అమృత వర్షిణి

తెలియలేరు రామ! భక్తిమార్గము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన అరచేతిని చూసుకుంటే అందులో అడ్డదిడ్డంగా ఎన్నో రేఖలుంటాయి. ఒక్క గీత మనం గీయగలమా?
మన కంటికి కనిపించకుండా ఎవ్వరూ వెదికే వీలు లేకుండా గూఢంగా ఎక్కడో వుంటూ, మన తలరాతలు రాస్తున్నాడే! ఆ మహానుభావుడు? ఎంత గొప్ప శిల్పియో చూడండి.
అర్థరహితంగా కనిపించే భగవంతుని చర్యలోనే అనంతమైన విజ్ఞత దాగి వుంది. ఈ సత్యాన్ని ముందుగా మనకంటే తెలుసుకున్న వారినే మనం పూర్తిగా నమ్మేయాలి.
ఆయన్ని బుద్ధితో కాదు. హృదయంతో అనుభవించటానికి ప్రయత్నం చేశారు. తిన్నగా ఆత్మసమర్పణ చేసేశారు. ఆ కిటుకు వారికి తెలిసిపోయింది.
దృఢమైన ఆరోగ్యం, మంచి వనం అధికాధికవైన ఐశ్వర్యం వుండి, తెలివితేటలు కూడా వుండి, అసలే కొఱతా లేని జీవితమున్నా, ఆ సంతోషం కంటే వందరెట్లు అధికమైన బ్రహ్మానంద సాగరంలో మునిగితేలిన మహానుభావుల ముందు మనమెంత?
ఈ సందర్భంలో భగవాన్ రమణ మహర్షి ఓ కథ చెప్పారు.
ఒక రాజు సేనను, పరివారాన్నీ తీసుకుని ఎంతో వైభవంతో అరణ్య మార్గంలో వెళ్తున్నాడు. దారిలో కౌపీనం మాత్రం ధరించి నేలపై పరుండి కాలి మీద కాలు వేసుకున్న ఒక వ్యక్తిని చూశాడు.
ప్రపంచంతో నిమిత్తం లేకుండా ఎంతో తృప్తిగా చెప్పలేనంత సంతోషంతో పగలబడి నవ్వుతూన్నాడు. అతని ఆనందానికి ఆశ్చర్యపడి అతన్ని తన వద్దకు రమ్మని భటులను ఆదేశించాడు.
రాజుగారి పరిచారకులు దిగంబరియై కూర్చున్న సాధువు వద్దకు వెళ్లి, రాజుగారి సందేశాన్ని తెలిపారు - సమాధానం లేదు. అలాగే చిదానంద స్వరూపుడై యున్నాడు.
రాజుగారికీ విషయం తెలిసి స్వయంగా ఆయన వద్దకు వెళ్లి విచారించాడు. సాధారణ వ్యక్తి కాదనిపించింది. సాధువుతో
‘స్వామీ! మీరు పూర్ణానందంలో మునిగి వున్నట్లు అనిపిస్తోంది. ఈ స్థితికి రహస్యమేమిటో చెబుతారా? ఏ గురు కటాక్షం వల్ల యిది లభించింది? దయచేసి చెప్పగలరా’ అన్నాడు. దానికి ఆ సాధువు రాజుతో ‘నాకు యిదివరకు 24 గురువులున్నారు. సర్వమూ ఈ శరీరము, భూమి, పనిముట్లు మరి కొందరు వ్యక్తులూ నాకు ఉపకారం చేశారు. లోకంలో ప్రతిదాన్నీ మంచిదిగానో, చెడ్డదిగానో విభజించవచ్చు. ఈ ప్రపంచం నాకు మంచేదో చెప్పింది. చెడు ఏదో కూడా చెప్పింది’ అని సమాధానమిచ్చాడు. ఆయన ఎవరో కాదు.
సాక్షాత్తూ అవధూత దత్తాత్రేయులే.
ఈ కథ చెప్పిన, రమణులు,
‘జ్ఞానమనే నిప్పురవ్వ సర్వసృష్టినీ, ప్రత్తి గుట్టను కాల్చినట్లు సులభంగా కాల్చివేస్తుంది. అహంకారమనే బలహీనమైన పునాదిపై కట్టబడిన కోట్ల కొలది ప్రపంచాల మీద జ్ఞానమనే ఆటంబాంబు (అణుబాంబు) పడినప్పుడు అన్నీ కుప్పకూలిపోతాయి’ అన్నారు.
