అక్షర

ఉద్యమానికి బాసటగా నిలిచిన దళిత కోయిల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అస్పృశ్య కోయిల (నవల)
-కాలువ మల్లయ్య
వెల: రూ.190
పేజీలు: 155
ప్రతులకు: 9505518441

***** *** ** * * * *

ఊళ్లో గానకోకిలగా పేరు పొందిన ఓ అంటరాని మాలపిల్ల దొరల దౌష్ట్యానికి ఎలా బలయిపోయిందో వివరిస్తూ ‘బామ్మర్ది’ పేరుతో కాలువ మల్లయ్య గతంలోనే ఒక కథ రాశారు. అది చదివిన చాలామంది పాఠకులు కథ బాగుందని చెప్పడమే కాకుండా, దాన్ని విస్తరించి నవలగా రాయమని సలహా ఇవ్వడంతో రచయిత పూనుకొని దానినే ‘అస్పృశ్య కోయిల’ పేరిట నవలగా మలిచారు. ఈసారి ‘బామ్మర్ది’ కథకు అనుబంధంగా దళిత స్ర్తిల జీవితాన్ని, యధార్థ సంఘటనలను, గ్రామ దళితుల బతుకు నేపథ్యాన్ని వివరిస్తూ ఈ ‘అస్పృశ్య కోయిల’ రాశానని రచయిత తెలియజేస్తున్నారు.
ఈ నవలలో, డిగ్రీ చదువుతున్న మనోజ్ సెలవుల్లో ఇంటికి వస్తాడు. ఊళ్లో దళితుల పట్ల కొనసాగుతున్న అవమానాలు, అసమానతలు, వివక్ష, లైంగిక దోపిడీ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని గుర్తిస్తాడు. దళితులు ఊరి చివరనే ఎందుకు వుండాలో అర్థం కాదు. దళితులు చదువుకుంటే అంటరానితనం గురించి పట్టించుకోరు అని అనుకుంటే అది భ్రమ అని తేలుతుంది. బడిపంతులైన మాల సారుకు ఊళ్లో ఎక్కడా అద్దెకు ఇల్లు దొరకదు. సరికదా దాని కోసం ప్రయత్నించినందుకు అందరితో తిట్లు తినాల్సి వస్తుంది. దొరల అన్యాయాల గురించి ప్రశ్నిస్తే ‘ఇంకా నయం. మనూల్లె రెడ్డి దొరలే ఉన్నారు. వెలమ దొరలున్న చోటనయితే ఇంకా ఘోరం ఈ విషయంల..’ అని తండ్రి చెబుతాడు. మనోజ్ దళితుల అన్యాయాల గురించి ప్రశ్నించడం, శ్రీశ్రీ మహాప్రస్థానం చదవడం తండ్రికి నచ్చదు. కొడుకు ఎక్కడ నక్సలైట్లలో కలుస్తాడోనని భయపడతాడు. తాము వెనుకబడిన తరగతులకు చెందిన గొల్లలమైనా, తాము కూడా దళితులను అంటరాని వాళ్లుగా చూడటమేమిటని మధనపడతాడు. ఇక నుండి దళిత అభ్యుదయం కోసం పాటుపడాలని నిర్ణయించుకుంటాడు.
మనోజ్ ఒకరోజు పాలేరు రాకపోతే ఎడ్లను మేపడానికి పొలానికి తీసుకెళ్లడంతో, అక్కడ కోకిలమ్మ కొట్లాటను చూస్తాడు. ఈ కోకిలమ్మ ఎవరో కాదు. ఓ అంటరాని మాలపిల్ల. తన తీయని గొంతుతో అన్ని రకాల పాటలు పాడుతూ జనమందర్ని ఆకట్టుకొంటుంది. దళిత స్ర్తిల సమస్యలను అర్థం చేసుకున్న కోకిలమ్మ, తన వెంటబడే దొరల పిల్లలను ఒక్కతే ధైర్యంగా