కృష్ణ

కనీస వేతనాలకు కదం తొక్కిన అంగన్‌వాడీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఉద్రిక్తతకు దారి తీసిన కలెక్టరేట్ ముట్టడి
* ఆందోళనకారులు, పోలీసుల మధ్య తోపులాట
* యూనియన్ నాయకుల అరెస్టు, విడుదల
మచిలీపట్నం, నవంబర్ 27: కనీస వేతనాల కోసం అంగన్‌వాడీలు కదంతొక్కారు. పోరాటాల ద్వారా సాధించుకున్న వేతన పెంపు జివోను తక్షణమే విడుదల చేయాలని, అంగన్‌వాడీలను స్వచ్ఛంద సంస్థలకు అప్పగించే ప్రయత్నాలను మానుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా శుక్రవారం కృష్ణా జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడించారు. జిల్లా నలుమూలల నుండి తరలివచ్చిన వేలాది మంది అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై దుమ్మెత్తిపోశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, పోరాటాల ద్వారా సాధించుకున్న హామీలను అమలుచేయని చేతకాని ప్రభుత్వం గద్దె దిగాలని నినాదాలు చేశారు. ఎపి అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా శాఖ (సిఐటియు) ఆధ్వర్యంలో నిర్వహించిన కలెక్టరేట్ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. జిల్లా నలుమూలల నుండి పెద్ద ఎత్తున అంగన్‌వాడీలు తరలివచ్చారు. కలెక్టరేట్ ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ధర్నా అనంతరం కలెక్టరేట్‌లోకి చొచ్చుకుపోయే ప్రయత్నం చేసిన అంగన్‌వాడీలను పోలీసులు కట్టడి చేశారు. బందరు డిఎస్‌పి శ్రావణ్‌కుమార్ పర్యవేక్షణలో చిలకలపూడి, ఇనగుదురు సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు జనార్దనరావు, సాయి ప్రసాద్, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పెద్ద ఎత్తున కలెక్టరేట్ వద్ద మోహరించారు. ఆందోళనకారులు కలెక్టరేట్‌లోకి ప్రవేశించకుండా రోప్ పార్టీ సాయంతో కట్టడి చేశారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వివాదం, తోపులాట జరిగింది. ఎ.కొండూరుకు చెందిన సుజాత మరికొంత మంది కార్యకర్తలు సొమ్మసిల్లి పడిపోయారు. పోలీసుల జులుం నశించాలంటూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. పరిస్థితి మరింత ఉద్రిక్తతగా మారటంతో ఆందోళనకు నాయకత్వం వహించిన ఎపి అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌సిహెచ్ సుప్రజ, సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఎన్‌సిహెచ్ శ్రీనివాసరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి చౌటపల్లి రవి, ఎ కమల, సిహెచ్ బాబూరావు, కె సుబ్బారావు, కె పద్మ, ఎం పద్మ, పి మానసలను పోలీసులు అదుపులోకి తీసుకుని చిలకలపూడి పోలీసు స్టేషన్‌కు తరలించారు. దీన్ని నిరసిస్తూ ఆందోళనకారులు చిలకలపూడి పోలీసు స్టేషన్‌కు భారీగా తరలివెళ్ళి స్టేషన్ ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. అరెస్టు చేసిన యూనియన్ నాయకులను వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎపి అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ మాట్లాడుతూ అంగన్‌వాడీలను నిర్వీర్యం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకున్నారని విమర్శించారు. తాము చేసిన పోరాటాల ఫలితంగా అంగన్‌వాడీ కార్యకర్తకు 7100, ఆయాకు 4200 ఇస్తానని మార్చిలో ప్రభుత్వం ఇచ్చిన హామీ ఇప్పటివరకు అమలు చేయకపోవడాన్ని ఆమె గర్హించారు. చంద్రబాబు ప్రభుత్వం అంగన్‌వాడీలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని దుమ్మెత్తిపోశారు. వేతన పెంపు జివోను విడుదల చేసే వరకు తాము పోరాడుతూనే ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి డివి కృష్ణ, అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రతినిధులు పి రజనీరాణి, విజయలక్ష్మి, లీలారాణి, మధు కుమారి తదితరులు పాల్గొన్నారు.

