అక్షర

ఓ జాతి మూలాల తవ్వులాట - మరో లదణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మరో లదణీ (బంజారుల చరిత్ర)
-ఆమ్‌గోత్ వెంకట్ పవార్
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో

** ** ********

ఏ వ్యవస్థలోనైనా ప్రజలే బలి పశువులన్నట్లు, అన్ని అభివృద్ధికర ముసుగులో మునిగేది గ్రామాలు, గిరిజన ఆవాస ప్రాంతాలే! నాటి కాకతీయుల కాలంలో పన్నులు కట్టలేదని సమ్మక్క, సారలమ్మ నాయకత్వాన గిరిజనులు తిరుగుబాటు చేస్తే, నిర్కశంగా ఆ తిరుగుబాటును కాకతీయులు అణచివేశారు. అయినా, అటు కాకతీయుల్ని, ఇటు గిరిజన నాయకురాండ్రను పొగుడుతాం. ఏది వాస్తవమో, అవాస్తవమో తెలుసుకోగలరని గడసరి మనస్తత్వం మనది.
జార్ఖండ్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఒడిస్సా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ దాకా చేపట్టిన అభివృద్ధి నమూనాలన్నీ ఆదివాసులకు, గిరిజనులకు, గ్రామీణులకు ఉరితాళ్లుగా మారుతున్నాయి. ఈ ఆవేదన నుంచి అక్షర రూపం దాల్చిందే ఆమ్‌గోల్ వెంకట్ పవార్ రాసిన ‘మరో లదణీ’ అనే బంజారుల చరిత్ర. తాను పుట్టి పెరిగిన కారుకొండ తాండా పాత మహబూబ్‌నగర్ జిల్లాలో నిర్మితమవుతున్న వట్టెం రిజర్వాయర్‌లో మునిగిపోతుందని, దానితోపాటు చుట్టూగల తాండాలు కూడా మునుగుతాయని, దీంతో తాత ముత్తాతల నుంచి ఆవాస ప్రాంతాలుగా ఏర్పరచుకొని, బ్రిటీషు కాలంతో, నైజాంల ప్రోత్సాహంతో అడవిని, వ్యవసాయాన్ని నమ్ముకొని పాలిస్తున్న లంబాడ గిరిజనులంతా తిరిగి ఆగమైపోతారని ఆవేదన చెందిన రచయిత, తమ తాండాల ప్రాశస్త్యాన్ని బాహ్య ప్రపంచానికి తెలపాలని, రికార్డు చేయాలనే తలంపుతో, కేవలం తమ ఆవాస ప్రాంతాలైన తాండాలకే పరిమితం కాకుండా, చరిత్ర పుటల్ని, వందలాది శతాబ్దాల చరిత్రని సృష్టించిన ప్రయత్నమే ఈ రచన!
దీంతో బంజారుల మూలాల్లోకి వెళ్లి, కృష్ణుడి కాలంనాటి పౌరాణిక ఘట్టాల్ని, బంజారుల సంబంధాల్ని, మహారాజా పృథ్వీరాజు సైనికులుగా, ఆనాటి ప్రజలుగా, తర్వాత చెల్లాచెదరై ఇటు దక్షిణానికి, అటు పంజాబు గుండా యూరప్ ఖండానికి వ్యాప్తి చెందిన విషయంతోపాటు, చైనాలోని గోబి ఎడారి మీదుగా భారతదేశానికి, ఇటు నుంచి ఓ కార్వాన్‌గా వెనిస్ (ఇటలీ)కు, ఇతర ప్రాంతాలకు బంజారులు విస్తరించి వుంటారనే ఓ పరికల్పనతోపాటు, దక్షిణ భారత్ నుంచే ఉత్తర భారత్‌కు ప్రయాణం అయి వుంటారనే మరో కథనాన్ని కూడా రచయిత ప్రస్తావించడం గమనార్హం! అయితే, వారి శారీరక సౌష్టవం, రంగు, ఆహార్యాల్ని చూస్తే దక్షిణానికి అతికేలా వుండదు. పైగా బ్రిటీషు కాలంలో థర్‌స్టోన్ లాంటి ఆంత్రోపాలజిస్టులు, ఇతరుల పరిశోధనలన్నీ నేటి రాజస్థాన్‌లోని మేవార్ ప్రాంతం నుంచే యుద్ధాల కారణంగా, మోతగాళ్లుగా (ఆలమందలపై బరువులు పెట్టి) ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందినట్లు చెపుతారు. అందుకే, అటు బ్రిటీషు వారు, ఇటు మొగలులు, అసఫ్‌జాహి వంశీయులు బంజారులకు అనేక నజరానాలను అందించడం జరిగింది.
భారత్ నుంచే, యూరప్ ఖండానికి వలస పోయినట్లు, వీరిని రోమో బంజారులంటారని, 1984-85వ ప్రాంతంలో ఢిల్లీలో జరిగిన బంజారుల సదస్సులో వీరు పాల్గొనగా, వారి అలవాట్లు- నీళ్లు తాగే ముందు భూమికి అర్పించడం (సాక) జరిగిందని, మాట్లాడే ‘గోబాలి’ భాష దాదాపు బంజారుల్లో, రోమో బంజారుల్లో ఒకే తీరుగా ఉందంటూ, కల్పనా శర్మ అనే జర్నలిస్టు, నాటి హిందూ పత్రికలో ప్రస్తావించడం జరిగింది.
రచయిత తలచింది ఒకటి, రాసింది మరొకటిలా, పుస్తకం ఓ సంకలనంలా రాయడం జరిగింది. అటు చారిత్రిక విషయాలకు పరిమితం కాక, ఇటు తాండా ముంపునకు సంబంధించి కాక, మిళితం చేసి, తన కుటుంబ చరిత్రను మాత్రం చక్కగా రాసుకోవడం జరిగింది. అందుకే ఓ సమగ్రత లోపించింది. అలాగే, చారిత్రిక ఘట్టాల్ని ఏ ఆధారాలతో ప్రస్తావించారో, ఆధారాల్ని ఆ కథనాల చివరనన్నా పొందుపరిస్తే, తదుపరి పరిశోధకులకు ఉపయోగకరంగా ఉండేది. అలాగే తాండా గూర్చి ప్రస్తావిస్తూ బంజారులకు సంబంధించిన కొన్ని ఆచారాల్ని తడిమినా, అవి కూడా సమగ్రంగా లేకుండా పోయాయి. ఉదా. దావ్లో అనే ఏడిచే (వీపింగ్ ఆర్ట్) కళను తల్లి, పెళ్లీడుకొచ్చిన పిల్లకు నేర్పడం అనేది ఏ గిరిజనుల్లోనూ కనపడదు. కాని, బంజారులలో ఇదో గొప్ప కళ. ఇక ముఖచిత్రంగా వేసిన పెయింటింగ్ వివరాలు గాని, ఆర్టిస్టు పేరుగాని తెలపలేదు. దీన్ని విధిగా తెలపాల్సింది. అలాగే కేరళ రాష్ట్రంలోని కమ్మర (లోహార్) గిరిజన మహిళల తర్వాత బంజార మహిళలే అతి శ్రమ చేసే కష్టజీవులనే విషయం లాంటివి కూడా ప్రస్తావనకు రావాల్సింది. బంజారులపై పరిశోధన చేయాలనుకునే వారికి ఈ పుస్తకం ఓ ఉత్ప్రేరకంగా పని చేస్తుంది.

-డా.జీయల్