అక్షర

జూకంటి కవిత్వపు పస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పస (కవిత్వం) -జూకంటి జగన్నాథం
వెల: రూ.100
ప్రతులకు: 6-5-101, విద్యానగర్, సిరిసిల్ల - 505 301
కరీంనగర్ జిల్లా 09441078095

** *****

నిరంతరం కవితా రచన కొనసాగించే జూకంటి జగన్నాథం మరొకసారి తన ‘పస’ అనే కవితా సంకలనం ద్వారా తనను తాను ప్రకటించుకొన్నారు. సామాజిక దురన్యాయాల పట్ల తన కసిని వ్యక్తీకరిస్తున్నారు. తన అనుభవాన్ని అక్షరీకరించడంలో ఒక ప్రత్యేక పంథా జూకంటిది. ఆయన వ్యక్తీకరణలో తన అనుభవానికి అక్షరానికి పెద్ద వ్యత్యాసం కనిపించదు. చాలా మంది అనుభవం అక్షరంగా మార్చేటపుడు గిరికీలు కొడుతుంటారు. ఒక్కోసారి ఈ అతి ఒక సంక్లిష్ట ప్రతీకగా మన ముందుకు వస్తుంది. తద్వారా సాహిత్యకుల సంగతి సరే గాని, సాధారణ పాఠకునికి కవికి ఒక అగాధం నిర్మితమయ్యే ప్రమాదం ఉంది. జూకంటిలో ఇలాంటి అపసవ్య నిర్మాణ పద్ధతి అసలు కనిపించదు. తాను చెప్పదలచుకొన్నది ఒక జలపాతం దూకినట్టు మెరుపు మెరిసినట్టు చెప్పడమే ఆయన పద్ధతి.
‘పస’ అనే ఈ కవితా సంకలనంలో ఆయన ఒక్కోసారి సమగ్ర జీవితాన్ని చిత్రిక పట్టిన కవితలు కనిపిస్తాయి. సాధారణంగా కథలలోనే మనకు సమగ్ర జీవిత చిత్రణ కనబడుతుంది. కాని ‘యాదగిరి మామా’ లాంటి కవిత ద్వారా ఈయన ఇది కవితలలో కూడా సాధ్యమే అని నిరూపించాడు. ఈయన చిత్రించిన బతుకు కథనం హృదయ మూలాలని కదిలిస్తుంది.
‘హోటల్ దందా నడవక/ మబ్బుల ఎవరూ లేవక ముందే/ పట్నం బతుకబోయిన మీ ముగ్గురి తండ్లాట/ మనసు నుంచి లేత చిగురుటాకు రాలినట్లు/ ఇయ్యాల్లటికి చివుక్కుమంటుంది.
... ... తప్పక ఒకసారి వచ్చి చూసిపోతామే/ ఓ యాదగిరి మామా/ బెక్కన బెంగటిలకే యాదగిరి మామా.’
ఇట్లా ముగించిన ఈ కవిత కథకు కవితకు మధ్యస్థంగా నిలబడి కొత్త ఒరవడికి మార్గదర్శనం చేసింది. ఇదే ఫక్కీలో కొనసాగిన మరో కవిత ‘ఆగలేని గోస’ను ఉనే తీసేగాన గాండ్ల వృత్తి దుర్మార్గమైన వ్యవస్థకు కకావికలు అయిపోయిన దయనీయ పరిణామం ఈ కవితలో చిత్రించాడు.
‘రందితో మా బాబు/ ముందు శివైక్యం అయిండో../ మా గానుగా ముందు/ తనువు చాలించిందో/ అన్నీ మెల్లమెల్లగా కాలం చేసినై/ జ్ఞాపకాలే చెడు వేపాకులయినై..’
