అమృత వర్షిణి

సుస్వర మాంత్రికులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ సినీ దర్శకుడు బాపుగారితో నాకున్న అనుబంధం స్నేహం, ఒకనాటిది కాదు. మా ఇద్దర్నీ కలిపినది ఘజల్ సంగీతం. బహుశా హిందుస్థానీ సంగీతం ఆయన విన్నంత ఏ సంగీత దర్శకుడూ విని ఉండకపోవచ్చునేమో!
నిత్యం ఎక్కడో ఒకచోట అలజడి అల్లర్లతో సతమతమయ్యే మన పక్క దేశం పాకిస్తాన్‌లో అద్భుతంగా పాడే గాయకులు ఘరానాలున్నారంటే ఆశ్చర్యమే. రోషనారా బేగమ్, ఉస్తాద్ సలామత్ ఆలీఖాన్, నజాకత్ ఆలీఖాన్ ద్వయం పేరు వినని సంగీత ప్రియులుండరు. వారి గ్రామఫోన్ రికార్డులు అనేకం. నజ్రత్ ఫతే ఆలీఖాన్ లాంటి ఖవ్వాలీ సూఫీ గాయకులకు అక్కడున్న ఆదరణ అంతా ఇంతా కాదు. ప్రశాంతంగా సంగీతం వినే వాళ్లున్నారంటే చిత్రమే. పది పదిహేను సంవత్సరాల క్రితం తరచుగా నేను మద్రాసు వెళ్లినప్పుడల్లా బాపును కలవకుండా వచ్చేవాణ్ని కాదు.
సాయంత్రం ఫోన్ చేసి ‘అయ్యా! బయలుదేరుతున్నాననగానే’, ‘మీదే ఆలస్య’మంటూ పరమ సంతోషంగా రమ్మనేవారు. కాసేపు తన పనుల్ని పక్కనపెట్టి సిద్ధంగా ఉండేవారు. ఓ సాయంత్రం ఆయనుండే ‘చిత్రకల్పన’ ఆఫీసులోనే కలుసుకుని ఇద్దరం ఓ గంట గంటన్నరసేపు మాకిష్టమైన గాయకుల ఘజల్ టుమ్రీ సంగీతం విన్న తర్వాత నేను బయలుదేరబోతూ గేటు దగ్గర ఆగి చూస్తే ‘సుసర్ల దక్షిణామూర్తి’ అనే పేరు కనబడింది. బాపుగారి స్నేహితుడు శ్రీరమణను అడిగాను. అయ్యా! ఈ ఇల్లు ఆయనదే. ఇప్పుడు మాత్రం అన్యాక్రాంతం - అనగానే కాస్త మనస్సు చివుక్కుమంది. ఎంత వెలుగున్నా చీకటి కూడా దానికి సమానంగానే వుంటుంది. సంపద ఎంత వున్నా పక్కనే ఆపద పొంచే ఉంటుంది.
ఒక్కసారిగా సినిమా రీలు తిరిగినట్లు సుసర్ల సంగీత ప్రస్థానం పక్కనే వున్న శ్రీరమణతో ముచ్చటించుకుని వస్తూ కారెక్కాను.
మన కళ్లెదురుగా అల్లరిచిల్లరిగా తిరిగి కొంత కాలానికి ఉన్నట్లుండి అఖండ ఖ్యాతి నార్జించటం వారిని గురించి కథలు కథలుగా చెప్పుకోవటం మనకు అనుభవమే.
