అమృత వర్షిణి

సినీ సిగబంతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శృతితో పాడటం వేరు. శృతిలోనే మునిగి పాడటం వేరు. తేడా వుంది.
మన కర్ణాటక సంగీతంలో కంటే హిందూస్థానీ సంగీతంలో ఈ శృతి సుఖానికీ శృతి జ్ఞానానికే ఎంతో ప్రాధాన్యత నిస్తారు. స్వరాలపై బాగా నిలిపి చేసే సాధనకే ఎక్కువ సమయం కేటాయించుకుంటారు. అపశృతి దోషం లేకుండా చూసుకుంటూ జాగ్రత్తగా పాడతారు. యథావిధిగా నిత్యం పూజలు చేసినంత మాత్రాన కనిపించని దేవుడు ఒక్కసారి ప్రత్యక్షవౌతాడా? క్రమం తప్పక నిత్య సాధన చేసే విద్వాంసులకు లభించే సంగీత సిద్ధి కూడా అంతే. డిగ్రీలు, డిప్లొమోలు కాదు. నిశ్చలమైన భక్తి, చంచలం లేని ఏకాగ్రత ఉండాలి. కాల నియమంతో పని లేదు. వుండకూడదు. ఒక్కరోజు సాధన మానేస్తే, పాడే విద్వాంసునికే ఆ లోపం తెలిసిపోతుంది. రెండు మూడు రోజులు మానేస్తే ఆ లోపం వినే శ్రోతకు వెంటనే తెలిసిపోతుంది. ‘అనగననగ రాగ మతిశయిల్లు తినగ తినగ వేము తియ్యగ నుండు.
ఎంతో పేరున్న పెద్దపెద్ద విద్వాంసులు సైతం వారి నిత్యసాధనలో సరళీస్వరాలు, అలంకారాలు, జంట, దాటు వరుసలు సాధన చేయటం నా కళ్ళారా చూశాను. ఇలా స్విచ్ వేయగానే అలా బల్బు వెలిగినట్లు, ఒక్కసారి షడ్జం ప్రారంభించగానే వెళ్లి తిన్నగా వారి గాత్రాలు ‘శృతి’లో చేరి పాయసం రుచి చూసినట్లుగా ఉంటాయి. అదో సుకృతం. గాయకులందరికీ లభించదు.
శరీర బలాన్ని పెంచుకోవటానికెంత సాధన కావాలో, రక్తిగా శృతి మాధుర్యంతో పాడేందుకు కూడా అంతటి సాధనా కావాలి. దీనికి దగ్గర దారులంటూ వుండవు. పైరవీలు చేసి పైకి రాలేరు.
ప్రజలకు నచ్చిన వస్తువులు తయారుచేసి అమ్ముకోవటం వ్యాపారి ధర్మం. తాను సృష్టించినవి నాణ్యతతో రుచి పుట్టేలా చేయటం కష్టమైన రెండవ ధర్మం.
