అనంతపురం

రూ.66 కోట్ల పనులకు గ్రహణం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం టౌన్, ఫిబ్రవరి 21 : మూడు నెలల క్రితం పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో వౌలిక సదుపాయాల కల్పనకు కేటాయించిన రూ.66 కోట్లకు గ్రహణం పట్టింది. పట్టణంలో వౌలిక సదుపాయాలు లేని ప్రాంతాలను గుర్తించి రూ.66 కోట్లతో రోడ్లు, మురికి కాలువలు, ప్రధాన రోడ్ల వెడల్పు, వీధి దీపాల ఏర్పాటు తదితర పనులు చేపట్టాలని నిర్ణయించారు. రెండేళ్ల క్రితమే ప్రతిపాదనలు సిద్ధమైనా నిధుల మంజూరులో తీవ్ర అలసత్వం జరిగింది. చివరకు ఎన్నికలు ముంచుకొస్తుండటంతో మూడు నెలల క్రితం ప్రభుత్వం పనులు చేపట్టేందుకు అనుమతి ఇచ్చింది. అంతకుముందు గుత్తేదారు ఖరారు చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంది. టెండర్లు పిలవడం, రద్దు చేయడం తదితర వాటితోనే పుణ్యకాలం గడిచిపోయింది. ఆ తర్వాత పనులు ప్రారంభించినా గుత్తేదారు మాత్రం ఇప్పటిదాకా అగ్రిమెంట్ చేసుకోవడానికి ముందుకు రాకపోవడం గమనార్హం. అధికారులు గుత్తేదారుపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు తీసుకువస్తున్నా అదిగో, ఇదిగో అంటూ కాలం వెళ్లబుచ్చుతున్నాడు. పట్టణంలో చేపట్టే అన్ని పనులకు రీసర్వే చేయడం, వాటి నిర్మాణానికి సంబంధించి రీడిజైనింగ్ చేయడం, వాటికి ఉన్నతాధికారుల నుండి అనుమతి తీసుకోవడం తదితర పనులు చేపట్టాల్సి ఉంది. అయితే గుత్తేదారు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో పనుల నిర్వహణపై అనుమానాలు తలెత్తుతున్నాయి. గుత్తేదారుకు నోటీసులు జారీ చేసినా త్వరలో వస్తానంటూ అధికారులతో అంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఒప్పందం ఖరారయ్యే దాకా పనుల నిర్వహణ సాగేది అనుమానమే. ఖరారు చేసుకున్న తర్వాత పనులు పూర్తి చేయడానికి ఏడాది నుండి ఏడాదిన్నర గడువు ఉంటుంది. ఈనేపథ్యంలో ఇప్పట్లో పనులు పూర్తిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
నిధుల కేటాయింపు ఇలా...
రూ.66 కోట్ల నిధులతో పట్టణంలో దాదాపు 10 ప్రధాన రహదారులను విస్తరించేందుకు నిర్ణయించారు. ఇందులో నిర్మాణ పనులకు రూ.9 కోట్లు కేటాయించారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో రూ.29 కోట్లతో 34 రోడ్లను నిర్మించేందుకు ప్రతిపాదించారు. అవసరమైన కాలనీల్లో రూ.7 కోట్లతో మురుగు కాలువల నిర్మాణాలు చేపట్టేందుకు, విస్తరించిన 10 రోడ్లలో డివైడర్ల ఏర్పాటు, సెంట్రల్ లైటింగ్, పచ్చదనం, సుందరీకరణ తదితర పనులకు రూ.4 కోట్లతో చేయాలని నిర్ణయించారు. సమగ్ర మురుగు నీటి వ్యవస్థ ఏర్పాటులో భాగంగా పట్టణంలో ఆరు ప్రధాన మురుగు కాలువల నిర్మాణానికి రూ.2 కోట్లు కేటాయించారు. రోడ్ల విస్తరణ కారణంగా పైపులైన్లు మార్చడం, కొత్తగా ఏర్పాటు తదితర పనులకు రూ.1.8 కోట్లు వెచ్చించనున్నారు. రూ.30 లక్షలతో నూతన ఉద్యానవనాలకు ప్రహరీలను నిర్మించనున్నారు. మిగిలిన సొమ్మును జీఎస్‌టీ, సీనరేజీ చార్జీల చెల్లింపు, విద్యుత్ స్తంభాల మార్పులు, ఇతరత్రా పనులకు వెచ్చించేలా సమగ్ర ప్రణాళికలో పేర్కొన్నారు.
