అమృత వర్షిణి
మహనీయులు - మరువలేని జ్ఞాపకాలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
దేహికి అన్నం కావాలి. చెప్పగలడు. అన్నమే కాదు. ఇంకా ఏవేవో కావాలి. కానీ వాటిని సాధించుకొనేందుకు ఆ కోర్కెలేవిటో బయటకు అనాలి. అదే భావ ప్రకటన - ఇది ఒక్క మనిషికి మాత్రమే అనుగ్రహించి సృష్టికర్త చేసిన ఏర్పాటు. ఇందులో ఒక సొంపు ఉండబట్టే మిగిలిన జీవజాలాలవి వొట్టి అరుపులుగానూ, కూతలుగానూ మిగిలిపోయి ఈ మనిషి కూత మాత్రం ముద్దు మాటై, సాహిత్యమై చివరకు బ్రహ్మానందానుసంధాయకమై యిహ పర సాధకమైన వాఙ్మయంగా భావ రాగ తాళ సమన్వితమైన సంగీతంగా జన జీవనంలో కలిసిపోయింది.
ఏ మనిషికైనా ఒక మదింపు కావాలి. అంటే వ్యక్తిగతమైన గుణాలాధారంగా ఏర్పడే గుర్తింపు. ఎవరైనా తన వైఖరిని బట్టి అవతలి వారి నుంచి ఒక గుర్తింపు కోరతాడు.
అందులో తేడా ఏ మాత్రం కనిపించినా సరే విలవిల్లాడిపోతాడు. కవులైనా మహా సంగీత విద్వాంసులైన యిటువంటి ప్రేరణ లేదా ప్రతిస్పందనతో అద్భుతమైన కావ్యాలు అందించారు. రాళ్లను సైతం కరగించే గానంతో చరిత్ర ప్రసిద్ధులై పోయారు. మాటే మంత్రంగా జీవించారు. కవులైనా గాయకులైనా బయట నుండి లభించే పరువు మర్యాదల పల్లకీలో కూర్చోవాలని ఆశించటం దోషం కాదు. గతంలో యిటువంటి సత్కారాలూ, సన్మానాలు చేయించుకున్న మహనీయులున్నారు.
అటువంటి వారు ఒక్క పరమేశ్వరుడికే మొక్కుతారు. మరొకరికి తలవంచరు. ఇంద్రుడనీ చంద్రుడనీ పొగడవలసిన పనిలేదు.
కొందరు సంగీతమంటే ప్రాణమంటారు. పాటంటే చెవులు కోసుకుంటామంటారు. అలా అన్నంత మాత్రాన ప్రతి సంగీతానికీ చెవులు కోసుకోరు. పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి.
రియాలిటీ షోలు చూడండి.. జనం ప్రక్కవాడికేసి చూడరు. పల్లెత్తు మాటాడరు. అదే ఏ సంగీత కచేరీయో జరుగుతోందనుకోండి. నిస్తేజంగా రావటం, నిరాసక్తతో కూర్చోవటం, కాసేపు కూర్చుని వౌనంగా వచ్చి వెళ్లిపోవటం. ముఖంలో ఏ స్పందనా వుండదు. ఏదో పోగొట్టుకున్నవాడిలా కూర్చుంటారు. హరికథా పితామహ ఆదిభట్ల నారాయణదాసు హరికథా గానం జరుగుతోంది. కథ మంచి రసకందాయనంలో వుంది. ‘శిశుపాలుని వధా’ సన్నివేశం. మహాజనంలోంచి ఉన్నట్లుండి ఒక పెద్ద మనిషి మధ్య వరుసలో నుంచి మనుషుల దాటేసుకుంటూ బయటకు వెళ్లడానికి లేచాడు. దాసుగారికి రివ్వున వచ్చింది కోపం.
