అక్షర

అక్రమాల బాట.. మూడు ముక్కలాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూడు ముక్కలాట (నవల)
-దేవులపల్లి కృష్ణమూర్తి
వెల: రూ.100 పేజీలు: 164
ప్రతులకు: హైదరాబాద్ బుక్‌ట్రస్ట్, 04023521849

** ***

కష్టపడి డబ్బు సంపాదించడానికి వొళ్లు ఒంగదు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు ఎలా సంపాయించటమా అనే యావ ప్రజల్లో ఎక్కువయింది. పెట్టుబడి లేకుండా వ్యాపారం చేసే తెలివైన వాళ్లు, ఇతరుల డబ్బుతో వ్యాపారం చేసి లాభాలు గడించే చతురులు కూడా ఉంటారు. ఆ మధ్యకాలంలో రియల్ ఎస్టేట్ బిజినెస్ విపరీతంగా పుంజుకోవడంతో అందరి దృష్టి దానిపైకి మళ్లింది. దాంతో పనీపాటా లేనివాళ్లు, చిరుద్యోగులతోపాటు రకరకాల మోసగాళ్లు కూడా ఈ రంగంలోకి దిగారు. వీళ్ల తాకిడికి రియల్ ఎస్టేట్ రంగం ‘మూడు ముక్కలాట’గా మారిపోయింది. ఈ మూడు ముక్కలాటలోకి దిగి అదృష్టాన్ని పరీక్షించుకోదలచుకున్న ముగ్గురు మిత్రుల జీవితాలు ఎన్ని మలుపులు తిరిగాయో ఈ నవల వివరిస్తుంది.
కలెక్టర్ ఆఫీసులో పనిచేసే శ్రీశైలంకు సొంత ఇల్లు కట్టుకోవాలనే కోరిక. దాని కోసం ప్లాటు కొంటే అది వేరేవాళ్లు ఆక్రమించుకుంటారు. తీరా చూస్తే అది డబుల్ రిజిస్ట్రేషన్. మళ్లీ మళ్లీ డబ్బులు తగలేసి ఆ స్థలాన్ని తన మీదకు మార్పించుకొని, ఇంటి నిర్మాణం మొదలుపెట్టేవరకు అన్నీ సమస్యలే. మధ్యవర్తిగా కుదిరిన జాన్‌ఖాన్ పదెకరాల పొలం కొని ప్లాట్లు వేసి అమ్ముకుంటే బోలెడు డబ్బు వస్తుందని, వెంకటాద్రిని కూడా కలుపుకుంటారు. సర్వేయర్‌గా మాయాచారి సహాయం తీసుకుంటారు. ఏడాది అయినా ప్లాట్లు అమ్ముడుపోక, శ్రీశైలం ఇంటి పని ఆగిపోయి దిక్కుతోచని పరిస్థితిలో వుంటే, అమ్మిన ప్లాట్లు డబుల్ రిజిస్ట్రేషన్ అని కొన్నవాళ్లు వచ్చి గోలపెడితే, వాళ్లకు సర్ది చెప్పడానికి మళ్లీ డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. శ్రీశైలం ఒకటి చేయబోతే మరొకటి అయి కూచుంటుంది. ఇంట్లో వున్నవి అమ్ముకోగా, అప్పులు చేయాల్సి వస్తుంది. ఎన్నో బాధలు పడి చివరకు ఇల్లు కట్టుకుని పిల్లల్ని పెద్దచేసి, రిటైర్ అయి విశ్రాంత జీవితం గడుపుతాడు.
టీచర్ వెంకటాద్రి అదనపు ఆదాయం కోసం ప్లాట్ల దందా మొదలుపెడతాడు. ఒక ఇండస్ట్రియల్ అధికారి పరిచయంతో బోర్ల బిజినెస్‌లో పుంజుకుంటాడు. టీచర్ యూనియన్ ప్రెసిడెంట్‌గా ఎన్నికై, వాళ్ల పనులు చేసి పెడుతూ, పలుకుబడి పెంచుకుంటాడు. అప్పుడు జాన్‌ఖాన్ వచ్చి తొమ్మిది ఎకరాల పొలం కొనమనీ, శ్రీశైలం, వెంకటాద్రి డబ్బులతో, తాను తిరిగి అమ్మిపెడతానంటాడు. కాని ఆ వెంచర్‌లో లాభాలు రాకపోవడంతో, డబ్బులు లేనోనితో సావాసం చేయకూడదని నిర్ణయించుకుంటాడు. రిటైర్ కాగానే అందరూ రాజకీయాలలోకి దిగమని వత్తిడి తెస్తే, బోలెడంత డబ్బు అందరికీ తినబెట్టినా టికెట్ దొరకదు. సరికదా ప్రతిపక్షం వాళ్లు హత్యకేసులో ఇరికిస్తే బయటపడలేక దిక్కుతోచని పరిస్థితిలో ఉంటాడు.
