అమృత వర్షిణి

ఉనికి ఎరుకే ఉత్తమ గతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘తెలిసి రామ చింతనతో నామము
సేయవే ఓ మనసా’
తలపులన్ని నిలిపి నిమిషమైన
తారక రూపుని నిజ తత్త్వార్థము
రామాయణ చపలాక్షుల పేరు
కామాదుల పోలు వారు వీరు
రామాయన బ్ర హ్మమునకు పేరు
ఆ మానవ జన నార్తులు దీరు ॥
అర్కమనుచు జిల్లేడునకు పేరు
మర్కట బుద్ధులెట్లు ధీరు
అర్కుడనుచు భాస్కరునకు పేరు
తర్కమనే అంధకారము దీరు ॥
అజమనుచును మే షమునకు పేరు
నిజ కోరిక లేలా గీడేరు?
అజుడని వాగీశ్వరునకు పేరు
విజయము గల్గును త్యాగరాజ నుతుని ॥
ప్రసిద్ధమైన త్యాగరాజ కీర్తనల్లో ఇదొకటి. సంగీత విద్వాంసులు సాధారణంగా పల్లవి, అనుపల్లవి తర్వాత ముద్రాచరణంతో ముగించటం అలవాటు. అంటే ‘త్యాగరాజనుత’ అనే ఆఖరి చరణమే పాడతారు.
నిశ్చల మనోశక్తికి గుర్తుగా ఈశ్వరుడే ‘దక్షిణామూర్తి’గా కనిపిస్తాడు. అంటే వృద్ధులైన శిష్యులెదురుగా పరబ్రహ్మతత్త్వాన్ని వౌన వ్యాఖ్యానం ద్వారా అందిస్తాడు.
ఆ శిష్యులకు శాస్త్ర విషయాల్లో ప్రావీణ్యత ఉంది కానీ, తత్వ సారాన్ని గ్రహించలేదు.
వారికి మిగిలిపోయిన ధర్మసంశయాలు అంతటా వ్యాపించి పోయిన దక్షిణామూర్తి మహావౌనంలో నివృత్తి అయ్యాయి.
నిశ్చల మనస్సుకు సూటైన మార్గాన్ని తన వౌనం ద్వారా లోకానికి అందించిన మహనీయులు భగవాన్ రమణమహర్షి. మహర్షి సన్నిధిలో ఒక్కొక్కరికీ ఒక్కో అనుభవం.
దక్షిణామూర్తిలో మూర్త్భీవించిన నిశ్చల మనోశక్తికి రమణుల జీవితమే శాశ్వతమైన గీటురాయి. ఒకరోజు రమణ మహర్షిని అడగాలని ప్రఖ్యాత తాత్త్వికవేత్త పాల్ బ్రంటన్ కొన్ని ప్రశ్నలను ముందుగా జాగ్రత్తగా రాసుకుని సిద్ధం చేసుకుని, ఎన్నో సంశయాలతో భగవాన్ కూర్చున్న హాల్లో ప్రవేశించారు. భగవాన్ మంచం మీద అతి సహజసిద్ధమైన స్థితిలో శాంతమూర్తియై కూర్చున్నారు.
హాలంతా నిశ్శబ్దంగా ఉంది. అలా గంటకు పైగా గడిచింది. మరో గంట గడుస్తోంది. ఇద్దరి మధ్య ఏ రకమైన సంభాషణా లేదు. వౌనమే. భగవాన్‌ని అడగాలని పెట్టుకున్న ప్రశ్నలన్నీ బ్రంటన్ నుంచి నెమ్మదిగా జారుతున్నాయి. ఆ ప్రశ్నలకు అడగాలా? వద్దా? అనేది కూడా ఆయనకు పట్టలేదు. ప్రశాంతత! ఒక నదిలా తన ప్రక్కనుంచి ప్రవహిస్తూ, తన అంతఃకరణాన్ని తాకిన అనుభూతి మాత్రం తనకు తెలుస్తోంది. ఇంక ప్రశ్నలు సంధించవలసిన అవసరం తనకు కనిపించలేదు - ఆయన సన్నిధిలో. వౌన ఆశీర్వాదం లభించింది. తృప్తిగా లేచి వెళ్లిపోయాడు బ్రంటన్.