ఎదిరిస్తుంది. తన వెంటబడే మగవాళ్లను నిలదీసి బామ్మర్దీ అని పిలిచి, దొరలకే సవాలుగా, నిలుస్తుంది. ఒకసారి తన వెంటబడిన దొర కొడుకును చొక్కా పట్టుకుని బామ్మర్దీ అని సంబోధిస్తూ ‘మమ్మల్ని ముట్టుకుంటే వచ్చే అంటరానితనం పక్కలోకొస్తే వుండదా’ అని ప్రశ్నిస్తుంది. తను కావాలనుకుంటే పెళ్లి చేసుకుని ఇంట్లోకి తీసుకుపో - అని షరతు పెడుతుంది. ఇదంతా చూసిన మనోజ్ బిత్తరపోతే, అతని మిత్రుడు ‘మాల కోకిలమ్మకు చాలా ధైర్యముంది. మాటకారితనమున్నది. తన వాదనతో చదువుకున్నోళ్లను, పిడికెడు పిడికెడు మీసాలున్నోళ్లను కూడా పరేషాన్ జేత్తది. దొరల మృగాల నుండి తనను తాను కాపాడుకోడానికి ఆమె రాక్షసయింది..’ అని చెబుతాడు. దొర కొడుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా కోకిలమ్మ లొంగకపోతే, ఆమెకు రహస్యంగా తాళి కట్టి తన స్వంతం చేసుకుంటాడు. వాడుకుని వదిలేద్దామనుకున్న దొర కొడుకును పట్టుకుని, కోకిలమ్మను భార్యగా స్వీకరించాలని ఊళ్లో పంచాయతీ పెడతారు. ఈ పంచాయతీకి దళిత కుటుంబాలు, మనోజ్‌తోపాటు అతని తండ్రి కిష్టయ్య, ఊరి దొరలు హాజరవుతారు. నక్సలైట్లు కోకిలమ్మకు అనుకూలంగా తీర్పునిస్తారు. అన్నల భయానికి కోకిలమ్మను ఇంట్లోకి రానిచ్చినా, ఆమెను దాసిగా, ఉంపుడుగత్తెగానే చూస్తారు. దొర కొడుకు కోకిలమ్మకు బలవంతంగా అబార్షన్ చేయిస్తాడు. ఆమెను ఆడ బాపగా మార్చి, దొరల ఇంటికి వచ్చే వాళ్లకు సుఖాన్ని అందించే భోగ వస్తువుగా మార్చేస్తాడు. దాంతో ఆమె ఆరోగ్యం క్షీణించడం, జీవితం మీద ఆసక్తి చచ్చిపోవడంతో ఆత్మహత్య చేసుకుందామని ప్రయత్నిస్తుంది. ఒక అగ్రవర్ణ అంబేద్కరిస్టు ఆమెను కాపాడి ధైర్యం చెప్పి, చదువు నేర్పించి, గాయనిగా మలిచి, సహజీవనం చేయడానికి ఆమెను ఒప్పిస్తాడు. బామ్మర్దిగా, అంటరాని కోయిలమ్మగా ప్రారంభమైన ఆమె జీవితం దళిత, బహుజన ఉద్యమ నాయకురాలిగా ఎదిగిన క్రమాన్ని ఈ నవల వివరిస్తుంది. ఈ ప్రధాన కథకు అనుబంధంగా మాల మాదిగలు వాళ్ల జీవన వైరుధ్యాలను, వాళ్లు ఎదుర్కొంటున్న అవమానాలు, వివక్షతను, వాళ్ల నాశ్రయించుకుని బతికే ఆశ్రీత కులాల వారిని, దళిత రాజకీయాలను, దళిత ఉద్యమాల గురించి వివరించారు. చివరగా వాళ్లకు చేసిన అవమానాలకు గాను, అందరూ కలిసి దళిత జాతికి క్షమాపణలు చెప్పుకొని, దళిత రాజ్యాధికారం తేవడానికి కృషి చేయాలని పిలుపునిస్తారు.

-కె.పి.అశోక్‌కుమార్