మరి కొందరుంటారు. పువ్వు పుట్టగానే పరిమళం అందుకున్నట్లు బీరువాల మీదా, డబ్బాల మీద అదే పనిగా చేతులాడిస్తూ క్రమంగా లయజ్ఞానం స్వాధీనమై అనతికాలంలో ఏ మృదంగ విద్వాంసుడో, సంగీత విద్వాంసుడో అయిపోయి పేరు తెచ్చుకున్న వారుంటారు. వారిలో నిగూఢంగా వున్న ప్రవృత్తి ఊరికే కూర్చోనివ్వదు. వాళ్లనుకున్నది సాధించేవరకూ నిద్రపోనివ్వదు. త్యాగరాజ శిష్య ప్రశిష్య పరంపరలో సుసర్ల వారిది సంగీత వంశం. ఈయన తాతగారు, అవనిగడ్డకు పక్కనే వున్న పెద కళ్లేపల్లిలో వుండే త్యాగరాజ శిష్య ప్రశిష్యులలో ఒకరు. సుసర్ల వారి శిష్యుడే పారుపల్లి రామకృష్ణయ్య పంతులు. బాలమురళీ ప్రభృతులందరూ పంతులుగారి శిష్యులే. సంగీతం అలాగే పెరగాలి. అలాగే పెరుగుతుంది. తాతగారి సంగీత వారసత్వం మనవడైన దక్షిణామూర్తికి అబ్బింది. మానాంబు చావిడి వెంకటసుబ్బయయ్య శిష్యుడే సుసర్ల దక్షిణామూర్తి. సినిమా సంగీతం విషయంలో ఎవరికీ రాత్రికి రాత్రే పేరు ప్రఖ్యాతులు సిద్ధించవు. డిప్లొమోలు, డిగ్రీలు వాళ్లడగరు. అవసరం లేదు. లక్షలు కోట్లు పెట్టుబడి పెట్టి సినిమాలు తీసేవాళ్లకు కావలసినది పాపులారిటీ. ప్రజాదరణ కేవలం రస హృదయం మాత్రమే సరిపోదు. దక్షిణామూర్తి సినిమాల్లో నిలదొక్కుకుని నిలబడటానికి ప్రధాన కారణం అప్పటి సంగీత వాతావరణమే! ‘డొక్కశుద్ధిగా సంగీతం నేర్చుకుని వచ్చి చేరిన ఘంటసాల, సుశీల, లీల లాంటి వారు తిరిగి చోట్ల ఏవేవో గాలిపాటలు చేస్తే ఔచిత్యం ఉంటుందా? జనం మెచ్చుకుంటారా? పిఠాపురం నాగేశ్వర్రావు, ఎ.ఎం.రాజా, పి.బి.శ్రీనివాస్ లాంటి నేపథ్య గాయకులు పాడినవి కూడా ఆ రోజుల్లో సంగీత గౌరవంతోనే వుండేవి తప్ప, చౌకబారుగా మాత్రం వుండేవి కావు. సమతుల్యం చెడేది కాదు. దక్షిణామూర్తి చిన్నప్పటి నుంచి సంక్రమించిన సంగీతాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. గాత్రం, వయొలిన్ రెంటిలోనూ ప్రావీణ్యం సంపాదించాడు. మనోధర్మ జ్ఞానం గొప్పది.
ఆయనకు స్వరశిల్పి అనే బిరుదు ఉంది. 1950లో విడుదలైన ‘సంసారం’ చిత్రంలోని పాటలు మీరు గుర్తుకు తెచ్చుకుంటే ఆ బిరుదుకు ఆయన పూర్తిగా అర్హుడనిపించక మానదు. ఘంటసాల పాడిన ‘చల్లని వెనె్నలలో చక్కని కనె్న సమీపములో’ పాట ఒక్కటి చాలు. ఆయనలోని అపారమైన మనోధర్మం ఎంతో సామాన్యుల కంటే ఎక్కువగా సంగీత ప్రియులే గ్రహించగలరు.
ఎస్.పి.కోదండపాణి, ఎం.ఎస్.విశ్వనాథన్ లాంటి సంగీత దర్శకులు దక్షిణామూర్తికి సహాయకులుగా పని చేశారు. సుప్రసిద్ధులయ్యారు. మా గురువు గారైన వోలేటి వెంకటేశ్వర్లు గారికి మద్రాసులో ఉద్యోగానే్వషణలో వుండే రోజుల్లో సంగీత జ్ఞానం, సంస్కారం కలిగిన సినీ సంగీత దర్శకులతో పరిచయాలుంటూండేవి. వారిలో భీమవరపు నరసింహారావు ఒకరు. ‘అర్ధాంగి’ సినిమాలో ‘వద్దురా కన్నయ్యా!’ జిక్కి పాడిన పాటకు నిజానికి కాపీ రాగంలో స్వరకర్త వోలేటిగారే ఆ బిఎన్‌ఆర్ దగ్గర దక్షిణామూర్తి పని చేశారు.
సంగీత దర్శకులైనంత మాత్రాన అందరూ పాడలేరు. పాడలేని వారు ఐడియాలిస్తారు. లేదా వాద్యం ద్వారా వారి భావాలను వ్యక్తపరుస్తారు. తర్వాత బాధ్యతంతా నేపథ్య గాయకులదే. గాయకులైన సంగీత దర్శకులకు లభించే ఫలితం ఎక్కువ. మిగిలిన వారంతా ఎంత వారైనా నేపథ్య గాయకులపైనే ఆధారపడతారు. ఉభయులూ పాడగలిగిన వారే అయితే ‘్భలే భేషుగ్గా’ ఉంటుంది.
గాయకుడి శక్తి సామర్థ్యాలు తెలిసిన సంగీత దర్శకులు, తామనుకున్న క్వాలిటీ వచ్చేంతవరకూ సాధించి తీరుతారు. పాడిస్తారు. ‘షణ్ముఖ ప్రియ’ రాగంలో ఘంటసాల చేత పాడించిన ‘దేవీ శ్రీదేవీ’ పాటే దీనికి ఉదాహరణ. ఇటువంటి వారికి సమర్థులైన నేపథ్య గాయకులు లభించటం పెద్ద వరం.
