అనంతపురం

దూకుడు పెంచనున్న పార్టీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, నవంబర్ 13 : తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోనూ ఎక్కడ చూసినా 2019 ఎన్నికలపై జనం చర్చించుకుంటున్న తరుణంలో ఫిబ్రవరి మూడో వారంలో నోటిఫికేషన్ వెలువరించనున్నట్లు ఎన్నికల కమిషన్ సూచనప్రాయంగా ప్రకటించడంతో జిల్లాలో రాజకీయ పార్టీలు సైతం దూకుడు పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్‌పై ఇపుడిపుడే ప్రకటన వెలువడుతుందన్న విషయంపై స్పష్టత లేకపోయినప్పటికీ రానున్న ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా ప్రధాన పార్టీలు టీడీపీ, వైకాపాలు జనంలోకి వెళుతున్నాయి. ఎన్నికల కమిషన్ ప్రధానాధికారి సిసోడియా మంగళవారం అమరావతిలో ఎన్నికల నోటిఫికేషన్‌పై మీడియాకు వెల్లడించడంతో ఆయా పార్టీల నేతలు అప్రమత్తమయ్యారు. 2019 ఎన్నికల్లో గెలిచే వారికే టికెట్లు ఇస్తామని, ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా, ప్రజల్లో నిరంతరం ఉండేవారికే టికెట్ల కేటాయింపు ఉంటుందని ఇప్పటికే తెలంగాణ ఎన్నికల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. కొన్ని నెలల ముందు నుంచే రాష్ట్రంలోనూ ఎన్నికలు వస్తాయన్న ప్రచారం సాగిన తరుణంలో సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరును సీఎం బేరీజు వేస్తూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఎవరికి రానున్న ఎన్నికల్లో టికెట్టు దక్కుతుందో, ఎవరికి దక్కదో అన్న ఆందోళన టీడీపీ ప్రజా ప్రతినిధుల్లో నెలకొంది. బీజేపీతో విభేదించి బయటకొచ్చిన అనంతరం తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో జత కట్టిన తరుణంలో ఏపీలోనూ అదే సీన్ రిపీటయ్యే పరిస్థితులు తలెత్తితే ఎవరి సీటుకు ఎసరు వస్తుందోనన్న సందేహాలు కూడా కొందరిని వెంటాడుతున్నాయి. ఏపీలోనూ పొత్తు ఉంటే అది ఎవరికి లాభిస్తుందన్న విషయంపైన ప్రజల్లో నిరంతరం చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ, జిల్లాలో జల వనరుల ప్రాజెక్టులతో ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న కృషిని తెలియజేస్తూ ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తున్నారు. మరోవైపు సుమారు రూ.2వేల కోట్లతో మంజూరు చేసిన పేరూరు, బీటీపీ పనులు వేగవంతానికి మంత్రులు పరిటాల సునీత, కాలవ శ్రీనివాసులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ నిరంతరం పర్యవేక్షిస్తూ తమ నియోజకవర్గాల్లో పట్టు సడలకుండా జాగ్రత్త పడుతున్నారు. ప్రజలతో నిరంతరం మమేకం అయ్యేందుకు శాయశక్తులా కృషి చేస్తూ, నియోజకవర్గ ప్రజలకు చేరువవుతున్నారు. అదే సమయంలో రాష్ట్రానికి బీజేపీ చేసిన ద్రోహాన్ని ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆదేశాలతో నేతలు ప్రజలకు వివరిస్తున్నారు. వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు, నిధుల దుర్వినియోగం, సంక్షేమ పథకాల్లో లోటుపాట్లు, అవినీతి, నీటి ప్రాజెక్టుల్లో అక్రమాలు, పరిశ్రమల పేరుతో కాలయాపనలు, అక్రమంగా భూములు కాజేస్తున్నారన్న అంశాలతో పాటు జగన్ వస్తేనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందంటూ ‘రావాలి జగన్.. కావాలి జగన్’ కార్యక్రమంతో ప్రజల్లోకి వెళుతున్నారు. అలాగే ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మంగళవారం ‘అన్న కోసం’ పేరుతో ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. దీంతో ప్రజలతో మమేకమయ్యేందుకు వైకాపా నేతలు మరింత ఎక్కువగా కృషి చేయడానికి సమాయత్తమవుతున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు తెలియజేయడంతో ఇటు ప్రజల్లోనూ, అటు రాజకీయ నాయకుల్లోనూ ఉత్కంఠకు తెర తీసింది. ఇప్పటికే రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? కేంద్రంలో బీజేపీ, లేదా కాంగ్రెస్ ఏది వస్తే రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉంటుంది? అనే అంశాలపై ప్రజలు చర్చించుకుంటున్నారు. మరోవైపు ఇటు టీడీపీ, కాంగ్రెస్‌పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శనాస్త్రాలు సంధిస్తుండటం, తమకు అవకాశం ఇస్తే ప్రజలకు సేవ చేసి చూపిస్తామంటు చెబుతుండటంపైనా ఉత్సుకత నెలకొంది.