ప్రతిపాదించిన అభివృద్ధి పనులు...
వాసవీ ధర్మశాల లోడ్డు, డీఎల్ రోడ్డు, బాలాజీ టాకీస్ రోడ్డు, వన్‌టౌన్ పోలీసుస్టేషన్, బెంగళూరు రోడ్డు, ఆర్టీసీ బస్టాండ్ హోండా షోరూం ప్రక్కన ఉన్న రోడ్డు, తేజ ఆసుపత్రి నుండి బాలాజీనగర్ చివర పెన్నా కుముద్వతి కాలువ వరకు, అక్కడి నుండి ముద్దిరెడ్డిపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల వరకు ఉన్న దండు రోడ్డులను విస్తరించి నూతనంగా రహదారులను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించారు. రహమత్‌పురం నుండి ఫళని నగర్ వరకు ఇంటర్‌లింక్ రోడ్డు ఏర్పాటు చేయనున్నారు. అలాగే కొల్లకుంట, కొట్నూరు, ఇందిరమ్మ కాలనీ, చౌడేశ్వరి కాలనీ, త్యాగరాజనగర్, ఆర్టీసీ కాలనీ, ఆబాద్‌పేట, ముక్కడిపేట, ధర్మపురం, డీబీ కాలనీ, గోకుల్‌నగర్, డీఆర్ కాలనీ, మోడల్‌కాలనీ, సడ్లపల్లి, టీచర్స్‌కాలనీ, హౌసింగ్ బోర్డు, ఆటోనగర్, సిల్క్‌కాలనీ, సీపీఐ కాలనీ, రహమత్‌పురం, కోట, విద్యానగర్, నింకంపల్లి, మోతుకపల్లి, అహ్మద్‌నగర్, బోయపేట, ఆజాద్‌నగర్, పాండురంగనగర్, అంబేద్కర్‌నగర్, సత్యసాయినగర్, మార్కేండేయనగర్, మేళాపురం, విజయనగర్‌కాలనీ, అరవిందనగర్, డ్వాక్రా కాలనీ, శివబాలయోగినగర్, లక్ష్మినగర్, ముద్దిరెడ్డిపల్లి, సింగిరెడ్డిపల్లి ప్రాంతాల్లో అంత్గరత రహదారులతోపాటు మురికి కాలువలను నిర్మించేందుకు కార్యాచరణ రూపొందించారు.
సెంట్రల్ లైటింగ్ కోసం ..
వాల్మీకి సర్కిల్ నుండి హౌసింగ్ బోర్డు కాలనీ వరకు, రహమత్‌పురం సర్కిల్ నుండి బైపాస్ రోడ్డులో ఉన్న భగీరథ సర్కిల్ వరకు, పెనుకొండ రోడ్డులో ఆర్టీసీ బస్టాండ్ నుండి తెలుగుతల్లి విగ్రహం వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. దీనికి తోడు తెలుగుతల్లి సర్కిల్ నుండి వన్నమ్మ కాలనీ వరకు, పరిగి రోడ్డు నుండి మోతుకపల్లి వరకు, బైపాస్ రోడ్డు లో రవీంద్రభారతి పాఠశాల వరకు, ఆర్పీజీటీ రోడ్డు నుండి దండురోడ్డు చివరి వరకు, వాసవీ ధర్మశాల రోడ్డులో అత్యాధునిక సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోనున్నారు. ఇదిలా ఉండగా ఆర్టీసీ బస్టాండ్, ఆబాద్‌పేట, ఆర్టీసీ కాలనీ, మున్సిపల్ కార్యాలయ వెనుకభాగంలోని శ్రీనివాసనగర్, నింకంపల్లి, సప్తగిరి కళాశాల ప్రాంతం, పులమతి రోడ్డు, పరిగి రోడ్డు, ఆజాద్‌నగర్ తదితర ప్రాంతాల్లో ప్రధాన వర్షపు మురుగునీటి కాలువలను అభివృద్ధి చేయనున్నారు. ఇకపోతే మోడల్ కాలనీలో ఉన్న ఉద్యానవనాలకు ప్రహరీలను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.