భాగవతంలో పోతన..
అలసులు, మందబుద్ధియుతులల్ప తరాయువులుగ్ర రోగ సం/ కలితులు మందభాగ్యులు సుకర్మము లెయ్యవి సేయజాలరీ/ కలియుగమందు మానవులు గావున నెయ్యది సర్వసౌఖ్యమై/ యలవడు నేమిటం బొడము నాత్మకు శాంతి మునీంద్ర చెప్పవే’ అంటాడు.
యింకా కలియుగం ప్రథమ పాదంలోనే వున్నాం-
కలి రూపం యిప్పుడే అడుగడుగునా గోచరిస్తూంటే, మున్ముందు ఎలా ఉంటుందో ఆయన ముందే చెప్పాడు.
-తెలియలేరు రామ! భక్తిమార్గమును
-ఇలనంతటను - తిరుగుచు మరి కలువరించెదరు గానీ
-వేగలేచి నీట - మునిగి భూతి బూసి
వ్రేళ్లనెంచి వెలికి శ్లాఘనీయులై
బాగపైక మార్జన లోలురై గాని త్యాగరాజ వినుత
సాధారణంగా త్యాగయ్యగారి కీర్తనలకు వ్యాఖ్యానంతో పనిలేదు. ఏ రాగంలో ఆయన మనస్ఫూర్తిగా పాడుకున్నాడో కాస్త, అటూ ఇటూగా, వీలైతే మనం పాడితే చాలు - అదే పదివేలు - కానీ, సంగీత వాసనంటూ ఏమీ లేకుండా, సినిమా పాటల మాదిరిగా ‘ఏదో మాకు తోచిన రీతిలో ఏదో పాడుకుంటున్నాం’ అని అనుకోవడానికి ఏ మాత్రం వీలు లేకుండా కట్టడి చేసి పెట్టాడు. సంగీత జ్ఞానం లేకుండా ఎవరూ త్యాగరాజు జోలికి వెళ్లలేరు - లేదంటే ‘ఆయన పాటకు పట్ట్భాషేకాలనీ కుంభాభిషేకాలు, శతాభిషేకాలూ’ అంటూ ఏనాడో వీధికెక్కేవారు. మనం చాలా అదృష్టవంతులం. త్యాగయ్య కూడా అదృష్టవంతుడే.
మంత్రం కాని మాట, ముందుకు రాని మొక్కా వుండవు. 96 కోట్ల రామతారక మంత్రోపాసనా పరుడైన సంగీత ఋషివాక్కు రామబాణం లాంటిది.’
భక్తిలేని కవిజాలవరేణ్యులు/ భావమెరుగలేరని కవిలోజని../ భుక్తి ముక్తి కలుగునని కీర్తనముల/ బోధించి త్యాగరాజ వినుత’ - (దాశరథీ నీ ఋణము తీర్పనా తరమా)
పారితోషికాల కోసం పాడుతూంటారు. ఏం పాడుతున్నారో భావం అర్థమయ్యిందో లేదో తెలియదు. అటువంటి వారు కూడా కడుపునిండా తిని బ్రతికేలా కీర్తనలు రాశానని చెప్పుకున్న త్యాగయ్య ఋణం తీర్చుకోగలమా? చెప్పండి.
తెలియకపోతే మానవ జీవితమొక గోల. తెలిస్తే అదొక లీల.
ధర్మానికి హాని కలుగుతోందని మనకెప్పుడు తెలుస్తుందో చెప్పమంటారా?
రామాయణ భారత భాగవతాలు, పురాణేతిహాసాలు వినాలనే ఆశ పెరిగి జనం తండోపతండాలుగా ధార్మికోపన్యాసాలను వినాలనే ఆసక్తి పెరగటమే.
అంతవరకూ అయితే మంచిదే. ప్రశాంతంగా యింట్లో కూర్చుని చేయవలసినది ధ్యానం, లేదా మానసికంగా చేసే పూజ. మరొకరితో సంబంధం లేని వ్యవహారం.
