అమృత వర్షిణి

ఘటనలన్నియు నీ సంకల్పమేనయ్యా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీరామచంద్రుడు మాయా మానుష విగ్రహ స్వరూపుడు. కృష్ణుడు లీలా మానుష విగ్రహ రూపుడు. దుష్ట శిక్షణ, ధర్మరక్షణే పరమావధిగా ఉన్నప్పటికీ త్రేతాయుగంలో రామావతారానికీ, ద్వాపర యుగంలో కృష్ణావతార ప్రయోజనానికీ వ్యత్యాసం ఉంది.
ధర్మానికి కట్టుబడి బ్రతికే ఐదుగురు ఒకవైపు, అధర్మ జీవనమే లక్ష్యంగా సాగిన నూర్గురు మరోవైపు మధ్యలో కృష్ణుడు. అంతా నాకే అనే దుర్బుద్ధి కలిగిన అన్నదమ్ముల పిల్లల మధ్య అకారణంగా పుట్టుకొచ్చిన వైరం. ఫలితం కురుక్షేత్ర సంగ్రామం.. అందరికీ తెలిసిన కథే. విషాద స్థితిలో ఉన్న అర్జునుడు నా కర్తవ్యమేమిటో నాకు బోధపడటం లేదు అన్నాడు.
కర్తవ్యాన్ని బోధపరచుకోవడానికి కావలసిన తత్వజ్ఞానాన్ని సరసంగా సమగ్రంగా ఉపదేశించాడు ఆ పరమాత్మ. చూడు! చెప్పవలసినదంతా నీకు చెప్పాను. కావలసిన జ్ఞానమంతా ఇచ్చాను. ఇంక నీ కర్తవ్యాన్ని నిర్ణయించుకుని ముందుకు సాగడమే నీ పని అన్నాడు శ్రీకృష్ణుడు. తత్త్వమైతే అర్థమైంది గానీ, అర్జునుడికి కర్తవ్యమే గ్రహించడం అంత సుళువుగా కనిపించలేదు. ఆ పరిస్థితిని గమనించిన శ్రీకృష్ణుడు అపారమైన వాత్సల్యంతో అనునయిస్తూ, దగ్గరకు పిలిచి ‘ఒక పని చేయి. నన్ను శరణు వేడు. సర్వధర్మాలను నాకు సమర్పించు. అప్పుడు నీ కర్తవ్యం నేను నిర్దేశిస్తాను. ఈ పాప పుణ్యాలతో నీకు పని లేదు. సకల పాపాల నుంచీ విమోచన కలగజేసి నిన్ను పునీతుణ్ణి చేసే బాధ్యత నాది’ అని అభయహస్త మందించాడు. అర్జునుణ్ణి శిష్యుడిగా స్వీకరించాడు. ఇంకేముంది? హమ్మయ్య అనుకున్నాడు అర్జునుడు. తన పని చాలా తేలికైనట్లుగా భావించాడు. ధర్మాధర్మాల విషయంలో తనలో తానే మాటిమాటికీ ఏం చేయాలో తికమక పడనవసరం లేదు. ఆ భారం శ్రీకృష్ణుడి మీదే పెట్టేశాడు. శరణాగతి అంటే ఇదే అర్థం.
కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమైంది. శ్రీకృష్ణుడు అడుగడుక్కీ, ధర్మసూక్ష్మాలను వివరిస్తూ దారి చూపించాడు.
ఎంతో వినమ్రతతో అర్జునుడు మారు మాట్లాడకుండా చెప్పినట్లే ఆచరించాడు. మధ్యమధ్య మళ్లీ కిరీటికి ఏవేవో అనుమానాలొచ్చినప్పుడు ‘నేను చెప్పినట్లు చేయి. నువ్వు ధర్మాధర్మాలను గురించి విచారించకు. పాప పుణ్యాలను గురించి ఆలోచించ వలసిన పని లేదు. అసలు నీకే పాపం అంటకుండా చూసుకునే భారం నాది’ అన్నాడు.
