అక్షర

భౌతికవాద కోణంలో వివేకానంద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వివేకానందుని సామాజిక రాజకీయ దృక్పథాలు
మూల రచయిత: బినయ్ కె.రాయ్ అనువాదం: కె.రాజేశ్వరరావు ఎం.సారథి
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో

స్వామి వివేకానంద బోధనలు, ప్రవచనాలు ఇవీ అని సవ్యాఖ్యాన గ్రంథాలు ఇప్పటికే చాలా వెలువడ్డాయి అసంఖ్యాకంగా. విచిత్రం ఏమిటంటే ఆ మహనీయుని వాక్కులను ఎవరికిష్టమొచ్చిన రీతిలో వారు అన్వయించి రాశారు, రాస్తున్నారు. ఆస్తికతకు, అఖండ భారత జాతీయతా వాదానికి పందొమ్మిదవ శతాబ్దపు వైతాళికుడుగా అధిక సంఖ్యాలు భావిస్తున్న ఆ భగవత్తాత్వికవేత్త సూక్తులను పోరాటవాదులు, ఆధ్యాత్మికత అంటే కిట్టని కొందరు మానవతావాదులు, ప్రచ్ఛన్న నాస్తికతా వాదులు, నేటి కొందరు వంగదేశ భౌతికవాదులు, వర్గ పోరాటవాదులు మొదలైన వాళ్లు కూడా తమతమ ధోరణులకు అనుకూలంగా అన్వయిస్తూ చెప్పుకుపోతున్నారు.
హిమాచల శృంగానికి కొన్ని వేల మైళ్ల దూరంలో వున్న, దేశ దక్షిణపు కొన అయిన కన్యాకుమారిలోని ఒక రాతిగుట్ట మీద కూర్చొని, కళ్లు మూసుకుని భగవంతుడిని, భారతమాతను ధ్యానిస్తూ అఖండ భారత చిరంతన జాతిని, గౌరీశంకర శిఖరాన్ని దర్శించి దివ్యానుభూతికి లోనైన వివేకానందుడిని ఒక అద్వైత తత్త్వవేత్తగా పేర్కొంటూనే అతనిని ఒక వర్గ పోరాట వాదిగా చిత్రిస్తూ కె.రాజేశ్వరరావు, ఎం.సారథి అనే ఇద్దరు రచయితలు కలిసి ఒక అనువాద గ్రంథాన్ని రాశారు. పుస్తకం పేరు ‘వివేకానందుని సామాజిక రాజకీయ దృక్పథాలు’ మూలం బినయ్ కె.రాయ్ అని పేర్కొన్నారు.
‘సత్యంపైన, అఖండ సర్వవ్యాపక పరమాత్మ భావన పైననే నా బోధలన్నీ ఆధారపడి ఉన్నాయి’ అంటూ ముగిస్తారు వివేకానంద.
‘చాలాకాలం నుంచీ దివ్య జ్ఞాన సామాజికులు, పాశ్చాత్య మిషనరీల వాళ్లు, పాక్షిక దృష్టిగల పరిశీలకులు సాగించిన కపట ప్రచారం వల్ల భారతదేశం మార్మికత, మంత్ర తంత్రాలతో నిండిన అర్థ బర్బర దేశంగా కొనసాగిన భావన పశ్చిమాన వివేకానంద సాగించిన ప్రచారోద్యమ అవిశ్రాంత కృషి వల్ల గణనీయంగా కదలిపోయింది’ వంటి వాస్తవాలు ఈ పుస్తకంలో చోటు చేసుకోవటం బాగానే ఉంది.