నేను కడుపునిండా తింటే పక్కవాడి ఆకలి తీరదు - అలాగే పూజ. పక్కవాడి కోసం పూజలు, పునస్కారాలు అలవాటై పోయాయి.
ఒకప్పుడు కార్తీకమాసంలో ఊళ్లోని పుణ్యస్ర్తిలు చక్కగా తెల్లవారుఝామున లేచి, కాలువల్లోనో, బావుల దగ్గరో స్నానాలు చేసి ఇళ్లకు వచ్చి దీపాలు వెలిగించుకుని ఏవో వాళ్లకు తెలిసిన నామాలు చదువుకునేవారు.
సామూహికంగా రోడ్ల మీదకు వచ్చి దీపాలు వెలిగించడం, పెద్దపెద్ద విగ్రహాలూ, శివలింగాలతో చేసే అల్లరి వల్ల లభించేది భక్తి. అంటే ఎవరైనా నమ్ముతారా? పెద్దపెద్ద విశాలమైన మైదానాల్లో, ప్రాణ ప్రతిష్ఠ, ఆవాహన పూజాదికాలేమీ లేని విగ్రహాలకు సామూహిక పూజలా?
సంప్రదాయ దుస్తులతోనే ఆలయ ప్రవేశానికి రావాలనే ఆంక్షలు విధించే తిరుమల తిరుపతి దేవస్థానం సైతం ఉత్సవ మూర్తులతో వీధికెక్కి భజనలు, కోలాటాలూ సరేసరి.
వీధిలో వున్న విగ్రహాలను స్వయంభూ దేవతల్లా భావించి అత్యున్నత పదవుల్లో వున్న వారిచేత పూజలు చేయించటం చూస్తున్నాం కదా?
‘యిది తప్పు’ అని ఎవరు ‘ఎవరిని ప్రశ్నిస్తారు?’ ఆ దశ దాటిపోయింది.
‘వేగ లేచి నీట మునిగి భూతిబూని
వ్రేళ్లనెంచి వెలికి శ్లాఘనీయులై
బాగా పైకమార్జన లోలురైతే గాని’ అని త్యాగయ్య ఎందుకన్నాడో మీకు అర్థమయందా?
ఈ కొంగ జపాలు, ఒక ధ్యానాలూ కలియుగ లక్షణాలు. మానవ లోకంలో ఒక్క అంగుళం ఖాళీ లేకుండా సర్వత్రా వ్యాపించి క్రిందికీ, పైకీ గంతులేయిస్తూ మానవత్వాన్ని మరుగున పెట్టేవి కాంతా కనకాలంటాడాయన.
నిజానికి లోక వ్యవహారమంతా వీటిమీదే ఆధారపడి వుంది. ఈ రెండూ లేకపోతే అసలు వ్యవహారమే లేదు. అంతెందుకు? రామాయణ భారతాలు రెండూ ఈ రెంటికీ కేంద్ర బిందువులేగా?
మాయ సృష్టికి మాయ సంకేతాలు.
అప్పటి పరిస్థితులను బట్టి భగవంతుడే డిక్టేటర్ అవ్వవలసి వచ్చింది.
ఎదురుగా వున్న శ్రీకృష్ణుడంతటి వాణ్ణి జనం నమ్మారా? నానా యాగీ చేయలా?
ధర్మం స్థానంలో అధర్మం. నీతి స్థానంలో అవినీతి, న్యాయం స్థానంలో అన్యాయం వచ్చి కూర్చుంటే ఎవరేమి చేయగలరు?
‘్ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే’ అని శ్రీకృష్ణుడు మనకో మాటిచ్చాడు. సృష్టి ధర్మానికి తన జీవితాన్ని పరమ ప్రమాణంగా చూపించిన పూర్ణ పురుషుడు. పరిపూర్ణ అవతారుడు.
సృష్టిలోని మార్పుల్ని ముందే ఊహించి చెప్పి, మన తలరాతలు మార్చడానికి ‘గీత’ను ప్రసాదించాడు.
మహాభారతానికి ఆయువుపట్టు భగవద్గీత. తరువాత వచ్చిన సకల ఆధ్యాత్మిక సంప్రదాయాలకూ పరమ ప్రమాణం ప్రచండ వీరులైన పాండవుల్ని ధర్మం కోసం కాపాడుతూ వచ్చిన మహానుభావుడు శ్రీకృష్ణుడు.