శ్రీకృష్ణుడు ఎంత తెలివిగా వ్యవహారాన్ని నడిపాడో, ఎంత చాకచక్యంగా కురుక్షేత్ర యుద్ధాన్ని ఎలా మలుపులు తిప్పాడో యుద్ధం ముగిసి యుద్ధ రంగంలో తొడలు విరిగి పడి ఉన్న దుర్యోధనుడికి పూస గుచ్చినట్లు జరిగినది వివరించాడు. ‘మేమేదో అధర్మంగా నడిచాం, నువ్వు చేసిన వాటిలో ధర్మబద్ధమైన పని ఒకటంటే ఒక్కటైనా ఉందా చెప్పు!’ అని నిలదీసి అడిగాడు దుర్యోధనుడు కృష్ణుణ్ణి. అప్పుడు కృష్ణుడు మీరింత వరకూ పాండవుల పట్ల ఎలా ప్రవర్తించారో వినండంటూ, మొత్తం చరిత్ర చెప్పాడు. ఇన్ని క్రూరకృత్యాలు చేసిన మిమ్మల్ని వధించవద్దా? అన్నాడు. దుర్యోధనుడి దగ్గర సమాధానం లేదు. ‘చూడు సుయోధనా! ఒకసారి వధింపబడటానికి నిర్ణయమైన తర్వాత ఎవరెవరు ఎలా వధింపబడాలో అందులో సుళువులను చూసేది నేను’ అన్నాడు కృష్ణుడు.
దుర్యోధనుడికి మాట పెగలలేదు. అయినా అప్పుడు కూడా కృష్ణుడి మాట పట్ల సంతృప్తి పడలేదు. అతడిలోని మత్సర బుద్ధి అలాగే వుంది. గౌరవం కాపాడుతూ ప్రేమగా ఎవరెవరికి ఎలా చెప్పాలో అలాగే చెప్పాడు కృష్ణుడు. వినక పోవటం వాళ్ల ఖర్మం బావా? అని ఆప్యాయంగా పిలుచుకోగల చనువున్న ధర్మరాజు, అర్జునుడు ఇద్దరూ కృష్ణుని దివ్యప్రజ్ఞకు శరణాగతి చేసి ధన్యులయ్యారు. వారి సంకల్పాలన్నీ ఆయన ముందుంచారు. నడిపించే భారం కూడా ఆయన మీదే పెట్టారు. ఎలా చేయమంటే అలా చేశారు. ఏం మాట్లాడాలో అదే మాట్లాడారు. ధన్యులయ్యారు. వారు పెద్దల పట్ల చూపిన గౌరవమది. ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు ఎంతసేపూ ‘నాది’ ‘నేను’ అనే వలయంలో చిక్కుకుని కృష్ణుడి దివ్య ప్రజ్ఞ వైపు చూడలేక అసలు చూడాలనిపించక, గిలగిలలాడుతూ విలవిల్లాడిపోయారు - తిన్నగా నరక స్థితికి జారుకున్నారు. నిజం చెప్పాలంటే ఏ యుగంలో చూసినా సన్నివేశాలన్నీ ఒక్కటే. యుగాల పేర్లు మాత్రమే తేడా. ధర్మాధర్మాల మధ్యన జరిగే కుమ్ములాటలు ఏ యుగంలోనైనా ఒకటే. ఇప్పుడు లేవంటారా? కుమ్ములాటలతో కొట్టుకు చచ్చే కుటుంబాలు లేవు? ఒక తల్లి కడుపున పుట్టిన పిల్లల్లో అనైక్యత ఇప్పుడు ఎన్ని కుటుంబాల్లో లేదంటారు? పరిశుద్ధమైన, స్వచ్ఛమైన, నిర్మల మనస్సులతో మాయా మర్మం లేకుండా ఒకరిని చూడకుండా మరొకరు ఉండలేని స్థితిలో తిరిగిన ఒకే తల్లికి పుట్టిన అన్నదమ్ములు, ఎప్పటికైనా విడిపోయి జీవించవలసినదే! ఎవరి ఉద్యోగాలు వారివి. కాలక్రమేణా ఎవరి తిండి వారిదై, సంపాదన వేరై, కాపురాలు వేరయ్యే సరికి, భావాలు వేరైపోయి రకరకాల మార్పులొస్తూంటాయి. ప్రేమాభిమానాలు నామ మాత్రమే. తగ్గిపోతూంటాయి. కడుపున పుట్టిన పిల్లల్ని వదల్లేక మజిలీలు చేసుకుంటూ కిక్కురుమనకుండా జీవితాలు వెళ్లదీయవలసినది ఇంతమందినీ కన్న వృద్ధులైన తల్లిదండ్రులే.
ఒకవేళ పిల్లలు సంస్కార హీనులైతే ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. తమ మాటకు విలువుండదు. ఉత్సవ విగ్రహాల్లా ఉండవలసినదే. వంద మందిని కన్న ధృతరాష్ట్రుడి పరిస్థితే. సర్వహక్కులూ కోల్పోయి నామమాత్రంగా సింహాసనంపై కూర్చుని అటూ ఇటూ దిక్కులు చూడటం మినహా ధృతరాష్ట్రుడు సాధించినదేమిటి? జగన్నాటక సూత్రధారి కృష్ణుణ్ణే మాయ చేద్దామనుకున్న పిల్లల్ని నియంత్రించ గలిగాడా? ఫలితం కుటుంబం సమూలంగా నాశనమవ్వలా?
