అనంతపురం

మరుగుదొడ్లు - మహామాయ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం టౌన్, జూలై 17: సినిమా వాళ్లు ట్రైలర్ మొదటి విడుదల చేస్తారు...తర్వాత సినిమా రిలీజ్ చేస్తారు. అలాగే హిందూపురం నాయకులకు మరుగుదొడ్ల నిర్మాణాలపై పుట్టపర్తికి చెందిన విశ్వనాథ్ ఫౌండేషన్ చూపించింది. తర్వాత అసలు నిర్మాణాల్లో మహా మాయ చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పుట్టపర్తికి చెందిన విశ్వనాథ్ ఫౌండేషన్ పట్టణంలో మరుగుదొడ్ల నిర్మాణానికి ముందుకొచ్చింది. ప్రభుత్వం ఇచ్చే రూ.15 వేలతో మరుగుదొడ్లను అన్ని సౌకర్యాలతో నిర్మించి లబ్ధిదారుడికి చెంబు, బాకెట్, ఫినాయిల్, సబ్బులు ఇలా అన్ని చేతికి ఇస్తామంటూ హామీలు ఇప్పించింది. మొదట్లో ఇలా అన్ని సౌకర్యాలతో నిర్మించి సినీనటులు, ఎమ్మెల్యే బాలకృష్ణ చేతుల మీదుగా ప్రారంభింప చేసింది. ఇది మొదట్లో చూపిన కథ. తర్వాత ఇదే ఫౌండేషన్ వారు పట్టణ శివారులోని కొల్లకుంట, కొట్నూరులో మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టారు. అయితే ఇప్పటిదాకా ఇక్కడ అన్ని సౌకర్యాలతో పూర్తయిన మరుగుదొడ్లు పట్టుమని పది కూడా కనిపించడం లేదు. అన్ని అరకొర నిర్మాణాలే. నిర్మాణాలకు వాడిన వస్తు సామాగ్రి సైతం నాసిరకం. మరుగుదొడ్ల గుంతలకు వాడే రింగ్‌లు నిర్మాణాలు పూర్తికాకనే పాడైపోయాయి. ఏడాది క్రితం నిర్మాణ పనులు చేపట్టారు. రెండు నెలల్లో పూర్తి చేస్తామని గొప్పలు చెప్పారు. అయితే ఏడాది గడుస్తున్నా అడుగు ముందుకు పడకపోవడం గమనార్హం. పూర్తి చేసినట్లు చూపుతున్న 23 మరుగుదొడ్లు సైతం పూర్తిస్థాయిలో నిర్మించకపోవడం వారి చిత్తశుద్ధికి నిదర్శనంగా కనిపిస్తోంది. మొదట్లో జోరుగా ఆసక్తి చూపిన సంస్థ నిర్వాహకులు ఆ తర్వాత పట్టించుకోకపోవడంతో నిర్మాణాలు ముందుకు సాగడం లేదు. దీనికి తోడు సంస్థ తరపున పనిచేసే సిబ్బంది లబ్ధిదారుల నుండి రూ.1000 నుండి రూ.2 వేల దాకా సొమ్ము వసూలు చేసినట్లు చెబుతున్నారు. నిర్మాణాలు ప్రారంభించడంతో అన్ని మరుగుదొడ్లకు సంబంధించి మున్సిపల్ అధికారులు మొదటి విడత బిల్లులను చెల్లించేశారు. కొన్నింటికి రెండో విడత సైతం చెల్లింపులు జరగడం గమనార్హం. నిర్మాణాలు పూర్తి కాకపోవడం, ప్రజల నుండి ఫిర్యాదులు రావడంతో మున్సిపల్ సిబ్బంది భయపడి తుది విడత బిల్లుల చెల్లింపులు నిలిపివేశారు. మరుగుదొడ్డి నిర్మాణాన్ని ప్రత్యేకంగా నాలుగు వైపులా గోడలు నిర్మించాలి. వీటిలో ఒక వైపు తలుపు ఉంటుంది. అయితే ఈ గ్రామాల్లో చేపట్టిన మరుగుదొడ్లలో అప్పటికే నిర్మించిన ఇళ్ళ గోడలకు ఆనుకొనే మరుగుదొడ్లను నిర్మించడంతో ఓ వైపు గోడ నిర్మాణం చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. దీనికి తోడు నాసిరకం నిర్మాణ సామాగ్రి వాడటంతో భారీగా మిగులు ఉంది. ఇది చాలదన్నట్లు లబ్ధిదారుల నుండి వసూలు చేశారు. ఇంత చేసినా నిర్మాణాలను పూర్తి చేయకపోవడం, కొన్ని మరుగుదొడ్ల నిర్మాణ పనులు ప్రారంభించకపోవడం, పునాదులకే పరిమితం చేయడం కనిపిస్తోంది. గ్రామస్తులు ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. అధికారులు సైతం నిర్వాహకులతో మాట్లాడటానికి ప్రయత్నించినా అందుబాటులోకి రానట్లు తెలుస్తోంది. చివరకు మున్సిపల్ ఛైర్‌పర్సన్ లక్ష్మి నేరుగా రంగంలోకి దిగి తాను ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరికలు జారీ చేయాల్సిన దుస్థితి నెలకొంది. అధికారులపై తీవ్రమైన ఒత్తిడి రావడంతో నిర్వాహకులు తాము వచ్చి పరిశీలిస్తామంటూ, తమ సిబ్బందిని పంపుతామంటూ సమాధానాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 2వ తేదీ నాటికే మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తికావాల్సి ఉంది. గడువు ముగిసి తొమ్మిది నెలలు కావస్తున్నా ఇప్పటికీ నిర్మాణాలు పూర్తి కాకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనంగా కనిపిస్తోంది. వీరికి తోడు మున్సిపల్ అధికారులు వారిపై ఒత్తిడి తీసుకురావడం, చర్యలు తీసుకోవడంలో విఫలమైనట్లు స్పష్టమవుతోంది. అర్థాంతరంగా నిలిచిపోయిన మరుగుదొడ్లను పూర్తి చేసేందుకు ఫౌండేషన్ నిర్వాహకులు ఏ మేరకు స్పందిస్తారో వేచి చూడాల్సిందే.