఆకలితోపాటు ఆరాటం, పోరాటం, అశక్తత ఉన్నాయి. రొట్టెముక్కను సంపాదించిన శ్రామిక చీమలపై గండుచీమల దౌర్జన్యం, చివరకు యుద్ధంలో శ్రామిక చీమలకు ఓటమి తప్పదు. అయితే గండు చీమలకు చిక్కిన రొట్టెముక్క ఉన్నట్టుండి గాల్లోకి లేస్తుంది. రొట్టె పాముల్లా ఉన్న మనిషి చేతి అయిదు వేళ్లలో చిక్కి పైకిలేస్తూ కన్పించకుండా పోతుంది. ‘కదలిపోతున్న ఆ మానవ భూతాన్ని కళ్లనీళ్లతో నిస్సహాయంగా గండుచీమలు చూస్తుండిపోయాయి’ అనే వాక్యంతో కథ ముగుస్తుంది.
హృదయ సౌందర్యాన్ని విప్పి చెప్పిన కథ ‘హృదయం’. సినిమా హాలులో తినుబండారాలు అమ్ముకునే స్ర్తిల మధ్య పోటీని ‘పిట్టపోరు’ కథలో నాటకీయతను జోడించి రాశారు రచయిత.
ఇలా కథలన్నీ మధ్యతరగతి, ఆ కింది వాళ్ల జీవితాల్ని ప్రతిబింబిస్తాయి. కథలకు వాస్తవికత ప్రాణం పోసింది. పాత్రల సంభాషణల్లో సహజత్వం ఉంది. సంఘటనలు, సన్నివేశాల కూర్పులో బాధితుల పట్ల రచయిత సానుభూతి కనబడుతుంది. కథల్లోని సమస్యల రూపంలో మార్పు వచ్చినా పరిస్థితులు మాత్రం నేటికీ మారలేదు.
పాత్రల్లో ఒకడిగా కలిసిపోయినట్లు ఇంత సహజంగా జీవితాల్ని చిత్రించిన రచయిత అయోధ్యారెడ్డి కథారచన కొనసాగినట్లు లేదు.
‘అయోధ్యారెడ్డి అచ్చమైన భావుకుడు. అడుగుపొరల్లో రచయిత ఆయాసపడుతున్నడు. చదివిన అనుభవం, చూసిన జీవితం, అనుభవించిన ఘర్షణ.. అన్నీ కథలుగా రాయవలసి ఉంది’ అన్న నందిని సిధారెడ్డి ఆకాంక్ష నెరవేరితే వర్తమాన జీవితాలు కూడా అయోధ్యారెడ్డి అక్షరాల్లో ప్రతిఫలించే అవకాశం ఉంది.

-బి.నర్సన్