అమృత వర్షిణి

సాహిత్య రుచిని అలవాటు చేయాలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నా చిన్నతనంలో, చౌకబారైన ఏ రకపు సంగీతమూ తలెత్తని రోజులవి. సినిమాలు లేవు. అంటే 1925-40 మధ్య కాలమన్న మాట. ఎందరో రంగస్థల నటులు శాస్ర్తియ సంగీతం బాగా తెలిసి పాడే పాటలకూ, పద్యాలకూ ఆసక్తితో జనం లొంగిపోయి వినేవారు.
అద్దంకి శ్రీరామమూర్తి, రాయప్రోలు సత్యనారాయణ, ఉప్పులూరి సంజీవరావు, పారుపల్లి సుబ్బారావు, యడవల్లి సూర్యనారాయణ, తుంగల చలపతిరావు, కపిలవాయి, జొన్నవిత్తుల, సురభి కమలాబాయి, వెల్లంకి వెంకటేశ్వర్లు, మద్దాలి శేషగిరిరావు, బ్రహ్మాజోస్యుల సుబ్బారావు, ముప్పిడి జగ్గరాజు చాలా బాగా పాడేవారు అని చెబుతూ నా పరమ గురువు శ్రీ డా.శ్రీపాద పినాకపాణి, మోహన, శంకరాభరణం, ముఖారి, నాదనామ క్రియ, తోడి సురబి, బిలహరి, కానడ, ఖమాస్, భైరవి మొదలైన రాగాలన్నీ వారు పాడే పద్యాలవల్ల కీర్తనలవల్లా గుర్తించేవాణ్ణి అంటుండేవారు.
ఆ రోజుల్లో తెలుగు మాష్టర్ల గురించి చెబుతూ, బి.ఎస్. లక్ష్మణరావనే ఆయన మాకు తెలుగు బోధించేవారు. మా పాఠ్య పుస్తకాల్లో కొన్ని పాఠాలు పదాల రూపంలో ఉండేవి. ఒక పద్యపాఠం చెబుతూ ఒక పద్యాన్ని రెండుసార్లు చదివేవారు. మొదటిసారి చదివినప్పుడు ఆయన ఏయే మాటల తర్వాత ఆగుతున్నారో, విద్యార్థులంతా పెన్సిలుతో గుర్తుపెట్టుకోవాలి. మాష్టారు రెండవసారి చదివినప్పుడు ఆయన చదివిన వైనం, వైఖరి గమనించాలి. ఆ తర్వాత విద్యార్థులలో సమర్థుడైనవాడు లేచి ఆ పద్యాన్ని చదవాలి.
ఒకరోజు నావంతు వచ్చింది.
మాష్టరుగారు భైరవి రాగంలో ఒక పద్యం చదివారు. మొదటిసారి చదివినప్పుడు ఆయన ఏయే మాటల వద్ద విరుపులు విరిచారో, పెన్సిల్‌తో గుర్తపెట్టుకుని, రెండోసారి చదివినప్పుడు ఆ రాగం ఎలా పాడారో, అలాగే ప్రయత్నం చేసి పాడాను. మెచ్చుకుని మా నాన్నగారికి చెప్పారు.
నాకు సంగీతంలో ఓనమాలు దిద్దినది ఆ లక్ష్మణరావుగారే.. అని ఎంతో సంబరంతో చెప్పేవారు.
ఈవేళ పద్యాలు పాడగలిగే తెలుగు మాష్టార్లు ఎందరు? అచ్చ తెలుగు భాష, సాహిత్యంలోని రుచిని పిల్లలకు అలవాటు చేయగల సమర్థులైన ఉపాధ్యాయులెందరు? సమర్థులైన ఉపాధ్యాయులెందరు? పొరబాటున ఏ ఒకరో యిద్దరో ఉన్నా, ఆయన చేత పాడించగల వాతావరణ మెక్కడుంది? పద్యాలు పాడితే బాగుంటాయని తెలిసినవారెందరు? పాడగలిగిన వారెందరు? నా బాల్యంలో ఆడ పిల్లల బడి, మగ పిల్లల బడి అని వేరు వేరుగా ఉండేవి. ఏ సుమతీ శతక పద్యాలో భాస్కర శతక పద్యాలో గోడల మీద రాశి ఉండేవి. అవి చూసి చూసి కంఠోపాఠమై పోయేవి. చూడకుండానే అలా పద్యం చెప్పగలగటం అలవాటైన తర్వాత, క్రమంగా పద్యాలల్లటానికి అలవాటుపడి, కవులైనవారు కూడా ఉన్నారంటే ఆశ్చర్యం లేదు.
కీర్తనలా తాళం కట్టుదిట్టంగా కంటికి కనిపించకపోయినా, పద్యానికో తాళం ఉంటుంది.