‘ఈ లోకంలోకి ఎందుకొస్తారో తెలియదు. ఎందుకు నిష్క్రమిస్తారో తెలియదు. నదీనాం సాగరో గతిః. కొందరి ప్రయోజనం కూడా అంతే’ అని ఊరుకున్నాడు. అంతే. ఆ మాట తనకు వర్తించేదే అనుకున్న పెద్దమనిషిని జనం అదే పనిగా చూసి నవ్వుకున్నారు.
అంతే. ఆ లేచిన వ్యక్తికి శిరచ్ఛేదనమయినంత పనైంది.
సంగీతం నేర్చుకోవాలంటే కొన్ని అర్హతలుండాలి. మంచి సంగీతం వినేందుకు సంస్కారముండాలి. ఈ రెండూ లేని కళలకు ఏ పరమార్థమూ లేదు.. అడివిగాచిన వెనె్నలే.
ఏలూరు పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమే కాదు - ఒకప్పుడు సాంస్కృతిక చైతన్యానికి కూడా కేంద్ర బిందువే. నాటకాలు, నాట్యాలు, బుర్రకథలు, హరికథలు, తరంగ గానాలు సప్తాహాలతో కోలాహలంగా వుండేది.
ముఖ్యంగా వై.ఎం.హెచ్ హాలులో జరిగే సంగీత కచేరీలు న భూతో న భవిష్యతి.
మహారాజపురం విశ్వనాథయ్యర్ (సంతానం తండ్రి) అరియక్కుడి, బాలమురళీకృష్ణ, ఎం.ఎస్.సుబ్బులక్ష్మి, ఎం.ఎల్. వసంతకుమారి, రాధ జయలక్ష్మి వంటి విద్వాంసులెందరో వచ్చి పాడేవారు. త్యాగరాజ సంగీత సభ ఆధ్వర్యంలో జరిగే ప్రతి కచేరీ వందలాది సంగీత రసికులతో నిండిపోయేది. రసజ్ఞులైన శ్రోతలే ఎక్కువగా వచ్చేవారు. అలా వచ్చేవారిలో ఇద్దరు సంగీత ప్రియులు ఆకర్షణగా కనిపించేవారు. ఒకరు, సుగంధ పరిమళాల అగరుబత్తీ వ్యాపారి ఆలపాటి రామచంద్రరావు. కచేరీ చివర దాకా కూర్చుండిపోయేవాడు.
శనివారపుపేట నుంచి పుట్టు అంధుడైన ‘ఆచార్యులు’ అనే వయొలిన్ విద్వాంసుడు ఎడ్లబండిలో వస్తూండేవాడు. సంగీత సభ సెక్రటరీ తీసుకెళ్లి స్టేజీ మీద కూర్చుండబెట్టేవాడు. కచేరీలో శ్రుతిబద్ధంగా స్వరం నిలిపి విద్వాంసుడు చేసే ఆలాపన విన్న మరుక్షణం రెండు చేతులూ ఎత్తి నమస్కారాలు పెట్టేసేవాడు. కచేరీ జరుగుతున్నంతసేపూ నాదానుభూతిలోనే మునిగేవాడు. అదీ రసజ్ఞతకు నిర్వచనం. శ్రుతి మాధుర్యం హాలంతా ఆవరించిందంటే చాలు. ఆయన వెంటనే ప్రతిస్పందించేవాడు. తెలియని ఆనందంతో ఊగిపోయేవాడు.
‘నా ఎదుకు కన్నులీయకున్న నిను గాంచే దారి ఏది?’ అంటాడో కవి. కళ్లున్నా అంధులైన వాళ్లున్నారు. అసలు హృదయంలో సంస్కారం వుండాలి. అటువంటి వారికి శారీరక లోపం లోపమే కాదు.
