అక్షర

రసార్ద్రత నిండిన కథలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మున్నీ కథల సంపుటి
-కీ.శే.డా.గణపతిరాజు అచ్యుతరామరాజు
వెల: రూ.80
రెండవ ప్రచురణ
ప్రతులకు: విశాలాంధ్ర, నవచేతన, నవోదయ బుక్‌హౌస్
గణపతిరాజు పెరుమాళ్ల రాజు విశాఖపట్నం 9948723399

**** *******

స్వాతికార్తెలో కొన్ని వేల లక్షల చినుకులు నేల మీదా, చెరువుల మీదా, చెట్టూ చేమల మీదా రాలుతాయి. ఆ చినుకుల్లో కొన్ని మాత్రమే ముత్యపు చిప్పల్లో పడి మేలిమి ముత్యాలు అవుతాయి. అట్లాగే తెలుగు కథ పుట్టిన నాటి నుండే, అంటే 107 ఏళ్ల నుండీ కొన్ని లక్షల కథలు ఆవిర్భవించాయి. అందులో కొన్ని మాత్రమే ‘గొప్ప కథలు’గా పేరుగాంచి చిరాయువులై నిలిచాయి. అలాంటి గొప్ప కథల జాబితాలోకి చేర్చదగ్గవి - కీర్తిశేషులు ‘కళాప్రపూర్ణ’ డా.గణపతిరాజు అచ్యుత రామరాజుగారి ఈ కథలు. అచ్యుతరాజు గారి జీవిత కాలం 1924 నుంచి 2004. తెలుగు కథ ఆవిర్భవించాక, పధ్నాలుగేళ్లకు రాజుగారు పుట్టారు. రాజుగారికున్న అభిరుచి వల్ల కావొచ్చు, లేదా ఆనాటి కాలమాన పరిస్థితుల వల్ల కావొచ్చు. వీరు నాటకాలకు/ నాటికలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చినట్లు అవుపిస్తుంది. కారణాలు ఏమైనా వీరు చాలా తక్కువ కథలు రాసినట్లుగా అనిపిస్తుంది. ప్రస్తుత కథాసంకలనం ‘మున్నీ’లో రాసినవే అనుకుంటాను. ఎనిమిదే కథలు - అయితేనేం - ఒకటీ అరా తప్పించి, ఇవన్నీ ఆణిముత్యాలు. కథాపరంగా కథనం పరంగా గొప్ప సాహిత్యపు విలువలు కలిగిన కథలు. బుచ్చిబాబు, రావిశాస్ర్తీ లాంటి మహామహుల సరసన నిలుపవలసిన కథలు. గొల్లపూడి మారుతీరావు గారి మాటల్లో చెప్పాలంటే ‘సాంద్రత పరిణతిని పుంజుకుంటూ సాగిన’ కథలు. రావిశాస్ర్తీ లాంటి కథకుల ‘గీటురాయి’ మీద పరీక్షింపబడి మేలిమి బంగారంగా ధృవీకరించబడిన కథలివి.
సంకలనంలోని ఎనిమిది కథల్లో ఆరు కథలు ఆయన సమకాలీన జీవితాన్ని ప్రతిబింబించేవి అయితే - రెండు కథలు, నిన్నటి నేపథ్యంతో ‘మాంత్రిక వాస్తవికత’ వినియోగింపబడిన కథలు.
సంకలనంలోని మొదటి కథ శ్రమజీవనంలోని సౌందర్యాన్ని ప్రతిఫలింపజేస్తూ, రేపు ఇలాంటి వాళ్లకే గొప్ప భవిష్యత్తు ఉంటుందని చెబుతుంది. రచయిత ‘పరిసరాల పరిశుభ్రత’కు ఇచ్చిన ప్రాముఖ్యత నేటి ‘స్వచ్ఛ భారత్’ను తలపించే ‘కాలదోషం’ పట్టిన కథ.
రెండో కథ ‘అరటిమొక్క’. అర్థంలేని నమ్మకాన్ని నిరసిస్తుంది. రాద్ధాంతం చేసిన కుటుంబరావు తల్లే కథ చివరన ఆ నమ్మకాన్ని పక్కకు పెట్టి కోడలు లక్ష్మి నాటిన అరటిమొక్కను ఆమోదిస్తుంది. రాజుగారి నాలుగో కథ ‘కసి’ ఎన్నో, ఎనె్నన్నో బహుమతులు పొందిన కథ. కట్టిపడేసే కథనం, ప్రదర్శించిన నాటకీయం - ఓ కథ చెబుతున్నట్లు అనిపించదు, సినిమా చూస్తున్నట్లుంటుంది.