ధర్మాధర్మాల మధ్య దూతగా పని చేశాడు. రథసారధిగా గుర్రాలు తోలడానికీ, తోమడానికీ కూడా సిద్ధపడ్డాడు. మానావమానాలకు అతీతుడైన యోగీశ్వరుడు. కురుక్షేత్ర సంగ్రామంలో దుష్టుల్ని పంపించేశాడు. వారితోబాటు శిష్టులూ వెళ్లిపోయారు. మరి భూమికి మిగిలిందేమిటి? చివరకు ఆయన కూడా తప్పుకున్నాడు. శ్రీకృష్ణుడు మిగిల్చిందేమిటి? అన్నాడో పెద్ద మనిషి.
శ్రీకృష్ణుడు మిగిల్చినదే కొనసాగుతోంది ఈ భూమీద. ఆయన భూమాతను ఒంటరిగా వదల్లేదు. భూమితల్లి బంగారు పంటలు పండించి తిండిపెట్తూంది. అంతవరకూ ధర్మం ఉన్నట్లేగా? ధర్మసంస్థాపన కోసం అంతవరకూ జరిగిన విషయాలన్నీ ఆకళింపు చేసుకున్న పరీక్షిత్తు కథను ముందుకు నడిపాడు.
కాలచక్రం గిర్రున తిరిగింది. కలి ప్రభావాన్ని చూపించడానికి సిద్ధపడుతూ వున్న సమయంలో పరీక్షిత్తు ద్వారా కలి సంతరణ మార్గమైన భాగవతాన్ని భూమి మీద జనులందుకునేలా చేశాడు శ్రీకృష్ణుడు. అలా భాగవతాన్ని ‘ముక్తికాంత’గా అందించి దేహాన్ని వదిలిపెట్టాడు పరీక్షిత్తు.
భారతమందించేది శిక్షణ.
భాగవతమందించేది రక్షణ.
ఈ ప్రపంచంలో ప్రవేశించినవాడూ, ఆహా? ఏమి నా భాగ్యం? అపురూపమైన మానవజన్మ సిద్ధించిందని పొంగిపోయి చక్కని జ్ఞానాన్ని సముపార్జించి, ఇంద్రియ సుఖాలకు దూరంగా వుంటూ, వీటివల్ల ప్రయోజనమేమీ లేదనుకునే వాడు కోట్ల మందిలో ఒక్కడే వుంటాడు. మిగతా వారి బ్రతుకులు పునరపి జననం, పునరపి మరణం అంతే. కారణజన్ములు ఒకరిద్దరే పుట్టారు. లోకంలో ఆదిశంకరుల వంటి వేదాంతులు మళ్లీ ఎందరు పుట్టారో చెప్పండి. ఇటువంటి పెద్దల అనుభవాలు, అనుభూతులు మన ఆథ్యాత్మిక ప్రగతికి బలాన్నిస్తాయి. ఎలాంటి వాళ్లకైనా పెద్దల్ని అనుసరించాలనే బుద్ధి కలగకపోతే స్వంత భావాలు కొంపముంచుతాయి. ‘హరికథలు చెబ్తూ మా నాన్నగారంటూండేవారు. ‘జీవితాలెప్పుడూ అర్థంలేని అవధానాలే. పూర్తయిందంటూ వుండదు. ఎప్పటికప్పుడు పరగడుపే. ఒకటి అవ్వగానే మరోటి. పాతది వెనక్కి వెళ్తుంది. కొత్తది ముందుకు వస్తుంది. ఒకటి పూర్తవదు. రెండోది సిద్ధవౌతుంది. చెప్పలేని ఆందోళనలు, ఆవేశాలు, అలజడులు. వీటికి పరిష్కారముండదు. ఇదో చక్రభ్రమణం.
అసలు పుట్టడం ఓ పాపం, చావడం మరో పాపం. ఐతే, పుట్టి బ్రతుకుతూ ఎలా బ్రతకాలో ఎలా వెళ్లిపోవాలో తెలియకపోవడమే ఘోరం. అదే గొప్పకళ. జీవకళ. చావు పుట్టుకలు లేని కళ ఒకటుంది. అదిగో దాన్ని పట్టుకోవాలి...’