మధురమైన ఫలాన్ని ఇష్టంగా తింటున్నామంటే, దాని వెనక ఎంతో చరిత్ర వుంటుంది. వృక్షం పెరిగి మొగ్గ తొడిగి పుష్పించాలి. అందులో రజస్సు ఏర్పడాలి. ఆ తర్వాత పిందె అయి, కాయయై, పండుగా మారాలి. ఆనంద రసానుభూతికి విద్యావృక్షం సంగీతమనే పుష్పాన్ని పుష్పించాలి. అందులో సాహిత్యమనేదే పుప్పొడి. సరియైన సంగీత సాహిత్యాల వల్ల ఆస్తికత్వమనే ఫలం ఏర్పడుతుంది. దాని అనుభవం వల్ల కైవల్యరూపమైన బ్రహ్మానందానుభూతి లభిస్తుంది.
అందుకే ‘ఇంత సౌఖ్యమని నే చెప్పజాల’ అన్నాడు త్యాగయ్య.
ఆకలి వుంటేనే అన్నం రుచి తెలిసేది. అది లేని వాడికి పంచభక్ష్య పరమాన్నాలున్నా ప్రయోజనం సున్నా. సంగీతం కూడా అంతే.
సర్వస్వతంత్రుడైన ఆధిభట్ల నారాయణదాసుగారు బహుముఖ ప్రజ్ఞాశాలిగా చరిత్ర ప్రసిద్ధి చెందిన సంగతి సంగీజ్ఞులకే కాదు కొమ్ములు తిరిగిన పండితులెందరికో తెలుసు. విద్యలో సాధికారిత సిద్ధించిన వారికి సర్వ స్వతంత్ర భావాలుండటం కద్దు.
సంప్రదాయ సంగీతానికి పెద్ద పీట వేసేది దక్షిణాదిలోని సంగీత రసికులే. రసికులైన శ్రోతల వల్లనే అక్కడ సంగీతం పెరుగుతూ వస్తోంది. అక్కడున్నన్ని సభలు మన ప్రాంతంలో లేవు.
ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు. కాని ఆదిభట్ల నారాయణదాసు - రచ్చ గెలిచిన తర్వాతనే యింట గెలిచిన ఉద్దండుడు.
మైసూరు మహారాజు వంటి రసికులు, జమీందారులూ దాసుగారి గాన సాహితీశక్తులకు మురిసి ముచ్చటపడి తమ ఆస్థాన విద్వాంసుడుగా వుండమని కోరితే, నారాయణదాసుడు ‘నరదాసుడు’ కాలేడని నిర్ద్వంద్వంగా ముఖం మీదే చెప్పిన ధీశాలి, సర్వ స్వతంత్రుడు.
టార్చిలైట్ పెట్టి వెదికినా అటువంటి వారీవేళ కనబడరు.
సత్కవులనూ, సంగీత విద్వాంసులనూ గుర్తించగలిగే సంస్కారులెక్కడ?
మనకు లేదనే ఏడుపు ఒకవైపు అవతలి వారికి ఉందనే ఏడుపు మరోవైపు. ఈలోగా జీవితంలో సగ భాగం గడిచిపోతుంది. వెనకటి తరంలోని విద్వాంసులు అలా బ్రతకలేదు.
విజయనగర సంస్థానాధీశుల దగ్గర ఆస్థాన గాయకుడుగా ‘ఆ కొలువు తన స్వాతంత్య్రానికి అడ్డు రాకూడదనే’ నియమంతోనే దాసుగారి ఉద్యోగం సాగింది.
ఓ రోజు రాజుగారి పుట్టినరోజు వేడుక జరుపుకుంటూ కవుల్నీ, గాయకుల్నీ, వేద పండితుల్నీ పిలిచి యథోచితంగా సన్మానించాలనుకున్నారు. పండితులూ, కవులూ, గాయకులూ ప్రత్యేక ఆహ్వానాలందుకున్నారు. కొందరి ఇళ్లకు వెళ్లి పిలిచారు. అంతా వచ్చారు కానీ, దాసుగారొక్కరే వెళ్లలేదు.
ఉదయం 10 గంటల వరకూ రాజుగారు వేచి యుండి మళ్లీ పిల్చి తీసుకురమ్మని దివానుగారిని నారాయణదాసు గారింటికి పంపారు.