బాగా పాడగలిగిన దక్షిణామూర్తి హెచ్‌ఎంవి రికార్డింగ్ కంపెనీలో పని చేసే రోజుల్లో కొన్ని లలిత గీతాలు పాడారు. గ్రామఫోన్ రికార్డులుగా విడుదలయ్యాయి.
నేను విజయవాడ రేడియో కేంద్రంలో పనిచేసే రోజుల్లో తరచు ఆ పాటలు వినిపించేవాణ్ని.
సాధారణంగా కాస్త పేరు ప్రఖ్యాతులు రాగానే సంగీత దర్శకులు కూడా పాడే ప్రయత్నం చేస్తారు. కాదనటానికీ, వద్దు అనటానికి ఎవరూ సాహసం చేయరుగా!
సాలూరి రాజేశ్వర్రావు, మాస్టర్ వేణు లాంటి వారు చక్కని గాయకులైనప్పటికీ కొన్ని పరిమితులకు లోబడే వుండేవారు. సాహసించి తామూ పాడతామనేవారు కాదు. ఆ ధైర్యం చేయలేదు - అదీ విశేషం.
సుసర్ల వారూ అంతే. కానీ ఒకటి రెండు సార్లు అక్కినేనికీ, ఎం.జి.రామచంద్రన్‌కూ పాడారు.
సుమారు 135 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించినా దక్షిణామూర్తిగా బాగా పేరు తెచ్చిన సినిమాలు నర్తనశాల, సంసారం, సంతానం, ఇలవేల్పు ప్రముఖంగా చెప్పాలి. డా.మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ఎం.ఎల్. వసంతకుమారి వంటి సంగీత విద్వాంసుల చేత పాడించిన చరిత్ర కలిగిన దక్షిణామూర్తి, తెలుగులోనే కాదు తమిళం, మలయాళం, సింహళం, కన్నడ భాషా చిత్రాలనేకం చేశారు. తనకంటూ ఒక ప్రత్యేకతను సిద్ధింప చేసుకున్న దక్షిణామూర్తి లాంటి వారు ఏం సుఖపడ్డారో, ఏమి సంపాదించి కూడబెట్టారో తెలియదు. కానీ సంగీతానికే అంకితమై బతికారు.
కర్ణాటక సంగీతం బాగా సద్గురువు సమక్షంలో నేర్చుకుని చక్కని మనోధర్మంతో పాడేవి కీర్తనలు, రాగాలు.
సినిమా సంగీతానికంటూ శిక్షణా కేంద్రాలు కళాశాలలూ ఉండవు. సంగీత జ్ఞానం సంపాదించాలనే కోరిక లక్ష్యం ఒక్కటే ఉండాలి. అవసరం కూడా.
పాడాలనే కాంక్ష ఒక్కటే అర్హత కాదు. విని నేర్చుకునే నేర్పు, లాఘవం, తెలివితేటలూ, మాధుర్యం నిండిన గాత్రం కూడా అవసరమే. రాజేశ్వర్రావు, వేణు, పెండ్యాల, అశ్వత్థామ లాంటి ఉత్తమ శ్రేణి సంగీత దర్శకులూ, ఘంటసాల వెంకటేశ్వర్రావు లాంటి గాయకులు, సంగీత దర్శకులూ చేసిన పాటలన్నీ ఇప్పటికీ వినగల్గుతున్నామంటే కారణం ఒక్కటే. రెండు మూడు గంటలసేపు పాడగా పాడగా, లభించిన సంగీత కచేరీకి లభించిన ఖ్యాతి, కేవలం మూడు మూడున్నర నిమిషాల వ్యవధి రికార్డులో మొత్తం రాగభావం, సాహిత్య భావం మనసులో నాటుకునేలా చేసేసి కొన్ని దశాబ్దాలపాటు ఎప్పుడు విన్నా, అప్పుడే విన్న అనుభూతిని మిగిల్చి వెళ్లిపోయిన గాయకులూ, సంగీత దర్శకులెప్పుడూ చిరస్మరణీయులే. అటువంటి ఉన్నత ప్రమాణాలతో పాటలు చేయగలిగిన వారూ, పాడగలిగిన వారూ తగ్గిపోయారు. నానాటికీ తీసికట్టు నాగంబొట్లు సామెతలా, అన్ని రంగాల్లో పడిపోయినట్లుగా సినీమా సంగీతంలో కూడా ప్రమాణాలు దిగజారాయి. రసజ్ఞత కరువైంది. పైగా ఏమి పాడుతున్నారో, ఎలా పాడుతున్నారో తెలియని గందరగోళం అయోమయ స్థితిలో కోట్లు ఖర్చు చేస్తూ ఆడియో వేడుకలు.. అదే సంగీతమనుకుని భావించే వారికి ఏం మాట్లాడినా, రాసినా, బదిర శంఖారావమే. జ్ఞాన సంపన్నులకు వారసులు పుట్టినట్లు అజ్ఞానులకూ వుంటారు వారసులు.

- మల్లాది సూరిబాబు 90527 65490