అనంతపురం

తుంపర్తి వద్ద ఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మవరం, డిసెంబర్ 12: ధర్మవరం మండలం పోతులనాగేపల్లి రెవెన్యూ గ్రామంలోని తుంపర్తి వద్ద ఇంటి పట్టాల కోసం భూ సేకరణ చట్టం ద్వారా సేకరించిన 210 ఎకరాలను స్వాధీనం చేసుకునేందుకు బుధవారం రెవెన్యూ అధికారులు వెళ్లారు. తమకు సరైన నష్టపరిహారం ఇవ్వకుండా ఎలా స్వాధీనం చేసుకుంటారంటూ పలువురు రైతులు అధికారులపై ఎదురుతిరిగి నిరసన వ్యక్తం చేశారు. దీంతో డీఎస్పీ వెంకటరమణ ఆధ్వర్యంలో భారీగా పోలీసు బలగాలు అక్కడికి చేరుకున్నాయి. ఈ తరుణంలో రైతులకు, రెవెన్యూ, పోలీసు అధికారులకు వాగ్వివాదం చోటు చేసుకుంది. తమ భూములను ఇచ్చేది లేదంటూ రైతులు నిరసన వ్యక్తం చేశారు. తహసీల్దార్ మహబూబ్‌బాషా, డీఎస్పీ వెంకటరమణ రైతులకు ఎంత సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా వారు వినకపోవడంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారిని స్టేషన్‌కు తరలించారు. భూ సేకరణ చట్టం ద్వారా రైతుల భూములను స్వాధీనం చేసుకోలేదంటూ అధికారులు ఏకపక్షంగా స్వాధీనం చేసుకుంటున్నారని ఇప్పటికే గత కొన్ని దినాలుగా రైతుల పక్షాన పోరాడుతున్న సీపీఎం, సీపీఐ రైతు సంఘం నాయకులు ఓబుళ, జంగాలపల్లి పెద్దన్న, జింకా చలపతితోపాటు పలువురు సీఐటీయూ నాయకులను పోలీసులు ముందస్తుగానే అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. అయినప్పటికీ రైతులతోపాటు పలువురు వైకాపా నేతలు రైతులకు న్యాయం చేయాలంటూ తుంపర్తి వద్ద అధికారుల ఎదుటే నిరసన వ్యక్తం చేయడంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో గంటపాటు ట్రాఫిక్ కూడా స్తంభించిపోయింది. పోలీసులు రైతులను, వారి మద్దతుదారులను స్టేషన్‌కు తరలించి జేసీబీలు, హిటాచీల సాయంతో భూములను చదును చేసే ప్రక్రియ చేపట్టారు. అలాగే పలు మామిడి తోటలను సైతం తొలగించారు. ముందస్తు జాగ్రత్తగా పోలీసులు పొలాల వద్దే మకాం వేయడంతో సమస్య సద్దు మణిగింది.

* చట్టప్రకారమే భూములను స్వాధీనం చేసుకుంటున్నాం: తహసీల్దార్ మహబూబ్ బాషా
2013 భూ సేకరణ చట్టం ప్రకారమే తుంపర్తి వద్ద 210 ఎకరాలను స్వాధీనం చేసుకుంటున్నామని తహసీల్దార్ మహబూబ్‌బాషా తెలిపారు. ఇక్కడ భూముల విలువ రిజిస్ట్రేషన్ కార్యాలయం ప్రకారం రూ.1.50 లక్షలు ఉండడంతో రూ.3.25 లక్షల ధర నిర్ణయించి అదనంగా మరో రూ 1.75 లక్షలు కలిపి రైతులకు అందజేస్తున్నట్లు తెలిపారు. 91 మంది రైతుల్లో 20 మంది రైతులు ఇప్పటికే డబ్బులు తీసుకున్నారని మిగిలిన రైతుల మొత్తాన్ని తిరుపతి ఆర్‌ఆర్ ట్రిబ్యునల్ కోర్టులో డిపాజిట్ చేశామని వారు అక్కడికి వెళ్లి తీసుకోవచ్చన్నారు. ఇందులో 73 ఎకరాలను ఏపీ టిడ్కో ఆధ్వర్యంలో నిర్మించే అపార్ట్‌మెంట్లకుగాను మున్సిపల్ శాఖకు అప్పగించామన్నారు. పేదల భూములను తక్కువ ధరకు తీసుకోలేదని ఇవి కూడా ప్రభుత్వం ఇచ్చినవేనన్నారు.

* రైతులకు సరైన నష్టపరిహారం అందజేయాలి: మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి
పేదల ఇంటి పట్టాల కోసం భూములు తీసుకునే ముందు ఆ భూమినే నమ్ముకొని జీవనం సాగించే రైతుల పరిస్థితి కూడా ప్రభుత్వం ఆలోచించాలని, ఎకరాకు రూ.5 లక్షలు చెల్లించడం తగదని రూ.10 లక్షలు చెల్లించి తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి బుధవారం విలేఖరులతో పేర్కొన్నారు. తుంపర్తి వద్ద పేదల భూముల చుట్టూ అధికార పార్టీ నాయకులు భూములను కొనుగోలు చేశారన్నారు. వారి భూములను పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. ఇంటి పట్టాల పంపిణీకి తమ పార్టీ వ్యతిరేకం కాదని అయితే రైతులకు కూడా న్యాయం జరగాలన్నదే తమ అభిమతమన్నారు.