ఉప్పు, పప్పుకై తప్పని అప్పు!
* సకాలంలో అందని భోజన బిల్లులు * అప్పుల ఊబిలో మధ్యాహ్న భోజన ఏజెన్సీలు
నల్లమాడ, నవంబర్ 13: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల మధ్యాహ్న భోజనం కోసం ఉప్పు, పప్పుకై అప్పులు తప్పడం లేదని వంట ఏజెన్సీల వారు వాపోతున్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజనం కోసం ప్రభుత్వం నుండి కేవలం బియ్యం మాత్రమే అందుతాయి. అన్నంలోకి అవసరమయ్యే నిర్దేశించిన కూరల కోసం బేడలు, కాయగూరలన్నీ వంట ఏజెన్సీ వారి తెచ్చుకోవాల్సి వుంది. అందుకోసం ప్రాథమిక పాఠశాలల్లో 1నుండి 5వ తరగతి వరకు చదివే విద్యార్థులకై ఒక్కొక్కరికి రూ 6.48 పైసలు, 6నుంచి ఇంటర్ వరకు చదివే విద్యార్థులకై ఒక్కొక్కరికి రూ 8.53 పైసలు చొప్పున వంట ఏజెన్సీ వారికి ప్రభుత్వం చెల్లించడం జరుగుతోంది. జిల్లాలోని 2603 ప్రాథమిక పాఠశాలల్లో 1,60,149మంది విద్యార్థులు, 607 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 1,00,276మంది విద్యార్థులు, 543 ఉన్నత పాఠశాలల్లో 64,397మంది విద్యార్థులు, 42 జూనియర్ కళాశాలల్లో 18,738మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం తింటున్నారు. జిల్లాలోని ప్రాథమిక పాఠశాలల్లోని విద్యార్థులు తింటున్న భోజనం కోసం రూ. 2 కోట్ల 59 లక్షలు, ప్రాథమికోన్నత పాఠశాలల్లోని విద్యార్థులకై రూ. 2 కోట్ల 14 లక్షలు, ఉన్నత పాఠశాలల్లో చదివే విద్యార్థులకై రూ. 6 కోట్ల 11 లక్షలు, జూనియర్ కళాశాలల్లోని విద్యార్థులకై రూ. 40 లక్షలు నెలలో సరాసరి జరిగే 24 రోజులకు మన జిల్లాలో మధ్యాహ్న భోజనానికి ప్రభుత్వం వెచ్చిస్తోందని సంబంధిత శాఖ ద్వారా అందిన సమాచారం. మొత్తం ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లోని విద్యార్థుల మధ్యాహ్న భోజనం కోసం మన జిల్లాకు రూ. 6 కోట్ల 51 లక్షలు ఖర్చవుతోందని చెప్పుకోవచ్చు. విద్యార్థుల మధ్యాహ్న భోజనంలో అన్నంలోకి సోమవారం, గురువారం రోజుల్లో సాంబారు, మంగళవారం, శుక్రవారం రోజుల్లో కాయగూరల కూర, బుధవారం, శనివారం రోజుల్లో ఆకుకూరలు కలిపి వండిన పప్పు, శనివారం మినహా మిగిలిన 5 రోజుల్లోనూ కోడిగుడ్డు విద్యార్థులకు అందజేసే విధంగా మెనూ ఏర్పాటుచేశారు. సుమారు 594 ప్రాథమిక పాఠశాలల్లో, 25 ప్రాథమికోన్నత పాఠశాలల్లో, 70 ఉన్నత పాఠశాలల్లో ఇప్పటికీ వంట గదుల నిర్మాణాలు లేవు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండటానికి సరైన సౌకర్యాలు వున్నా, లేకున్నా కూడా ఏజెన్సీల వారు వారి పనిచేస్తూనే వున్నారు. నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలోకి కూరలు తయారుచేయడానికి ఖర్చులు కూడా అధికంగానే వుంటాయి. మార్కెట్‌లో అన్ని నిత్యావసర సరుకుల ధరలు కూడా ఆకాశాన్నంటుతూనే వున్నాయి. ఈ నేపధ్యంలో ప్రతి నెలా అందజేయాల్సిన మధ్యాహ్న భోజన బిల్లులు అందజేయకుండా ఆలస్యం చేయడం వల్ల రూ. లక్షల అప్పుల్లో కూరుకుపోతున్నామని మధ్యాహ్న భోజన ఏజెన్సీల వారు లబోదిబోమంటున్నారు. ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి జిల్లాలోని కొన్ని ఏజెన్సీల వారికి 4 నెలలు, మరికొన్ని ఏజెన్సీల వారికి 3 నెలల బిల్లులు అందలేదని సమాచారం. జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం ఏర్పాటుచేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్క బిల్లు కూడా తమకందలేదని వంట ఏజెన్సీల వారు వాపోతున్నారు. విద్యార్థుల మధ్యాహ్న భోజనం కోసం వేలల్లో అప్పులు తీసుకురావాల్సి వుంటుండగా బిల్లులు సకాలంలో అందకుండా వుంటుండటంతో అదనంగా వడ్డీలు కూడా తమకు భారంగా మారుతున్నాయని చెప్తున్నారు. ఒకవేళ బిల్లులు మంజూరైనా కూడా ప్రాథమిక పాఠశాలలవి ఒకసారి, 6, 7 తరగతులవి ఒకసారి, 9, 10 తరగతులవి ఒకసారి మంజూరు చేస్తున్నారు గానీ పూర్తి స్థాయిలో బిల్లులు కావడం లేదని, ఇంకా గతేడాదికి సంబంధించి రెండు, మూడు మాసాలవి కూడా కొన్ని ఏజెన్సీల వారికి కాలేదన్నది సమాచారం. కేవలం బియ్యం మాత్రమే అందజేస్తూ మిగిలిన భారం అంతా భోజన ఏజెన్సీల వారిపై వేసేసి సకాలంలో బిల్లులు మంజూరు చేయక ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మధ్యాహ్న భోజన ఏజెన్సీల వారు ఆరోపిస్తున్నారు. భోజన ఏజెన్సీల వారికి పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయులు నమోదు చేసి మెయిల్ చేస్తే రాష్ట్ర సచివాలయంలోని విద్యా శాఖ నుంచే బిల్లులు నేరుగా ఏజెన్సీల వారి పద్దులోకి జమ అవుతాయని అధికారులు చెప్తున్నారు. కాగా భోజన ఏజెన్సీల వారి ఆధార్, బ్యాంకు పద్దు వివరాలలో ఏవైనా తప్పులున్నా కూడా సకాలంలో బిల్లులు అందని పరిస్థితి వుంటుందని అధికారులు చెప్పడం గమనార్హం.
బిల్లులు ఇంకా రావాల్సి వుంది... జిల్లా విద్యా శాఖ..
మధ్యాహ్న భోజన బిల్లులు కొందరికి 3 మాసాలవి, మరికొందరికి 4 మాసాలవి అందాల్సి వుంది. ప్రస్తుతం మధ్యాహ్న భోజన బిల్లులు రాష్ట్ర విద్యా శాఖ నుంచే భోజన ఏజెన్సీల వారి పద్దుల్లోకి జమ అవుతాయి. ప్రతి నెలా బిల్లుల విషయం రాష్ట్ర అధికారులకు నివేదికలు పంపుతూనే వున్నాం. కొన్ని ఏజెన్సీల వారి ఆధార్, బ్యాంక్ పద్దు వివరాల్లో తప్పులు దొర్లి కూడా బిల్లుల్లో జాప్యం జరిగింది. రాష్ట్ర ఆర్థిక శాఖ పరిధిలోని విషయం ఇది. కచ్చితంగా బిల్లులు అన్నీ అందుతాయి.

అధికారులను వెన‘కేసు’కు
రావటం సరికాదు
*అవినీతి అధికారిని శిక్షించాల్సిందే *మోటారుసైకిళ్లకు డీజిల్‌పై ప్రభుత్వానికి నివేదిక పంపండి
*అధికారిని తప్పులను ‘మన్నించాలంటే’ ఎ.జి తనిఖీలెందుకు
అనంతపురంటౌన్, నవంబర్ 13: ఇష్టారాజ్యంగా అవినీతికి ఎన్విరాన్‌మెంట్ డీఈఈ పాల్పడుతుంటే చూస్తూ ఊరుకోవటానికి పాలన ఎందుకు, ఆడిట్ తనిఖీ లెందుకని మున్సిపల్, ఆడిట్ అధికారుల సమావేశంలో ఉన్నతాధికారులకు చీవాట్లు పడ్డాయి. నాలుగు రోజుల క్రితం మున్సిపల్, ఆడిట్ అధికారుల సమావేశంలో హైదరాబాద్‌లో జరిగింది. ఏపీ చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆడిట్ జనరల్ (ఎ.