అక్షరాలోచన

మరీ మరీ మననం (అక్షరాలోచనాలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆలోచనలను
ఎంతసేపు తిరగేస్తున్నా
కొత్త అంశమేదీ తళుకొత్తటం లేదు
నల్లని మబ్బులను
ఎంతసేపు జల్లెడ పట్టినా
ఒక్క మెరుపు తునక
కంటికి చిక్కటం లేదు.
ఇది సృష్టి లోపమా?
లేక అంతర్ద్రష్టి లోపమా?
లోపాలున్నప్పుడు గుణాలుంటాయి
చీకట్లున్నప్పుడు వెలుగులుంటాయి
మానవుడు
ఆవిర్భవించినప్పటి నుంచి
ప్రకృతి
ప్రభవించినప్పటి నుంచి
పరిక్రమిస్తున్న
నిరంతర సత్యమిది.
తెలిసినా తెలియనట్టు
అనుకోవటం
తెలివి వికటించినప్పుడు జరిగే
సన్నివేశం.
ఈదుతున్నా
స్థిరంగా నిల్చునట్టు భ్రమించటం
భ్రాంతి ఆవరించినప్పుడు కమ్ముకునే
సంఘటనం.
యథార్థాన్ని దిగమింగుకునే కాల్పనికత
తల వూపుతూ నడిచే కల వంటిది.
స్వప్నాన్ని సత్యమని విశ్వసించే
మనోవైఖరి
ఎండమావిలో పరిచే వల వంటిది.
ఇవి అందరికీ తెలిసిన
చిరంతన విషయాలే
మననం చేసుకున్న కొద్దీ
మరింతగా ఉద్దీపించే కాంతి వలయాలే.
*

పంచముఖి
-సాంధ్యశ్రీ
8106897404
ప్రకృతి:
ఈ యుగాదిలో తలివంపుటి గురుమెత్త
గడచిపోయిన శిశిరంపు కాన్పుగాదె
రమ్యమాకంద పత్రతోరణము గట్టి
ఇచట పుడమిపైన ప్రవహించుచుండె
ప్రకృతి యంతయు తన్మయత్వమ్ము నొంద...

తుమ్మెద:
రేకు రేకుగ విచ్చిన ఆకుచాటు
పూవు దిమ్మపై ‘బేగడ’ బుగులుకొనెను
అరనిదురలో యొక ప్రియురాలి గుబ్బ
నూలు పయ్యెద గాలికి తూలె - నాద
శీకరమ్ములు వెలువడి శీధువారె...

చిలుక:
చెట్టు యొక కొమ్మలో దిగి చెంత కులికి
హృదయ రసవీణ తీగలు కదలజేసి
పలుకు పలుకున ముత్యాల నొలకబోయ
జాలుగా సోన సెలయేరు జాలువారె
చిలుక చినె్నలు నేర్చెను చైత్ర మహిమ

కోకిల:
ఎన్ని నాళ్లయె నీ కూత ఎసలువెట్టి
తలపు చివురాకు ఎఱుపెక్కి పులకరించి
తిరుగుచున్నది నునుసిగ్గు తెరలచాటు
తేనియలు జారి చిందె గీతికలలోన
కోకిలా! కనిపించె నీ కొమ్మ యిల్లు.

కవి:
వివిధ భారమ్ము లొరసి యుద్విగ్నమైన
సుకవి హృదయమ్ము పోలిక ప్రకృతియెల్ల
ప్రతి పదమ్మున తన్మయత్వము భజించె
ప్రేమ మాధురీ వాహినీ ప్రాణపదవి
పొదువుకొంటిని మామక హృదయమందు...

వాసంత విలాసం

-డా.తిరునగరి
9392465475
మాయెలమావిపై మధురవౌ గళమెత్తిన కోకిలమ్మ ఓ
తీయని పాట పాడినది, తేనియ గుండియలోన నిండెనా
కోయిల పాటతో ప్రకృతి క్రొత్త జగమ్మయి కానుపించె నీ
తీయని వేళలో అరుగుదెంచెను దుర్ముఖి, నూత్న వర్షమై

ఆమని వచ్చినంత మానసంత ప్రియానయనాంచలమ్ములే
ఆమని వచ్చినంత గృహమంత నవీనములైన శోభలే
ఆమని వచ్చినంత హృదయమ్ముల సుందర చైత్రకాంతులే
ఆమని వచ్చినంత జగమంత వసంత పరీమళమ్ములే

కవులు ఆమనిలోన సత్కవులు ఐరి
వలపు గీతాలు పాడు కోయిలలు ఐరి
కవుల సమ్మేళనమ్ములే అవని అంత
మానసమ్ములమీటెడి గానసభలె
కానలో పికముల గానాలనే విని
తనను తామరిచెను తన్వియొకతె
అరుణంపు పాలాశవిరుల గుత్తులు చేత
పట్టితా మురిసెను పడతి యొకతె
చెఱకు కర్రను తాను చేత పట్టి యొకర్తె
మన్మథ స్వామిపై మనసు నిలిపె
విరహాన వేగెడి అరవింద ముఖియోర్తు
పరుపుపై యిటు అటు పొరలజొచ్చె
ముగుదలందున తెలియని సొగసుతోచె
ప్రౌఢలందున నిర్లజ్జ పైకి తోచె
ప్రణయ రమ్యమై ధరణి నందనము అయ్యె
విశ్వమే నేడు మాణిక్య వీణలయ్యె
వెడలిపోవు మన్మథుకును వీడుకోలు
ఆగమించు దుర్ముఖికిని స్వాగతమ్ము
జగమునేలగ వచ్చు వాసంతలక్ష్మి!
రమ్ము, శాంతి సుఖమ్ములతెమ్ము రమ్ము!
*

-డా.సి.నారాయణరెడ్డి 040-24753724