అల్పపీడన ప్రభావంతో అన్నదాతలు ఉక్కిరిబిక్కిరి
కూచిపూడి, నవంబర్ 27: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో దక్షిణ కోస్తా, ఆంధ్రా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతన్నలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ నెల 14నుండి 19వరకు వాయుగుండం ప్రభావంతో మొవ్వ మండలంలో 266.6 మి.మీల వర్షానికి తోడు గాలులు వీచడంతో కోతకు సిద్ధమైన వరిపంటలు నేలవాలి నీట మునిగాయి. తరువాత ఏర్పడిన వాయుగండం ప్రభావం చూపకపోవటంతో రైతులు ఊపిరిపీల్చుకున్నారు. గత వారం రోజులుగా వాతావరణం పొడిగా వుండటంతో సిద్ధమైన వరిపంట కోతలు ప్రారంభించారు. ఒకేసారి కోతలకు రైతులు సిద్ధమవటంతో అదును చూసుకుని వ్యవసాయ కూలీలు డిమాండ్ పెంచారు. ఎకరాకు 2వేల నుండి 4వేల రూపాయలు కోతలకు డిమాండ్ చేస్తున్నారు. కుప్పలకు 2,500 రూపాయలు డిమాండ్ చేసిన కూలీలు వాయుగుండం ప్రకటనలు వెలువడటంతో 4వేలకు పెంచారు. ఈనేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం మరల అల్పపీడనం ఏర్పడిందని, దీని ప్రభావంతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలు రైతన్నలకు చెమటలు పట్టిస్తున్నాయి. మొవ్వ మండలంలో నాలుగు రోజులుగా వందలాది ఎకరాల్లో కోసిన వరి పంట పనలపై వుంది. ఈనేపథ్యంలో వర్షాలు పడి ఇప్పటికే చాపచుట్టగా పడిన పంట నేలరాలుతుంటే మరలా వర్షాలు కురిస్తే తీవ్రంగా నష్టపోతామని రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. హెచ్చరికల నేపథ్యంలో పలువురు రైతులు అదనపు కూలీ భారాన్ని భరాయించి యుద్ధప్రాతిపదికన శుక్రవారం కుప్పలు వేయించి రక్షణ చర్యలు చేపట్టారు.

నిరంతర విద్యుత్ ఘనత మాదే
జి.కొండూరు, నవంబర్ 27: నిరంతరం విద్యుత్‌ను పంపిణీ చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కుతుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో జి.కొండూరు కమ్యూనిటీ హాల్లో మంత్రి ఉమ శుక్రవారం విద్యుత్ వినియోగదారులకు ఎల్‌ఇడి బల్బులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉమ మాట్లాడుతూ రైతులకు ఇబ్బంది లేకుండా ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. విద్యుత్ పొదుపు చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఎల్‌ఇడి బల్బులను పంపిణీ చేస్తోందన్నారు. విద్యుత్ ఉత్పాదనలో గణణీయమైన ప్రగతి సాధించేందుకు సిఎం చంద్రబాబునాయుడు అహర్నిశలూ శ్రమిస్తున్నారన్నారు. ఆయన ఆలోచన విధానం రాష్ట్రానికి బంగారు బాటలు వేస్తోందన్నారు. నదుల అనుసంధానం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు రాబట్టే ఇప్పుడు సాగునీటికి కొరత లేదన్నారు. చెంబుతో నీళ్ళు తెచ్చి పోశారని వైసిపి నేతల విమర్శలకు తమ ప్రభుత్వ చేతలే సమాధానమన్నారు. వైసిపి నాయకుల అసత్య ప్రచారంతో అమాయకపు యువకులు పోలవరం కుడి కాలువలోనికి దిగి ప్రాణాలు పోగొట్టుకున్నారన్నారు. అర్హులైన వారందరికీ పించన్లు పంపిణీ చేస్తామన్నారు. ఇంకా పించన్లు రావాల్సిన వారు ఎవరైనా మిగిలి ఉన్నారా? అంటూ మంత్రి సభలో ప్రశ్నించారు. కొందరు మహిళలు తమకు పించను ఇంకా ఇవ్వడం లేదని మంత్రి ఉమ దృష్టికి తీసుకురాగా, అప్పటికప్పుడు ఆయన వెయ్యి రూపాయల పించనును సుశీల అనే మహిళకు ఇచ్చారు. ఎవరైనా పించను ఇవ్వలేదని తన దృష్టికి వస్తే అధికారులపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోనికి తీసుకువెళ్ళాలన్నారు. ప్రభుత్వమే పేదలకు జి ప్లస్ 2 ఇళ్ళను కట్టిస్తుందన్నారు. దీనికి అవసరమైన భూమిని గుర్తించి హౌసింగ్ అధికారులకు నివేదించాలని తహశీల్దార్ కె సుధారాణిని మంత్రి ఆదేశించారు. రహదారులను పూర్తిగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. దుర్గగుడి ఫ్లైఓవర్‌ను పుష్కరాల లోపు పూర్తి చేస్తామన్నారు. జి.కొండూరు బైపాస్ రహదారి బాధితులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తానన్నారు. ఎత్తిపోతల పథకాల ద్వారా పశ్చిమ కృష్ణాను సస్యశ్యామలం చేస్తామన్నారు.