జి) నివేదిక అందచేయటంతో వాటిపై వివరణాత్మక నివేదిక పంపాలని, వాటితోపాటు 14 ప్రభుత్వ అద్దె వాహనాల ఫైలు, గత ఆర్థిక సంవత్సర డీజిల్ ఎం.బుక్‌లను మున్సిపల్ పరిపాలన శాఖ సెక్రటరీ ఆదేశించారు. దీనిపై నాలుగు రోజుల క్రితం జరిగిన ఎ.జి మున్సిపల్ అధికారుల సమావేశానికి కమిషనర్ మూర్తి, ఇన్‌చార్జి ఎస్.ఈ నాగమోహన్ హాజరైనారు. సమావేశంలో ఎన్విరాన్‌మెంట్ డీఈఈ సురేంద్రనాథ్ పనితీరు, వ్యవహారశైలిపై ఏజీ అధికారుల బృందం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అచ్చు తప్పులేకాని అవినీతి, అక్రమాలు జరగలేదని కార్పొరేషన్ ఉన్నతాధికారులు చెప్పటంపై వారు తీవ్రంగా స్పందించారు. ఎం.బుక్‌లడిగితే ఇవ్వరు, ఫైళ్లను సమర్పించమంటే లేదంటారు. అప్పుడు వెలుగుచూడని ఫైళ్లు, ఎం.బుక్‌లు ఇప్పుడు ఎలా బయటకు వచ్చాయని వారు ప్రశ్నించారు. ఆడిట్ జనరల్ తనిఖీ అంటే అంత నిర్లక్ష్యమా. డీజిల్ వినియోగంలో భారీ అవినీతి జరుగుతుంటే ప్రజా ధనం పందికొక్కులా మింగుతుంటే వాటిని ఎత్తిచూపటమే ఆడిట్ జనరల్ తనిఖీ లక్ష్యమని వారు పేర్కొన్నారు. మోటారు సైకిళ్లకు ఏడాది పొడవునా డీజిల్ వేస్తున్నట్లు రికార్డులు, ఆన్‌లైన్ వివరాలు స్పష్టంగా చూపుతున్నాయన్నారు. ఎం.బుక్‌లో సమాచారం, ఆన్‌లైన్ వివరాలు అచ్చు తప్పులని ఇన్‌చార్జి ఎస్‌ఈ నాగమోహన్ చెప్పటాన్ని వారు తప్పుబట్టినట్లు తెలిసింది. ప్రభుత్వ పాలనా వ్యవహారాలు అవినీతిరహితంగా, పారదర్శకంగా సాగించాలనే అద్దె వాహనాలకు లాగ్‌బుక్, ఫిట్‌నెస్ సర్ట్ఫికెట్, పొల్యూషన్ సర్ట్ఫికెట్, ఇన్సూరెన్స్ సర్ట్ఫికెట్‌లను తప్పనిసరిగా సేకరించాలని ప్రభుత్వ జి.ఓ నిర్దేశించిందన్నారు. కార్పొరేషన్ ఇంజినీరింగ్ యంత్రాంగానికి ప్రభుత్వ జీ.ఓలు, నిబంధనలు వర్తించవాయని వారు ప్రశ్నించినట్లు తెలిసింది. అగ్రిమెంట్లు లేకుండానే 26.46 లక్షలు కాంట్రాక్టర్‌కు చెల్లించటం అవినీతి, అక్రమాల కిందకు రావాయని నిలదీసినట్లు తెలిసింది. ఏఈలు హేమచందర్, నరసింహాలు ఎన్విరాన్‌మెంట్ డీఈఈ సురేంద్రనాథ్‌లు ఎలా సంతకాలు పెట్టారని వారు ప్రశ్నించినట్లు తెలిసింది. కార్పొరేషన్‌లో ఎన్విరాన్‌మెంట్ డీఈఈ చేసే నిర్వాకాలకు అంతుపొంతు లేదని ఏజీజి బృందం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎన్విరాన్‌మెంట్ డీఈఈపై సస్పెన్షన్‌లాంటి శాఖాపరమైన చర్యలకు, క్రమశిక్షణా చర్యలకు సిఫారసు చేయాల్సిందిపోయి అచ్చుతప్పులుగా చూపుతూ వారికి అండగా నిలవటంలో ఉన్నతాధికారుల ఆంతర్యమేమిటని ప్రశ్నించినట్లు తెలిసింది. దీనిపై కార్పొరేషన్ ఉన్నతాధికారులు సమాధానం చెప్పలేక బిక్కమొఖం వేసినట్లు తెలిసింది. అవినీతి జలగలను రక్షించాలనిపోయిన ఇన్‌చార్జి ఎస్.ఈ నాగమోహన్, కమిషనర్ మూర్తిలు తిరుగుముఖం పట్టారు. ఏజీ నివేదిక తర్వాత కూడా అవినీతి జలగను రక్షించాలన్న తాపత్రయం కార్పొరేషన్ ఉన్నతాధికారులు చూపటంతో వారు నివ్వెరపోయినట్లు తెలిసింది. ఎన్విరాన్‌మెంట్ డీఈఈపై చర్యలు చేపట్టి తీరాల్సిందేనని వారు స్పష్టం చేసినట్లు తెలిసింది.