కానీ పుస్తకం మొత్తం అధిక భాగం ‘మనం కూపస్థ మండూకాలం - బావిలో కప్పలం (పేజీ.27)’ ‘్భరతదేశంలోని అగ్రవర్ణాలకు చెందిన వాళ్లల్లారా! మీరంటే శూన్యం. గతం యొక్క నిరర్థక వ్యక్తులు. మీరు గతకాలపు భారతదేశం యొక్క మాంసరహిత, రక్తరహిత కంకాళాలు (పేజీ.35)’ ‘బ్రాహ్మణుల ప్రభావము, క్షత్రియుని ప్రతాపము, వైశ్యుల అదృష్టము - ఇవన్నీ ఎవరి శారీరక శ్రమ వల్ల కలిగాయో అలాంటి వారు ఈనాడు ఎక్కడ ఉన్నారు? (పేజీ.50) ఇలాంటి వాక్యాలు అన్నీ వివేకానంద అన్నట్టు రాశారు.
ఇక పద ‘సంయోజనము’ సంగతికొస్తే, అభివృద్ధి నిరోధక శక్తులు, కాలం చెల్లిన శక్తులు, ఫ్యూడల్, బూర్జువా తత్త్వం, సామ్రాజ్యవాదం, పోరాటం, శ్రమ దోపిడీ మొదలైన మార్క్సిస్టుల పడికట్టు పిడివాదపు పదాలతోనే పుటలన్నీ చిటపటలాడిపోతుంటాయి. కుల ద్వేషం పెంచే రీతిలో చాలా పేరాగ్రాఫ్‌లు శివాలాడుతుంటాయి.
వివేకానంద యొక్క మార్గాన్ని విశే్లషిస్తూ, కనిపించే ‘వివేకానందుని అభిప్రాయం యొక్క తాత్త్విక పునాదిలో వైరుధ్యాలు, ద్వంద్వ ప్రమాణాలు అంతర్గతంగా ఉన్నాయి (పేజీ.44)’. ‘శ్రమజీవులదే అనగా శూద్రులదే భవిష్యత్తు అని ముందే జోస్యం చెప్పినప్పటికీ వివేకానంద యొక్క జాతీయ పునరుజ్జీవన కార్యక్రమం సగంలో రాజీ పడేది (పేజీ.63). మొదలైన వాక్యాల ద్వారా వివేకానందుని స్వీయ పథగమనం ఈ సోషలిస్టులకు పూర్తి సంతృప్తి నివ్వలేదని అనుకోవాలి.
ఇక అనువాద శైలి సంగతి. మూల రచయిత వంగ భాషలోనో, హిందీలోనో చెప్పినదాన్ని అనువాదకులు ఇంగ్లీషులో అర్థం చేసుకొని తెలుగులో రాసినట్టు కృతకంగా ఉన్నది. ఉదాహరణలు: పాదార్థిక ప్రపంచంలోని దోపిడీ నియమాలన్నీ భారతదేశ ప్రజల్ని బంధనాల్లో ఉంచే వనరులైనాయి (పేజీ.12); ‘మొదట్టమొదట ఆయన పదార్థాన్ని గురించి సూత్రీకరిస్తూ ఆ నిర్దిష్ట భౌతికసారాన్ని (తాత్త్విక భౌతికత) చేరారు. (పేజీ.13) వంటి ఎన్నో వాక్య సముదాయాలు.
అక్కడక్కడ కొన్ని కొన్ని శబ్ద దోషాలు మసిమరకలలాగా ఉన్నాయి - ‘శక్తివంతము’ ‘బానిసత్వము’ లాంటివి. ‘శక్తిమంతము’ ‘బానిసత్వము’ లాంటివి. శక్తిమంతము అనాలి. మతుబర్థం (కలవాడు, కలది అనే అర్థం)లో ‘ఇ’కారం తరువాత ‘మ’కారం వస్తుంది. ‘వ’కారం కాదు, రాదు. బానిసతనము అని గాని, బానిసము అని గాని అనాలి. తెలుగు పదం మీద భావార్థక ప్రత్యయంగా ‘త్వం’ అని రాదు. దొంగత్వము, పిరికిత్వము, తీపిత్వము - ఇలాంటి శబ్దాలు ఎలా వికృతాలో అలాగే ‘బానిసత్వం’ కూడా. భాషారూప సహజతలను గమనించి, అధ్యయనం చేసి పద ప్రయోగాలు చేస్తే భాషే మనకు ‘బానిసం’ చేస్తుంది. ఆస్తికుడైన వివేకానందను నాస్తికవాదులైన మార్క్సిస్టులు కూడా తమ వానిగా చేసికోవటం ఒక చమత్కారం ఈ గ్రంథంలో.

-శ్రీ