భక్తి భావ సంపదను స్థిరాస్తిగా కలిగిన అన్నమయ్య ఈ పరిస్థితులు సంసారాల్లో సహజమని ఊహించి పాడుకున్న తన సంకీర్తనలో-
మతి భ్రమసితిని కొంత మన్ను నాకు రాజ్యమని
సతులంటా సుతులంతా సంసారినైతి
గతియై శ్రీ వేంకటేశ కాచితి వింతటిలోనె
ఇతరుడను ఇంతే నీకు ఏమి భాతి నేను?॥ అంటాడు.
నాకనిపిస్తుంది. దుర్లభంగా దొరికే భక్తి, సంగీతం.. రెండూ మనిషిని వశపరచుకునే మత్తుపదార్థాలే. శరీరానికీ మనసుకూ రెంటికీ వవమవ్వటం ఇవతలకు రావటం రెండూ కష్టమే. రెండూ కుదిరితే మనసులోకి వచ్చే ఆలోచనలన్నీ ధర్మ మార్గంలోనే వెళ్తాయి. పాపపు నడవడిక ఉండదు. దుర్మార్గపు ఆలోచనలూ పుట్టవు. తిట్టినా హింసలు పెట్టినా ధర్మాన్ని వదిలేసే బుద్ధి కలగదు. పాండవులకు పట్టిన అదృష్టమిదే. దురదృష్టం కౌరవులదే. ఒకే ఇంట్లో పుట్టిన కౌరవుల మత్సరబుద్ధే వారి మరణానికి కారణమైంది.
అధర్మ ప్రవృత్తి, వారిని పాతాళానికి తీసుకుపోయింది. అన్నీ దగ్గరుండి గమనిస్తూన్న కృష్ణమూర్తికి అన్నీ తెలుసు. మాయల మరాఠీ కదా! ఎవరిని ఎలా నిర్జింపచేయాలో ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఓరోజు త్యాగరాజు మనస్సులో మెరిసాడు. ఆ మాటే, పాటైంది.
చంద్రజ్యోతి - ఆదితాళం
పల్లవి: బాగా యెనయ్య నీ మాయలెంతో
బ్రహ్మకైన కొనియాడ తరమా?
అ.పల్లవి: బాగా యెనయ్యా
ఈ గారడము నొనరించుచు
నే గాదని పల్కుట యును ॥
చరణం: అలనాడు కౌరవుల నణచ మన
అలరి దోసమనే నరుని చూచి పాప
ఫలము నీకు తనకు లేదని చక్కగ
పాలనము సేయలేదా? త్యాగరాజ నుత
ఈ ప్రపంచంలో క్షణం క్షణం ఏవేవో సంఘటనలు జరిగిపోతూంటాయి. ఏ సంఘటనకూ కారణం ఎవరూ కాదు. కురుక్షేత్ర యుద్ధానికి అన్ని ఏర్పాట్లూ అయిపోయాయి. తీరా యుద్ధ భూమిలో అడుగు పెట్టిన అర్జునుడు విషాద వదనంతో కృష్ణుడివైపు చూస్తూ యుద్ధం నావల్ల కాదు. ఇంతమంది నా వాళ్లను నా చేతులతో చంపలేనని విముఖుడై కూర్చున్నాడు.
‘యుద్ధం వల్ల కులం నశిస్తుంది. కుల ధర్మాలు నశిస్తాయి’ అని చతికిలపడ్డాడు. ‘పిచ్చివాడా! వీరందరినీ నువ్వు చంపుతున్నావను కుంటున్నావేమో? నేనెప్పుడో చంపేశాను. వీరందరూ, వారి కర్మల ననుసరించి ఒకరోజు వారి అధర్మ నడవడికతో కాలగర్భంలో కలిసిపోవలసిన వారే. నువ్వు చేసే ధర్మయుద్ధం చేసి తీరాలి. లేకపోతే ఆ పాపం నీకు చుట్టుకుంది అని అర్జునుణ్ణి కార్యోన్ముఖుణ్ణి చేశాడు శ్రీకృష్ణుడు. అర్జునుణ్ణి నిమిత్తమాత్రుణ్ణి చేసి అసలు పని కాస్తా తానే నిర్వర్తించేశాడు.

- మల్లాది సూరిబాబు 90527 65490, 9182718656