‘ఆ గదిలో దక్షిణం వేపు గడ్డిపరుపు వేసి ఉన్న నులక మంచం కింద ఓ కుండా, ప్లాస్టిక్ గ్లాసు, కత్తిపీటా, ఓ ట్రంకు పెట్టె వున్నాయి’. గొప్పింటి కామరాజు ఇంట్లో - ‘దీపాలు, ఫేనులు, మంచాలు, పరుపులు, సోఫాలు, కుర్చీలు, బట్టలు, భోజనాలు విందులు, అత్తరులు, పన్నీరులు విలాసాలు’ పై రెండు వర్ణనలకు ఎంత కాన్‌ట్రాస్ట్.
అలాంటి పై భోగాన్ని వదులుకుని కాంతం ఏమీలేని అర్జయ్య తాటాకుల ఇంటికి తనకు తానై వచ్చిందంటే, ఆమె మీద బోలెడు రసానుభూతి కథకుడు చెప్పకున్నా కలుగుతుంది. ఈ కథలో రాజుగారి ప్రథమ వాక్యమే కథ తీరు తెన్నుల్ని చెబుతుంది. ‘ఊరికి ఉత్తరానున్న రాదారి బంగళా వెనుక వైపు రెండో వాసలో ఉన్న తాటాకుల ఇళ్లకొప్పు మీద.. చంద్రుడు కునుకబోతున్నాడ’ట! ‘మసకమసకగా ఉన్నాడ’ట! చనిపోయే కాంతం, క్షణికావేశానికి లోనయిన అర్జయ్యలను మొదటి వాక్యంలోనే పరిచయం చేశాడు రచయిత.
పెంపుడు కుక్క ‘రూబీ’ మరణం చదువుతూంటే కరుణరసం చిప్పిలుతుంది. ‘మున్నీ’ కథ కూడా అంతే.. గుడిగంటలు చిత్రంలో, కథానాయకుడి బాల్యంలో స్నేహితుడి ఊబిగుంట మరణం గుర్తుకు తెస్తుంది. వితంతువైన మున్నీ తల్లి గురించి చిన్నపిల్లడు మురళి ఊహలు ఎంతో సహజంగా, అమాయకంగా ‘అయ్యో! పాపం’ అనిపిస్తుంది.
సంకలనంలోని ఏడవ కథ ‘అన్నవాకం’ గురించి - రావిశాస్ర్తీ గారిని ఉబ్బితబ్బిబ్బు చేసిన కథ ఇది. ‘రాజుగారూ! ఏం కథ రాస్సేరండీ.. గుండెల్ని గుంజాయించేసారనుకోండి... రాస్తే ఇలాంటి మంచి ముత్యాలు మీరే రాయాలండీ’ అనిపించుకున్న కథ ఇది. ఆయనే కాదు - చదివిన ప్రతీ పాఠకుడినీ ఉబ్బితబ్బిబ్బు చేసే కథ ఇది. చరిత్ర, జనశృతి, రాజుల వైభవం, సాహసం, పరాక్రమం, ఈర్ష్య ద్వేషం, జీవన విధానం వివరించే కథ. ‘అత్తారింటికీ’ కథ కూడా అంతే గొప్పనైన, జాతి సంస్కృతి, సాంఘిక వ్యవస్థ, మంచీ చెడుల మధ్య సంఘర్షణ - వివరించే జానపద సాహిత్యంలో స్ర్తిలకు సంబంధించిన కరుణా రసాత్మకమైన గాథ.
రోజూ తింటుంటాం. మరో 3-5 గంటల తర్వాత మళ్లీ తింటాం. కడుపు నిండుతుంది. మళ్లీ ఆకలి. మామూలే! మనసు నిండితే అలా కాదు. కొన్నాళ్లపాటు ఆ కథల తలంపుల ‘పులకలు’ వస్తుంటాయి. అందుకే ఇవి మనసునింపే కథలు. కళ్లతో కాకుండా మనసుతో చదవాల్సిన కథలు.
ప్రతి కథకు వేసిన ‘బాలి’ బొమ్మలు ‘బాపూ’గారిని తలపిస్తాయి.
ఒక రసార్ద్ర లోకంలోకి తీసుకువెళ్లగలిగే కథలు. మంచి గంధంలా మల్లెపూవుల్లా పరిమళించే కథలు. కథారచన అనే కళను ‘ప్రపూర్ణం’ చేసిన కథలివి.

-కూర చిదంబరం.. 8885552423