తలపులకు తాళం వేయటమంటే అర్థం అదే. వౌన వ్యాఖ్యకు పరమార్థం కూడా అదే. భక్తులు భావాలు పంచుకుంటారు అనటానికి నిదర్శనం. త్యాగరాజు రచించి పాడుకున్న ‘పూర్ణచంద్రిక’ రాగంలోని కీర్తన ఇది.
మానవ దైనందిన జీవన విధానానికి తలమానికంగా నిలిచే కీర్తన. పట్టుమని పది నిమిషాలు ధ్యానం చేయగలిగితే చాలు - కానీ బుద్ధిని నియంత్రించి నిలబడటం చిన్న విషయం కాదు. ఎందుకంటే మన తలపులకు తలుపులుండవు. ఆశలకు, ఆలోచనలకు ద్వారబంధాలు, తాళాలూ ఉండవు.
విరామం లేకుండా దిక్కుమాలిన పరుగులే పరుగులు. ఏవేవో ఆకాశహర్మ్యాలే. పెట్టుబడి అక్కర్లేదు. కానీ తిరిగి రాని కాలం మాత్రం గాలిపాలు. తారకరాముణ్ణి తత్త్వం తెలిసి భజించే భక్తుల వెనకాలే వుండి వారి సేవ చేస్తాట్ట పరమాత్ముడు.
మనసులోని భావాలను వ్యక్తం చేయటానికి మాటలకు శక్తి లేదు. నిజానికి మాటలు చాలవు. ఎన్ని జన్మల్లో చేసిన పాపాలైనా మానవజన్మ లభించినందుకు సార్థకం చేసుకుని బ్రతకరా నాయనా’ అని నెత్తినోరూ బాదుకుని యోగులైనా, నాదయోగులైనా చెవిన ఇల్లు కట్టుకుని చెప్పారు.
త్యాగయ్య భౌతిక దేహంతో 80 ఏళ్లున్నా యశః కాయంతో ఎందుకు ఎవరి కోసం, ఈనాటికీ మన మధ్య వున్నారో తెలిస్తే చాలు. తత్త్వం తెలిస్తే అహంకారముండదు.
అహంకారం ఛస్తే ‘ఆత్మే’ తానవుతాడు. నశించే శరీరం కాదు. ఆత్మలోనే ఉంది శరీరం. ఆత్మేవ జగత్సర్వం.
ధనబలం, విద్యాబలం లేదా అహంకారం, రాజ్యాధికారం, ఇవన్నీ సహజంగా, అభిమానాన్నీ అభిజాత్యాన్ని పెంచి పోషిస్తూంటాయి.
తత్త్వం తెలుసుకునేంతవరకూ ‘సునామీ’లా ఒక ఊపు ఊపేస్తాయి. అయోమయంలో పారేస్తాయి.
ఉన్నచోట స్థిమితంగా ఉండనివ్వవు. లోకతత్త్వం తెల్సుకోవాలన్నా శరీర తత్త్వం, ఆత్మతత్త్వం తెలుసుకోవాలన్నా వివేకం ఉండితీరాలి.
అన్నిటికీ మనస్సే ప్రధానం. రామచంద్రుణ్ణి ధ్యానించినప్పుడు ఆయన నిజ తత్త్వం తెలిసి ధ్యానిస్తే అది ఫలవంతవౌతుంది. ఒక్కో మాటకు రెండు అర్థాలున్నాయి. రామ అంటే ‘స్ర్తి’ అనే అర్థముంది. తారక రాముణ్ణి స్మరిస్తే పరబ్రహ్మ స్వరూపం తెలుస్తుంది. సంసార దుఃఖ నివృత్తి కలుగుతుంది. నిజమైన సంగీత సద్గురువు త్యాగరాజే.
ముగ్గురు సంగీతమూర్తులూ ఒకే వూళ్లో వున్నారు. ఎవరి ధోరణిలో వారు పాడుకుంటూ బ్రతికారు. ఎవరి శిష్యులు వారికున్నారు. ఒకరంటే మరొకరికి గౌరవమే. అన్యోన్యంగానే ఉండేవారు తప్ప అసహనం గానీ, అహంకారంగానీ, మత్సర బుద్ధిగానీ ఎఱుగరు కాబట్టే ప్రాతఃస్మరణీయులయ్యారు. సంగీత లోకానికి ఆదర్శ పురుషులయ్యారు.
తమ జీవితాలను సంగీత మార్గంలో నడుపుకుని తరించారు. ఆ దారిని మనకూ చూపించారు.
తనకంటే గొప్పవారిని అభినందించటం, తక్కువ వారిని ప్రోత్సహించి మాట్లాడటం సంగీతజ్ఞులకుండే ప్రాథమిక సద్గుణాలు. ఇవి చాలామందిలో అరుదుగా వుంటాయి.
ఇవి లోపించినంత కాలం, వారి పాటకు పెరుగుదలంటూ వుండదు. ఎండమావిలా కనిపిస్తుంది. అంతే.
సంగీత మూర్తిత్రయమైన (శ్యామశాస్ర్తీ), త్యాగరాజు, దీక్షితులు) ఏ ఒక్కరికీ కీర్తి కండూతి లేదు. రాజులతో గానీ రాజాస్థానాలతో గానీ పనిలేదు. రాజుల్ మత్తులు, వారి సేవ నరకప్రాయమని వాళ్లకు చాలా దూరంగానే బ్రతికారు.
భద్రాచల రామదాసు, కబీరు వంటి వారెందరో వున్నారు. 96 కోట్ల రామనామ జపం చేసినది ఒక్క త్యాగయ్యే.
భక్తులలో త్యాగయ్యకు ప్రహ్లాదుడే స్ఫూర్తి. ఆదర్శమూర్తి. ఆయననే అంతరంగంలో నిలుపుకుంటూ, ఆయననే స్మరిస్తూ, ప్రహ్లాదుడికి లభించిన ముక్తి మార్గాన్ని తనకూ ప్రసాదించమని చేసే వేడుకోలు ప్రయత్నమే ఆయన ప్రహ్లాద భక్త విజయం.
సంగీతానికి అనువైన అజంత భాష మన తెలుగు భాష. అరవ దేశంలో వుండి అచ్చ తెలుగులో నాదోపాసనను మేళవించి, సప్తస్వర సుందరులను భజించి, సంగీతజ్ఞులకో మార్గం చూపించిన ఆ మహానుభావుణ్ణి తలచుకోని వారెవ్వరు?
సంగీత సాహిత్యనిధి అయిన త్యాగరాజ కీర్తనలన్నీ ఆయన మనసులో నుండి ఆశువుగా బయలుదేరినవే. అందుకే-
సాగి కమ్మెచ్చునన్ వచ్చు తీఁగకరణి
సాలెపురుగు కడుపులోని నూలు వలెను
దబ్బునన్ దొర్లిపడు కొండదారి మాడ్కి
సహజ కవిత బయల్వడి సన్నుతిగను’ అంటారు హరికథా పితామహుడైన నారాయణదాసు. త్యాగయ్య కవిత్వానికి ఆయన హృదయమే గురువు. శ్రీరామచంద్రుడే సాక్షి...
* * *
సంగీత జ్ఞాన విహీనులకు మోక్షము గలదా? యని నిర్మొహమాటంగా ధైర్యంగా త్యాగరాజు వేసిన ప్రశ్నకు కలదని నిర్భయంగా ప్రత్యుత్తరమియ్యగలిగిన వారింతవరకూ పుట్టలేదు.
ఈ వేళ అటువంటి పెద్దలు ఏర్పరచిన సంగీత మార్గంలో ఎందరు ప్రయాణిస్తున్నారు?
సంగీతాన్ని జీవికగా (తేలికగా) చేసుకుని బ్రతికేవారే ఎక్కువ. ఇంకా నయం. పాడేందుకు ఇష్టం లేకపోయినా, పాడటం తమకు తెలియకపోయినా, కనీసం ఇతరులు పాడితే సంతోషించగల చైతన్యం ఇంకా లోకంలో వుంది -అనేవారు సంగీత విమర్శకుడు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. ఒక విద్వాంసుడు గానం చేస్తూంటే మరో విద్వాంసుడు కూర్చుని వింటే గండపెండేరంతో సత్కరించి గజారోహణం చేసినంత సంబరపడే వారుంటారు. కానీ అటువంటి వారు అరుదు.