జాన్‌ఖాన్ పనిలేకుండా తిరిగి చివరకు గుత్తేదారు గూని సర్దార్ దగ్గర చేరి కాంట్రాక్టు పనులు నేర్చుకుంటాడు. అక్కడా పనులు దొరకక తిరుగుతుంటే, కలెక్టరేట్‌లో కలిసి పనిచేసిన శ్రీశైలం కనిపించి, తన ఇంటి ప్లాటు సమస్య గురించి వివరిస్తాడు. అది పరిష్కరించే ప్రయత్నంలో రెండేళ్లు సుఖంగా గడిచిపోతాయి. పాత స్నేహితుడు వెంకటాద్రితో శ్రీశైలంను కలిపి, తొమ్మిది ఎకరాల పొలం కొనిపించి ప్లాటు దందా చేయిస్తాడు. ఈ దందాలో వాళ్ల్లకేమీ మిగలకపోయినా జాన్‌ఖాన్, సర్వేయర్ మాయాచారి మాత్రం నాలుగేళ్లు హాయిగా బతికేస్తారు. తర్వాత భూములను చూయించడం, డబుల్ రిజిస్ట్రేషన్ చేయించడం, భూములు ఇప్పిస్తానని డబ్బు తీసుకుని తిప్పడం, అందిన కాడికి అప్పులు చేసి పారిపోతాడు. లోకల్ పేపర్‌లో విలేకరిగా చేరి క్రమంగా సొంత పత్రిక పెట్టుకోవడం, దాన్ని అడ్డం పెట్టుకొని బ్లాక్‌మెయిలింగ్‌తో బాగా డబ్బు గడించి, హైదరాబాద్ ఎడిషన్ ప్రారంభిస్తాడు. అక్కడ పోలీసులతో వచ్చిన గొడవలతో, వాళ్లు బాంబు పేలుళ్ల దాడిలో జానాఖాన్‌ను ప్రధాన నిందితుడిగా ఇరికించడంతో బయటపడలేక దిగాలు పడిపోతాడు.
కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన ముగ్గురు మిత్రుల కథ ఇది. ఇందులో ప్లాట్ కొని మోసపోయిన శ్రీశైలం చివరకు మిత్రులతో కలిసి ప్లాట్ల బిజినెస్‌లోకి దిగడం, లాభాలు చూడకపోగా అప్పులతో సతమతమవుతాడు. టీచర్‌గా వున్న వెంకటాద్రి రకరకాల వ్యాపారాలతో డబ్బు సంపాదించుకుని, రాజకీయాల మోజులో పడి డబ్బు, పరువు పోగొట్టుకుంటాడు. జాన్‌ఖాన్ ముందు బతకడం కోసం, తర్వాత కుటుంబం కోసం దళారీ పనులలో దిగి కాలం గడుపుతాడు. చివరకు పత్రిక పెట్టి బ్లాక్‌మెయిలింగ్‌కు దిగి, పోలీసుల ఉచ్చులో చిక్కి బయటపడలేక కొట్టుమిట్టాడుతుంటాడు. ఈ ముగ్గురు మిత్రుల పుట్టుక, బాల్యం, వివాహం, సంపాదన, కుటుంబం మొదలయిన పూర్తి జీవిత విశేషాల వర్ణన ఇందులో వుంది. శ్రీశైలం కొడుకు అన్నలలో కలిసిపోయి తల్లిదండ్రులకు గర్భశోకాన్ని కలిగించడం, వెంకటాద్రి కూతురు ప్రేమ పేరుతో లేచిపోతే, వాడు వాడుకొని వదిలేయగా గర్భిణిగా మిగిలిపోతుంది. వెంకటాద్రి వెళ్లి కూతుర్ని తెచ్చుకొని, తన కింద పనిచేసే చంద్రంకిచ్చి పెళ్లి చేస్తాడు. వీరే కాకుండా గుత్తేదారు గూని సర్దార్, సర్వేయర్ మాయాచారి, అతని భార్య వనజ, వెంకటాద్రి తోటలో పనిచేసేవాళ్లు - ఇలాంటి అప్రధాన పాత్రధారుల జీవితాల గురించి కూడా ఆసక్తికరంగా వివరిస్తారు. పాత్రధారులందరికీ సంబంధించిన డబ్బు సంపాదన, బతుకు పోరాటంతోపాటు వారి విలాసాలు, అక్రమ సంబంధాలు, ఉంపుడుగత్తెల వ్యవహారాలు ఇలా ప్రతి చిన్న విషయాన్ని పూసగుచ్చినట్లు తెలియజేస్తారు. ఎన్ని రకాలుగా జనాలను మోసం చేసి బతకవచ్చో వీళ్ల జీవితాలు తెలియజేస్తాయి. ప్రభుత్వ భూములను, ఇతర భూములను కబ్జా చేసి అమ్ముకోవడం, ఒకే ప్లాటును పది మందికి అమ్మడంతోపాటు రియల్ ఎస్టేట్‌లో కొనసాగే రకరకాల మోసాలను ఇందులో వివరంగా తెలియజేశారు. వీటితోపాటు మున్సిపల్ కాంట్రాక్టుల ప్రహసనం, రేషన్ షాపుల బాగోతం, చిట్టీలు వేయించి అందరినీ ముంచడం, మున్సిపల్ కౌన్సిలర్లందరూ కలిసి ఊరిని పంచుకోవడం.. ఇలా నల్లగొండ జిల్లా నేపథ్యంలో వచ్చిన, వస్తున్న మార్పులు - దాన్ని ఆధారంగా చేసుకుని ఎవరికి తోచినట్లు వారు ఊరి మీద పడి బతకడం ఎంత మామూలయిందో ఈ నవల తెలియజేసిన విధానం బాగుంది.

-కె.పి.అశోక్‌కుమార్