అసలేమి పాడుతున్నారో తెలిసి, అర్థం చేసుకుంటూ పాడితే తిన్నగా అది వినేవాళ్ల హృదయాలకు చేరుతుంది. రుచి పుట్టేలా పాడే బాధ్యత గాయకులదే. అలా ఎన్నాళ్లు పాడినా, ఎనే్నళ్లు పాడినా రుచి తగ్గకుండా పాడిన సినీ నేపథ్య గాయనీ మణులలో ఒకరు మన సుశీల. మరొకరు అక్కడ లతామంగేష్కర్. ఈ ఇద్దరూ ఎవరినో అనుకరించో మరెవ్వరినో ఆశ్రయించో ఈ రంగాల్లోకి రాలేదు. చెప్పుకోదగ్గ సంగీత నేపథ్యం ఉండి ఎన్నో సంవత్సరాల సాధనతోనే ఆ రంగాల్లో బాగా నిలదొక్కుకున్న సరస్వతీ రూపాలు. అసలు సినిమాకు పాటలవసరమా? సంగీతం అవసరమా? నృత్యాలు, ఫైట్లూ లాంటి అల్లరి కావాలా? అంటే కావాలి అనే చెప్పాలి. ఎందుకంటే కాస్తో కూస్తో కళాదృష్టి కలిగి చేసే పెద్ద వ్యాపారం సినిమా. లేనివి ఉన్నట్టూ, ఉన్నది లేనట్లూ చూపించాలి. హీరో హీరోయిన్‌లు బాగా సంగీతం నేర్చుకుని పాడుతున్నారనే భావన చూసేవారిలో కలిగించాలి. దీనికి నేపథ్య గాయనీ గాయకులదే ఎక్కువ బాధ్యత. కేవలం మూడున్నర నిమిషాల్లో ఒక పాటను రక్తికట్టేలా మళ్లీ మళ్లీ వినాలనిపించేలా పాడటం, పాడించటం తమాషా వ్యవహారం కాదు. వెనకటి తరంలో ప్రతి సంగీత దర్శకుడూ ప్రాణం పెట్టి మరీ పాటలు కట్టేవారు. అన్ని పాటలూ బాగుండాలనీ, అందరికీ నచ్చాలనీ అనుకునేవారు. అలాగే వుండేవి కూడా. కారణం, వారెవ్వరూ, ఎక్కడో గాలికి కొట్టుకొచ్చి, సినిమా రంగానికి చేరిన వాళ్లు కాదు. పాడ లేకపోయినా పాటలు కట్టడానికి సిద్ధపడినవారూ కాదు. అందరికీ సంగీత నేపథ్యం వుంది. వారి అపారమైన సంగీతానుభవమే నేపథ్య గాయనీ గాయకులు రాటుదేలి పాడేలా చేసింది. చెక్కుచెదరని పరిణతిని సాధించి పెట్టింది. దక్షిణాదిలోనూ, ఉత్తరాదిలోనూ లబ్ధప్రతిష్టులైన సంగీత దర్శకులందరూ రాగ సముద్రంలో ఈదులాడినవారే. కెరటాల్లా ఎగిసిపడిన ఐడియాలతో ఆణిముత్యాల్లాంటి పాటలను వీనుల విందుగా చేసి వెళ్లిపోయారు.
ఆ పాటలన్నీ కాలచక్రంలో కరిగిపోయి కనిపించకుండా పోలేదు. ఇంకా నేటికీ వినిపిస్తూనే వుండటానికి కారణం ఈ గాయనీ మణులే. ఏమిటి కారణం? ఈ యిద్దరూ పాడిన ప్రతి పాటలోనూ శృతి శుద్ధత, స్పష్టమైన ఉచ్చారణ, నిక్కచ్చిగా వినబడే లయ. ఎంతటి క్లిష్టమైన సంగతులనైనా గొంతులో పలికించగల నేర్పు, అన్నిటికంటే మించి, గొంతులో మధువులొలికే మాధుర్యం - సంప్రదాయ సంగీతం నేపథ్యం.
అంతో, ఇంతో తేడా వున్నవారు వీరితో పోటీ పడలేక ద్వితీయ స్థానంలోనే వుండిపోయారు.
ఘంటసాల వెంకటేశ్వరరావు నేర్చుకున్న విజయనగరం సంగీత కళాశాలలోనే సుశీల కూడా సంగీతాభ్యాసం చేసింది. దక్కిన అవకాశాలను చక్కగా సద్వినియోగం చేసుకుని గాయనిగా స్థిరపడిపోయింది.
ఆమెకు 75 ఏళ్లు నిండిన రోజుల్లో నేనొక ఆల్బమ్ రికార్డు చేశాను. కళ్లు మూసుకుని స్టూడియోలో కూర్చుని వింటూంటే పాతిక ముప్పై ఏళ్ల వయసు వాళ్లు పాడిన అనుభూతి.
ఉక్కపోతగా ఉండి కిటికీ తలుపులు తీస్తే మెలమెల్లగా చల్లని గాలి వొంటికి సోకితే ఎలా ఉంటుందో, లతా సుశీల పాటలు అలా ఉంటాయి.