విద్వాంసుల కంటే, సంగీత పరిచయం బొత్తిగా లేని వారి ఎదురుగా పాడటమే కష్టం. వారికి తెలుసనుకుని పాడాలా? తెలియదనుకుని భావించి, దానికి తగ్గట్టుగా పాడాలా? అనే మీమాంసతో గాయకుడు సతమతవౌతాడు. వారికి బాగా పరిచయమున్న రాగాల్లోనే కీర్తనలు వినిపించటమే అవుతుంది, చివరకు. సినీ రంగంలో సుప్రసిద్ధ నేపథ్య గాయకుడు ఘంటసాల వెంకటేశ్వర్రావు పాట, ప్రతిభలను గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆయన భార్య సావిత్రిగారితో 2003వ సం.లో విజయవాడ రేడియో కేంద్రంలో నేనే ఒక ఇంటర్వ్యూ చేశాను.
‘సంగీత విద్వాంసులు సైతం మెచ్చుకునే గాయకుడు కదా మీ ఆయన? మీరున్న మద్రాసు నగరంలో ఎన్నో సంగీత సనలున్నాయి, ఎందరెందరో మహా విద్వాంసులు పాడుతూంటారు. ఎప్పుడైనా సంగీత కచేరీలకు వెళ్లి వినాలనే ఆసక్తి వుండేదా?’ అని అడిగాను. దానికి ఆమె
‘ఆయనకు కర్ణాటక సంగీతం ప్రాణం. నిజానికి ఆయనకు భిక్ష పెట్టినది ఆ సంగీత జ్ఞానమే. అదే లేకపోతే రాగాల స్వరూప స్వభావాలన్నీ ఎలా తెలుసాయి? మహాకవి కాళిదాసు చిత్రం కోసం ‘కల్యాణి’ రాగంలో ‘మాతా మరకత శ్యామా, మాతంగీ’ అనే శ్యామలా దండకం విని పరవశుడైన ఒక సంగీత రసికుడు, మా యింటికో రోజు పొద్దునే్న వచ్చి బుట్టెడు పళ్లు ముందు పెట్టి తమిళంలో మాట్లాడుతూ ‘అయ్యా! మీ వంటి గాయకుడు దొరకడం తెలుగు సినిమా రంగం చేసుకున్న పుణ్యం. నేను రెండు దశాబ్దాలుగా కేవలం కర్ణాటక సంగీత కచేరీలు మాత్రమే వింటాను. ఏ సినిమాలు చూడను. సినిమా పాటలు వినను. మా యింట్లో ఎవరూ వినరు. సినిమాలకు వెళ్లరు. ఆర్తిగా మీలా గానం చేసి మ్రోకరిల్లితే ఎదురుగా అమ్మవారొచ్చి నిలబడదా?’ అని కళ్లనీళ్ల పర్యంతమై పాదాభివందనం చేసి వెళ్లిపోయాడు. నిజానికి మనసులో సంగీత కచేరీలకు వెళ్లి వినాలనే వుండేది. కానీ సమయం సరిపోయేది కాదు.
తీరా వెళ్దామని అనుకోనేలోగా, తనలో తాను ‘ఎన్నో ఏళ్లు కష్టపడి శుద్ధమైన కర్ణాటక సంగీతం నేర్చుకుని, అందులో హాయిని అనుభవించిన నేను కేవలం బ్రతుకుతెరువు కోసం ఈ సినిమా పాటలు పాడవలసి వస్తోంది కదా’ అని చింతించవలసిన స్థితి వస్తుంది - నన్ను వెళ్లమనకు. వీలు చేసుకుని ఎప్పుడైనా ఇంట్లో కూర్చునే వింటానులే’ అనేవారు.
నిజమైన పండితునికి బుద్ధే ప్రమాణం. ఇది ప్రాచీనం, యిది అర్వాచీనం, యిది సాంప్రదాయం, యిది ఆధునికం అనే భేదాలుండవు. బుద్ధికి తోచినదానే్న ప్రమాణంగా స్వీకరిస్తారు. ప్రమాణానికి బద్ధమైన దానే్న అంగీకరిస్తారు. ఘంటసాల పాడిన సంప్రదాయ సంగీత ధోరణి పాటలే దీనికి ఉదాహరణ. మన గురించి మనమే పట్టించుకునే సమయముండదు. అవతలి వారిని గురించి ఆలోచించేదెవరు? వోలేటి సుబ్బారావనే ఆప్తమిత్రుడొకాయన వున్నారు. పరుల యోగ క్షేమాలు తెలుసుకోవటమే ఆయన ప్రవృత్తి. సంగీత సాహిత్యాలంటే ప్రాణం. ఆయన పిల్లలు అమెరికాలో వుంటారు. అక్కడున్నా, ఇక్కడున్నా దూరమైనా, భారమైనా, తాను ప్రాణంగా భావించేవారితో ఏదో ఫోన్‌లో బాతాఖానీ కాదు. స్వయంగా వారిళ్లకు వెళ్లి పలకరించే స్వభావం కలిగిన అరుదైన స్నేహశీలి.
