అక్షర

సమాజంతో చక్కని ఊసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహితీ దీపికలు -డా.కె.అరుణావ్యాస్
వెల: రూ.40 పుటలు: 62
ప్రతులకు: నవ చేతన పబ్లిషింగ్ హౌస్
విశాలాంధ్ర బుక్‌హౌస్ నవ తెలంగాణ బుక్‌హౌస్

** ***************

Flash of expression is better than trash of explanation (చెత్త అనిపించే విశదీకరణ కన్న తళుక్కుమనే వ్యక్తీకరణ మిన్న) అనుభవాలు, అధ్యయనాలు, అనుభూతులు అనేవి ఒక్కొక్కప్పుడు క్లుప్తంగా చెప్తేనే బాగుంటాయి. శ్రోతను గాని, పాఠకుడిని గాని ఒక గంభీరమైన ఆలోచనా లోకంలోకో, ఎద నిండే అనుభూతిలోకో, ఒక ఉదాత్త జిజ్ఞాసలోకో నెట్టుకుపోతాయి. గంగిగోవు పాలు గరిటెడైనను చాలు అన్న చందాన కొన్ని అంశాలు ముచ్చటైన చిట్టిచిట్టి ‘వ్యాసిక’లుగా రూపొందిన, ఒక స్ర్తి హృదయం వెలార్చిన, ఒక సుకుమార రచన ‘సాహితీ దీపికలు’. రచయిత్రి డా.కె.అరుణావ్యాస్.
‘మనిషి జీవనాధారమ్’ ‘జగతికి ఆడదే ఆధారం’ ‘మమతల కోవెల’ ‘కాలచక్ర పరిభ్రమణం’ - ఇత్యాది శీర్షికలతో ఇరవై ‘వ్యాసిక’లు. ‘విశ్వమ్ ఏకమ్’ అనే పేరుతో ఒక రసార్ద్ర విషాద వచన కవితా రచన ఉన్నాయి ఇందులో. సగటున ప్రతి వ్యాసిక మూడు పుటలు ఉంటుంది.
26వ పుటలో రచయిత్రి తన పెద్దకుమారుడు శ్రీహర్షను స్మరించుకుంటూ రాసుకున్న ఎలిజీ ‘విశ్వమ్ ఏకమ్’. అది దుఃఖ, కరుణ, గంభీర తాత్త్వికతల త్రివేణీ సంగమంగా, రసార్ద్ర కవితా వాహినిగా పాఠకుని ఎదలోకి చొచ్చుకుపోయి బరువెక్కిస్తుంది హృదయాన్ని. అందులోని ప్రతి వాక్యం, ప్రతి పదం, ప్రతి భావం సముద్రమంత గంభీరం.
‘కేర్.. కేర్.. క్వువ్వా.. హ్వువ్వా.. పసిపాప భూమి మీద పడ్డ మరుక్షణం తన అస్తిత్వాన్ని లోకానికి చాటే యత్నం. తినటానికి వీలుకాని పండు. పుట్టే తీపితీపి (తీయని తీపి)... ఆనందం తెరలై, పొరలై, అలలై, అర్ణవమై.. కేరింతల ధారం పీయూష, తన్మయిస్తూ యోష (స్ర్తిమూర్తి).. ఈ చిన్నారి స్థిరమై, చిరమై మరో షేక్స్‌స్పియర్, మరొక ఐన్‌స్టీన్ అయితే.. ఆశల సౌధాలు వడివడిగా పరుగిడగా.. హఠాత్తుగా ఆశాపాతాన్ని త్రుంచుతూ అశనిపాతంగా భయంకర మృత్యుకరాళ ద్రంష్ట.. ఇంటిల్లి పాదినీ ఉత్తేజపరచిన చైతన్యం.. సహేతుకము, సజీవమూ అయిన మేథ.. ప్యారగాన్ ఆఫ్ యానిమల్స్ (ప్రాణులలోకెల్ల మనోహరమైన నమూనా).. చేతస్సులోని రోచిస్సు... ఇలా గాలివాటు దీపమేనా? అనంతమైన విశ్వంలో ఏ మూలో చేతనత్వం.. బియాండ్ ది హొరైజన్ (దిగంతాల కావల).. సోలార్ సిస్టం (సౌర కుటుంబంలోకా?) స్టెల్లార్ సిస్టం (తారామండలం లోకా?)
ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్!
హూ ఐ వండర్ వ్వాట్ యూ ఆర్!
... ... ...
నాడు నా కడుపున పడి.. కేర్.. క్వువ్వా... హ్వువ్వా...
ఈనాడు అనంత రోదసిలో..
అది ప్రవాదం... ...
ఇలా సాగిపోయింది కమ్మనైన కడుపుతీపి కవిత విషాద భావ రోదసిలోకి వ్యాస్‌గారి కలంలోంచి - కాదు - కన్నీళ్ల లోంచి బహు గంభీరార్థ వ్యాఖ్యాన సమర్హంగా, వ్యాఖ్యాతీతంగా.
‘మనిషి జీవనాధారం’ అనే ‘అభిప్రాయిక’లో ‘సృష్టి లయించి మళ్లీ కొత్త ఊపిరితో శ్వాసిస్తే ఈ శాఖాచంక్రమణంలో మనిషి ఉనికి మట్టే మరి’ అనటంలో భూదేవి ప్రాముఖ్యం ఎంత మహత్తరమైనదో సంభావిస్తూ ఆ వాక్యాన్ని వ్యాఖ్యానించుకుంటే అద్భుతమైన భావం అందంగా మొగ్గ తొడుగుతుంది.
అక్కడక్కడ మెఱిసే మేధావులు, మహనీయుల సూక్తులు రచయిత్రీ ఉద్దేశిత విషయ వ్యక్తీకరణకు సముచిత దాహకాలుగా అందగించాయి.
రామానందతీర్థ చెప్పిన ‘నిస్వార్థ కర్మ దేవుణ్ణి ఋణగ్రస్తుణ్ణి చేస్తుంది. దేవుడు తప్పక వడ్డీతో ఇచ్చుకోవాల్సి వస్తుంది. (52వ పుట) - లాంటి సూక్తులు లలిత హాస్యాన్ని, వాస్తవికతా సౌందర్యాన్ని జమిలిగా పాఠకునకు అందిస్తాయి. 50వ పుటలో ‘నిర్ణయం’ అనే దాని బలం ఎంతో చక్కగా వివరించారు ఈ ‘వ్యాసికల’ రచయిత్రి వ్యాస్.
49వ పుటలో ‘కాలానుగుణంగా సమస్యల పరిష్కారాలుగా పుట్టిన సిద్ధాంతాలను చెరిపేసుకుంటూ ప్రతిదీ అశాశ్వతమే అనే నిజాన్ని రూఢిచేస్తూ పరుగుతీస్తోంది కాలం’ అంటూ ఉన్న వాక్యం ప్రసిద్ధ పాశ్చాత్య తత్త్వవేత్త, ‘అఖండవాద సిద్ధాంత’వాది అయిన ఫ్రెడరిక్ హెగెల్ భావజాలాన్ని తలపునకు తెస్తుంది.
నాగరికతను మంచికే వాడుకోవాలి అనే మంచి సందేశాన్ని ఇస్తుంది ‘స్వంత లాభం కొంత మానుకో!’ అనే అంశికా వ్యాసిక.
14వ పుట మూడవ పంక్తిలో ‘అంచులు కొలవలేని అంబరం అమ్మ అనురాగం’ అనటంలో ‘రూపకమే’ కాకుండా ‘అంబరం’ అన్నచోట శే్లష కూడా భావ సుందరతోపేతంగా సౌరులొలకబోసింది. ‘ప్రచార సాధనాలలో స్ర్తి’ అనే వ్యాసం అరుణావ్యాస్ గారి పరిశోధనా సిద్ధాంత వ్యాస రచనా శైలిని ప్రస్ఫుటంగా ప్రతిబింబించింది.
మొత్తం మీద ఈ ‘సాహితీ దీపికలు’ సారస్వత సందీప్తులకన్న వివిధ విజ్ఞాన విషయ ప్రభలను ఎక్కువగా వెదజల్లాయేమో అనిపిస్తుంది. ఏ అంశాల పుస్తకమైనా మస్తకంలోని మసకలను పోగొట్టేది గానే ఉండాలి కదా! అలాంటి దీపకం ఈ పుస్తకం.

-శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం