అనంతపురం

వైభవంగా ముక్కోటి ఏకాదశి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉరవకొండ, డిసెంబర్ 18: ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని మండలంలోని పెన్నహోబిల లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో అత్యంత వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున స్వామి వారికి అభిషేకం, ప్రత్యేక అలంకరణ, అర్చనలు, పూజలు నిర్వహించారు. ఏకాదశి సందర్భంగా ఆలయంలో వివిధ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. అర్చకులు ఉత్తర రాజగోపురం(ద్వారం) భూదేవి, శ్రీదేవి సమేతుడైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఉత్సవ మూర్తులను పల్లకిలో కొలువు దీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి ఉత్తర ద్వారం ద్వారా భక్తులు స్వామి వారిని దర్శించుకుని, తమ మొక్కుబడులు తీర్చుకున్నారు అదే విధంగా ఆలయ దిగువున ఉన్న ఉద్భవ లక్ష్మి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, పూజలు నిర్వహించారు. స్వామి వారిని దర్శించుకోవడానికి జిల్లా నలమూలల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. అదే విధంగా పట్టణంలోని లక్ష్మీవేంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున మార్కండేయ స్వామి దేవాలయం నుండి కాగడాలతో ఊరేగించారు. అనంతరం ఆలయంలో ఉత్తర ముఖ ద్వారాన్ని తెరిచి భక్తులకు ప్రవేశాన్ని కల్పించారు. లక్ష్మీవేంకటేశ్వర స్వామికి లక్ష అర్చనలు నిర్వహించారు. లక్ష్మి గణపతి హోమం కార్యక్రమాలను నిర్వహించారు. పట్టణంలోని పాండురంగస్వామి ఆలయంలో ఉత్తర గోపురం ద్వారా స్వామి వారి దర్శనం కల్పించారు.
వైకుంఠ ద్వారంలో కొలువుదీరిన దేవదేవుడు
* భక్తజన సంద్రమైన శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం
గుంతకల్లు, డిసెంబర్ 18: హిందూవుల అత్యంత పవిత్రమైన వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి దేవాలయంలో శ్రీసీతరామ లక్ష్మణ సహిత ఆంజనేయస్వామి విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి వైకుంఠ(ఉత్తర) ద్వారంలో కొలువు దీర్చారు. అందులో బాగంగానే ఆలయంలో మూల విరాట్ ఆంజనేయస్వామికి తెల్లవారుజామున సుప్రభాత సేవలో బాగంగా స్వామివారికి మహాభిషేకం, విశేష పుష్పలంకరాలు, బంగారు కిరీట ధారణ, వజ్రకవచాలంకరణలు నిర్వహించారు. అనంతరం వైకుంఠ ద్వారంలో స్వామి వార్లను కొలువు దీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదే విధంగా పట్టణంలోని రాజేంద్రనగర్ శ్రీ వేంకటేశ్వర దేవాలయం వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని భక్త జన సంద్రమైంది. దేవాలయం మొత్తం పురాణాలకు సంబంధించిన కళరూపాలతో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తెల్లవారుజామున స్వామి వారికి ప్రత్యేక పూజలు అనంతరం భక్తుల సందర్శనార్థం కొలువు దీర్చారు. ఆలయంలోని ఉత్తర ద్వార ప్రవేశం చేయడంతోనే కాణిపాక వినాయకుడు, కోనేరులో వెలసిన శివలింగం, శ్రీదేవి, భూదేవి సమేతుడైన మలయప్ప స్వామి వారి ఉత్సవ విగ్రహాలు, ఆలయ దక్షిణంలో సంజీవపర్వతాన్ని తీసుకుని వస్తున్న ఆంజనేయస్వామి, ఎదురుగా అనంతాళ్వారు స్వామి వారి గాయపరిచే సన్నివేశం, సీతాదేవి భూదేవితో కలసి రాముల వారి వీడి తన జన్మస్థలంకు వెళ్లే సన్నివేశం, శ్రీ లింగబైరవీ దేవి విశేష పుష్పలంకరణ, నైరుతిలో వాసుదేవుడు, బాలక్రిష్ణుని నది దాటించు కళారూపాలు, వైకుంఠ వాసంలో ఏర్పాటు చేసిన శ్రీ పద్మనాభ స్వామి, దేవాలయం వెనక బాగాన మహా విష్ణు 16 అవతారం శ్రీ హయగ్రీవుడు ఆయన కుమార్తె దుర్ముఖి, హాలులో శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకారంలో కొలువు దీర్చారు. ఈ సందర్భంగా భక్తులు ప్రత్యేకంగా తయారు చేసిన కళారూపాలను దర్శించుకునేందుకు పెద్దఎత్తున భక్తులు విచ్చేయడంతో ఆలయం వెలుపల భారీ కేడ్లతో క్యూ కౌంటర్‌లను ఏర్పాటు చేశారు. అదేవిధంగా స్థానిక శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో లక్ష దీపార్చన ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ డీవీఎస్ సుబ్రమణ్యం ఆధ్వర్యంలో నిర్వహించారు.

స్వర్గమార్గం..వైకుంఠ ద్వారం
* ఉత్తరద్వారంలో నృసింహుని దర్శనం * ఆలయానికి పోటెత్తిన భక్తాదులు
కదిరి, డిసెంబర్ 18: ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి వైకుంఠ ద్వారమైన ఉత్తర గోపురంలో భక్తులకు మంగళవారం దర్శనమిచ్చారు. తెల్లవారుజామున 3 గంటల నుండి రాత్రి వరకు శ్రీవారిని దాదాపు లక్ష మంది భక్తులు దర్శించుకున్నారు. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కందికుంట ఆధ్వర్యంలో రూ. 15 లక్షలతో ప్రత్యేకంగా బెంగళూరు నుండి తెప్పించిన పూలతో ఆలయమంతా అలంకరించారు. సూర్యుడు ఉత్తరాయనానికి మారేముందు వచ్చే శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. ముక్కోటి ఏకాదశి రోజున వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటాయని, వైష్ణవ ఆలయాల్లో గల ఉత్తర ద్వారం వద్ద తెల్లవారుజామునే భక్తులు వేచివుండడం ఆనవాయితీగా వస్తోంది. ముక్కోటి రోజున మహావిష్ణువు గరుడ వాహనుడై మూడు కోట్ల దేవతలతో దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తారని, అందుకే ఈరోజు ముక్కోటి ఏకాదశి అని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశలతో సమానమని, అందుకు ముక్కోటి ఏకాదశని కూడా పిలవడం జరుగుతోంది. ముక్కోటి ఏకాదశినాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయని, శివుడు హాలాహాన్ని మింగినరోజు కూడా ముక్కోటి ఏకాదశి రోజే. కాగా వైకుంఠ ద్వారం ద్వారా శ్రీవారిని ఆలయ అర్చకులు పార్థసారథిచార్యులు, నరసింహాచార్యులు విశేషాలంకరణతో పల్లకిలో ఉత్తర ద్వారం వద్దకు తీసుకురాగా టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కందికుంట వెంకట ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ పార్థసారథి పల్లకిని మోశారు. అనంతరం కందికుంట దంపతులు వైకుంఠ ద్వారం ద్వారా శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అత్తార్ చాంద్‌బాషా, వైకాపా సమన్వయకర్త డా. పీవీ సిద్దారెడ్డి వైకుంఠ ద్వారం ద్వారా శ్రీవారిని దర్శించుకున్నారు. దాదాపు లక్ష మంది భక్తులు వైకుంఠ ద్వారంలో శ్రీవారిని దర్శించుకునేందుకు తరలిరాగా ఆలయ ఈఓ వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. కదిరి డీఎస్పీ శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో సీఐలు గోరంట్ల మాధవ్, మన్సూరుద్దీన్, పట్టణ ఎస్‌ఐ ఖాజాహుస్సేన్‌తో పాటు డివిజన్ పరిధిలోని ఎస్‌ఐలు, సిబ్బందితో కలిసి బందోబస్తు ఏర్పాటుచేసి, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్‌ను సోమవారం రాత్రినుండి సోమవారం సాయంత్రం వరకు ఆలయానికి వెళ్లే మార్గంలో బారికేడ్లను ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను నియంత్రించారు.

రేపటి నుంచి భక్తరహళ్ళి
లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు
మడకశిర, డిసెంబర్ 18: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన భక్తరహళ్ళి లక్ష్మీనరసింహస్వామి, జిల్లేడుకుంట ఆంజనేయస్వామి దేవాలయాల్లో గురువారం నుండి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. మార్గశిర శుద్ధ త్రయోదశి గురువారం నుంచి బ్రహ్మోత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. 20వ తేదీ ఆంజనేయస్వామి దేవాలయంలో ధ్వజారోహణం, అంకురార్పణ, అభిషేకం, హనుమాన్‌వ్రతం, 21న స్వామివారి కల్యాణోత్సవం, 22న జిల్లేడుకుంటలో స్వామివారి కల్యాణోత్సవం, 23న జ్యోతుల ఉత్సవం, 12.30 గంటలకు భూతప్ప ఉత్సవం, 24న పూల పల్లకి, 25న జిల్లేడుకుంటలో కంబాల లక్ష్మీనరసింహస్వామి జ్యోతుల పరుష, 26న వసంతోత్సవం, చక్రస్నానం నిర్వహిస్తారు. భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి స్వామివార్ల కృపకు పాత్రులు కావాలని దేవాలయ కమిటీ ప్రతినిధులు కోరారు. ఈ ఉత్సవాలకు రాష్ట్రంలోని నలుమూలల నుండే కాక ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు వేలాదిగా విచ్చేసి మొక్కుబడులు తీర్చుకుంటుంటారు. తమ అభీష్టం మేరకు సెలిమిడిని హారతులుగా తలపై ఉంచుకుని తెల్లవారుజామున 4 గంటల నుంచే ఆలయం చేరుకుని పూజలు నిర్వహిస్తారు. దాతలు, రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో రాజగోపుర నిర్మాణం పూర్తి చేశారు. ఈ ఉత్సవాలకు ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు నడుపనున్నారు.

మంచి కోసమే మార్పు
* నవీన్‌కు రాష్టస్థ్రాయిలో గుర్తింపు
* వైకాపా జాతీయ కార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డి
హిందూపురం, డిసెంబర్ 18: కొన్ని సమీకరణల వల్ల పలుచోట్ల నియోజకవర్గ సమన్వయకర్తలను మార్చాల్సి వస్తోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి కడపల శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, స్థానికంగా కూడా టీడీపీ నుండి వైకాపాలోకి చేరిన మాజీ ఎమ్మెల్యే అబ్ధుల్‌ఘనీని సమన్వయకర్తగా నియమించామన్నారు. ఘనీకి రాజకీయంగా ఎంతో అనుభవం ఉండటంతోపాటు ఓ దఫా ఎమ్మెల్యేగా కూడా పనిచేశారన్నారు. ఆయన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని సమన్వయకర్తగా నియమించామన్నారు. అయితే గత ఐదేళ్లుగా వైకాపా కోసం శ్రమించిన నవీన్‌నిశ్చల్‌కు తప్పకుండా రాష్టస్థ్రాయిలో గుర్తింపు ఇస్తామన్నారు. అధిష్ఠానం దీనికి కట్టుబడి ఉందన్నారు. ఘనీని సమన్వయకర్తగా నియమించినందున నవీన్‌తో పాటు ఆయన అనుచరుల్లో అసంతృప్తి నెలకొనడం సహజమన్నారు. త్వరలో నవీన్‌కు రాష్టస్థ్రాయిలో సముచిత స్థానం కల్పిస్తామన్నారు. గతంలోలా పార్టీలో సస్పెన్షన్లు ఉండవని, పార్టీ కోసం పనిచేసిన వారికి సముచిత స్థానం తప్పకుండా లభిస్తుందన్నారు. రాష్ట్రంలో వైకాపా ప్రభంజనం కొనసాగడం తథ్యమన్నారు. అవినీతికి పాల్పడిన తెలుగుదేశం ప్రభుత్వాన్ని గద్దెదింపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

గర్భిణులకు సామూహిక సీమంతాలు
నల్లమాడ, డిసెంబర్ 18: కుటుంబ అభివృద్ధిలో బాధ్యతగా వ్యవహరిస్తూ అహర్నిశలు శ్రమించే మహిళలే మహరాణులని చీఫ్ విప్ పల్లె రఘునాథరెడ్డి అన్నారు. మంగళవారం నల్లమాడలోని సామాజిక ప్రభుత్వాసుపత్రి ఆవరణలో మండలంలోని గర్భిణులకు పల్లెరఘునాథరెడ్డి సతీమణి దివంగత పల్లె ఉమా పేరిట సామూహిక సీమంతాలను నిర్వహించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పల్లె మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలకు ప్రభుత్వం ద్వారా అందజేస్తున్న సేవలను వివరించారు. మహిళలు గర్భం దాల్చినప్పటినుంచి ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనివ్వాలన్న సంకల్పంతో అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా బలమైన పౌస్టికాహారాన్ని అందజేస్తున్నామన్నారు. గర్భిణులు ప్రభుత్వాసుపత్రుల్లోనే ప్రసవం అయితే బాలింతతోపాటు పుట్టిన బిడ్డకు అందజేయాల్సిన ఎన్టీఆర్ కిట్లను అందజేసి తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ ద్వారా సురక్షితంగా ఇంటికి చేరుస్తున్నారన్నారు. బిడ్డ కడుపులో పడినప్పటి నుంచి పుట్టిన తర్వాత పెరిగి పెద్దగయ్యేంత వరకు ప్రభుత్వం ద్వారా సహాయ సహకారాలు అందజేస్తున్నామన్నారు. అనంతరం గర్భిణులు, అంగన్‌వాడీలు, ఆశా వర్కరకు చీరలు పంచిపెట్టారు.
రుణ మంజూరు పత్రాల పంపిణీ...
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కార్పొరేషన్‌ల ద్వారా మంజూరైన రుణాల పత్రాలను విప్ పల్లె స్థానిక షాదీ మహల్‌లో పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేషన్‌ల ద్వారా రుణాలు, ఆదరణ పథకం ద్వారా పనిముట్లు అందజేస్తున్నామన్నారు. అర్హులందరికీ రుణాలందజేసి ఆర్థికంగా బలోపేతం చేస్తున్నామని వివరించారు.

చంద్రబాబు పాలనలో బీసీల అభివృద్ధి శూన్యం
ఈ నెల 20న బీసీల నిరసన దీక్ష విజయవంతం చేద్దాం
* వైకాపా పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ రంగయ్య
గుంతకల్లురూరల్, డిసెంబర్18: చంద్రబాబు నాలుగున్నర ఏళ్లపాలనలో బిసీల అభివృద్ధి శూన్యమని, చంద్రబాబు బీసీల పట్లచేసే అసత్యపు ప్రచారాలను తిప్పికొడుదామని వైకాపా అనంతపురం పార్లమెంట్ సమన్వయకర్త పిడి తలారి రంగయ్య వైకాపా కార్యకర్తలకు సూచించారు. స్థానిక వైకాపా కార్యాలయంలో మంగళవారం వైకాపా బీసీ ముఖ్యనాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా అనంతపురం పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ రంగయ్య, పార్టీసీనియర్ నాయకులు మీసాల రంగన్న, బీసీ సెల్ జిల్లాఅధ్యక్షులు వీరాంజినేయులు, మాజీ మున్సిపల్ చైర్మన్ రామలింగప్ప, భీమలింగప్ప, మల్లయ్యయాదవ్‌లు హాజరయ్యరు. ఈ సందర్భంగా తలారి రంగయ్య మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చంద్రబాబు బీసిలకు దాదాపు 600 హామీలు గుప్పించి ఎన్నికల అనంతరం ఇచ్చిన హామీలలో ఏఒక్కటీ అమలు చేయక బీసీలను నిలువునా మోసగించారన్నారు. చంద్రబాబు బీసీలకు మాయమాటలు చెప్పి కేవలం ఓటుబ్యాంకుగా వాడుకుంటున్నారేతప్ప బీసీలకు ఒరగబెట్టింది ఏమీలేదన్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో బీసీలను మరోసారి దగాచేసి ఓట్లుదండుకోవాలన్న ఉద్దేశంతో జయహో బీసి అంటూ చంద్రబాబు మరోనాటకానికి యత్నిస్తున్నాడన్నారు. చంద్రబాబు నాటకాలను తిప్పికొట్టేందుకు ప్రతి కార్యకర్త చైతన్యవంతులై టీడీపీ అసత్యప్రచారాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలన్న తపనతో సీఆర్పీలను నియమించుకొని వారికి రోజుకి రూ.850చెల్లిస్తూ టీడీపీ ప్రచారం చేయించుకుంటున్నారన్నారు. నిత్యం కరువుపీడిత ప్రాంతమైన అనంతపురం జిల్లాలోని పార్లమెంట్ సభ్యులకు కేంద్రం నిధులు విడుదల చేస్తున్నప్పటికీ వాటిని సక్రమంగా ఖర్చు చేయడంలేదన్నారు. గ్రామాల్లోని ప్రజలకు కనీసం రోడ్లు, తాగునీరు, మురికి కాలువలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రజా సమస్యల పట్ల ఏమాత్రం స్పందించడం లేదన్నారు. అనంతరం పార్టీ సీనియర్ నాయకులు మీసాల రంగన్న, రామలింగప్ప, భీమలింగప్పలు మాట్లాడుతూ చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో బీసీలకు చేసిందేమిటని వారుప్రశ్నించారు. కేవలం టిడిపి కార్యకర్తలకు, జన్మభూమి కమిటీవారికి మాత్రం ప్రభుత్వపథకాలు వర్తింపజేశారన్నారు. ఆదరణ పేరుతోమహిళలకు తుప్పుపట్టిన కుట్టుమిషన్లు, పనిముట్లు పంపిణీ చేశారన్నారు. కావున చంద్రబాబు చెప్పే మాయ మాటలకు మరోసారి దగా పడకుండా జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకునేందుకు బీసీలందరూ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కావున ఈ నెల 20 తలపెట్టిన కలెక్టరేట్ వద్ద చేపట్టే నిరసన దీక్షకు బీసీ సోదరులు పెద్ద సంఖ్యలోతరలివచ్చి బీసీల ఐక్యతను చాటాలని వారు పిలుపునిచ్చారు.

నగరాభివృద్ధికి అనంత కుటుంబం చేసిందేమిటి
* అభివృద్ధి జరగలేదని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం * ధ్వజమెత్తిన మేయర్ స్వరూప
అనంతపురంటౌన్, డిసెంబర్ 18: ఇరవై సంవత్సరాలపాటు ఎంపీలుగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా ఉంటూ అనంత వెంటరామిరెడ్డి కుటుంబం నగరాభివృద్ధికి ఏనాడైనా కృషి చేశారా అని మేయర్ స్వరూప ధ్వజమెత్తారు. మంగళవారం మేయర్ ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ 20 ఏళ్లుగా వాళ్లు చేయలేని అభివృద్ధిని నాలుగున్నర సంవత్సరాల్లో చేసి చూపించానన్నారు. అభివృద్ధి జరగలేదని నిరూపిస్తే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. అభివృద్ధి జరిగినట్లు నిరూపితమైతే వారు రాజకీయసన్యాసానికి సిద్ధమై బహిరంగ క్షమాపణ చెప్పాలని సవాల్ విసిరారు. పాలకవర్గం పదవీబాధ్యతలు చేపట్టిన వెంటనే నగరంలో 11 వేల ఎల్‌ఈడీ లైట్లు వేయించి నగరంలో విద్యుత్‌కాంతులు వెదజల్లామన్నారు. నగరంలోని వివాదాస్పద స్థలాలను పరిష్కరించి రహదార్లు నిర్మించామన్నారు. ప్రస్తుత వైకాపా నేత అప్పటి కమిషనర్ రంగయ్య తన పెన్నును కాంట్రాక్టర్లకు అప్పగించింది వాస్తవం కాదా అని అన్నారు. దొంగసంతకాలు చేసుకుని సొమ్ము చేసుకున్న అంశాలపై విచారణ చేపట్టగా స్వయంగా రంగయ్య తనకు ఫోన్ చేసి ఆ సంతకాలు తనవి కావని చెప్పిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. అలాగే అప్పటి కమిషనర్లు నీలకంఠారెడ్డి, రంగయ్యలు పాలకవర్గం లేని సమయంలో స్పెషలాఫీసర్ల పాలనలో పనిచేశారన్నారు. అధికారులను తమ గుప్పిట్లో పెట్టుకుని చేసిన అభివృద్ధి పనులు నాసిరకంగా, నాణ్యతాలోపంతో కూడి ఉన్న విషయంపై వార్తాకథనాలు వెలువడింది వాస్తవం కాదా, వారు ఎస్‌డీఎఫ్ గ్రాంటు కింద చేసిన రహదార్లు వేసిన కొద్ది రోజులకే సగానికి చీలిపోవడం వాస్తవం కాదా, అప్పటి పాలకవర్గాలపై కార్పొరేటర్లను గ్రూపులు చేసి ఎగదోసింది నిజాలు కావా అని నిలదీశారు. నగరంలో ప్రధాన రహదార్లలో డివైడర్లు ఏర్పాటు చేసి పచ్చదనం పెంచింది అనంత వెంకటరామిరెడ్డికి కనపడటం లేదా అని నిలదీశారు. నగరంలో పార్కులను అభివృద్ధి చేసి ఓపెన్‌జిమ్‌లను ఏర్పాటు చేశామన్నారు. నగరంలోని 50 డివిజన్లలో పార్టీలకతీతంగా అభివృద్ధి పనులు చేశామన్నారు. వైకాపా కార్పొరేటర్లు సమావేశంలో ప్రజాసమస్యలు చర్చించకుండా అడ్డుతగులుతున్నారన్నారు. తీరా సమస్యలు చర్చించే సమయంలో వాకౌట్‌లు చేసి ప్రజాసమస్యలను విస్మరిస్తున్నారని, వారి నాయకుడు జగన్మోహనరెడ్డి అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజాసమస్యలను విస్మరిస్తున్నారన్నారు. అలాగే కౌన్సిల్‌లో వైకాపా కార్పొరేటర్లు ప్రజాసమస్యలు గాలికి వదలివేస్తున్నారన్నారు. నగరంలోని 50 డివిజన్లలో జరిగిన అభివృద్ధి పనులపై తయారు చేసిన సావనీర్‌ను అనంత వెంకటరామిరెడ్డికి కొరియర్ ద్వారా పంపుతున్నానన్నారు. పుస్తకాన్ని అధ్యయనం చేసి అనంత వెంకటరామిరెడ్డి, వైకాపా నేతలు బహిరంగ చర్చకు వస్తే అభివృద్ధిపై చర్చించటానికి సిద్ధంగా ఉన్నానని, వారికి పది రోజులు గడువు ఇస్తున్నట్లు మేయర్ తెలిపారు. ఇప్పటికైనా వాస్తవాలు గుర్తించి అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే యత్నాలు మానుకోవాలని ఆమె హితవు పలికారు.