మద్రాసు వెళ్తే ప్రముఖులను కలవకుండా యింటికి రాడు. ఆ మధ్య మద్రాసు వెళ్లినప్పుడు అక్కడ ఘంటసాల కబుర్లు తీసుకొచ్చి, వినిపించాడు. సినిమా అవకాశాలు వెతుక్కుంటూ ఆధారమూ దొరక్క మద్రాసులోని పానగల్లు పార్కులో, ఘంటసాల కాలక్షేపం చేసే రోజుల్లో రామచంద్రరావనే వ్యక్తితో స్నేహం ఏర్పడింది. మంచి సంగీత రసజ్ఞుడు.
ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ తన పాటలు రామచంద్రరావుకు పాడి వినిపించేవారుట ఘంటసాల.
ఫలానా రాగం బాగుందనీ, ఫలానా రాగం ఆ పాటకు నప్పలేదనీ చెప్పగలిగేటంత చనువును పెంచుకున్న రామచంద్రరావు విశాఖపట్నం నుంచి తమ బ్రతుకు తెరువు కోసం మద్రాసు చేరాడు. క్రమంగా అక్కడే ఇద్దరికీ స్నేహం పెరిగింది. సినిమా రంగంతో ఘంటసాల కాస్త నిలదొక్కుకోగానే అతన్ని తన వద్దే ఉంచేసుకున్నారు. చాలా కాలం ఘంటసాల ఇంట్లోనే ఉంటూ, ‘సావిత్రమ్మగారికి వంటలో సహాయపడుతూ వుండేవాడు’ అని చెప్పిన సావిత్రిగారు చెప్పిన మాటలు గుర్తుచేశాడు.
* * *
ఇంట్లో పూజా మందిరంలో కూర్చుని ఆ ఏడుకొండలవాణ్ణి తలచుకోండి. వెంటనే ఆ దివ్య మంగళ విగ్రహుని రూపం కంటికి కనిపించదూ? ఇక్కడ కూర్చుని అమెరికాలో వున్న మీ పిల్లల్ని ఓసారి తలుచుకోండి. చిరునవ్వులు చిందిస్తూ గబగబా మీ ఒళ్లో వాలేసి మీ మనవలు, మనవరాళ్ల మొఖాలు మనసులో నిలిచి సంతోషాన్ని నింపేయవూ?
ఒకటే పదార్థం. రెండు రూపాల్లో కనిపించినట్లుగా సంగీతంలో రాగాలు కూడా అంతే - రాగాన్ని స్మరించగానే ‘ఆ రాగ దేవతలు’ సాక్షాత్కరించినట్లుగా విద్వాంసులు పాడేవారొకప్పుడు. పాలు, నీరు కలిసినట్లుగా రాగం, భావం కలిసి ఖరహరప్రియ, కాంభోజి, కాపీ, కీరవాణి, కల్యాణి, మోహన వంటి ఎన్నో రాగాల్లో పాడే కీర్తనలన్నీ ఆ రాగాల్ని ప్రతిబింబించే సాహిత్య రూపాలే. రాగం, సాహిత్యం వేరువేరు కాదు’ అని భావించి రాగభావం బాగా తెలిసి పాడాడు. కాబట్టే ఘంటసాల వెంకటేశ్వర్రావును నేటికీ జనం తలుచుకోవటంలో ఆశ్చర్యం లేదు.
ఈ వేళ సినిమాలకు రాగాలతో నిమిత్తం లేదు - ఏదో ఓ బీటు వుంటే చాలు - సంగీత జ్ఞానం విధిగా గాయకులకుండాలనే నియమం లేదు - నాద సుఖంతో పని లేదు.

- మల్లాది సూరిబాబు 9052765490