అంతరంగంలో నెలకొని కూర్చున్న ఆత్మారాముణ్ణి వదిలేసి, ‘గుళ్లూ గోపురాలూ ఆడంబరంతో (కోసం) తిరుగుతూ, ప్రచార ఆర్భాటంతో అల్లరిచేసే ప్రబుద్ధుల్ని పై వాడు కనిపెట్టకుండా ఉంటాడా? పిచ్చిగానీ!!
దీపమున్నప్పుడే ఇల్లు చక్కపెట్టుకోమన్నారు. ‘శరీరంలో ఆత్మ’ వుందని తెలిసి కూడా ప్రాధాన్యత శరీరానికే ఇస్తున్నాం’ అన్నారు భగవాన్ రమణులు. ‘ముందు నేను’ అనే మాటను పక్కనబెట్టమన్నారు. శరీరమనేది ఆగంతుకంగా అతిథిగా వచ్చినదే. ఎన్ని రాలేదు? ఎన్ని పోలేదు? అవన్నీ ఎలాంటివో మనకు తెలియకపోవడమే అజ్ఞానం.
ఎందుకొచ్చామో తెలుసుకుని బ్రతకడమే సర్వశ్రేష్టమైన శ్రేయోమార్గం. తనకెవడైనా వ్యతిరేకంగా వుంటే వాడి మీద ‘ద్వేషం’. తన సంపాదనకు అడ్డు తగిలితే ‘క్రోధం’. తను తినడు మరొకరికి పెట్టడు, ‘లోభం’. ఐశ్వర్య మదంతో శుభాశుభలు తెలియకపోవడం ‘మదం’.
తనకంటే గొప్పవాళ్లను సహించలేకపోవడం ‘మాత్సర్యం’, కష్టాలు ఎదుటి వాళ్లకే గాని, తనకు రాకూడదనుకోవటం ‘ఈర్ష్య’. మనలా ఎదుటివాళ్లు సుఖపడకూడదనుకోవడం ‘అసూయ’. తాను చేసిన ధర్మకార్యాలు ఎదుటి వాళ్లు పదిసార్లు చెప్పుకుంటూ తిరగాలనుకోవడం ‘దంభం’, తనతో సరిపోయే వారెవరూ ఉండకూడదనుకోవటం ‘అహంకారం’. యివన్నీ మనిషి ‘మనస్సులో’ నుంచి పుట్తున్నవే! ఈ బాపతు అజ్ఞానానికి అసలు మందే లేదు. తత్త్వం తెలియని వాడికి ఇంకెందుకు పూజలు? ఏల పుణ్యకార్యాలు?
జీవుడు దుఃఖంతోనే పుట్తాడు. దుఃఖం నుంచి పారిపోవటానికి సుఖంగా బ్రతకాలని బ్రతికున్నంత కాలం ప్రయత్నిస్తాడు. సుఖమేదో, దుఃఖమేదో తెలియలేరు రామభక్తి మార్గము అనే కీర్తన త్యాగయ్య ‘దేనుక’ రాగంలో పాడుకున్నారు. సెమ్మంగుడి శ్రీనివాసయ్యర్ రక్తిగా పాడుకున్నారు పాడుతూండేవారు. నిజానికి ఈ ‘్ధనుక’ మేళ కర్త రాగమే అయినా, యిందులో ఎక్కువ రచనలు లేవు. మేళకర్త రాగాలలో ప్రధానమైనవీ వున్నాయి. అప్రధానమైన కొన్ని రాగాలు కేవలం సంఖ్య కోసమేనా అన్నట్టుగా వున్నాయి. వాగ్గేయకారులు కొన్ని రాగాలు వదిలిపెట్టారు. ప్రతి రాగానికీ ఒక్కో అనుభూతి, ఒక్కో భావం, ఒక్కో రంగు, రుచీ వున్నాయి. కాబట్టే మన భారతీయ సంగీతం, యితర బాణీలన్నిటికంటే విశిష్టమై నిలిచిపోయింది.
పరమేశ్వరుణ్ణి నామ కుసుమాలతో పూజించి తరించిన వాగ్గేయకారులే దీనికి సాక్ష్యం.

- మల్లాది సూరిబాబు 9052765490