వరసగా రెండేసి మాటలు, నాలుగేసి అక్షరాల చొప్పున ఉంటే ఆది తాళం మూడేసి మాటలుంటే రూపకం, ఐదేసి అక్షరాలుంటే ఝంపెతాళం, ఏడేసి అక్షరాలతో ఉంటే మిశ్ర చూపుతాళమని భావించి, పాడితే.. సదరు మాటలు తిన్నగా వెళ్ళి మనసులో కూర్చుంటాయి. రకరకాల మాటలతో గమ్మత్తుగా మనకు తెలియకుండానే పద్యానికో తాళం ఏర్పడిపోతుందనే సంగతి తెలిస్తే చాలు. సంగీత జ్ఞానం సంపూర్ణంగా ఉండక్కర్లేదు. అందంగా పసందుగా పాడేయవచ్చు.
వెనకటి రోజుల్లో పౌరాణిక నాటకాల్లోని నటీనటులకు, చాలామందికి వినికిడి జ్ఞానం పుష్కలంగా ఉండేది. శాస్తబ్రద్ధంగా గురువునాశ్రయించి నేర్చిన వారూ ఉండేవారు. సినిమా రంగంలో సుప్రసిద్ధ గాయకులు పి.బి. శ్రీనివాస్‌కు అన్నయ్య వరసైన తాతాచారనే మంచి సంగీత విద్వాంసుడు, నా గురువు వోలేటి గారికీ, తద్వారా నాకూ బాగా పరిచయం.
ఆరోజుల్లో ప్రసిద్ధి చెందిన రంగస్థల నటులలో జొన్నవిత్తుల శేషగిరిరావును చూసిన ఆయన సంగీతాన్ని విన్న అదృష్టవంతుడు.
అలనాటి నట గాయనీ గాయకులంతా పద్యాలకు ప్రాణం పోసిన వారే..
ఒకరిని మించి, రంగస్థలంపై పోటాపోటీగా పాడేవారు, నటించేవారు.
కృష్ణా జిల్లా శాయిపురం అగ్రహారంలో పుట్టి ప్రసిద్ధుడైన జొన్నవిత్తుల శేషగిరిరావు (1905-1937) రంగస్థల సంగీతం బాగా విని ప్రభావితుడైన విద్వాంసుడు. ఈ తాతాచారి.
మద్రాసు రేడియో కేంద్రంలో నిలయ విద్వాంసునిగా పనిచేసేవారు.
ఉభయ సంగీత బాణీలలో రంగస్థల నటుడు జొన్నవిత్తుల పద్య గానాన్ని గురించి కథలుగా చెప్పేవారు నాకు.
‘జొన్నవిత్తులకు’ ఆంధ్ర గంధర్వ అనే బిరుదుంది.
తోడి, శహన, శంకరాభరణం, కేదార గౌళ, సురటి, శ్రీరాగం, కాంనోజి, హిందూస్తానీ రాగాలైన భీంపలాస్ సోహినీ (మార్వా) భాగేశ్వరి, సింధుభైరవి (మనతోడి రాగంలా ఉంటుంది) వంటి అనేక రంగాల్లో పాడే పద్యాలు నభూతో నభవిష్యతి అన్నట్లుగా ఉండేవని చెప్పేవారు.
అప్పట్లో ప్రసిద్ధులైన కోనేరి రాజపురం వైద్యనాథ అయ్యర్, తిరుచ్చి గోవిందస్వామి పిళ్ళె నాదస్వర విద్వాంసుడు మధురై పొన్నుస్వామి పిళ్ళె వంటి వారెదురుగా కూర్చుని గంటలకొద్దీ రాగాలాపన చేశాడంటే. శేషగిరిరావు ఎంతటి సమర్థుడో ఊహించండి.
శకుంతల నాటకంలో దుష్యంతునిగా సావిత్రిలో సత్యవంతునిగా ద్రౌపదీ వస్త్రాపహరణం, రాధాకృష్ణ, తులాభారం, సక్కుబాయి నాటకాలలో ధరించిన కృష్ణుని పాత్రలో ఒకే శ్లోకాన్ని రాగమాలికలుగా చేస్తూ పాడేస్తోంటే, పండిత పామరులు ఆనందంతో పొంగిపోయి వినేవారట.
యిప్పుడా పద్య వైభవం అంతా గతంలోకి జారిపోయింది. పాడేవారు తగ్గిపోయారు. వినే వారిలో ఆసక్తిపోయింది.
జొన్నవిత్తుల శేషగిరిరావు మన తెలుగువాడే. పైగా మన కృష్ణాజిల్లా వాసే అని సంబరపడుతూ ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే అదే పదివేలు.

- మల్లాది సూరిబాబు 90527 65490, 91827 18656