అక్షర

సినారె వైభవం.. ఓ కావ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినారె వైభవము
(గేయ కావ్యం)
-ఆచార్య అనుమాండ్ల భూమయ్య
వెల: రూ.100
ప్రతులకు: నవోదయ బుక్‌హౌస్
కాచీగూడ,
హైదరాబాద్-27.
*
విశ్వంభర కవి డా.సి.నారాయణరెడ్డిగారి సాహిత్య జీవితాన్ని కావ్యం - అందునా సినారె తొలి రోజుల్లో చేసిన మాత్రాఛందస్సుల ప్రయోగపు గేయ ఫణితిలోనే ఆవిష్కరించిన ఆచార్య అనుమాండ్ల భూమయ్యగారి గ్రంథం ‘సినారె వైభవము’. తెలుగు కవిత్వ లోకంలో గేయం మీద పట్టు సాధించి ఋతుచక్రం, కర్పూర వసంతరాయలు వంటి అద్భుత సృష్టి చేసిన సినారెకు ఇది సముచిత నివాళి.
గేయ కావ్యము లెన్నొ వ్రాసెను
గేయ కవి సమ్రాట్టె అయ్యెను
తెలుగు కవుల చరిత్ర యందున
నిలుపుకొనె ప్రత్యేక స్థానము
అని సినారెను భూమయ్య ప్రశంసించినట్లుగానే ఈ కావ్య రచనకూ ఒక ప్రత్యేక స్థానము సమకూడుతుంది. ఆధునిక కవుల మీద ఏదో ఒకటీ అరా కవిత్వం రాసిన వారున్నారు గానీ ఇలా సమగ్ర కావ్యం రాసిన ప్రయోగం అనుమాండ్ల వారిదే కావచ్చు.
ఆరు అధ్యాయాలుగా మలచిన ఈ కావ్యంలో అధ్యాయాలకు ఆయన పెట్టిన పేర్లు కూడా ఔచితీమంతంగా ఉన్నాయి ‘నవ్వని పువ్వు’ సినారె అచ్చులో తొలి పుస్తకం. కవిగా పూర్ణ వికసనం పొందిన వాడు కనుక తొలి అధ్యాయానికి నవ్విన పువ్వు అని పేరు పెట్టారు. చారిత్రక, కథ, గేయ కావ్యాల అధ్యాయానికి ‘కర్పూర జలపాతం’ అని నామకరణం చేశారు. సినారె ఋతుచక్రానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డు, ‘మంటలు - మానవుడు’కి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు, ‘విశ్వంభర’కు జ్ఞానపీఠ పురస్కారం లభించాయి. ఆ బహుమతి గ్రంథాల ప్రశంసాధ్యాయానికి జ్ఞాన గంగ అని పేరు పెట్టారు.
ఋతువుల నారింటిని తన
బ్రతుకున కొక ముడిని వేసి
పుట్టిన తన ఊరిని చూ
పెట్టి వ్రాసె ‘ఋతుచక్రము’

మనిషి చల్లారగూడదని
మార్తాండ బింబంలా
మండుతూనే ఉండాలని
మార్గమొకటి చూపెను కవి

వచన కవితలో కావ్యము
వ్రాయాలను తలపు పండె
అత్యున్నత పురస్కార
మందగనది మధురమయ్యె
అని అవార్డు పుస్తకాల రచనావైదుష్యాన్ని ఆ ప్రకరణంలో విశే్లషించారు భూమయ్య. పద్మ పురస్కారాలకు ఆయన వచన కవితా సంపుటాలే భిత్తిక కనుక ఆ కావ్య సంపుటుల ప్రకరణాన్ని పద్మదళాలుగా అలాగే సినీ గీతాల అధ్యాయానికి రసరమ్య గీతాలు అనీ వచన సాహిత్య వివరణాధ్యాయానికి ‘వచన వాహిని’ అనీ పేరిడి గేయాత్మకంగానే ఆయన సాహిత్య జీవిత ప్రస్థానాన్ని దృశ్యమానం చేశారు.
పరుగులెత్తెడి సృజన శక్తికి పగ్గాలు ఎవరూ వేయలేరు. ఓ కవిని గూర్చి మరో కవి, ఓ ఒజ్జను గూర్చి అంతేవాసి, కవిత్వాన్ని గూర్చి కవితాత్మకంగానే వ్రాసి మెప్పించడం అనుమాండ్ల భూమయ్య సాధించిన విజయం. సినారె వైభవము భూమయ్య రచనా వైభవం ద్విగుణీకృతమైందనవచ్చు. కవికి అక్షరాభినందనలు.

-సుధామ