అని చెబుతూ ‘బహు జనులంతా ఒక్కటి కానంత వరకు కుదిచ్చి చెడె నీళ్ల బొక్కెనలం మనం, దారులకు బొక్కెన తాకి చిల్లులు పడ్డ బతుకంతా మనమే. అస్తిత్వమే అతి గొప్ప ఆభరణం. దించే తీరే సుగుణం’ అని ముగుస్తుంది.
ఆశలేని గోస -అనే ఈ కవిత.. దీర్ఘ కవితకు కావలసిన అన్ని లక్షణాలతోపాటు ఒక జీవిత విషాద కథా కథన చిత్రణ ఈ కవిత విశిష్టత. విధ్వంసాన్ని విషాదాన్ని మాత్రమే రాసే ఈ కవి కలం దానికే పరిమితం కాలేదు. వ్యక్తిగతానుభూతులను కూడా చక్కగా కవిత్వీకరించడం చూస్తాం. తవుటం, అనుకరణ లాంటి కవితలు తన మనుమరాలి గురించి, నాతో సముద్రం, నాలో సముద్రం, కవి మిత్రుడు పత్తిపాక మోహన్ గురించి రాసినవి. ఇవి కవిలోని సౌందర్య దృక్పథాన్ని జీవితం పట్ల ఆయనకున్న సౌజన్యాన్ని తెలియజేస్తుంది. కోడిపిల్లలు, అమ్మాయి.. కూడా ఈ కోవకు చెందిన కవితలే.
పాత జ్ఞాపకాలని, ఆనాటి జీవన విధానాన్ని తట్టిలేపే కవితలు కొన్ని ఉన్నాయి. ‘టాంగా’ పూర్తి స్థాయి అట్లాంటి కవిత అని చెప్పవచ్చు.
చెట్టుకు నమస్కారం, కవిత వస్తు రూపాలకు పూర్తి సమన్వయం సాధించిన కవిత.
‘నువ్వెన్నయినా చెప్పు/ చివరికి చెట్టుకు నమస్కారం పెట్టు/ వానకు పబ్బతి పట్టు’ అంటూ ఈనాటి కాలానికి చెట్టు ఎంత అవసరమో చెబుతాడు.
ఫికరు, సైసుండ్రి, తవుటం, చెక్కర్, బుక్కెడు, ఓంబత్తి లాంటి పదాలన్ని తెలంగాణ ప్రజల విసర్గ జీవితం కావ్య స్థాయికి చేరడానికి సంకేతాలు.
‘కరెం నగర్, కరీంనగర్’ కవితలో ఆయన తాను నడయాడిన భూమి పట్ల ప్రేమ, కరీంనగర్ ధిక్కార స్వరంతో తనను మమేకం చేసుకున్న ఆరాధన కనిపిస్తాయి.
‘ఇయ్యాలా తల్లీ నిన్ను ఆరుపాయలుగా పంచుకుంటిమి’ అంటూ కరీంనగర్ ఆరు భాగాలు కావడం పట్ల ఒక నిస్పృహ వ్యక్తం చేస్తాడు.
‘ఎంతమంది వీరులు నేలకొరిగినా మునిపంటిన ఏడేడు సముద్రాల దుఃఖాన్ని అదిమి పెడితిమి’ అనేటపుడు ఆయన భావోద్రేకం పతాక స్థాయిని చేరింది.
ఈ కవికి స్పష్టమైన వస్తు దృక్పథం ఉంది. అత్యాధునిక కవిత్వంలోని ఎలాంటి ప్రతీకలు భావచిత్రాలు, గందరగోళాలు ఈయనలో ఉండవు. కొన్నిసార్లు వచన మాత్రమే అయిపోతున్నాడని దిగులు కలుగుతుంది. కాని మరుక్షణమే దాన్ని అధిగమించే మెరుపు మనసుని తాకుతుంది.
ఆధునిక కవితలోని వివిధ కోణాలు వాటికి భూమికగా నిలిచిన విస్పష్టమైన తాత్విక భూమిక. అవి కవిత్వీకరణ పొందిన తీరు, తెలుసుకోవాలంటే ఈ కవిత్వం చదివి తీరాలి. ఈయన పసను అర్థం చేసుకోవాలి. ఆవాహన చేసుకోవాలి.

-డా.కాంచనపల్లి