‘ఇదిగో చూడు. వేదశాస్త్ర ప్రసంగాలతో ఆశీర్వచనం ఈపాటికి అయిపోయుంటుంది. లేదా ఇక అవుతుంది. నాది గానం. మీ మహారాజు కావాలనుకున్నప్పుడల్లా మాలోంచి పాట ఉబికి రాదు. అది వాగీశ్వరి కృప వల్ల వెలువడే దివ్యమైన దైవీ అనుభూతి. ఇది సమయం కాదు. నాకు అమృత సంకల్పం కలిగినప్పుడే వస్తాను. ఊరికే వచ్చి సంభావన తీసుకోవడానికి ‘ఆవాహయామి, పూజయామి’ అని పూజ చేయించే పురోహితుణ్ణి కాదు. వెళ్లు’ అన్నారు నారాయణదాసు.
దివానుకు కళ్లు తిరిగినంత పనైంది. దివానుగారేమని రాజుగారికి చెప్పారో తెలియదు గానీ, ఆ వేళ మహారాజుగారు కొలువు చాలించి లేచి వెళ్లిపోయారు, అసంతృప్తితో. కార్యక్రమం అయిపోయి అందరూ ఇళ్లకు వెళ్లిపోయారు.
సాయంత్రం నాలుగ్గంటలకు దాసుగారు తన శిష్యుణ్ణి కోటకు పంపి ‘ఒక అరగంటలో వస్తున్నాను. యిష్టమైతే రాజుగారిని కొలువుకు దయచేయమను’ అని దివానుగారికి చెప్పించారు. రాజుగారు ఆ కబురందుకుని వెంటనే పుర ప్రముఖులకూ, విద్వాంసులకు ఆహ్వానాలు పంపారు. అరగంటలో అందరూ కొలువుతీరారు.
దాసుగారు దిగ్ధంతిలా అడుగులు వేసుకుంటూ సభలో ప్రవేశించి ‘ఒక వేద పనసతో, సంస్కృత పద్యంతో’ రాజుగారిని దీవించి, గానం అందుకున్నారు. ఆ రాత్రి తెల్లవారేవరకూ అమృతోసమయ గానం ముగించి కర్పూరం వెలిగించి రాజుగారికి నివాళి పట్టారు. ఈ వేళ చాలా గొప్ప విద్వాంసులని పిలిపించుకున్న వారికి ఇది సాధ్యమేనా?
మహారాజుగారి ఆనందానికి అవధుల్లేవు. కళాపోషకులనే వారి సంస్కారం ఎలా వుందో చూడండి. సభ మంత్రబద్ధమైనట్టు నిశే్చష్టమై పోయింది. ఎవరికీ చెయ్యని ఘన సన్మానం చేసి మేళ తాళాలతో దాసుగారిని ఇంటికి పంపారట ఆనంద గజపతి ప్రభువులు. ఉపన్యాసాలు దంచటం కాదు. ఆచరణ ఉండాలి. జన్మ సంస్కారముండాలి. ఇది ఎక్కడో! ఎప్పుడో! ఎవరికో జరిగినదనుకోకండి! మనవాడికే, మన తెలుగువాడికే, మన విజయనగరంలోనే ఈ శతాబ్దంలోనే జరిగింది.
సంగీతాభివృద్ధికి కావలసిన వాసనావంతులైన రసికులు సహృదయులూ అపురూపమైన ఈ రోజుల్లో ‘సంప్రదాయ సంగీతం’పైన విద్వాంసులకే గౌరవం పుట్టకపోతే రసికులు లేరనుకోవడంలో అర్థం లేదు. అర్థం లేని విషయాల మీద సాధారణంగా అనాదరణ సహజం. సంప్రదాయం పట్ల గౌరవం, ఆసక్తితో వినాలనే రుచినీ కలిగించవలసినది విద్వాంసులే.