అక్షర

నిత్య సత్యాల కథాసంపుటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మురళివూదే పాపడు మరికొన్ని కథలు
-దాదా హయత్
వెల: రూ.150
ప్రతులకు: విశాలాంధ్ర, నవచేతన పుస్తక కేంద్రాలు

** ****

‘నేనీ కథలు రాస్తున్నప్పుడు ఈ ప్రపంచం ఇలా లేదు. ఈ దేశం ఇలా లేదు. ఈ తెలుగు ప్రజ ఇలా లేరు. నేను ఇలా లేను. నాతో పాటుగా ఇవన్నీ ఒక నాలుగు రోడ్ల కూడలిలో నిలబడి వున్నప్పుడు నేనీ కథలు రాశాను... ఈ కథలు రాసినప్పుడు నన్ను ప్రభావితం చేసిన విలువలు ఏపాటివి? ఇప్పటి (2017) విలువలతో సరిపోల్చడానికైనా ఈ కథలు పనికొస్తా యనుకుంటాను’ రచయిత దాదాహయత్ మనసు విప్పి చెప్పిన మాటలివి. పాఠకుల ఆలోచనలకు మార్గం నిర్దేశిస్తున్నాయి. 1983 - 2001 మధ్యకాలంలో రాసిన 22 కథల సంపుటి ఇది. వృత్తిరీత్యా రచయిత న్యాయవాది. అప్పటి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల నేపథ్యం కనిపిస్తుంది. ఎక్కువ కథల్లో బడుగు వర్గాల స్థితి భూమికగా చేసుకున్నారు. కొన్ని కథలు రాయలసీమకు అద్దం పడుతున్నాయి. మనస్తత్వ చిత్రణతో వున్న కథలు కూడా చోటు చేసుకున్నాయి. ఎత్తుగడ ఆకట్టుకునే రీతిలో ఉంటుంది. పాత్రలు పరిమితంగా ఉంటాయి. అనవసరమైన సన్నివేశాలకు స్థానం కల్పించరు. కథాసంవిధానం ఆసక్తిజనకంగా ఉంటుంది. కొన్ని పాత్రల సంభాషణల్లో రాయలసీమ మాండలికం రక్తి కట్టించింది. సందర్భ శుద్ధిలేని వర్ణనలేవీ కథలో కనుపించవు. కథనం చక్కటి శైలిలో సాగింది.
ఓట్ల రాజకీయం పేదల్ని ఎలా బాధిస్తుందో ‘సెగ మంటలు’ కథ నిరూపిస్తుంది. దస్తగిర్రెడ్డి, సంగిరెడ్డి మధ్య పోటీలో పేదలు ఇరుక్కుపోయారు. దొంగ ఓట్లు వేయకపోతే చిత్రవధ తప్పదు. రిక్షా తొక్కుకుని బతికే ఓబులేసు పోలింగు ఆఫీసర్ని బతిమాలిన విధం ఇలా ఉంది. ‘దొంగ వోటు వేయకుంటే మమ్మల్ని సంపుతారు సామీ! ఈ దొంగ వోటు వేయకుంటే పెండ్లానాది కాదు సామీ! వేయనీయండి సామీ’. బాంబుల సంస్కృతి వారసత్వంగా ఎలా మారిందో ‘వారసత్వం’ కథ విశదం చేస్తుంది. ‘ఎల్లువ’ కథ పేద రైతుకు జరిగిన అన్యాయం చిత్రిస్తుంది. తరతరాలుగా గొల్ల నారాయణ సాగు చేసుకుంటున్న భూమి ప్రభుత్వానిదని కరణం మోసంతో రాస్తాడు. కోర్టులో కేసు తీర్పు నారాయణకు వ్యతిరేకంగా వస్తుంది. చివరకు పక్కా పెద్ద రైతు రామిరెడ్డికి ఆ రెండెకరాలు అమ్మక తప్పలేదు.
ఆడపిల్లను కనడం పైన ఎంత ప్రాముఖ్యముందో ‘ప్రసూతి వార్డు’ కథ చదివితే తెలుస్తుంది. చదువుకుని, మంచి ఉద్యోగం చేస్తున్న యువకులు సహితం కట్నం దురాచారానికి లొంగిపోవడం ‘ఆశీర్వాదం’ కథకు ఇతివృత్తం. ‘ప్రదర్శన’ కథ ఊరి మధ్యలో హరిజనులు నివసిస్తున్న ఇళ్లు కూలగొట్టి అక్కడ పార్కుతో గాంధీ విగ్రహం నెలకొల్పిన వైనం వివరిస్తుంది. ఈ కథ ‘బహుశా అక్కడెక్కణ్ణుంచో మహాత్ముడే తన స్థితికి రోదిస్తున్నాడేమో’ వాక్యంతో ముగుస్తుంది. రాయలసీమలో తాగునీటికి ఎన్ని ఇబ్బందులు పడాలో ‘గుక్కెడు నీళ్లు’ కథ వల్ల స్పష్టమవుతుంది. ‘చరిత్ర’ కథలో కొంత రాజకీయ వ్యవస్థ రేఖా చిత్రముంటుంది. ‘ప్రజా పోరాటం అనునిత్యం అనివార్యం. ఇదే.. చరిత్ర’ అంటారు కథ చివర్లో.
‘లోకంలో ఏ ప్రాణీ వ్యర్థ జీవికాదు’ ‘ఏ దేశంలోనైనా ఎంత గొప్ప ఆశయాలతో ఏర్పాటైన సమాజంలోనైనా పాలక వర్గం ప్రజల్ని అణచివేయడానికే యత్నిస్తుంది’ ‘కవి కంటే కవి హృదయం గొప్పది’ ‘ఆడోళ్లకుండే జబ్బే ఇది. మగోడెంత తప్పుచేసినా ఆడదే భరిస్తాది. భరించి ఊరుకుంటాది’ వంటి వాక్యాలలో రచయిత నిత్య సత్యాలు ఆవిష్కరించారు.
ఆలోచనాత్మక కథలు అందించిన దాదాహయత్ అభినందనీయులు.

-జిఆర్కె