కర్ణాటక సంగీతంలో మహారాణిగా వెలుగొందిన ‘్భరతరత్న’ సుబ్బులక్ష్మికి సంగీత గురువులు పది మందికి పైనే. పి.సుశీల చేత పాటలు పాడించిన సంగీత దర్శకులు కూడా గురు సమానులే. అందుకే సాలూరి రాజేశ్వర్రావు, హనుమంతరావు, ఘంటసాల, వేణు, పెండ్యాల, సుసర్ల దక్షిణామూర్తి, అశ్వత్థామ లాంటి సంగీత దర్శకులు చేసిన ప్రతి పాటా ప్రాణం పోసుకుని పలకరిస్తాయి. ఆయా సంగీతజ్ఞుల ఊహించిన పాటలకు ఆయా నటులు పాడిన అనుభూతినిచ్చాయి. మహారాష్ట్ర సంగీతం మనకు అలవాటు చేసినది జొన్నవిత్తుల శేషగిరిరావు, కపిలవాయి లాంటి ఆనాటి రంగస్థల నటులే.
ఆ ప్రాంతంలో వారు పాడే అభంగాలు ఎంతో ప్రసిద్ధం. అన్నీ సంగీత ప్రధానంగా గోముఖం నుండి గంగ వెలువడినట్లుగానే వుంటాయి. ఏయే రాగ సంచారాలు ఎటువంటి మాటలకు నప్పుతాయో అనుభవంతో బాగా తెలుసుకుని మరీ పాటలు కట్టేవారు. అందులో నిబద్ధత కనిపించేది. ఇప్పుడు వినబడే సాహిత్యంలోనూ, సంగీతంలోనూ ఇది కనిపించదు.
ఆ మాటలేమిటో ఆ దరువులేమిటో ఒక పట్టాన అర్థంకాదు. యథారాజా తథా ప్రజా.
లతా మంగేష్కర్ కుటుంబమంతా సంగీతమయమే. తండ్రి, సోదరుడు, చెల్లెళ్లు సంగీతాన్ని బాగా వొంటబట్టించుకున్న వాళ్లే. తప్పొప్పులు మరొకరు చెప్పవలసిన పని లేకుండా నిర్దుష్టమైన సంగీత శిక్షణ ‘లత’ది.
సుశీల, లతా పాడిన పాటలన్నీ పెదవులతో పాడినవి కాదు. మనస్ఫూర్తిగా ఆ పాటలు వారే రాసి, వారే కంపోజ్ చేసుకున్నట్లుగానే ఉంటాయి. ఎన్ని దశాబ్దాలైనా అవి చిరంజీవులే. ప్రతిష్టాత్మక పద్మభూషణ్ బిరుదు పొంది అత్యధిక సంఖ్యలో వేలాది పాటలు పాడి, ఎన్నో అవార్డులు సొంతం చేసుకుని ఆరు దశాబ్దాలకు పైగా చిత్రరంగంలోనే స్థిరపడ్డ లతాకు సుశీలకూ ఈ వేళ ఎనిమిది పదులకు పైగా వయసున్నా గాత్రాలకు వృద్ధాప్యం లేదు. సుశీల కంటే వయసులో పెద్ద లత. పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు మొదలైన జాతీయ స్థాయిలో అవార్డులన్నీ లతాను వెతుక్కుంటూ వచ్చి చేరి, ఆమె కీర్తిని ప్రపంచం నలుదెసలా వ్యాపింపజేశాయి. చిత్రగుప్త, అనిల్ బిశ్వాస్, నౌషాద్, సలిల్ చౌదరి, మదన్‌మోహన్, ఎస్.డి.బర్మన్, లక్ష్మీకాంత్ ప్యారేలాల్, శంకర్ జైకిషన్, ఖయ్యాం, రోషన్ వంటి అనుభవజ్ఞులైన ఎందరో సంగీత దర్శకులు లతామంగేష్కర్‌ను హిందీ చలనచిత్ర రంగంలో మకుటం లేని మహారాణిని చేశారనటంలో ఆశ్చర్యం లేదు. వీరి క్రమశిక్షణ, పట్టుదల, లక్ష్యసాధన ఈతరం యువతరానికి ఆదర్శప్రాయం.

- మల్లాది సూరిబాబు 90527 65490